దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి
బూతుపురాణం, ముఖంపై పిడిగుద్దులతో దౌర్జన్యం
మెడికోల ఆట స్థలంలో ఎమ్మెల్యే నానాజీ అనుచరుల వీరంగం
వారికి మద్దతుగా కాకినాడ ఆర్‌ఎంసీ గ్రౌండ్‌కు వచి్చన ఎమ్మెల్యే
ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డా.ఉమామహేశ్వరరావుపై దాడి చంపేస్తానని హెచ్చరిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమరావతి: ఏరా లం...కొడకా.. చంపేస్తాను నా కొడకా.. ఏంటి రా నన్ను తిట్టావంట.. చదువుకునే కుర్రాళ్లను రెచ్చగొడతావా.. అంటూ నోటికొచ్చినట్టు బండ బూతులు తిడుతూ ఓ దళిత ప్రభుత్వ వైద్యుడిపై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తన అనుచరులతో కలసి పిడిగుద్దులతో దాడి చేశారు. శనివారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) మైదానంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పూర్వాపరాలిలా ఉన్నాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు శ్రీనగర్‌లో 12 ఎకరాల క్రీడా మైదానం ఉంది.
ఇందులో సుమారు 150 గజాల్లో మెడికోల కోసం వాలీబాల్ కోర్ట్æ ఉంది. వైద్య కళాశాల ముందస్తు అనుమతి లేకుండా ఇతరులు క్రీడల కోసం ఆ కోర్టును వినియోగించరాదు. అయితే గత కొంత కాలంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ అనుచరులమంటూ సుమారు 40 మంది యువకులు వాలీబాల్ కోర్ట్‌కు వస్తూ మెడికోలపై గొడవకు దిగుతున్నారు. వైద్య విద్యార్థినులతో పాటు వాకింగ్ కోసం వస్తున్న మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్‌ఎంసీ స్పోర్ట్స్ వైస్‌చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మెడికోలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని వైద్య విద్యార్థులు అటు రంగరాయ యాజమాన్యంతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ)కి ఫిర్యాదు చేశారు.
అనుమతి అడిగి.. అంతలోనే గొడవకు దిగి..
తమ అనుచరులను కోర్టులో ఆడుకునేందుకు అనుమతివ్వాలని ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహాన్ని ఇటీవల ఎమ్మెల్యేలు ఇరువురూ ఫోన్‌లో అడిగారు. అందుకు నరసింహం అభ్యంతరం చెబుతూ.. ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి చెబుతామని వారికి చెప్పారు. ఇంతలో అనుమతి లేకుండానే శనివారం కూటమి ఎమ్మెల్యేల అనుచరులు వాలీబాల్ కోర్టులో ఆటలాడుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, ఆర్‌ఎంసీ వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ విష్ణువర్ధన్, కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్, ఫోరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సతీష్‌తో కలసి ఆర్‌ఎంసీ గ్రౌండ్‌కి చేరుకున్నారు.
కోర్టు నుంచి వెళ్లిపోవాలని ఎమ్మెల్యేల అనుచరులకు నచ్చజెప్పగా.. వారు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు కోర్టు ఖాళీ చేసి వెళ్లిపోయాక ఎమ్మెల్యే నానాజీ తన అనుచరులను వెంట బెట్టుకుని గ్రౌండ్‌కు వచ్చి డాక్టర్ ఉమామహేశ్వరరావుపై బండ బూతులు మొదలుపెట్టి.. ఆ డాక్టర్ ముఖానికి మాస్క్‌ను బలవంతంగా లాగేసి పిడిగుద్దులు కురిపించారు. మరోమారు తన అనుచరులను అడ్డుకుంటే చంపేస్తానని హెచ్చరించి వెళ్లారు. ఆ సమయంలో ఇరు పక్షాలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
నేటి నుంచి జూడాల నిరసన..
ఎమ్మెల్యే నానాజీ దౌర్జన్యానికి నిరసనగా ఆదివారం నుంచి విధులు బహిష్కరిస్తామని వైద్యులు, జూడాలు ప్రకటించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం ఆధ్వర్యంలో వైద్యులు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు జరిగిన సంఘటనపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎంఎల్‌ఏ నానాజీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆర్‌ఎమ్‌సీకి వచ్చి ఇరుపక్షాలతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు వైద్యులు, మెడికోలు ససేమిరా అంటున్నారు. దళిత సంఘాలు ఆర్‌ఎంసీ గ్రౌండ్స్‌కు చేరుకుని దళిత జాతికి జరిగిన అవమానమంటూ ధర్నాకు దిగారు.
క్రిమినల్ కేసు నమోదు చేయాలి
డా.ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.జయధీర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment