అమలాపురం టౌన్: ఉద్యోగమంటూ ఎర వేశారు.. వ్యూహాత్మకంగా వలలోకి దించారు.. ది జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ బోర్డు తిప్పేసిన సంఘటనలో విశ్రాంత ఉద్యోగులే చాలామంది మోసపోయారు. ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్‌లు ఉన్నాయి. ‘జయలక్ష్మి’ యాజమాన్యం తమ సంస్థలో డిపాజిట్ల సేకరణకు ఆది నుంచి ముందు చూపుతో వ్యవహరించింది. ముందుగా పలు వాణిజ్య బ్యాంకుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారుల వివరాలు సేకరించింది.
తమ సొసైటీ బ్రాంచుల్లో వివిధ ఉద్యోగాలను ఎరగా చూపి వారికి కీలక పోస్టులను అప్పగించింది. మేనేజర్ స్థాయి కూర్చీల్లో కూర్చోబెట్టి గతంలో వారు పనిచేసిన బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసిన వ్యక్తులను పాత పరిచయాలతో తమ సొసైటీ వైపు ఆకర్షించేలా చేసుకుంది. అవిభక్త జిల్లా నుంచి ఇతర బ్యాంక్‌లు, డీసీసీబీల బ్రాంచ్‌ల్లో దాదాపు 45 మంది విశ్రాంత అధికారులకు ‘జయలక్ష్మి’ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చింది. వాణిజ్య బ్యాంక్‌లు, డీసీసీబీ తదితర బ్యాంక్‌లు వడ్డీ 5 నుంచి 6 శాతం ఇస్తుంటే.. తమ జయలక్ష్మి సొసైటీలో 10 శాతానికి మించి అధిక వడ్డీ ఇస్తున్నామని చెప్పి ఆకర్షించింది.
ఉద్యోగుల విశ్వాసంతో వల
డీసీసీబీ బ్రాంచ్‌ల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన కొందరు మేనేజర్లకు ‘జయలక్ష్మి’ బ్రాంచీల్లో ఉద్యోగాలు ఇచ్చి వారికి ఆకర్షణీయమైన జీతాలతో మేనేజర్లుగా కూర్చోబెట్టింది. ఉదాహరణకు కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు జయలక్ష్మి బ్రాంచ్‌ల్లో ఐదుగురు మేనేజర్లు విశ్రాంత డీసీసీబీ బ్రాంచ్‌ల మేనేజర్లే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్లాన్ ప్రకారం వివిధ వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు, అకౌంటెంట్లుగా ఉద్యోగ విరమణ చేసిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంది. విశ్రాంత అధికారులకు తమ సొసైటీల్లో ఉద్యోగాలు ఇచ్చి ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు కొల్లగొట్టాలని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు. వారి చేత ఆయా బ్యాంకుల్లో డిపాజిట్‌దారులను నమ్మించి, ఒప్పించి అక్కడ డిపాజిట్ల సొమ్మును ‘జయలక్ష్మి’లో వేసేలా చేయడంలో యాజమాన్యం సఫలీకృతమైంది. అమలాపురం జయలక్ష్మి బ్రాంచ్‌లో దాదాపు రూ.48 కోట్ల మేర డిపాజిట్‌దారులు దాచుకున్న సొమ్మును దోచేస్తే అందులో సుమారు రూ.15 కోట్లు అప్పటివరకూ డీసీసీబీ బ్రాంచ్‌లో డిపాజిటర్లుగా ఉన్నవారి నుంచి మళ్లింపు అయ్యింది. అవిభక్త జిల్లాలో పలు వాణిజ్య బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి సుమారు రూ.50 కోట్లు, డీసీసీబీ బ్రాంచ్‌ల్లో దాదాపు రూ.150 కోట్ల వరకూ ఇలా గత కొన్నేళ్లలో ఆయా బ్రాంచ్‌ల్లో దాచుకున్న డిపాజిట్‌దారులే తమ సొమ్మును ఈ సొసైటీ డిపాజిట్లలోకి మళ్లించుకునేలా వారిలో నమ్మకాన్ని నింపగలిగింది.
వారినే వాడుకుంది..
పలు బ్యాంకుల బ్రాంచ్‌ల విశ్రాంత మేనేజర్లకు తమ సొసైటీ బ్రాంచ్‌ల్లో తిరిగి మేనేజర్ల ఉద్యోగాలు కల్పించి ‘జయలక్ష్మి’ యాజమాన్యం పావులుగా వాడుకుంది. ఉదాహరణకు అమలాపురంలో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తన రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌తో పాటు తమ కుటుంబ సభ్యుల ద్వారా రూ.45 లక్షల వరకూ ‘జయలక్ష్మి’లో డిపాజిట్ చేశారు. గతంలో ఓ వాణిజ్య బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేసి రిటైర్ తర్వాత జయలక్ష్మిలో మేనేజర్ అయిన ఓ అధికారి మాటలను నమ్మి అన్ని లక్షలు డిపాజిట్లు చేశానని ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు లబోదిబోమంటున్నారు. ఇలా రూ.లక్షలు దాచుకుని నేడు దోపిడీకి గురైన ఏ విశ్రాంత ఉద్యోగిని కదిపినా ఒక్కో కన్నీటి కథ చెబుతున్నారు. తాము డిపాజిట్ చేయడం వెనుక ఫలానా బ్యాంక్ విశ్రాంత మేనేజరో.. బ్యాంక్ అధికారో ఉన్నారని.. వారి మాటలను నమ్మే సొమ్ము వేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment