కర్నూలు(అర్బన్): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి గ్రహణం పట్టింది. ఎన్నడూ లేని విధంగా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులన్నింటిని కొత్త ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో జిల్లాలో 53 వేల మంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
అధికారికంగా రూ.22 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు బకాయి పడింది. అనధికారికంగా మరో రూ. 14 కోట్లను చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, సిమెంట్, ఇనుము తదితరాలన్నింటి ధరలు రెండింతలు పెరిగినా, సొంత గూడులేని వేల మంది లబ్ధిదారులు అప్పులు చేసుకుని గృహాలను నిర్మించుకుంటున్నారు. బిల్లులు ఆగిపోవడంతో వీరంతా దిక్కులు చూస్తున్నారు.
చేతి డబ్బులు లేకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణాలను నిలిపివేశారు. ఎప్పుడో అవినీతి జరిగిందని, వాటిపై విచారణ పేరుతో ప్రస్తుతం నిర్మాణంలో బిల్లులను నిలిపివేయడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా మూడు విడతల్లో 3,29,567 గృహాలు మంజూరయ్యాయి. నిర్మాణాలు పూర్తి అయిన వాటితోపాటు వివిధ దశల్లో ఉన్న గృహాలకు రూ. 990.30 కోట్లు వెచ్చించారు. మూడు విడతల్లో చేపట్టిన గృహ నిర్మాణాలు దాదాపు పూర్తికావొస్తున్న ప్రస్తుత సమయంలో బిల్లులను ఆపివేయడం వల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాక పట్టణ ప్రాంతాల్లో కూడా వేల సంఖ్యలో గృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి.
తొలి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిగేనా?
ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా గృహ నిర్మాణ పథకానికి నిధుల కేటాయింపులు జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిని జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సిస్టమ్ ఆమల్లోకి వచ్చిన బిల్లులను చెల్లిస్తారా? బడ్జెట్ కేటాయించిన అనంతరం బిల్లులను విడుదల చేస్తారా? అనే సందిగ్ధత నెలకొంది.
గూడు గోడు..!
Published Sat, Aug 9 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement