అంబేడ్కర్ ఫ్లెక్సీ చించేసిన ఉండి ఎమ్మెల్యే రఘురామ బర్తరఫ్‌కు డిమాండ్
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్న దళిత నేతలు
సాక్షి నెట్‌వర్క్: ఎమ్మెల్యేలు కె.రఘురామకృష్ణరాజు, పంతం నానాజీ దురాగతాలపై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. వారిద్దరి తీరుపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావుపై దాడికి తెగబడిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నేతలు నినదించారు.
విశాఖ ఎల్‌ఐసీ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ, దళిత హక్కుల పోరాట సమితి, భీమ్‌సేన, కేవీపీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రఘురామకృష్ణరాజు దురాగతాన్ని హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావును దూషించి దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
వైద్యుడి ఘటనపై స్పందించని కాకినాడ ఎస్పీ, కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని కోరారు. కాగా.. ఉండి ఎమ్మెల్యే రఘురామ తీరుపై పల్నాడు జిల్లా అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాల నాయకులు నిరసన తెలిపారు. రఘురామను శాసనసభ నుంచి బర్తరఫ్ చేయాలని, ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం నాయకుడు తోకల సూరిబాబు, మండల సీఐటీయు కార్యదర్శి బి.సూరిబాబు, వైఎస్సార్‌సీపీ కారి్మక విభాగం నాయకుడు దారా ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఉండి ఎమ్మెల్యేపై ఫిర్యాదు
అంబేడ్కర్‌ను అవమానపరిచిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు బాపట్ల జిల్లా రేపల్లెలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైభీమ్ యాక్సెస్ జస్టిస్ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రాంజీ, న్యాయవాదులు దారం సాంబశివరావు, కర్రా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
తక్షణ చర్యలకు కార్పొరేటర్ల డిమాండ్
అంబేడ్కర్ ఫ్లెక్సీని చించేసిన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్టరాజు, దళిత డాక్టర్‌పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ను, దళిత డాక్టర్‌ను అవమానించిన ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనలను అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ కార్పొరేటర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారు వెనక్కి తగ్గలేదు.
డీజీపీకి మెమోరాండం
అంబేడ్కర్ ఫొటోతో ఫ్లెక్సీ చించేసి దళితుల్ని అవమానపర్చిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, దళిత ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు పీవీ రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విజయవాడలో తెలిపారు. మంగళవారం డీజీపీని కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేసినట్టు తెలిపారు.
ఇద్దర్నీ అరెస్ట్ చేయాల్సిందే
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ ఎమ్మెల్యే రఘురామపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వంద రోజుల పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment