
కాకినాడ జిల్లాలో మహిళా డాక్టర్‌పై జనసేన నేత వీరంగం
క్షతగాత్రులను సీహెచ్‌సీకి చేర్చిన వారి వివరాలు చెప్పాలంటూ కార్యకర్తల రగడ
పోలీసుల ప్రేక్షకపాత్ర
రక్షణ కల్పించాలని వైద్యుల డిమాండ్
ప్రత్తిపాడు: రాష్ట్రంలో కూటమి నేతల దాడులు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా.. జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల తమ్మయ్యబాబు ఏకంగా మహిళా డాక్టర్‌పై విరుచుకుపడి నానా రాద్ధాంతం సృష్టించారు. ఎప్పటిలాగే పోలీసులు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్వాపరాలు ఏమిటంటే.. ఏలేశ్వరం మండలం లింగంపర్తికి చెందిన కాపవరపు చంద్రకళ పదేళ్ల కుమారుడు చంద్ర శేఖర్‌తో కలిసి ఆటోలో లింగంపర్తి వస్తోంది.
ఆమె ప్రయాణిస్తున్న ఆటోను తునివైపు వెళ్తున్న కారు రామవరం వద్ద ఢీకొట్టి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం తల్లీకొడుకును హైవే అంబు లెన్సులో స్థానిక సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ శ్వేత వెంటనే స్పందించి, సిబ్బంది సహాయంతో వైద్యసేవలు అందించారు. అదే సమయంలో తమ గ్రామానికి చెందిన క్షత గాత్రులను పరామర్శించేందుకు లింగంపర్తి నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆస్పత్రిలోకి దూసు కొచ్చి, బాధితులను తీసుకొచ్చిందెవరంటూ నానా యాగీ చేశారు.
గాయపడిన వారిని ఎవరైనా తీసుకొస్తే వివరాలు లేకుండానే చికిత్స చేస్తారా అంటూ వారు వైద్యురాలితో ఘర్షణకు దిగారు. సిబ్బంది వారిస్తున్నా వినకుండా వారిపై ఎదురుదాడికి దిగారు. హైవే అంబులెన్సులో తీసుకొచ్చారని, పోలీసులకు సమాచారం అందించామని ఎంత చెబుతున్నా వినకుండా ఆçస్పత్రికి తీసుకొచ్చిన వారి వివరాలు చెప్పాలని రాద్ధాంతం చేశారు. అలాగే, తమ నాయకుడు వరుపుల తమ్మయ్యబాబుతో మాట్లాడాలంటూ డాక్టర్ శ్వేతకు సెల్‌ఫోన్ ఇచ్చారు. దీంతో అవతలి వ్యక్తి ఎవరో తెలియని డాక్టర్ బాధితులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
అంతే.. ఆగ్రహావేశాలతో ఊగిపోతూ వరుపుల తమ్మయ్యబాబు ఆస్పత్రికి చేరుకున్నారు. ‘తమ్మయ్యబాబు అంటే తెలీదా.. జీతాలు తీసుకోవడంలేదా.. నువ్వు డాక్టర్‌వా.. గేదెలు కాస్తున్నావా’.. అని నోటికొచ్చినట్లు అరుస్తూ ఆస్పత్రిలో హడావుడి చేశారు. దీంతో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

సెల్‌ఫోన్ లాక్కుని.. నగదు దోచుకుని..
ఈ తతంగమంతా ఓ పారిశుధ్య కార్మికురాలు తన సెల్‌లో వీడియో తీస్తుండగా జనసేన కార్య కర్తలు ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని వెళ్లిపోయారు. ఆ తర్వాత దాన్నుంచి రూ.2,700 నగదును ట్రాన్సఫర్ చేసుకుని, వీడియోలన్నీ తొలగించి రాత్రి 11 గంటలకు తిరిగిచ్చారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు.
మరోవైపు.. తమకు స్వేచ్ఛ, రక్షణ కల్పించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన హామీ కావాలనివైద్యులు డిమాండ్ చేశారు. కాగా, డాక్టర్ శ్వేత పట్ల అనుచితంగా ప్రవర్తించిన తమ్మయ్యబాబు ను సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment