నీటిని ఒడిసిపట్టుకునేదెలా? ముందుకు సాగని ఇంకుడుగుంతల నిర్మాణం జలసంరక్షణపై నిర్లక్ష్యం మంజూరైనవి 41,684 పూర్తయినవి 12,075 పాలకులు, అధికారుల చోద్యం బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యం
కరీంనగర్‌సిటీ: ఇంకుడుగుంతలు.. ప్రతి వర్షపుచుక్కను ఒడిసిపట్టి.. భూగర్భజలాలను సంరక్షించే ఆవాసాలు. రోజురోజుకూ పెరుగుతున్న నీటికష్టాలను అధిగమించేందుకు ప్రతి ఇంట్లోనూ వీటిని నిర్మించుకునేలా ప్రభుత్వం రెండేళ్ల క్రితం చర్యలు చేపట్టింది. హడావుడి నిర్ణయాలు.. వివిధ కార్యక్రమాలు.. బిల్లుల చెల్లింపులో జాప్యం వెరసి కార్యక్రమం లక్ష్యం ఇంకిపోయిందన్న విమర్శలున్నాయి. ఇంకుడుగుంతల నిర్మాణం బిల్లుల చెల్లింపులో అధికారులు, ఈజీఎస్ సిబ్బంది అంతులేని జాప్యంతో అడుగుముందుకు పడడం లేదు. జిల్లాకు మొత్తం 41,684 ఇంకుడు గుంతలు మంజూరైతే.. కేవలం 12,075 మాత్రమే పూర్తవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
పాతాళానికి చేరుతున్న భూగర్భజలాలను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇంకుడుగుంతల నిర్మాణానికి రెండేళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. ప్రతి బొట్టునూ భూమిలో ఇంకించడమే దీని ఉద్దేశం. కానీ.. క్షేత్రస్థాయిలో ఈజీఎస్ సిబ్బందికి అప్పగించింది. వారు శ్రద్ధ చూపకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది.. జిల్లాలోని 16 మండలాల్లో 41,684 ఇంకుడుగుంతలు మంజూరుచేశారు. 2016–17, 2017–18లో వీటి నిర్మాణం పూర్తికావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 12,075 మాత్రమే పూర్తయ్యాయి. మరో 4,507 ఇంకుడుగుంతలు వివిధ దశల్లో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మిగిలినవి ప్రారంభానికే నోచలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకుడుగుంతలు నిర్మించుకుంటే రూ.4040 ప్రభుత్వం చెల్లిస్తోంది.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యం
కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదట్లో రెండువిడతల్లో లబ్ధిదారులకు బిల్లులను చెల్లించింది. గుంత తవ్విన తర్వాత ఒకసారి, నిర్మాణం పూర్తయ్యాక రెండోవిడతగా బిల్లు చెల్లించింది. కొద్దిరోజులుగా జాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం లబ్ధిదారులే నిర్మాణాలకు ముందుకురావడం లేదంటుండడం గమనార్హం. వర్షాలు ఇప్పుడిప్పుడే కురుస్తున్నాయి. ఆ నీటిని ఒడిసిపట్టుకునే మార్గానికి ఇంకుడుగుంతలు దోహదపడనున్నాయి. ఈ క్రమంలో బిల్లుల చెల్లింపులు వేగవంతం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇంకుతున్న లక్ష్యం
Published Tue, Jun 13 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM
Advertisement
Advertisement