jayalakshmi society
-
‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లను నిలువునా ముంచేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేసిన జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ గత పాలకవర్గ సభ్యుల ఆస్తులను సీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సీఐడీ ఆ దిశగా దూకుడు పెంచింది. నిన్న మొన్నటివరకు మార్గదర్శి కుంభకోణాన్ని ఛేదించడంలో నిమగ్నమైన సీఐడీ ఇప్పుడు తాజాగా ‘జయలక్ష్మి’పై దృష్టిపెట్టింది. కాకినాడ సర్పవరంలోని జయలక్ష్మి మెయిన్ బ్రాంచిలో రెండ్రోజులుగా సీఐడీ బృందం పాత పాలకవర్గ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సహా డైరెక్టర్లు వ్యూహాత్మకంగా ముందుగానే అమ్మేసిన ఆస్తుల సీజ్‌కు రికార్డులను సిద్ధంచేసింది. జామీను దొరక్కపోవడంతో జైలులోనే.. ఏప్రిల్‌లో కాకినాడ సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బోర్డు తిప్పేసి 19,911 మందికి చెందిన రూ.520 కోట్ల డిపాజిట్లు కొల్లగొట్టేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల్లో 29 బ్రాంచీలను ఏర్పాటుచేసి ఈ మోసానికి తెగబడ్డారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరి డిపాజిటర్ వరకు న్యాయం చేసేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇందులో భాగంగా సీఐడీని రంగంలోకి దించడంతో చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షి, 11 మంది సహా డైరెక్టర్లపై కేసులు నమోదుచేయడానికి, ముగ్గురు మినహా అందరినీ అరెస్టుచేయించడానికి వీలు చిక్కింది. ఆంజనేయులు, విశాలాక్షి, డైరెక్టర్లకు బెయిల్ మంజూరైనప్పటికీ జామీను ఇవ్వడానికి ఎవరు ముందుకురాకపోవడంతో వారంతా ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఆస్తులు సీజ్ చేస్తున్న సీఐడీ ఈ క్రమంలో.. గత పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్పర్సన్ సహా డైరెక్టర్ల పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పాలకవర్గ చైర్మన్ గంగిరెడ్డి త్రినాథ్‌రావు సమక్షంలో సీఐడీ బృందం గురు, శుక్రవారాల్లో కాకినాడ మెయిన్ బ్రాంచిలో రికార్డులను పరిశీలించింది. ఒక్క కాకినాడ జిల్లాలోని ఎనిమిది బ్రాంచీల వివరాలు సేకరిస్తేనే కోట్ల విలువైన చర, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు తేలింది. సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సీఐడీ సీఐ పైడప్ప నాయుడు, ఆరుగురు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం రికార్డులు, గత పాలకవర్గ సభ్యుల పేరుతో ఉన్న డాక్యుమెంట్లను సేకరించి ఆస్తులను సీజ్ చేసే పనిలో నిమగ్నమైంది. వీటిపై చట్టపరంగా ఆంజనేయులు, విశాలాక్షి సహా డైరెక్టర్లకు ఎటువంటి హక్కుల్లేవని సీఐడీ తేల్చింది. ఆర్నెల్ల ముందు నుంచే అమ్మకానికి ఆస్తులు.. ఇక విశాలాక్షి, భర్త, కుమారులు కలిసి బ్యాంకు బోర్డు తిప్పేయడానికి ఆర్నెల్ల ముందునుంచే తమ పేరుతో ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టేశారు. కాకినాడలో ఒక మార్ట్.. రామారావుపేట, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న నాలుగు చర, స్థిరాస్తులతో పాటు ఎనిమిది ఎకరాల భూమిని కూడా ఆమె విక్రయించినట్లుగా గుర్తించారు. అలాగే, విశాలాక్షి పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న మొత్తం 64 ఆస్తులనూ సీజ్ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. సుమారు రూ.120 కోట్ల విలువైన ఆస్తులు అమ్మేసినట్లు తేలింది. వాటిలో కాకినాడ ఎస్ఈజడ్లో 30 ఎకరాలు ఉంది. ఇలా కొనుగోలుచేసి తిరిగి అమ్మేసిన ఆస్తులను సీజ్ చేయడంపై సీఐడీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఆస్తులను కొనుగోలు చేసిన వారికి సీఐడీ నోటీసులు సిద్ధంచేస్తోంది. వారిపై చార్జిషీట్లు కూడా వేయనుంది. సీఐడీ దూకుడుతో వారంతా బయటకు.. బ్యాంకు నుంచి రూ.120 కోట్లు వరకు రుణాలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఉన్న వారంతా ఇప్పుడు సీఐడీ దూకుడుతో బయటకొస్తున్నారు. నోటీసులు తీసుకుని 50 రోజులు దాటినా స్పందించని వారు సీఐడీ జోరుతో రుణాలు జమచేసేందుకు రుణగ్రహీతలు ముందుకొస్తున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా రుణగ్రస్తుల ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లుగా లెక్కతేలింది. 30శాతం తిరిగి చెల్లింపు? ఇక డిపాజిటర్లకు తొలి విడతగా మొత్తం డిపాజిట్లలో 30 శాతం తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకల్లా బాధితులకు రూ.100 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు 3 కోట్లు వసూలయ్యాయి. డిపాజిటర్లలో 14వేల మంది రూ.లక్ష నుంచి రూ.4 లక్షలలోపు డిపాజిట్ చేసిన వారే. రూ.26 కోట్లు తిరిగి ఇచ్చేస్తే మూడొంతులు మంది బాధితులు జయలక్ష్మి కుంభకోణం నుంచి బయటపడతారు. మరోవైపు.. సివిల్, అండ్ క్రిమినల్ కేసుల ప్రకారం ముందుకెళ్లే అవకాశముండడంతో జూలై 10 నాటికి జమచేస్తామని రుణాలు తీసుకున్న వారు చెబుతున్నారు. – గంగిరెడ్డి త్రినాథ్‌రావు, చైర్మన్, కాకినాడ జయలక్ష్మి సొసైటీ -
జయలక్ష్మీ బ్రాంచ్‌లలో విస్తృత సోదాలు
కాకినాడ రూరల్: కాకినాడ జిల్లాలో డిపాజిటర్ల సొమ్మును దారి మళ్లించి నట్టేటముంచిన జయలక్ష్మీ సొసైటీ లిమిటెడ్ గత పాలకవర్గ అవినీతి, అవకతవకలపై సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. సొసైటీ పాలకవర్గంలోని కీలకమైన గత చైర్మన్, వైస్ చైర్మన్ దంపతులతో పాటు వారి కుమారుడిని ఇప్పటికే జైలుకు పంపిన సీఐడీ అధికారులు..మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మరో వైపు జయలక్ష్మీ సొసైటీకి కొత్త పాలకవర్గం అందుబాటులోకి వచ్చింది. కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తాళాలు తెరవాలని సీఐడీ అధికారులను కోరుతూ మహాజన సభ వేదిక ద్వారా ఈ పాలకవర్గం తీర్మానించింది. కాగా, రాష్ట్రంలోని 29 బ్రాంచ్‌లలో అధికారులు సోదాలకు దిగారు. సోమవారం పిఠాపురం బ్రాంచ్‌లో తనిఖీలు ప్రారంభించిన అధికారులు మంగళవారం అన్ని బ్రాంచ్‌లకు తిరుగుతున్నారు. సర్పవరం వద్ద మెయిన్ కార్యాలయంలో మంగళవారం సీఐడీ అడిషనల్ ఎస్పీ రవివర్మ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు బుచ్చిరాజు, రమణమూర్తి, సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. బ్రాంచ్ మేనేజరు టి.పద్మావతి, సీఏవో లీలాప్రసాద్‌తో అడిషనల్ ఎస్పీ రవివర్మ మాట్లాడారు.కాగా, ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న ముగ్గురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. -
‘జయలక్ష్మి’ లెక్క రూ.560 కోట్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన కాకినాడది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ (ఎంఏఎం) కో ఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం అవినీతి లెక్క తేలింది. డిపాజిటర్ల సొమ్ము సుమారు రూ.560 కోట్ల మేర దారి మళ్లించినట్లు వెల్లడైంది. జయలక్ష్మి పాలకవర్గం అక్రమాల బాగోతాన్ని సహకార శాఖ అధికారుల బృందం నిగ్గు తేల్చింది. దాదాపు మూడు నెలలకుపైగా రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచీల్లో ఖాతాలను పరిశీలించి తుది నివేదికను సహకార శాఖ కమిషనర్ బాబు అహ్మద్ పరిశీలనకు పంపారు. వడ్డీ ఎరవేసి.. ఆకర్షణీయంగా 12.5 శాతం వడ్డీని ఎర వేయడంతో జయలక్ష్మి సొసైటీ బ్రాంచిల్లో సుమారు 20 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు రూ.కోట్లలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. గడువు తీరినా డబ్బులు చెల్లించకపోవడంతో జయలక్ష్మి సొసైటీ బాగోతం గత ఏప్రిల్ 6న వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదులతో చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షి తదితరులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులతో పాటు సీబీసీఐడీ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. బాధితుల ఆక్రందన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు, నలుగురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లతో కూడిన కమిటీ ఏప్రిల్ 20 నుంచి విచారణ చేపట్టి అనేక అవకతవకలు గుర్తించింది. చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షి కనుసన్నల్లోనే ఈ మొత్తం కుంభకోణం జరిగినట్టు నివేదికలో పొందుపరిచారు. డిపాజిటర్ల ఖాతాల నుంచి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ వైస్ చైర్పర్సన్, కుటుంబ సభ్యుల పేరిట మళ్లించిట్టు కమిటీ తేల్చింది. రుణాలకు ఎటువంటి హామీ పత్రాలూ లేవు. ఆంజనేయులుకు వరుసకు మేనల్లుడు అయిన ఓ వ్యక్తికి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.70 కోట్ల వరకూ డబ్బులు మళ్లించారు. మరోవైపు పాలకవర్గంలో మెజారిటీ సభ్యులు డిపాజిటర్ల సొమ్ములను సొంతానికి వాడుకున్నారు. మరి కొందరికి ఎలాంటి హామీ లేకుండా రూ.200 కోట్ల వరకూ బదలాయించినట్టు గుర్తించారు. వైస్ చైర్పర్సన్ సమీప బంధువుకు సినిమా నిర్మాణం పేరుతో హామీ లేకుండా రూ.50 కోట్లు ఇచ్చేశారు. సర్పవరం మెయిన్ బ్రాంచి లెడ్జర్లో కొన్ని పేజీలు మాయమయ్యాయని నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. అక్టోబరు 9న పాలకవర్గ ఎన్నికలు సహకార శాఖ గత నెల 23న జయలక్ష్మి సొసైటీకి అడ్హాక్ కమిటీని నియమించింది. ఈ కమిటీ స్థానంలో కొత్త పాలకవర్గం ఎన్నిక జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు అడ్హాక్ కమిటీ చైర్మన్ సుబ్బారావు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఎన్నికల అధికారిగా రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆర్ఎస్ సుధాకర్‌ను నియమించారు. బోర్డు డైరెక్టర్లు, ఆఫీసు బేరర్ల నియామకానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబరు 9న పాలకవర్గ ఎన్నిక నిర్వహించి మర్నాడు ఫలితాలు ప్రకటిస్తారు. ఏకగ్రీవం అయితే అక్టోబర్ 2న పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. లేకపోతే 9న పోలింగ్ నిర్వహిస్తారు. జయలక్ష్మి సొసైటీ కుంభకోణంపై కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గం చర్చించి డిపాజిటర్లకు అండగా నిర్ణయం తీసుకోనుంది. విచారణ పూర్తి జయలక్ష్మి సొసైటీలో జరిగిన అవకతవకలపై నివేదికను ఉన్నతాధికారులకు పంపించాం. కొత్త పాలకవర్గం ఎన్నికకు అడ్హాక్ కమిటీ చైర్మన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏకగ్రీవం కాకుంటే పోలింగ్ నిర్వహిస్తాం. – ఆర్.దుర్గాప్రసాద్, జిల్లా సహకార అధికారి, కాకినాడ -
‘జయలక్ష్మి’ పాలకవర్గం రద్దు
సాక్షిప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన కాకినాడలోని ది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ (ఎంఏఎం) కోఆపరేటివ్ సొసైటీ పాలకవర్గం రద్దు అయ్యింది. చైర్మన్ సహా 10 మంది డైరెక్టర్లపై మహాజనసభ అనర్హత వేటు వేసింది. డిపాజిట్లకు 12.5 శాతం వడ్డీలు ఇస్తామని ఆశ చూపి రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లలో 19,971 మంది విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు ఇలా అన్ని వర్గాల నుంచి రూ.520 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించారని ప్రాథమికంగా నిర్ధారించారు. డిపాజిట్ల గడువు ముగిసినా సొమ్ములు చెల్లించకపోవడంతో ‘జయలక్ష్మి’ గత ఏప్రిల్ 6న బోర్డు తిప్పేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న సొసైటీ పాలకవర్గంపై బాధితుల ఫిర్యాదులతో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సీబీసీఐడీ పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. సొసైటీ రికార్డులను అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సహకార శాఖలోని రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు విచారణ చేస్తున్నారు. సొసైటీ నిర్వహణ లేక కుంటుపడుతోందని.. వెంటనే మహాజన సభ ఏర్పాటు చేయాలని డిపాజిటర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా సహకార అధికారి బీకే దుర్గాప్రసాద్‌కు అందిన లేఖతో శనివారం కాకినాడలో మహాజనసభ ఏర్పాటు చేశారు. ఇందులో పలు తీర్మానాలు ఆమోదించారు. అడ్హాక్ కమిటీకి పాలకవర్గం బాధ్యతలు సుమారు రూ.520 కోట్లు డిపాజిట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితులు, సొసైటీ పరిపాలన మందగించడం, వారిపై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో చైర్మన్ సహా 10 మంది సభ్యులు డైరెక్టర్లుగా కొనసాగే అర్హత లేదని మహాజనసభ నిర్ణయించింది. 30 రోజుల్లోపు పాలకవర్గం మహాజనసభ ఏర్పాటు చేయకపోవడంతో సంఘం బైలా ప్రకారం సభ్యులపై అనర్హత వేటు వేసింది. పరారీలో ఉన్న పాలకవర్గ సభ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా మరో తీర్మానాన్ని ఆమోదించింది. పాలకవర్గ చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ ఆర్బీ విశాలాక్షి, ట్రెజరర్ ఏపీఆర్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.జయదేవ్‌మణి, డైరెక్టర్లు.. నాగేశ్వరరావు, ఎం.సత్యనారాయణ, ఎస్.చక్రభాస్కరరావు, వి.నరసయ్య, జి.నారాయణమూర్తి, మాజీ ట్రెజరర్ డి. వెంకటేశ్వరరావులను పాలకవర్గంలో కొనసాగేందుకు అనర్హులుగా ప్రకటించారు. వీరిని పాలకవర్గం నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. తొలగించిన సభ్యుల స్థానంలో సొసైటీ బైలా ప్రకారం కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునే వరకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా 10 మందితో అడ్హాక్ కమిటీని నియమించారు. దీనికి చైర్మన్‌గా వీఎస్వీ సుబ్బారావు, సభ్యులుగా.. గోదావరి శ్రీనివాస చక్రవర్తి, ఎండీ మెహబూబ్ రెహ్మాన్, పీవీ రమణమూర్తి, అంగర నరసింహారావు, సూరి రామ్‌ప్రసాద్, చింతలపూడి సుబ్రహ్మణ్యం, షేక్ జానీ బాషా, ఏవీఎస్ రవికుమార్, జ్యోతుల స్వామిప్రసాద్‌లను నియమించారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు చేసే వరకు సొసైటీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగించారు. -
ఉద్యోగమిచ్చి.. ఉచ్చులోకి దించి
అమలాపురం టౌన్: ఉద్యోగమంటూ ఎర వేశారు.. వ్యూహాత్మకంగా వలలోకి దించారు.. ది జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసిన సంఘటనలో విశ్రాంత ఉద్యోగులే చాలామంది మోసపోయారు. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు ఉన్నాయి. ‘జయలక్ష్మి’ యాజమాన్యం తమ సంస్థలో డిపాజిట్ల సేకరణకు ఆది నుంచి ముందు చూపుతో వ్యవహరించింది. ముందుగా పలు వాణిజ్య బ్యాంకుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారుల వివరాలు సేకరించింది. తమ సొసైటీ బ్రాంచుల్లో వివిధ ఉద్యోగాలను ఎరగా చూపి వారికి కీలక పోస్టులను అప్పగించింది. మేనేజర్ స్థాయి కూర్చీల్లో కూర్చోబెట్టి గతంలో వారు పనిచేసిన బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసిన వ్యక్తులను పాత పరిచయాలతో తమ సొసైటీ వైపు ఆకర్షించేలా చేసుకుంది. అవిభక్త జిల్లా నుంచి ఇతర బ్యాంక్‌లు, డీసీసీబీల బ్రాంచ్‌ల్లో దాదాపు 45 మంది విశ్రాంత అధికారులకు ‘జయలక్ష్మి’ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చింది. వాణిజ్య బ్యాంక్‌లు, డీసీసీబీ తదితర బ్యాంక్‌లు వడ్డీ 5 నుంచి 6 శాతం ఇస్తుంటే.. తమ జయలక్ష్మి సొసైటీలో 10 శాతానికి మించి అధిక వడ్డీ ఇస్తున్నామని చెప్పి ఆకర్షించింది. ఉద్యోగుల విశ్వాసంతో వల డీసీసీబీ బ్రాంచ్‌ల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కొందరు మేనేజర్లకు ‘జయలక్ష్మి’ బ్రాంచీల్లో ఉద్యోగాలు ఇచ్చి వారికి ఆకర్షణీయమైన జీతాలతో మేనేజర్లుగా కూర్చోబెట్టింది. ఉదాహరణకు కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు జయలక్ష్మి బ్రాంచ్‌ల్లో ఐదుగురు మేనేజర్లు విశ్రాంత డీసీసీబీ బ్రాంచ్‌ల మేనేజర్లే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్లాన్ ప్రకారం వివిధ వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు, అకౌంటెంట్లుగా ఉద్యోగ విరమణ చేసిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంది. విశ్రాంత అధికారులకు తమ సొసైటీల్లో ఉద్యోగాలు ఇచ్చి ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు కొల్లగొట్టాలని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు. వారి చేత ఆయా బ్యాంకుల్లో డిపాజిట్‌దారులను నమ్మించి, ఒప్పించి అక్కడ డిపాజిట్ల సొమ్మును ‘జయలక్ష్మి’లో వేసేలా చేయడంలో యాజమాన్యం సఫలీకృతమైంది. అమలాపురం జయలక్ష్మి బ్రాంచ్‌లో దాదాపు రూ.48 కోట్ల మేర డిపాజిట్‌దారులు దాచుకున్న సొమ్మును దోచేస్తే అందులో సుమారు రూ.15 కోట్లు అప్పటివరకూ డీసీసీబీ బ్రాంచ్‌లో డిపాజిటర్లుగా ఉన్నవారి నుంచి మళ్లింపు అయ్యింది. అవిభక్త జిల్లాలో పలు వాణిజ్య బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి సుమారు రూ.50 కోట్లు, డీసీసీబీ బ్రాంచ్‌ల్లో దాదాపు రూ.150 కోట్ల వరకూ ఇలా గత కొన్నేళ్లలో ఆయా బ్రాంచ్‌ల్లో దాచుకున్న డిపాజిట్దారులే తమ సొమ్మును ఈ సొసైటీ డిపాజిట్లలోకి మళ్లించుకునేలా వారిలో నమ్మకాన్ని నింపగలిగింది. వారినే వాడుకుంది.. పలు బ్యాంకుల బ్రాంచ్‌ల విశ్రాంత మేనేజర్లకు తమ సొసైటీ బ్రాంచ్‌ల్లో తిరిగి మేనేజర్ల ఉద్యోగాలు కల్పించి ‘జయలక్ష్మి’ యాజమాన్యం పావులుగా వాడుకుంది. ఉదాహరణకు అమలాపురంలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు తమ కుటుంబ సభ్యుల ద్వారా రూ.45 లక్షల వరకూ ‘జయలక్ష్మి’లో డిపాజిట్ చేశారు. గతంలో ఓ వాణిజ్య బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేసి రిటైర్ తర్వాత జయలక్ష్మిలో మేనేజర్ అయిన ఓ అధికారి మాటలను నమ్మి అన్ని లక్షలు డిపాజిట్లు చేశానని ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు లబోదిబోమంటున్నారు. ఇలా రూ.లక్షలు దాచుకుని నేడు దోపిడీకి గురైన ఏ విశ్రాంత ఉద్యోగిని కదిపినా ఒక్కో కన్నీటి కథ చెబుతున్నారు. తాము డిపాజిట్ చేయడం వెనుక ఫలానా బ్యాంక్ విశ్రాంత మేనేజరో.. బ్యాంక్ అధికారో ఉన్నారని.. వారి మాటలను నమ్మే సొమ్ము వేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిర్వాహకులదే నిర్వాకం!?
కాకినాడ రూరల్: వేలాది మంది నమ్మకాన్ని దారుణంగా దెబ్బతీసి కాకినాడలోని సర్పవరం జంక్షన్లో బోర్డు తిప్పేసిన జయలక్ష్మి సొసైటీ బాగోతం నిర్వాహకుల నిర్వాక ఫలితమేనని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో స్వార్థ ప్రయోజనాల కోసమే వారు సొసైటీని దివాళా తీయించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. తమ కష్టారితాన్ని ఎంతో నమ్మకంతో సొసైటీలో పొదుపు చేసుకున్న సభ్యులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరికి వారే యమునా తీరే రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు కలిగి సుమారు పదివేల మంది నుంచి డిపాజిట్ల రూపంలో రూ.520 కోట్లు సేకరించిన జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీలో జవాబుదారీతనం పూర్తిగా లోపించింది. ఈ కుంభకోణంపై అడిగేందుకు పాలకవర్గం అందుబాటులో లేదు. ఒకరిద్దరు సిబ్బంది ఉన్నా తమకేమీ తెలీదని చేతులు దులుపుకుంటున్నారు. దీంతో డిపాజిటర్ల సొమ్ములు తిరిగి చెల్లించడం ఇప్పట్లో అసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపు.. సుధాకర్ అనే ఉద్యోగి ఫిర్యాదుతో సొసైటీలో సహకార శాఖాధికారులు ప్రాథమిక విచారణ పూర్తిచేసి నివేదికను ఉన్నతాధికారులకు గురువారం రాత్రి అందజేశారు. తొలుత ముగ్గురు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, తరువాత సహకార శాఖ కమిషనర్ ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన డిప్యూటీ రిజిస్ట్రార్ కృష్ణకాంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు జవహర్, ఏవీ లక్ష్మి, పి. ఉమాశంకర్, వెంకటేశ్వరరావుల బృందం రెండ్రోజుల పాటు విచారణ చేపట్టింది. సొసైటీలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సొసైటీ వైస్ చైర్పర్సన్ నిర్వాకం కంచే చేను మేసింది అన్నట్లుగా.. సొసైటీ వైస్ చైర్పర్సన్ హోదాలో ఉన్న ఆర్బీ విశాలక్షి తన స్వార్థ ప్రయోజనాల కోసం సొసైటీని దివాలా తీసేలా చేశారని అధికారులు అంచనాకు వచ్చారు. సుమారు రూ.64 కోట్ల వరకు ఆమె రుణాలు రూపేణా వాడుకోగా మరో రూ.140 కోట్లను బినామీల పేరిట అందించారు. ఇలా మొత్తం రూ.200 కోట్లు పక్కదారి పట్టాయి. మరో రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు రుణాలిచ్చినా వాటికి సరైనా సెక్యూరిటీ లేకపోవడంతో అవి పత్తాలేకుండా పోయాయి. దీంతో సొసైటీ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయింది. విశాఖ సంస్థే కారణం? ఇక సొసైటీ దివాలాకు విశాఖపట్నానికి చెందిన రావు అండ్ రావు చార్టెడ్ అకౌంటెంట్స్, కన్సెల్టెంట్స్ ప్రధాన కారణమని భావిస్తున్నారు. సొసైటీ ఆర్థిక పరిస్థితి దివాలా తీసేలా ఉన్నప్పుడు వీరు అడ్డుకట్ట వేయాల్సింది పోయి వైస్ చైర్‌పర్సన్‌కు సహకరించడంతో బినామీల ద్వారా డిపాజిట్లను పక్కదారి పట్టించేందుకు బీజం వేసినట్లు అధికారుల బృందం ప్రాథమిక విచారణలో తేల్చి నివేదికను డీసీఓ దుర్గాప్రసాద్‌కు అందజేసింది. ఆయన దానిని గుంటూరులోని సహకార శాఖ రిజిస్ట్రార్, కమిషనర్లకు పంపారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. జయలక్ష్మి సొసైటీలో భారీగా అవకతవకలు జరిగినట్లు తేలడంతో సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ల విచారణకు ఆదేశించాలని కోరామన్నారు. అలాగే, సీబీసీఐడీ విచారణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక సొసైటీలో క్షుణ్ణంగా విచారణ నిర్వహించేందుకు నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. 30మంది డిపాజిటర్ల ఫిర్యాదులు మరోవైపు.. సర్పవరం, టూటౌన్, ఇంద్రపాలెం, పిఠాపురం తదితర పోలీసుస్టేషన్లలో డిపాజిటర్లు తమ సొమ్ము కోసం పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై సర్పవరం సీఐ ఆకుల మురళీకృష్ణను వివరణ కోరగా.. తమకు 30మంది వరకు ఫిర్యాదులు ఇచ్చారని, ఎస్పీ సూచనల మేరకు వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.