భద్రాచలం రామాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్
ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మంజూరు చేస్తాం
భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంబోత్సవంలో సీఎం రేవంత్ ప్రకటన
రూ.22,500 కోట్లతో మొత్తం 4.50 లక్షల ఇళ్లు ఇస్తాం నాడు వైఎస్ ఆకాశమే హద్దుగా లక్షలాది ఇళ్లు ఇచ్చారు
కేసీఆర్ డబుల్ బెడ్రూం పేరిట ఊరించి పేదలను మోసం చేశారని ఆరోపణ
కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని వెల్లడి
మహిళల పేరిటే ‘ఇందిరమ్మ’ ఇళ్లు ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే. ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టా మహిళల పేరుతోనే ఉంటుంది. తద్వారా ఆ ఇల్లు బాగుంటుంది. పిల్లలు చదువుకుంటారు. ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతుకుతుందనేది మా ప్రభుత్వ భావన.
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని.. పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతీ శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టేనని, అందుకే ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే ఇస్తామని చెప్పారు. సోమవారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. తర్వాత ఇక్కడి వ్యవసాయ మార్కెట్ మైదా నంలో నిర్వహించిన సభలో ఇందిరమ్మ ఇళ్ల పథ కాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. రేవంత్ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘భద్రాచలం రాముడి సాక్షిగా ఆయన ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నాం. పేదల చిరకాల కోరిక ఇది. దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్లు. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే, పది మందిలో తలెత్తుకొని నిలబడాలంటే సొంతిల్లు ఉండాలని ఆలోచించి నాడు వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాశమే హద్దుగా లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. పేదలు నేటికీ ఆ ఇళ్లలో ఉంటున్నారు. నాటి పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. పెళ్లయి పిల్లలతో కుటుంబంగా మారారు. వారు కూడా సొంతింట్లో ఆత్మగౌరవంతో బతకాలనే ఆశయంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం.
ఆ అబద్ధాలకు కాలం చెల్లింది
2014 ఎన్నికలకు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బె డ్రూం ఇల్లు ముద్దు అంటూ పేదల సొంతింటి కలలతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారు. పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో ఇదే కథ మళ్లీ మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాల కు కాలం చెల్లడంతోనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. మేం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లను మంజూరు చేస్తాం. డబుల్ బెడ్రూం ఇళ్లున్న ఊళ్లలో కేసీఆర్ ఓట్లు వేయించుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్లలోనే మేం ఓట్లు వేయించుకుంటాం. ఇందుకు కేసీఆర్ సిద్ధమా?
ఆ ఊళ్లలో ఓట్లు వేయించుకోండి
ప్రధాని మోదీ మాటలకు హద్దే లేదు. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసి తీయని మాటలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు. 2022 నాటికి దేశంలోని పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని గత ఎన్నికల ముందు బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. మరి కేంద్రం రాష్ట్రంలో ఎక్కడ ఇళ్లు కట్టించిందో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ చెప్పాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లున్న చోట బీజేపీ నాయకులు ఓట్లు వేయించుకోవాలి. మేం అక్కడ ఓట్లు అడగబోం. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కానీ పెట్టుబడి కూడా రాక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు.
భద్రాచలం రిటైనింగ్ వాల్‌కు రూ.500 కోట్లు
గోదావరి ముంపు నుంచి భద్రాచలం పట్టణాన్ని రక్షించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేశాం. ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి భద్రాచలంలో కలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. రాముల వారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి తుమ్మల అడిగారు. అన్నింటినీ పరిశీలిస్తాం. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఖమ్మం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉన్నందునే ముగ్గురు మంత్రులను ఇచ్చాం. ఇటీవల రేణుకాచౌదరిని రాజ్యసభకు ఎంపిక చేశాం..’’అని రేవంత్ చెప్పారు.
సభలో పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు చెందిన పలువురు మహిళలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రులతో కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా సీఎం భద్రాచలం పర్యటన సందర్భంగా కాన్వాయ్‌లోని వాహనం ఢీకొనడంతో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
రాములవారిని దర్శించుకున్న సీఎం, మంత్రులు
భద్రాచలం అర్బన్: భద్రాచలం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్, మంత్రులు తొలుత శ్రీసీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న సీఎం, మంత్రులకు అర్చకులు పరివట్టం కట్టి పూర్ణకుంభంతో ఆహ్వనించారు. గర్భగుడిలో సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి, బెల్లంతో చేసిన రాముల వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.
పేదలు గుర్తుంచుకునే రోజు ఇది..: భట్టి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగిన, పేదలు గుర్తుంచుకునే సందర్భం ఇది అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘‘పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం సీతారామచంద్రస్వామి పాదాల సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద, బలహీన వర్గాల వారు రాములవారి సన్నిధిలో ఇంటి పత్రాలు పొందడం శుభకరం. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇళ్ల పథకాన్ని అటకెక్కిస్తే.. మేం అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే ప్రారంభించాం. దళిత, గిరిజనులు ఇల్లు కట్టుకోవడానికి రూ.6 లక్షలు, మిగతా వర్గాలకు రూ.5 లక్షలు ఇస్తాం. బీఆర్‌ఎస్‌లా హామీలిచ్చి విస్మరించకుండా.. బడ్జెట్‌లో నిధులు కేటాయించాకే పథకాలను ప్రారంభిస్తున్నాం. ఇళ్ల నిర్మాణం కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో తొలి దఫాగా రూ.7,740 కోట్లు కేటాయించాం..’’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment