సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి పొంగులేటి
పథకానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
‘ప్రజాపాలన’ దరఖాస్తుదారులకు ప్రాధాన్యం
నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన నిబంధనలు
విధి విధానాలు ఖరారు చేయాలని, ఇళ్ల డిజైన్లను రూపొందించాలని అధికారులకు ఆదేశం..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగమైన ‘ఇందిరమ్మ’ఇళ్ల పథకానికి ఈ నెల 11న శ్రీకారం చుట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి తొలుత 3,500 ఇళ్లను మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఈ పథకం అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేయాలని సూచించారు. శనివారం సచి వాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
త్వరలోనే మార్గదర్శకాలు
సొంత జాగా ఉన్నవారికి అదే స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు సీఎం చెప్పారు. సొంత జాగా లేని పేదలైతే.. ఇంటిస్థలంతోపాటు రూ.5 లక్షలు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇచ్చే మొత్తాన్ని ఎన్ని కిస్తీల్లో, ఏయే దశల్లో విడుదల చేయాలనే నిబంధనలతో త్వరగా మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, ఇందుకు కట్టుదిట్టమైన నిబంధనలు ఉండాలని సూచించారు.
డిజైన్లు సిద్ధం చేయండి
సొంత జాగాల్లో ఇళ్లను నిర్మించుకునేవారి కోసం కొన్ని డిజైన్లను సిద్ధం చేయాలని రేవంత్ ఆదేశించారు. ప్రతి ఇంట్లో వంటగది, మరుగుదొడ్డి ఉండేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ విభాగాలు పనిచేస్తాయన్నారు. ఇళ్ల మంజూరుకు సంబంధించి ఇటీవల నిర్వహించిన ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో చేసిన పొరపాట్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment