
పీవీ సునీల్‌కుమార్ అక్రమ సస్పెన్షన్‌కు నిరసనగా శ్రీకాకుళంలో ధర్నా నిర్వహిస్తున్న దళిత సంఘాల ప్రతినిధులు
పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్
ఇది సర్కారు పెద్దల కుట్రేనంటున్న దళిత సంఘాలు
సాక్షి, అమరావతి: దళిత అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటికే సీఐడీ పూర్వపు అదనపు డీజీ సంజయ్‌ని కుట్ర పూరితంగా సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం.. పలువురు దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఉద్దేశ పూర్వకంగా అవమానిస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వ కక్ష చల్లారినట్టు లేదు. అందుకే డీజీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై తాజాగా కక్ష సాధింపు చర్యలకు తెగబడింది.
కనీసం నోటీసు కూడా జారీ చేయకుండా ఆయన్ను ఏకపక్షంగా సస్పెండ్ చేయడం విస్మయ పరుస్తోంది. అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారనే అభియోగాలపై ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కానీ పీవీ సునీల్ కుమార్ ప్రభుత్వ ముందస్తు అనుమతితోనే విదేశీ పర్యటన చేశారు.
అయినా పీవీ సునీల్ కుమార్ 2019–2024 మధ్య పలుసార్లు ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా తదితర దేశాల్లో పర్యటించారని ప్రభుత్వం ఆరోపించింది. కీలక స్థానాల్లో ఉన్న ఐపీఎస్ అధికారి అనధికారిక విదేశీ పర్యటనలతో సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందనే సాకు చూపుతూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వ అనుమతితోనే విదేశీ పర్యటనలు
పీవీ సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించిన కారణాలు పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే 2019–2024 మధ్య కాలంలో ఆయన విదేశీ పర్యటనలకు ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. ఆ పర్యటనలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పర్యటనలు కాబట్టి పీవీ సునీల్ కుమార్ తన సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్లాలని కూడా పేర్కొంది.
అందుకు సమ్మతించి, పూర్తిగా తన సొంత ఖర్చులతో, వ్యక్తిగత హోదాలో ఆయన అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడటానికి వెళ్లారు. అయినా సస్పెండ్ చేయడం కేవలం చంద్రబాబు ప్రభుత్వ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలి.
కానీ కూటమి ప్రభుత్వం ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు జారీ చేస్తే.. తాను ప్రభుత్వ అనుమతితోనే, సొంత ఖర్చులతో విదేశాల్లో పర్యటించానని ఆయన ఆధారాలు సమరి్పస్తూ వివరణ ఇస్తారు. అందుకే ఆయనకు ఆ అవకాశం ఇవ్వకూడదనే ప్రభుత్వం కనీసం నోటీసు జారీ చేయకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూటమి ప్రభుత్వం కుట్ర
దళిత అధికారి పీవీ సునీల్ కుమార్‌ను టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పూరితంగా సస్పెండ్ చేసిందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంబేడ్కర్ ఇండియా మిషన్ (ఏఐఎం) ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు శ్రీకాకుళంలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు.
అస్మదీయులైతే అనుమతి లేకున్నా ఏ దేశానికైనా వెళ్లొచ్చట!
పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు ముందస్తు అనుమతి లేకుండానే విదేశాల్లో పర్యటిస్తున్నారు. వారు తమ విదేశీ పర్యటనల ఫొటోలను సోషల్ మీడియాలో కూడా అప్‌లోడ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఆ ఉన్నతాధికారులు స్వదేశానికి వచ్చిన కొంత కాలం తర్వాత వారి విదేశీ పర్యటనను ర్యాటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుండటం గమనార్హం.
సీనియర్ ఐఏఎస్ అధికారి భాస్కర్ భూషణ్ 2018 మార్చిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశాల్లో పర్యటించారు. ఆయన స్వదేశానికి వచ్చిన ఏడాది తర్వాత అంటే 2019 మార్చి 28న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన విదేశీ పర్యటనను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం ముందస్తు అనుమతి తీసుకుని మరీ విదేశాల్లో పర్యటించిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం విస్మయ పరుస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.