సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాల తంతు సర్కారు వద్దకు చేరనుంది. జిల్లాలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేసిన సీఐడీ అధికారులు.. పూర్తిస్థాయిలో పరిశీలించి అవకతవకల నిగ్గు తేల్చారు. మొత్తంగా రూ.2కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించిన సీఐడీ.. ఇందుకు సంబంధించి బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
ఆ నాలుగు గ్రామాల్లో..
జిల్లాలో ‘ఇందిరమ్మ’ అక్రమాలపై తొలుత నాలుగు గ్రామాలను ఎంపిక చేసుకున్న సీఐడీ ఆమేరకు దర్యాప్తు చేపట్టింది. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, రేగొండి గ్రామాలు, పరిగి నియోజకవర్గంలోని చిన్నవార్వాల్, ఇప్పాయిపల్లి గ్రామాల్లో తనిఖీలు చేపట్టారు. లబ్ధిదారులను వివరాల ఆధారంగా పరిశీలన చేపట్టారు. వారు నిర్మించిన ఇళ్లను నేరుగా సందర్శిం చగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. పలుచోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా బిల్లులు డ్రా చేసినట్లు గుర్తించారు.
అదేవిధంగా బేస్‌మెంట్ స్థాయిలో పనులు చేపట్టగా.. లెంటల్ స్థాయి వరకు బిల్లులు పొందారు. కొన్నిచోట్ల ఇళ్లు పూర్తిచేసినట్లు రికార్డులు చూపిస్తున్నా.. లబ్ధిదారులు మాత్రం గుడిసెల్లో నివసిస్తున్నట్లు తేల్చారు. ఇలా పరిశీలన చేసిన అధికారులు.. కేవలం బషీరాబాద్‌లోనే రూ.90లక్షల అక్రమాలు జరిగినట్లు పసిగట్టారు. మొత్తంగా నాలుగు గ్రామాల్లో రూ.2కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు ఖరారు చేశారు.
కేసులు.. అరెస్టులు..
నాలుగు గ్రామాల్లో అక్రమాలపై బుధవారం సీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ఈ అక్రమాల్లో భాగస్వాములైన అధికారులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిపై సర్కారు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసి అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన బోగస్ లబ్ధిదారులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
నేడు సర్కారుకు ‘ఇందిరమ్మ’ నివేదిక!
Published Wed, Aug 20 2014 3:31 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement
Advertisement