దళిత మహిళ పై దాడి హేయమైన చర్య
కాకినాడ, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ గూండాలతో కలిసి కాంగ్రెస్ సీటీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కొప్పుల విజయ్‌కుమారి ఇంటిపై దాడి చేయడం, కులంపేరుతో దూషించడం దారుణమని ఎస్సీనేతలు విమర్శించారు. ఈ మేరకు స్థానిక సాంబమూర్తినగర్‌లో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొప్పుల విజయకుమారి మాట్లాడుతూ బుధవారం పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ గూండాలు వ్యవహరించిన తీరును వివరించారు. ఆరోజు మధ్యాహ్నం 2.45 గంటలకు నానాజీ ఆధ్వర్యంలో కొందరు మద్యం సేవించిన యువకులు తన ఇంటిని చుట్టుముట్టి బీభత్సం చేశారన్నారు. ఇంటిలోకి చొరబడి తమ కుటుంబ సభ్యులపై దుర్భాషలాడుతూ సామగ్రిని చిందరవందర చేశారన్నారు. కులంపేరుతో దూషించి నెట్టివేశారని ఆరోపించారు.
పోలింగ్‌స్టేషన్ సమీపంలోనే ఇదంతా జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని విమర్శించారు. కార్పొరేటర్‌గా పనిచేసిన తనపై కనీస మర్యాద చూపించలేదన్నారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అర్ధరాత్రి వరకూ పట్టించుకోలేదని, చివరకు తాను గట్టిగా గొడవ చేస్తే కేసు పెట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ జస్టీస్ సంస్థ ప్రధాన కార్యదర్శి జయంత్, నాయకులు పువ్వల భాస్కరరావు, ఎంఆర్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వంగలపూడి నూకరాజు, గూడపాటి రాజు, మాజీకౌన్సిలర్లు ముద్దండ నాగేశ్వర్రావు, సిగల మధు తదితరులు మాట్లాడుతూ ఎస్సీ మహిళపై బహిరంగంగానే ఇలాంటి దౌర్జన్యాలకు దిగిన పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. 24 గంటల్లో ఆయనపై చర్య తీసుకోని పక్షంలో కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగుతామన్నారు. సమావేశంలో నాయకులు నురుకుర్తి నాగరాజు, వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీసెల్ కన్వీనర్ అక్బర్‌అజామ్ తదితరులు పాల్గొన్నారు.
పంతం నానాజీపై అట్రాసిటీ కేసు
కాకినాడ క్రైం : కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీపై త్రీ టౌ న్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పంతం నానాజీ, అతడి అనుచరుడు పీటీ శివ తదితరులు పోలింగ్ రోజైన బుధవా రం మధ్యాహ్నం విజయ కుమారి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిం చి, కులం పేరుతో ధూషించారు. ఇంట్లో డబ్బు, మ ద్యం దాచారంటూ ఆమె కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగారు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశారు. దీంతో విజయ కుమారి బుధవారం మధ్యాహ్నం త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారంటూ అదేరోజు రాత్రి 11 గంటల వరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఎట్టకేలకు పోలీసులు పంతం నానాజీ, పీటీ శివ తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విజయ కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.సతీష్ బాబు తెలిపారు.