‘పంతం’పై కేసు నమోదుకు మీనమేషాలు | Police indifference on Rangaraya Principals complaint | Sakshi
Sakshi News home page

‘పంతం’పై కేసు నమోదుకు మీనమేషాలు

Published Mon, Sep 23 2024 5:13 AM | Last Updated on Mon, Sep 23 2024 5:13 AM

Police indifference on Rangaraya Principals complaint

దళిత ప్రొఫెసర్‌ను బూతులు తిట్టి దాడిచేసినా దిక్కూమొక్కూ లేదు

కేసు నీరుగారుస్తున్న కూటమి ప్రభుత్వం 

రంగరాయ ప్రిన్సిపాల్‌ ఫిర్యాదుపై పోలీసుల ఉదాసీనత

24 గంటలైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు వెనుకడుగు

దశలవారీ ఉద్యమానికి వైద్యులు సిద్ధం

ప్రిన్సిపాల్‌ నరసింహం అందజేసిన ఫిర్యాదు ప్రతి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రంగరాయ వైద్య కళా­శాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్‌ జన­సేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతా­నని బెదిరించిన ఘటనపై 24 గంటలు దాటినా కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీనిపై రాష్ట్ర­వ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్ర­హాం వ్యక్తమవుతోంది. దశలవారీ ఉద్య­మా­లకు ప్రభుత్వ వైద్యుల సంఘం సమాయత్త­మవుతోంది. 

కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌­లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీ­బాల్‌ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచ­రులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్య­ంతరం చెప్పి­నందుకు ఆర్‌ఎంసీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్, ఫోరె­న్సిక్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ ఉమామహే­శ్వరరా­వును శనివారం ఎమ్మెల్యే నానాజీ బండ­బూ­తులు తిడు­తూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్ర­వ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.

పవన్‌కళ్యాణ్‌కు బాధ్యత లేదా?
కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఆవ­రణ­లోని వాలీబాల్‌ కోర్టుకు వైద్య విద్యార్థినులు సైతం ఆడుకోవడానికి వస్తుంటారు. ఇందులో కొంతకా­లంగా ఎమ్మెల్యే అనుచరులు వాలీబాల్‌ ఆడుతూ బహిరంగంగా బెట్టింగ్‌లు వేస్తు­న్నారని, వైద్య విద్యార్థినులతోపాటు వాకింగ్‌ కోసం వస్తున్న మహిళలను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మెడికోలు ఆర్‌ఎంసీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుకు గతంలోనే తెలియచేశారు. 

ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు రంగరాయ కళాశాల యాజ­మా­న్యంతో­పాటు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌(ఎన్‌ఎంసీ)కి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులతో మాట్లాడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన డాక్టర్‌ ఉమామహేశ్వర­రావు­పై ఎమ్మెల్యే నానాజీ బెట్టింగ్‌రాయుళ్లను వెన­కేసు­­కువస్తూ దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇద్ద­రిలో ఏ ఒక్కరూ స్పందించకపోవడాన్ని ఏమ­ను­­కోవా­లని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. వైద్యుడిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

అస్వస్థతకు గురైన బాధిత ప్రొఫెసర్‌
ఎమ్మెల్యే, అతని అనుచరులు బెదిరింపులు, దాడితో ఫోరెన్సిక్‌ హెచ్‌వోడీ ఉమామహే­శ్వరరావు మానసిక ఆందోళనతో ఆదివారం స్వల్ప అస్వ­స్థతకు గురయ్యారు. ఆయన తన ఇంటి­వద్దే చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, వైద్య­సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతి­నిధులు ఉమా­మహేశ్వరరావును కలిసి సంఘీభా­వం తెలిపారు. కాగా, ఎమ్మెల్యే నానాజీ తీరును గర్హిస్తూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ఆది­వారం ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం లేఖ రాసింది. 

వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే నానాజీ, అతని అనుచరులపై చట్ట ప్రకా­రం చర్యలు తీసుకో­వాలని సంఘ అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్‌బాబు ఆ లేఖలో డిమాండ్‌ చేశారు. లేదంటే దశల వారీ ఆందోళనకు ఉపక్రమించాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యే పం­తం నానాజీ, అతని అనుచరులపై కఠిన చర్య­లు తీసుకోవాలని సామాజిక న్యాయ సాధన సమితి డిమాండ్‌ చేసింది. 

సంస్థ అధ్యక్షులు డాక్టర్‌ భాను­మతి, ప్రధాన కార్యదర్శి నవీన్‌­రాజ్, అసోసి­యేట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోకా పవన్‌కుమార్, ముఖ్య సలహాదారులు అడ్వకేట్‌ జవహర్‌ అలీ, అయితా­బత్తుల రామేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర కార్య­దర్శి జి.ఆస్కార్‌­రావు, జిల్లా అధ్యక్షుడు రంగ­నాయ­కులు డాక్టర్‌ ఉమామహేశ్వరరావును పరా­మ­ర్శించారు.  ఈ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖమంత్రి సత్య కుమార్‌ యాదవ్‌ మొక్కుబడిగా స్పందించారు. వైద్యులకు, విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

నేనూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా
‘ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అలా ప్రవ­ర్తించాను.  నేనేదో తగువు సెటిల్‌ చేద్దామని ఆర్‌­ఎంసీ హాస్టల్‌కు వెళ్లాను. అక్కడ నేనే తగు­వులో పడిపో­యాను. దానికి ఇప్పుడు సభాముఖంగా డాక్టర్‌కు సారీ చెబుతున్నాను. ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో నిన్న అలా ఉన్నాను.  తిరుపతి లడ్డూ విషయంలో ఎవరో చేసిన తప్పునకు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. 

ఆయనే దీక్ష చేపడుతున్నప్పుడు ఆయన పార్టీలో ఉండి, నేను తప్పు చేసి నేను ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేయకూడదని భావించి సోమవారం కాకినాడ గొడారిగుంట ఇంటి వద్ద దీక్ష చేపడుతున్నాను’ అని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. అయితే ఈ ప్రకటనపై పార్టీనేతలు విస్తుపోతున్నారు. నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు అన్నట్టుగా ఉందని  వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి.

చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి: కురసాల కన్నబాబు
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచిత ప్రవర్తనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకో­వాల్సిందేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్ష్యుడు కురసాల కన్నబాబు డిమాండ్‌ చేశారు. వైద్యు­డిపై ఎమ్మెల్యే, అతని అనుచరుల దురుసు ప్రవర్తన, వ్యవ­హారశైలి, దాడి జనమంతా వీడి­యోల్లో చూశారు. బాధ్యులపై కేసు నమోదు చేయా­ల్సిందే. చేసిందంతా చేసి ఇప్పుడు ప్రాయశ్చితం అంటూ దీక్షలు చేసినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదన్నారు.

ఫిర్యాదు చేసి 24 గంటలు గడిచినా..
ఈ ఘటనపై శనివారం రాత్రి 8 గంటల సమ­యంలో ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్, అడిషనల్‌ డైరె­క్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ డీఎస్‌వీఎల్‌ నరసింహం జిల్లా ఎస్పీ విక్రాంతపాటిల్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారు అందుబాటులో లేదు. దీంతో స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ శ్రీరామ­కోటేశ్వరరావు, సర్పవరం సీఐ బొక్కా పెద్ది­రాజుకు ఫిర్యాదు చేశారు. రెండుచోట్లా ఫిర్యా­దు చేసి 24 గంటలు గడిచినా ఆదివారం రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయ­లేదు.

మరోవైపు కేసు విషయంలో వితండ వాదన జరుగుతోంది. వైద్యుడు స్వయంగా ఫిర్యాదు చేయలేదు, ఆయన ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి కేసు నమోదు చేస్తా­మని కాకినాడ డీఎస్పీ రఘువీర్‌ పృథ్వీ చెబుతు­న్నారు. వైద్యుడిని చంపుతానని బెది­రింపులకు దిగిన ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం ఎందుకు కేసు నమోదు చేయలేదని వైద్యులు, దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసన
ప్రభుత్వ వైద్యుల సంఘం
సాక్షి, అమరావతి: ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉమా­మ­హేశ్వరరావుపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని జనసేన పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ను ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) డిమాండ్‌ చేసింది. ఆదివారం జరిగిన సంఘ కార్యవర్గ సమావేశం వివరాలను అధ్యక్షుడు డాక్టర్‌ జయ«దీర్‌ మీడియాకు విడుదల చేశారు. సోమ­వారం నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని ప్రకటించారు.

ప్రొఫెసర్‌పై దాడి హేయం
దాడికి పాల్పడ్డ జనసేన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు
సాక్షి, అమరావతి: మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌­కళ్యాణ్‌ హామీలు అమలు చేయలేక దాడు­లతో బెదిరింపులకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఆక్షే­పించారు. తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యా­లయంలో సుధాకర్‌­బాబు మీడియాతో మాట్లా­డుతూ.. కూటమి నాయకులను దాడులకు ప్రేరేపించడం, ఆ తర్వాత వారే క్షమాపణలు చెబుతున్నట్టు డ్రామా చేయడం నిత్యకృత్యమైందన్నారు. 

కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాల ప్రొఫె­సర్, కాలేజీ స్పోర్ట్స్‌ అధికారి డాక్టర్‌ ఉమా­మహేశ్వరరావును కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ అసభ్య పదజాలంతో దూషించి చెంప దెబ్బకొ­ట్టడం, జనసేన కార్యకర్తలు దాడి చేయడం ఇందుకు తార్కా­ణమన్నారు. దళిత అధికారుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరి­స్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దళితులకు వైఎస్సా­ర్‌ï­Üపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దళిత అధికారిని అసభ్యంగా దూషించి దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రా­సిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

క్షమాపణ చెబితే చాలా!
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాధ్యక్షుడు సురేష్‌
చల్లపల్లి (అవనిగడ్డ): విధి నిర్వహణలో ఉన్న దళిత ప్రొఫెసర్‌పై అందరూ చూస్తుండగా దాడి చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దేవరపల్లి సురేష్‌బాబు ప్రశ్నించారు. ఉద్యో­గులు, అధికా­రుల­పై దాడులు చేసే ప్రజాప్రతి­ని­ధులు, వ్యక్తుల­పై తిరగబడా­లని ఆయన పిలుపునిచ్చారు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉద్యోగులు అధి­కారులపై దాడులు పరిపాటిగా మారాయని చర్యకు ప్రతిచర్య ఉండాలన్నారు.

 దాడిని ఖండించిన జూడాలు
సాక్షి, అమరావతి: కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ­టాన్ని ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఏపీ జూడా) తీవ్రంగా ఖండించింది. ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడి, దుర్భాషలాడిన ఘటన ఆరోగ్య సంరక్షకులను అగౌరవపరచ­డమేనని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన భద్రతా వైఫల్యానికి నిదర్శనమని తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

ప్రొఫెసర్‌పై దాడి హేయం 
ఏపీ ఏఎఫ్‌ఎంటీ అధ్యక్షుడు సాయిసుదీర్‌
కర్నూలు (హాస్పిటల్‌): ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి హేయమైన చర్య అని ఏపీ అకాడమీ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ (ఏపీ ఏఎఫ్‌ఎంటీ) అధ్యక్షుడు డాక్టర్‌ టి.సాయి­సుధీర్‌ ఖండించారు. ఏపీ ఏఎఫ్‌ఎంటీ, ఏపీ జీడీఏ, ఏపీ జేయూడీఏ, ఐఎంఏ సంస్థలను సంప్రదించి తదనంతర కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీపై డిప్యూటీ సీఎం పవన్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దాడి సిగ్గుచేటు
వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం ఉపాధ్యక్షుడు మెహబూబ్‌
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విధుల్లో ఉన్న మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌పై కూటమి ఎమ్మెల్యే పంతం నానాజీ బండబూతులు తిడుతూ దాడికి పాల్పడటం దుర్మార్గ­మని, సిగ్గుపడాల్సిన అంశమని వైఎస్సార్‌సీపీ వైద్య విభా­గం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మెహ­బూబ్‌ షేక్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు ఇదే నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అతని అనుచరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement