Payment of bills
-
భారతీయులకు యాపిల్ భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ భారతీయులకు భారీ షాకిచ్చింది. యాప్ స్టోర్‌లో యాప్‌లు, సబ్స్క్రిప్షన్ల కోసం డెబిట్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు స్వస్తి పలికింది. యూజర్లు అల్ట్రనేట్గా చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని యాపిల్ తన బ్లాగ్‌లో స్పష్టం చేసింది. మనదేశానికి చెందిన వినియోగదారులు తాము సేవ్ చేసిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లతో యాప్ సబ్స్క్రిప్షన్లపై చెల్లింపులు చేయలేకపోతున్నామంటూ యాపిల్ సంస్థకు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన యాపిల్ యాజమాన్యం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ను నిలిపివేసింది. అయితే వినియోగదారులు తమ యాపిల్ ఐడీలో ఉన్న బ్యాలెన్స్‌తో యాప్‌లు, సబ్స్క్రిప్షన్ల చెల్లింపులు చేసుకోవచ్చు. యాపిల్ ఐడీలో మరింత బ్యాలెన్స్ కావాలనుకుంటే యాప్ స్టోర్ కోడ్లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐలను వినియోగించుకోవచ్చు. చదవండి👉 ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా! టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్! -
ఎస్ఎల్బీసీ నెత్తిన మరో పిడుగు!
సాక్షి, హైదరాబాద్: ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో టన్నెల్ తవ్వకపు పనులకు కొత్త చిక్కొచ్చి పడింది. గడిచిన రెండు, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లుల చెల్లింపు చేయకుంటే ఈ నెల 10 నుంచి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని జెన్కో అధికారులు ఏజెన్సీ సంస్థకు నోటీసులు పంపారు. ఎస్ఎల్బీసీలో ఇప్పటికే శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు కన్వేయర్ బెల్ట్ పాడవడం, టన్నెల్ బోరింగ్ యంత్రానికి మరమ్మతులు జరగని కారణంగా ఆగిన విషయం తెలిసిందే. ఈ పనులకే రూ.60 కోట్లు అడ్వాన్సులు కోరగా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. దీనికి తోడు మరో రూ.20 కోట్ల మేర పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది. ఈ నిధులే ఐదారు నెల లుగా రాకపోవడంతో ఏజెన్సీ సంస్థ తలపట్టుకుంటోంది. ప్రస్తుతం ట్రాన్స్‌కో మరో పిడుగు వేసింది. టన్నెల్ తవ్వకం సందర్భంగా వస్తున్న సీపేజీ నీటిని తోడేందుకు ఏజెన్సీకి ప్రతినెలా రూ.2 నుంచి రూ.3 కోట్ల మేర కరెంట్ బిల్లు వస్తోంది. గతంలో బిల్లులు లేక చెల్లింపు చేయకపోవడంతో ప్రభుత్వం విదిల్చిన అరకొర నిధులతో నెట్టుకొచ్చింది. తాజాగా మళ్లీ మూడు నెలలుగా రూ.7 నుంచి రూ.8 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. వాటిని చెల్లించాలని లేదంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఇదివరకే జెన్కో హెచ్చరించింది. దీంతో ప్రాజెక్టు ఇంజనీర్లు ఆర్థిక శాఖను కలిసినా నిధుల విడుదల జరగలేదు. దీనిపై కల్పించుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు కొందరు రాష్ట్ర ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డితో చర్చించి కొన్నాళ్లు సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని విన్నవించారు. దీంతో సరఫరా కొనసాగిస్తూ వస్తుండగా, వారు విధించిన తుది గడువు ఈ నెల 10తో ముగుస్తోంది. బిల్లు చెల్లింపు చేయకుంటే సరఫరా ఆగనుంది. అదే జరిగితే మొత్తం ప్రాజెక్టుకు మొదటికే మోసం రానుంది. ఇప్పటికే ఇన్లెట్ టన్నెల్ పనుల వద్ద ప్రస్తుతం భారీగా సీపేజీ ఉండటంతో నిమిషానికి 9,600 లీటర్ల మేర నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీ వద్ద 6 వేల లీటర్ల మేర మాత్రమే నీటిని తోడే సామర్ధ్యం ఉండటంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతే డీ వాటరింగ్ చేయడం కష్టం. అదే జరిగితే టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా మునిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. -
పాలమూరు ప్రాజెక్టును నిలిపేస్తాం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు పూర్తికాని భూసేకరణ.. మరోవైపు కోర్టు కేసులు.. ఇంకోవైపు చేసిన పనులకు చెల్లింపులు జరగకపోవడంతో పనులు ఆపేస్తామని ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు సంకేతాలు పంపినట్లుగా తెలిసింది. గతేడాది ఆగస్టు నుంచి ప్రభుత్వం నయాపైసా నిధులు చెల్లించని దృష్ట్యా కాంట్రాక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరానికి నిధుల లభ్యత పుష్కలంగా ఉండటం, ప్రాజెక్టు పరిధిలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల పరిధిలో పనుల వేగిరానికి చర్యలు చేపడుతుండటంతో అక్కడ పనులను దక్కించుకున్న ఇదే కాంట్రాక్టర్లు తమ యంత్ర పరికరాలను అటువైపు మళ్లిస్తున్నట్లుగా తెలిసింది. ఉల్టా.. పల్టా.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.32 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు ప్రాజెక్టును చేపట్టిన విషయం విదితమే. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్ధండాపూర్, కేపీలక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా మొత్తం 5 రిజర్వాయర్ల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి రూ.30 వేల కోట్లతో పనులు చేపట్టారు. 2015–16 నుంచే ప్రాజెక్టు భూసేకరణ మొదలైనా, 2016–17 మార్చి నుంచి ఏజెన్సీలు పనులు మొదలెట్టాయి. ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తూ వస్తోంది. మొదట్లో పనులు ఘనంగా మొదలైనా తర్వాత చతికిలబడ్డాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.7,510.34 కోట్లు కేటాయించినా, భూసేకరణ జరగక, కోర్టు కేసుల కారణంగా పనులు జరగకపోవడంతో దాన్ని తిరిగి రూ.1,650 కోట్లకు సవరించారు. ఈ ఏడాది సైతం రూ.4,067 కోట్లు కేటాయించగా, ఇంతవరకు రూ.1,282 కోట్ల మేర ఖర్చు జరిగింది. మరో రూ.1,282 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇందులో చేసిన పనులకు చెల్లించాల్సిన మొత్తాలు రూ.900 కోట్ల మేర ఉండగా, భూసేకరణకు సంబంధించి రూ.380 కోట్ల వరకు ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు పనులకు నయా పైసా ఇవ్వలేదు. దీంతో సెప్టెంబర్ నుంచే పనులు నెమ్మదించాయి. ప్యాకేజీ–10లో మూడు రీచ్‌లు ఉండగా, ఇందులో ఒక రీచ్ పని ఆరంభమే కాలేదు. ప్యాకేజీ–1లో భూసేకరణ కారణంగా పనులు ముందుకు కదలడం లేదు. ప్యాకేజీ–9లో పనులు చేస్తున్న ఏజెన్సీ తన యంత్రాంగాన్ని పూర్తిగా కాళేశ్వరం రిజర్వాయర్లకు తరలించినట్లు సమాచారం. ప్యాకేజీ–6లో మెజార్టీ పనులు జరగ్గా, అక్కడ బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో అక్కడి నుంచి ఏజెన్సీ తన యంత్రాలను కాళేశ్వరం పనులకే తరలిస్తున్నట్లుగా తెలిసింది. ప్రాజెక్టుల బడ్జెట్‌పై మల్లగుల్లాలు.. ఉద్ధండాపూర్ రిజర్వాయర్ పరిధిలో 16, 17, 18 ప్యాకేజీలు ఉండగా, ఇక్కడ 16 ప్యాకేజీ పనులు ఇటీవలే మొదలవ్వగా, మిగతా రెండింటిలో పనులు ఆరంభమే కాలేదు. ఇప్పట్లో ఆ పనులను ఆరంభించే అవకాశం కనిపించట్లేదు. ఇంకా ప్రాజెక్టు పరిధిలో అవసరమైన 27 వేల ఎకరాల్లో మరో 9,692 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు ప్రస్తుతం నిధులు విడుదల జరగడం లేదు. అదీగాక ప్రస్తుతం ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్‌పై మల్లగుల్లాలు పడుతోంది. నిధుల లేమి కారణంగా తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తగ్గించినట్లుగా తెలుస్తోంది. దీన్ని గమనించిన కాంట్రాక్టు సంస్థలు పనులు నిలిపివేసే దిశగా ప్రభుత్వానికి సంకేతాలు పంపినట్లుగా నీటి పారుదల వర్గాల ద్వారా తెలిసింది. కొన్ని పెద్ద కాంట్రాక్టు సంస్థలు పనులను యథావిధిగా కొనసాగిస్తున్నా, మార్చి వరకు వేచిచూసి ఆ తర్వాత పనులు నిలిపివేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. -
రైతులకు చెల్లింపుల్లో జాప్యాన్ని సహించం
సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న, సోయా బీన్, వరిధాన్యం తదితర పంటలు అమ్మిన రైతులకు చెల్లింపులలో జాప్యాన్ని సహించేదిలేదని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను హెచ్చరించారు. బాధ్య తారహితంగా వ్యవహరిస్తున్న మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఇతర శాఖల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి మంత్రి.. జిల్లా జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ శాఖ, మార్క్‌ఫెడ్, హాకా తదితర సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు రోజుల కిందట తాను షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించినప్పుడు మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ సిబ్బందిపై రైతులు ఫిర్యాదు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ మార్కెట్లో రూ.4.83 కోట్ల విలువచేసే మొక్కజొన్నలను రైతుల నుంచి కొనుగోలు చేయగా, కేవలం రూ.66 లక్షలు చెల్లించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. మొక్కజొన్నల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం రూ.500 కోట్లు సమకూర్చినా రైతులకు చెల్లింపుల్లో బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని మండిపడ్డారు. మొక్కజొన్నలు, కందులు, ధాన్యం, పెసలు, మినుములు, పత్తి తదితర పంట దిగుబడులు మార్కెట్‌కు రాగా నే కొన్నవెంటనే 72 గంటలలోపు రైతులకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఖాతరు చేయని వారిపై కఠిన చర్యలు తప్పవని హరీశ్‌రావు హెచ్చరించారు. పత్తిని తక్కువ ధరకు అమ్మవద్దు.. పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నందున రైతులు తక్కువ ధరకు అమ్మ రాదని హరీశ్ సూచించారు. సకాలంలో చెల్లిం పులు జరపకపోవడంవల్లే రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని మంత్రి తెలిపారు. పలు జిల్లాల్లో సోయాబీన్ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఆయన ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారుల దృష్టికి తెచ్చారు. వరంగల్‌లో పత్తి, మరికొన్ని చోట్ల మొక్కజొన్నల రైతులకు చెల్లింపులు జరగలేదన్నారు. వీటన్నిటినీ యుద్ధప్రాతిపదికన చెల్లించాలని ఆదేశించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో లైసెన్సు లేకుండా కొందరు వ్యాపారులు లావాదేవీలు నిర్వహిస్తుండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిన్నింగ్ మిల్లులలో రకరకాల పేర్లతో సామాన్య రైతులను మోసం చేస్తున్నట్లు తనకు ఫిర్యాదులొస్తున్నాయని, అలాంటి మిల్లులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ప్రభుత్వ గోదాములు సరిపడేన్ని ఉన్నందున ప్రైవేటు గోదాములను ప్రోత్సహించవద్దని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు పాల్గొన్నారు. యాసంగిలో 17 లక్షల ఎకరాలకు సాగు నీరు ప్రస్తుత యాసంగి సీజన్లో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 17 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వనున్నట్టు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. చిట్టచివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించాలని, ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, నీటిపారుదలశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. -
ఇంకుతున్న లక్ష్యం
నీటిని ఒడిసిపట్టుకునేదెలా? ముందుకు సాగని ఇంకుడుగుంతల నిర్మాణం జలసంరక్షణపై నిర్లక్ష్యం మంజూరైనవి 41,684 పూర్తయినవి 12,075 పాలకులు, అధికారుల చోద్యం బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యం కరీంనగర్‌సిటీ: ఇంకుడుగుంతలు.. ప్రతి వర్షపుచుక్కను ఒడిసిపట్టి.. భూగర్భజలాలను సంరక్షించే ఆవాసాలు. రోజురోజుకూ పెరుగుతున్న నీటికష్టాలను అధిగమించేందుకు ప్రతి ఇంట్లోనూ వీటిని నిర్మించుకునేలా ప్రభుత్వం రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టింది. హడావుడి నిర్ణయాలు.. వివిధ కార్యక్రమాలు.. బిల్లుల చెల్లింపులో జాప్యం వెరసి కార్యక్రమం లక్ష్యం ఇంకిపోయిందన్న విమర్శలున్నాయి. ఇంకుడుగుంతల నిర్మాణం బిల్లుల చెల్లింపులో అధికారులు, ఈజీఎస్ సిబ్బంది అంతులేని జాప్యంతో అడుగుముందుకు పడడం లేదు. జిల్లాకు మొత్తం 41,684 ఇంకుడు గుంతలు మంజూరైతే.. కేవలం 12,075 మాత్రమే పూర్తవడం పరిస్థితికి అద్దం పడుతోంది. పాతాళానికి చేరుతున్న భూగర్భజలాలను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇంకుడుగుంతల నిర్మాణానికి రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. ప్రతి బొట్టునూ భూమిలో ఇంకించడమే దీని ఉద్దేశం. కానీ.. క్షేత్రస్థాయిలో ఈజీఎస్ సిబ్బందికి అప్పగించింది. వారు శ్రద్ధ చూపకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది.. జిల్లాలోని 16 మండలాల్లో 41,684 ఇంకుడుగుంతలు మంజూరుచేశారు. 2016–17, 2017–18లో వీటి నిర్మాణం పూర్తికావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 12,075 మాత్రమే పూర్తయ్యాయి. మరో 4,507 ఇంకుడుగుంతలు వివిధ దశల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మిగిలినవి ప్రారంభానికే నోచలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకుడుగుంతలు నిర్మించుకుంటే రూ.4040 ప్రభుత్వం చెల్లిస్తోంది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదట్లో రెండువిడతల్లో లబ్ధిదారులకు బిల్లులను చెల్లించింది. గుంత తవ్విన తర్వాత ఒకసారి, నిర్మాణం పూర్తయ్యాక రెండోవిడతగా బిల్లు చెల్లించింది. కొద్దిరోజులుగా జాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం లబ్ధిదారులే నిర్మాణాలకు ముందుకురావడం లేదంటుండడం గమనార్హం. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయి. ఆ నీటిని ఒడిసిపట్టుకునే మార్గానికి ఇంకుడుగుంతలు దోహదపడనున్నాయి. ఈ క్రమంలో బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఖజానాకు తాళం
అన్ని బిల్లుల చెల్లింపులను నిలిపివేసిన ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు మినహాయింపు సాక్షి, రంగారెడ్డి జిల్లా: బిల్లుల చెల్లింపులపై ఆంక్షలు విధించారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు అవసరమైన డబ్బులకు మాత్రమే మినహాయింపునిచ్చారు. ఇవిగాక ఇతర ఏ బిల్లులనైనా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఆర్థిక సంవత్సరం చివర దశకు చేరుకున్న క్రమంలో కార్యాలయాల నిర్వహణ బిల్లులు వివిధ శాఖలు డ్రా చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఫ్రీజింగ్ నెలకొనండంతో కొన్ని రోజుల వరకు డబ్బులు పొందే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క కీలకమైన మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు డైట్ బిల్లులు, ఉద్యో గుల మెడికల్ రియింబర్స్‌మెంట్ తదితర బిల్లుల చెల్లింపుల ప్రక్రియ స్తంభించిపోయినట్లేనని తెలుస్తోంది. నెలన్నరలో 2016–17 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఫ్రీజింగ్ నెలకొనడం అన్ని శాఖలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. తరచూ ఫ్రీజింగ్... గతంలో ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఫ్రీజింగ్ విధించేవారు. కొంతకాలంగా ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రెండు మూడు నెలలకోసారి ఫ్రీజింగ్ పెట్టడంతో.. బిల్లుల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. ఫలితంగా పలు అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. దీంతో కొన్ని శాఖలు నిర్దిష్ట సమయాల్లోనే బిల్లులు డ్రా చేసుకుంటూ ఫ్రీజింగ్ నుంచి ఊరట పొందుతున్నాయి. తాజాగా మళ్లీ ఫ్రీజింగ్ ఏర్పడడంతో.. చెల్లింపులు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. తద్వారా నిధులు మురిగిపోనున్నాయి. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులు, తాగునీటి పథకాలు తదితర బిల్లులు డ్రా చేయాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదని తెలుస్తోంది. -
అక్టోబర్ నుంచి చెల్లింపులు లేవు..
నాన్‌ప్లానింగ్ పనులకైతే ఎనిమిది నెలలుగా.. గుత్తేదార్ల అసోసియేషన్ సమాలోచనలు? పనులు ఆపిన కాంట్రాక్టర్లకు శ్రీముఖాలు ఆర్అండ్బీ శాఖలో అయోమయం నిజామాబాద్ : రహదారులు, భవనాల శాఖ(ఆర్అండ్బీ)లో అయోమయం నెలకొంది. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎనిమిది నెలలుగా జాప్యం జరుగుతుండగా, మరోవైపు పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న గుత్తేదార్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో పనుల కొనసాగింపుపై గుత్తేదార్లు సమాలోచనలో పడినట్లు సమాచారం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1,971 కిలోమీటర్లు ఆర్అండ్బీ శాఖ రహదారులున్నాయి. ఇందులో 236 కి.మీ. రాష్ట్ర రహదారులు కాగా, 854 కి.మీ. జిల్లా రహదారులు ఉన్నాయి. మరో 881 కి.మీ. గ్రామీణ, ఇతర రహదారులున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఉన్న రహదారులను డబుల్‌లైన్ రోడ్లుగా, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఉన్న రహదారులను నాలుగులైన్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించిన విషయం విధితమే. ఇలా జీఓ నంబర్ 129 కింద సుమారు రూ.238 కోట్లు, జీఒ నంబర్ 130 కింద సుమారు రూ.533 కోట్లు మంజూరయ్యాయి. కానీ.. ఈ నిధులతో చేపట్టిన పలు పనులకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. అక్టోబర్ నుంచి ఈ బిల్లులు రాకపోవడంతో పనులు కొనసాగించేందుకు గుత్తేదార్లు సమాలోచనలో పడినట్లు సమాచారం. ఎనిమిది నెలలుగా.. ఇక నాన్‌ప్లాన్ (ప్రణాళికేతర) పద్దు కింద చేపట్టిన పనులకైతే ఎనిమిది నెలలుగా బిల్లులు నిలిచిపోయినట్లు ఆర్అండ్బీ వర్గాలు పేర్కొంటున్నాయి. నాన్‌ప్లాన్ కింద రహదారుల నిర్వహణ పనులు చేపడతారు. బీటీ రెన్యూవల్స్, ప్యాచ్‌వర్క్‌లు చేస్తుంటారు. ఈ పనులకైతే ఎనిమిది నెలలుగా బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. ఇలా పిరియాడికల్ రెన్యూవల్స్ కింద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 76 పనులు కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. గుత్తేదార్లకు శ్రీముఖాలు.. మరోవైపు పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న గుత్తేదార్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాకు పెద్ద ఎత్తున రహదారుల పనులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు పోటీ పడి పనులు దక్కించుకున్నారు. కానీ.. పనులు చేయడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. కొన్ని రోడ్లయితే నెల రోజులకు పైగా పనులు కుంటుపడటంతో అధికారులు సదరు గుత్తేదార్లకు నోటీసులు జారీ చేశారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం చేసిన ఐదుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశామని రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ మధుసూధన్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్లో నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.25వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రతిఏటా ఇంతేమొత్తం కేటాయించి వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తామన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం నివారించడానికి బడ్జెట్ కేటాయింపులను సులభతరం చేస్తామన్నారు. విధివిధానాలను రూపొం దించేందుకు శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ ప్రక్రియ దాదాపు పూర్తయినందున పనుల్లో వేగం పెంచాలని, లైడార్ సర్వే నివేదిక వచ్చినందున తగిన కార్యాచరణతో సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మా ణం నత్తనడకకు మారుపేరుగా మారిందని, ఈ పరిస్థితిని మార్చేందుకు సరళ పద్ధతులు అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రస్తుతం క్లిష్టంగా ఉన్న భూసేకరణ, బిల్లుల చెల్లింపును సులభతరం చేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములు కొనుగోలు చేస్తున్నామని, దీంతో భూసేకరణలో జరిగే జాప్యాన్ని నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి ఇంటికీ నల్లాద్వారా మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఈ నెల 24న ఎంసీహెచ్ఆర్డీలో వాటర్‌గ్రిడ్‌పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈమేరకు సీఎంవో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేటాయింపులన్నీ ఒకే పద్దు కిందకు! రాష్ట్రంలో ప్రస్తుతం 25 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటితోపాటే కొత్తగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదనంగా 46 వేల చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు పూనుకుంది. వీటికోసం ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పాలమూరు, ప్రాణహిత, డిండి ప్రాజెక్టులకే ఏకంగా రూ.10 వేల కోట్ల కేటాయింపులు జరిపేందుకు ప్రణాళికలు వేస్తోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కొత్త ప్రాజెక్టుల నుంచి పాక్షికంగా అయినా నీరివ్వాలని భావిస్తోంది. అయితే లక్ష్యం మేరకు ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఆర్థికశాఖ సహకారం ఎంతైనా అవసరం. పరిపాలనా అనుమతుల మంజూరు, విడుదలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలి. ఇందుకనుగుణం గా కొన్ని మార్పులు చేయాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ప్రాజెక్టులవారీగా ప్రత్యే క పద్దులుండటం వల్ల, పనులు కొనసాగని ప్రాజెక్టులకు కేటాయించిన పద్దుల నుంచి ఇతర ప్రాజెక్టులకు నిధులను మళ్లించడం కష్టసాధ్యమవుతోంది. ఈ దృష్ట్యా అన్ని ప్రాజెక్టుల కేటాయింపులను ఒకే పద్దు కింద పెట్టి, పనులను బట్టి నిధులు విడుదల చేసే విధానాన్ని తేవాలని కోరింది. అలాగే ఎప్పటికప్పుడు నిధుల విడుదల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కోరుతోంది. -
నత్తే నయం
ఇదీ మరుగుదొడ్ల నిర్మాణం తీరు లక్ష్యం 1,73,418 పూర్తయినవి 20,266 స్వచ్ఛభారత్‌లో పూర్తి చేయాల్సినవి 75 వేలు ఉపాధిహామీ ద్వారా మరో 18 వేలు మచిలీపట్నం : జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. పారిశుధ్య చర్యలను మెరుగుపరిచేందుకు జిల్లా వ్యాప్తంగా 1.73 లక్షల మరుగుదొడ్లను నిర్మించాలని పరిపాలనా ఆమోదం తెలిపారు. దీంట్లో మొదటి విడతగా స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో 75 వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 970 పంచాయతీలు ఉండగా వాటిలో 96 పంచాయతీల్లో మరుగుదొడ్లను నిర్మించే బాధ్యతను ఉపాధి హామీ పథకం అధికారులకు అప్పగించారు. 18 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించారు. బుధవారం కలెక్టర్ నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో గ్రామాల వారీగా ఎన్ని మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంటుంది వివరాలు తీసుకున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ పథకం మళ్లీ అక్టోబర్ వచ్చే నాటికి వివరాలు తీసుకునేందుకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. గోరంత ఫలితం జిల్లాలో 1,73,418 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 20,266 మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తమ పర్యవేక్షణ లోని 19 వేల మరుగుదొడ్లు వివిధ దశల్లో ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాంగోపాల్ తెలి పారు. ఉపాధి హామీ పథకం ద్వారా 1,266 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశారు. ఉపాధి పథకం ద్వారా 18 వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయింగా 1,266ను పూర్తి చేసి 3,150 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు డ్వామా పీడీ మాధవీలత తెలిపారు. బిల్లులు చెల్లింపులో జాప్యం ఒక్కొక్క మరుగుదొడ్డికి తొలుత రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నగదు మరుగుదొడ్ల నిర్మాణానికి సరిపోదని ప్రజల నుంచి వినతులు రావటంతో ఈ మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచారు. మరుగుదొడ్డి మంజూరు కావాలంటే రేషన్, ఆధార్‌కార్డులు, ఇంటికి సంబంధించిన వివరాలు, పంచాయతీ కార్యదర్శి ఆమోదం తదితరాలను సేకరించాలి. రేషన్‌కార్డులో, ఆధార్‌కార్డులో కుటుంబ యజమాని పేరు ఒక్క అక్షరం తప్పుగా నమోదైనా మరుగుదొడ్డి నిర్మాణానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. లబ్ధిదారులు ముందుకు వచ్చి మరుగుదొడ్డి నిర్మిస్తే బిల్లుల చెల్లింపు కోసం నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారానే నగదు చెల్లింపులు ఉంటాయని చెబుతున్నా సకాలంలో నగదు ఇవ్వని పరిస్థితి ఉంది. -
నిధులున్నా.. విడుదల కావు
- కేయూ పరిధిలో వింతపోకడలు - బిల్లుల కోసం నిరీక్షిస్తున్న ప్రోగ్రాం ఆఫీసర్లు - ప్రారంభంకాని ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు - మూలుగుతున్న రూ.1.69కోట్లు - ఇన్చార్జీల పాలనతోనే అస్తవ్యస్తం..! కేయూక్యాంపస్ : కేయూ పరిధిలో జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరాలు నిర్వహించిన ప్రోగ్రాం ఆఫీసర్లకు బిల్లుల చెల్లింపులో యూనివర్సిటీ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, వివిధ జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రోగ్రాం అధికారులు ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఒక్కో శిబిరానికి యూనివర్సిటీ ద్వారా రూ.22,500 చొప్పున ఎన్ఎస్ఎస్ ద్వారా చెల్లిస్తుంది. విద్యార్థులు వారంపాటు గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. వీరికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ భోజనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తారు. శిబిరం ముగిశాక ఖర్చుకు సంబంధించిన బిల్లులను యూనివర్సిటీకి సమర్పిస్తారు. అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తారు. మంజూరైన నిధులు.. కేయూ పరిధిలో 2014-15 విద్యాసంవత్సరం లో వివిధ కళాశాలల్లో 350కిపైగా ఎన్ఎస్ఎస్ యూనినట్లు నమోదై ఉన్నాయి. గతేడాది అక్టోబర్ తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రో గ్రాం ఆఫీసర్లు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. వీటి తాలూకు వివరాలు, బిల్లుతో కూడిన ఫైలును ప్రోగ్రాం ఆఫీసర్లు యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఇప్పటి వరకు ముగ్గురు ఇన్చార్జీ వీసీలు మారారు. వారి వద్ద ఆ ఫైలు ముందుకు కదలలేదు. ఇటీవల ఇన్చార్జీ వీసీగా చిరంజీవులు బాధ్యలు చేపట్టగా ఆయన వద్దకు ఈ ఫైలు వెళ్లింది. సుమారు 200 కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ యూనిట్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలు గడిచినా ఒక్కరూపారుు విడుదల కావడంలేదు. విశేషం ఏమిటంటే.. ప్రభుత్వం ద్వారా యూనివర్సిటీకి రూ.1.69 కోట్లు మంజూరైనా విడుదల ఎందుకు చేయడంలేదో అర్థం కావడంలేదు. బిల్లులపై ఆడిట్‌తోనే..! గత విద్యాసంవత్సరంలోని బిల్లులు కావడంతో ఇవి సరైనవా, కాదా? అనే విషయంపై ఆడిట్ చేరుుంచారని తెలిసింది. ఇదే బిల్లుల విడుదలలో జాప్యానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు.. తమకు బిల్లులు చెల్లించాలంటూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు నెలల కొద్దీ కేయూ ఆర్డినేటర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది బిల్లులు అందకపోవడంతో ఈవిద్యాసంవత్సరంలో ఒక్క ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం కూడా నిర్వహించలేకపోయూరు. మిగతా అంశాల మాదిరిగానే ఇన్చార్జీల పాలనలో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు సైతం నీరుగారిపోతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది. -
అటకెక్కిన ఆరోగ్య ‘ధీమా’
డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా కర్నూలు జిల్లాలో 22 ఆసుపత్రులను నెట్వర్క్ జాబితాలో చేర్చారు. ఒక్కో ఆసుపత్రికి ఆరు నెలల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో ఆసుపత్రికి రూ.40లక్షల నుంచి రూ.కోటి వరకు రావాల్సి ఉంది. దీంతో పేదలకు ఈ పథకంలో భాగంగా వైద్యసేవలు అందించేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి. మరోవైపు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద రాష్ట్ర ఉద్యోగులకు, ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోవడం లేదని రోగులను వెనక్కి పంపుతున్నాయి... * ఇది ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లో ఇదే దుస్థితి కొనసాగుతోంది. ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ ద్వారా సరైన సేవలు అందకపోవడంతో రాష్ట్ర ఉద్యోగులు, లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం * ఫలితంగా రోగులను వెనక్కు పంపుతున్న వైనం.. * అదనపు ప్యాకేజీలకు హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రుల డిమాండ్ * లేదంటే వైద్యం చేసేది లేదని చెబుతున్న ప్రైవేటు ఆస్పత్రులు సాక్షి, హైదరాబాద్: నిరుపేదల్లో ఏ ఒక్కరూ వైద్యసేవలు అందక ఇబ్బంది పడరాదన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని 2008లో ప్రారంభించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న తీరు, ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటున్న స్ఫూర్తిని పరిశీలించి అనేక రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కార్పొరేట్ ఆస్పత్రి ముఖం చూడని పేదరోగికి రెడ్‌కార్పెట్ వేసిన ఆరోగ్యశ్రీ(తాజాగా ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవ) ఆపదలో పడింది. ప్రాణాంతక వ్యాధులతో వెళ్లిన వారికి వైద్యం అందడంలేదు. మరో ఆస్పత్రికి వెళ్లండంటూ కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి సమాధానం వస్తోంది. ఇక హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులైతే ఏపీ నుంచి వచ్చే పేషెంట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీల కంటే 25 శాతం ఎక్కువ ఇస్తేనే వైద్యం చేస్తామంటున్నాయి. మరోవైపు వైద్య చికిత్సలు చేసిన బిల్లుల కోసం నెలల తరబడి తిప్పుకుంటున్నారని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి. 850 కోట్లు అడిగితే.. 500 కోట్లు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.925 కోట్లు ఇచ్చేవారు. సీఎంఆర్ఎఫ్ కింద మరో రూ.350 కోట్లు వచ్చేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 58-42 దామాషా పద్ధతిలో నిధులూ విడదీయాలి. ఈ లెక్కన రూ.547 కోట్లు రావాలి. ప్రీమియం విలువ రూ.2 లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచడం, 938 జబ్బుల జాబితాను 1,038 జబ్బులకు పెంచడంతో రూ.80కోట్లు అదనంగా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. పథకానికి రూ.850 కోట్లు అవసరమని తేల్చారు. సర్కారు ఇవేమీ పట్టించుకోకుండా రూ.500కోట్లు మాత్రమే కేటాయించింది. అనుమతుల్లో తీవ్ర జాప్యం గత కొంతకాలంగా వైద్యానికి అనుమతుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఖరీదైన జబ్బులుగా చెప్పుకునే న్యూరో(నరాల జబ్బులు), పాలీట్రామా (ప్రమాద కేసులు), గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వాటికి కావాలనే జాప్యం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక కేసులను స్క్రూటినీ(పరిశీలించి) చేయాల్సిన సీనియర్ వైద్యులు తెలంగాణకు వెళ్లిపోయారని, అందుకే ఇక్కడ కేసులకు ముందస్తు అనుమతి ఇచ్చేవారులేరని అధికారులు చెబుతున్నారు. కిడ్నీ, గుండె, యూరాలజీ, క్యాన్సర్ వంటి వ్యాధుల వైద్యానికి హైదరాబాదే కేంద్రంగా ఉంది. ఏపీ నుంచి కనీసం 15 శాతం మంది రోగులు హైదరాబాద్‌కే రావాలి. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో గతంలో రోజుకు 2వేల కేసులకు అనుమతులిచ్చేవారు, ఇప్పుడా సంఖ్య 1300కు తగ్గింది. స్పెషలిస్టులు ఎక్కడ? గతంలో 130 జబ్బులను ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే చేయాలని బదలాయించింది. ప్రధానంగా ఏపీలో ఉన్న బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ వైద్యుల కొరత వేధిస్తోంది. బాధితులు ఆరోగ్యశ్రీ కింద చేరితే పట్టించుకునే వారే లేరు. కాక్లియర్ ఇంప్లాంట్స్‌కూ బ్రేకులు ఆరోగ్యశ్రీలో పుట్టుకతోనే చెవిటి, మూగ చిన్నారుల కోసం ఉద్దేశించిందే కాక్లియర్ ఇంప్లాంట్స్. అప్పట్లో 12ఏళ్లలోపు చిన్నారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.6.5లక్షలు చొప్పున ఏడాదికి కనీసం 300మందికి ఇచ్చేవారు. ఆ తర్వాత 2ఏళ్ల వయసులోపే గుర్తించాలని నిబంధన విధించారు. ఈ నిబంధనతో ఇప్పుడా సంఖ్య యాభైకి పడిపోయింది. చెవుడు, మూగ ఉన్నదో లేదో తెలుసుకునేలోపే చిన్నారికి రెండేళ్లు దాటిపోతోంది. రెండేళ్లకు ఒక్కరోజు దాటినా వెనక్కు పంపుతున్నారు. దీంతో ఆ చిన్నారులు శాశ్వతంగా వికలాంగులుగానే ఉండిపోతున్నారు. ఆరోగ్యశ్రీకి ‘సమ్మె’పోటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిబ్బంది చేస్తున్న సమ్మె పేద రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోం ది. కొంతకాలంగా ఆరోగ్యమిత్రలు, కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు పలు సమస్యలపై సమ్మె చేస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో అనుమతుల నుంచి ట్రస్ట్ అనుమతుల వరకూ అవరోధంగా మారింది. సమస్యను పరిష్కరించడంలో ఇటు సర్కారూ చొరవ చూపలేదు. దీంతో పరిస్థితి దిగజారింది. ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులు ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ కంటే ఎక్కువ డిమాండు చేస్తున్నాయి. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ గుర్తింపు ఉంటే 25% ఎక్కువ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాం. అయినా యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ఏపీలో ఎక్కడా జాప్యం లేదు. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే చర్యలు తీసుకుంటాం. - ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గతంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నా. ఏడాది పాటు మందులిచ్చారు. తర్వాత నుంచి మందులు కొనుక్కుంటున్నా. వీటికి నెలకు రూ.4వేలు అవుతోంది. వైద్య పరీక్షలు, మందులకు డబ్బుల్లేక రెండు నెలలుగా ఆస్పత్రికి వె ళ్లలేదు. మా ఆయన రిక్షా తొక్కితే వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నాం. - వయరాల అప్పలనర్స, బైయపురెడ్డిపాలెం, నర్సీపట్నం రెండేళ్ల కిందట గైనిక్ సమస్యతో బాధపడుతున్న నాకు ఆపరేషన్ చేయడానికి పెద్దాస్పత్రి వారు లక్ష ఖర్చవుతుందన్నారు. అంత స్తోమత లేక ఆందోళన చెందా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో రెండేళ్ల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నా. ఆయన దయవల్లనే ఇప్పుడు ఆరోగ్యంగా తిరగగలుగుతున్నా. - బేతా నాగేశ్వరమ్మ, పాతనగరం, వాడవీధి, విశాఖ -
బిల్లుల చెల్లింపు ఎప్పుడో !
బోధన్ : చెరుకు రైతు ఏటా గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పడం లేదు. ఏడాది కాలం శ్రమిం చి పండించిన చెరుకును ఫ్యాక్టరీ క్రషింగ్‌కు పంపుతుంటే నిబంధనల ప్రకారం రావాల్సి బిల్లులు అందకపోగా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రతియేడు బిల్లుల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితు వస్తున్నాయి. నిజాందక్కన్ షుగర్స్ లిమిటెడ్(ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుని ధర చెల్లించాలని రైతులు చాలాకాలంగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే దిక్కలేదు. చక్కెర ఫ్యాక్టరీ ప్రైవే ట్ సంస్థ గుప్పిట్లోకి వెళ్లింది. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమం విస్మరించాయి. ప్రైవేట్ ఫ్యా క్టరీ యాజమాన్యం లాభపేక్షధోరణితో వ్యవహరిస్తోందని రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏకపక్షంగా ధర నిర్ణయిస్తోందనే ఆరోపణలు వసున్నాయి. చెరుకు సరఫరా చేసిన రైతులు ప్రస్తుతం బిల్లుల కోసం ఎదురు చూ స్తున్నారు, ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరి స్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర.. బోధన్ ఎన్డీఎస్ఎల్లో 2014-15 సీజ న్కు సంబంధించి గత డిసెంబర్ 1న క్రషింగ్ ప్రారంభించారు. సుమారు 90 వేల టన్నుల వరకు చెరుకు క్రషింగ్ పూర్తయ్యిందని ఫ్యాక్టరీ అధికారులు పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల్లో క్రషింగ్ పూర్తి అయ్యే అవకాశాలున్నా యి. నిబంధనల ప్రకారం చెరుకు సరఫరా చేసిన 14 రోజుల్లో రైతులకు బిల్లులు చెల్లిం చా లి. అయితే నెల పదిహేను రోజులు కావస్తు న్నా.. ఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు ఎప్పు డు చెల్లించేది స్పష్టం చేయలేదు.యాజమాన్యం ప్రకటించిన ధర ప్రకారం రైతులకు రూ. 20 కోట్లవరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఒత్తిడి మేరకు.. వాస్తవంగా అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను రద్దు చేసి తిరిగి స్వాధీ నం చేసుకుంటామని, పూర్వవైభవం తెస్తామ ని సీఎం కేసీఆర్ ఎన్నికల సభలో హామీ ఇచ్చా రు. దీంతో ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం డోలాయమాన పరిస్థితిలో క్రషింగ్ ప్రా రంభించేందుకు సుముఖత చూపలేదు. ఈ పరిస్థితిని గమనించిన రైతులు స్థానిక ఎమ్మె ల్యే షకీల్ నేతృత్వంలో ఎంపీ కవిత, రాష్ట్రమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వారు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు . ప్రభుత్వ ఒత్తిడి మేరకు ప్రైవేట్ యాజమాన్యం క్రషింగ్ ప్రారంభించింది.క్రషింగ్ప్రారంభం కథ సుఖాంతంగా ముగిసింది. టన్ను ధర రూ.2260 ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ఈ ఏడాది క్రషింగ్ సీజన్ టన్ను ధర రూ.2200, ప్రభుత్వ కొనుగోలు ధర రూ. 60 కలుపుకుని రూ. 2260 ప్రకటించింది.గత ఏడాది సీజన్లో టన్ను ధర రూ. 2600 చెల్లించారు. ఈ ధరను కూడా రౌండ్ల వారీగా చెల్లించారు.ఈ ధరనైనా చెల్లించాలని రైతులు కోరుతున్నా యాజమాన్యం మౌనం వహించింది. ఈ ధర వివాదం మళ్లీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లింది. ఈ నెల 5న హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో రైతుల సమావేశంలో సీఎం కేసీఆర్ ధర పై స్పష్టత ఇచ్చారు. టన్నుకు రూ. 2600 ధర చెల్లిస్తామని సీఎం కేసీఆర్ భరోసాఇచ్చారు.ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించిన టన్ను ధర రూ. 2260 చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. బిల్లుల చెల్లింపు పై ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదు. బిల్లుల చెల్లింపులో ఇంకెంత కాలం జాప్యం జరుగుతుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గూడు గోడు..!
కర్నూలు(అర్బన్): ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి గ్రహణం పట్టింది. ఎన్నడూ లేని విధంగా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గృహ నిర్మాణాలకు సంబంధించిన బిల్లులన్నింటిని కొత్త ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో జిల్లాలో 53 వేల మంది లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారికంగా రూ.22 కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు బకాయి పడింది. అనధికారికంగా మరో రూ. 14 కోట్లను చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, సిమెంట్, ఇనుము తదితరాలన్నింటి ధరలు రెండింతలు పెరిగినా, సొంత గూడులేని వేల మంది లబ్ధిదారులు అప్పులు చేసుకుని గృహాలను నిర్మించుకుంటున్నారు. బిల్లులు ఆగిపోవడంతో వీరంతా దిక్కులు చూస్తున్నారు. చేతి డబ్బులు లేకపోవడంతో వివిధ దశల్లో నిర్మాణాలను నిలిపివేశారు. ఎప్పుడో అవినీతి జరిగిందని, వాటిపై విచారణ పేరుతో ప్రస్తుతం నిర్మాణంలో బిల్లులను నిలిపివేయడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా మూడు విడతల్లో 3,29,567 గృహాలు మంజూరయ్యాయి. నిర్మాణాలు పూర్తి అయిన వాటితోపాటు వివిధ దశల్లో ఉన్న గృహాలకు రూ. 990.30 కోట్లు వెచ్చించారు. మూడు విడతల్లో చేపట్టిన గృహ నిర్మాణాలు దాదాపు పూర్తికావొస్తున్న ప్రస్తుత సమయంలో బిల్లులను ఆపివేయడం వల్ల లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాక పట్టణ ప్రాంతాల్లో కూడా వేల సంఖ్యలో గృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. తొలి బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిగేనా? ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా గృహ నిర్మాణ పథకానికి నిధుల కేటాయింపులు జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, వాటిని జియో ట్యాగింగ్ సిస్టమ్ ద్వారా గుర్తించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సిస్టమ్ ఆమల్లోకి వచ్చిన బిల్లులను చెల్లిస్తారా? బడ్జెట్ కేటాయించిన అనంతరం బిల్లులను విడుదల చేస్తారా? అనే సందిగ్ధత నెలకొంది. -
చెరుకు రైతుకు అన్యాయం
చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యాల ఒత్తిడికి సర్కార్ తలొగ్గిందంటూ మండలి నుంచి బీజేపీ వాకౌట్ మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం సాక్షి, బెంగళూరు : రాష్ర్టంలో చెరుకు లావాదేవీలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా బిల్లును చూస్తే ప్రభుత్వం చక్కెర కర్మాగారాల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గినట్లు అర్థమవుతోందంటూ బీజేపీ శనివారం శాసన మండలి నుంచి వాకౌట్ చేసింది. అనంతరం సభ ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. చక్కెర కర్మాగారాలు రైతుల నుంచి చెరుకు కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపు తదితర లావాదేవీలకు సంబంధించి రూపొందించిన ముసాయిదా బిల్లుపై సుమారు రెండు గంటల పాటు చర్చ జరిగింది. సహకార శాఖ మంత్రి హెచ్ఎస్. మహదేవ ప్రసాద్ చర్చకు సమాధానమిస్తూ, సవరణ బిల్లు చట్టం రూపం దాల్చితే చెరుకును కొనుగోలు చేసిన 14 రోజుల్లోగా చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. లేనట్లయితే వడ్డీ సహా నిర్ణీత గడువులోగా చెల్లించాలని తెలిపారు. చర్చలో జేడీఎస్ సభ్యులు బసవరాజ హొరట్టి, మరితిబ్బేగౌడ, కాంగ్రెస్ సభ్యుడు ఉగ్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’కు విభజన సెగ
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన సెగ ఇందిరమ్మ ఇళ్లనూ తాకింది. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల కారణంగా కోడ్ అమల్లో ఉండడంతో మార్చి 15 తర్వాత లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఇందిరమ్మ మూడో విడత కింద జిల్లాలో వివిధ వర్గాలకు మంజూరైన మొత్తం 39,951 ఇళ్లను మార్చి నాటికి పూర్తి చేసేందుకు యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. వీటిలో 10 వేల ఇళ్ల నిర్మాణం చివరి మజిలీలో ఉండగా మిగి లినవి వివిధ దశల్లో ఉన్నాయి. మార్చి నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, రాష్ట్ర విభజన అంశం కారణంగా బిల్లుల చెల్లింపు నిలిచిపోయింది. మార్చి నెలలో 10 వేల ఇళ్లకు చెల్లింపులు నిలిచిపోగా ఏప్రిల్ నుంచి ఏ ఒక్క లబ్ధిదారుకూ బిల్లు చెల్లింపు జరగలేదు. సుమారు రూ.5 కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉంది. బిల్లుల చెల్లింపులకు బ్రేక్ ఎన్నికలు ముగియడంతో మార్చి 15 వరకు పురోగతిలో ఉన్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేసినప్పటికీ ఖజానా శాఖలో ఆన్లైన్ లావాదేవీలు శనివారం నిలిచిపోవడంతో ఈ బిల్లుల చెల్లింపులకు బ్రేక్ పడింది. రెండు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ జిల్లాల వారీగా లెక్కలు, బిల్లుల చెల్లింపు తదితర లావాదేవీలను వేరు చేసే రెండింటికీ వేర్వేరు వెబ్సైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో బిల్లుల చెల్లింపునకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక తీసుకునే నిర్ణయాన్ని బట్టి బిల్లులు చెల్లింపు జరగవచ్చనని అధికారులు చెబుతున్నారు. అది కూడా నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్న వాటికే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. దీంతో వేసవిలో ఇళ్ల నిర్మాణాలకు వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ సీజన్లో సొంతింటిని పూర్తి చేసుకుందామని భావించిన వారికి చేదు అనుభవమే ఎదురైంది. రచ్చబండలో మంజూరైన ఇళ్లకు మోక్షం కలిగేనా? జిల్లాలో రెండో విడత రచ్చబండ కింద 89,771 ఇళ్లను ప్రభుత్వం ఆన్లైన్లో మంజూరు చేసింది. ఇప్పటి వరకు 10 శాతం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో వేలాది ఇళ్ల నిర్మాణాలకు కొత్త ప్రభుత్వంలో మోక్షం క లగటం అనుమానంగా ఉంది. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్‌లో మూడో విడత రచ్చబండ సభల్లో వచ్చిన దరఖాస్తులకు దాదాపుగా 30 వేలపైనే ఇళ్ల మంజూరుకు ఆన్లైన్లో రిజిష్టర్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి వారం ముందు కూడా కాంగ్రెస్ సర్కార్ ఓట్ల కోసం భారీ ఎత్తున ఇళ్లను ఆన్లైన్ మంజూరుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు రచ్చబండల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను రద్దు చేసి టీడీపీ ప్రభుత్వం హయాంలో వారి లెక్క కింద చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం కొలువు తీరి ఇళ్ల నిర్మాణాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలోకి వచ్చేసరికి ఐదు నెలల కాలం పట్టే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.