ఇందిరమ్మ ఇళ్లకు నేడే శ్రీకారం | Indiramma houses from 11th March 2024 | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లకు నేడే శ్రీకారం

Published Mon, Mar 11 2024 6:06 AM | Last Updated on Mon, Mar 11 2024 6:06 AM

Indiramma houses from 11th March 2024 - Sakshi

భద్రాచలంలో పథకం ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి 

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల సాయం 

సాక్షి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు సోమవారం కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మైదానంలో సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభు త్వం అందించనుంది.

ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. దశలవారీగా రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారి కోసం వివిధ రకాల డిజైన్లను ప్రభుత్వమే తయారు చేయించింది. అందులో తప్పనిసరిగా ఒక వంట గది, టాయిలెట్‌ ఉండనున్నాయి. ఈ డిజైన్లను సీఎం రేవంత్‌ సోమవారం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,500 ఇళ్లను నిర్మించేందుకు 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో రూ.7740 కోట్లను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.

యాదాద్రి నుంచి భద్రాచలంకి సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి తొలుత యాదగిరిగుట్టకు చేరుకుంటారు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం భద్రాచలం రానున్నారు. భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం భద్రాచలం వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత సీతారామా ప్రాజెక్టుతో పాటు సాగునీటి రంగానికి సంబంధించిన ఇతర అంశాలు, భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్షాసమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత మణుగూరు చేరుకుని అక్కడ సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలిక్యాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement