ఐదేళ్ల అలక్ష్య పాలన.. తీవ్ర దుర్భిక్షం | State Struggling With Severe Droughts | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల అలక్ష్య పాలన.. తీవ్ర దుర్భిక్షం

Published Mon, Apr 29 2019 4:04 AM | Last Updated on Mon, Apr 29 2019 11:54 AM

State Struggling With Severe Droughts - Sakshi

గుంటూరు జిల్లా చక్రాయపాలెంలో గ్రామస్తులు వలస వెళ్లడంతో నిర్మానుష్యంగా ఉన్న వీధులు

కరువుకాటకాలతో గ్రామాలు అల్లాడుతున్నాయి..గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు లేవు..తినడానికి తిండిలేదు.. చేయడానికి పని లేదు..మనుషులు వలసబాట పడుతున్నారు..కనీస గ్రాసమూ దొరక్క పశువులు కబేళా దారిలో కనిపిస్తున్నాయి..వేసవికి ముందే తీసుకోవలసిన జాగ్రత్తల ఊసేలేదు..ఖరీఫ్‌లో వర్షాభావం దెబ్బతీసినా రబీకి ఏం చేయాలనేదానిపై కసరత్తు లేదు..కమీషన్ల కక్కుర్తే తప్ప సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేదు..ఇలాంటి అత్యవసర సమయంలో గ్రామీణ నిరుపేదలకు ఎంతో ఉపయోగపడే ఉపాధిహామీకి మంగళం పలికేశారు..ఆ పథకం నిధులన్నీ కైంకర్యం చేసి కూలీల కడుపుకొట్టారు.. అనాలోచిత నిర్ణయాలు.. అస్తవ్యస్థ పాలన ఫలితమే ఇది..ఐదేళ్లుగా ఇదే పరిస్థితి..
ఈ వేసవిలో రాష్ట్రమంతటా పరిస్థితి మరింత విషమించింది..
 అనంతపురం జిల్లాలో మేత లేక కబేళాకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన లేగదూడలు, గేదెలు 

- గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అడుగంటిన బోర్లు (చేతిపంపులు) నుంచి నీటిని తోడుకోవాలన్నా, కిలోమీటర్ల నుంచి కాలినడకన, సైకిళ్లపై నీరు తెచ్చుకోవాలన్నా, ఎప్పుడో వచ్చే ట్యాంకర్ల వద్ద వరుసలో నిలబడి బిందెడు నీరు దక్కించుకోవాలన్నా యుద్ధమే చేయాల్సి వస్తోంది. నీటి క్యాన్‌ కొనుగోలు చేయాలన్నా ఎదురు చూడాల్సి వస్తోంది. 
- మా ఊళ్లో చిన్నబావి దగ్గర 1,170 అడుగులు రిగ్గు వేయిస్తే చెంబెడు నీళ్లు కూడా రాలేదు, ఏ బావి, బోరులో కూడా నీళ్లు లేవు, ఏడెనిమిది గంటలు దఫదఫాలుగా మోటార్లు వేస్తున్నా ఒక ఎకరం కూడా తడవడం లేదు, అరటి తోటలు  మాడిపోతున్నాయి అని వాపోయాడు కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె రైతు. 
- పదిహేనేళ్ల బత్తాయి తోట సార్‌. బాగా దిగుబడి ఇవ్వాల్సిన తోటలో ఎండిపోతున్న కొమ్మలను రోజుకు కొన్ని చొప్పున కొట్టేయలేక మొత్తం తోటే నరికేయాల్సి వచ్చిందని కంటతడి పెట్టాడు ప్రకాశం జిల్లా పెద్దారవీడుకు చెందిన రైతు వెంకటేశ్వర్లు. 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/సాక్షి నెట్‌వర్క్‌:  ఎండిపోయిన చెరువులు, కాలువలు, బోర్లు.. పంటలు సాగు చేయక బీళ్లుగా మారిన భూములు.. కబేళాలకు తరలిపోతున్న పశువులు.. పొట్ట చేతపట్టుకుని వలస వెళ్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు.. ఇళ్లకు వేలాడుతున్న తాళాలు.. జనం లేక బోసిపోతున్న పల్లెలు.. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులన్నీ కొత్తగా ఈ రోజే తలెత్తినవి కాదు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కరువు కాటకాలు కొనసాగుతున్నాయి. తాగు, సాగునీటి సమస్య వేధిస్తోంది. పశుగ్రాసం కొరతతో పశువుల డొక్కలు ఎండుతున్నాయి. దుర్భిక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ముందుచూపు, సరైన ప్రణాళిక లేకుండా పోయాయి. ఉన్నదల్లా కమీషన్ల కక్కుర్తి, అవినీతి, అక్రమాలు, వనరులను ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడం. ఐదేళ్లుగా ప్రజలను గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అంటూ భ్రమలు కల్పించడంలోనే కాలం గడిపేసింది.

రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సర్కారు ఆడని డ్రామాలే లేవు. ప్రాజెక్టులపై సమీక్షలు అంటూ పాలకులు కమీషన్లు వసూలు చేసుకోవడంలో తీరిక లేకుండా గడిపారు. నీరు–చెట్టు పేరిట అధికార పార్టీ నాయకులు రూ.వేల కోట్లు మింగేశారు తప్ప భూగర్భ జలాలు అంగుళం కూడా పెరగలేదు. వరుస కరువుల వల్ల పల్లెలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంటుందని తెలిసినా ముందస్తు చర్యల్లేవు. పశువులకు మేత అందించాలన్న ఆలోచన సైతం ప్రభుత్వానికి లేకపోవడం గమనార్హం. వర్షాల్లేక వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి, వలసలను నియంత్రించాలన్న స్పృహ సర్కారులో కొరవడింది. ఐదేళ్లుగా దుర్భిక్షంతో బాధలు పడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని, తమను కనీసం ఆదుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

పాతాళానికి చేరిన భూగర్భ జలాలు 
రాష్ట్రంలో కరువు ధాటికి భూగర్భ జలాలు సగటున 14.71 మీటర్ల లోతుకు పడిపోయినట్లు ఈ నెలారంభలోనే లెక్కతేలింది. 208 మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. 1.65 లక్షలకు పైగా బోరు బావులు ఎండిపోయాయి. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్‌ నెలతో పోల్చితే ఈ ఏడాది రాయలసీమ జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లోనూ వేసవి ఆరంభంలోనే నీరు అడుగంటిపోయింది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా,  4,982 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 3,494 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నట్టు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చెబుతున్నారు.  ఇక నగరాలు, పట్టణాల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రెండు, మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు.  

రైతన్నలను ముంచేసిన ఖరీఫ్, రబీ 
ప్రస్తుత రబీ సీజన్‌లో 257 మండలాలను అధికారికంగా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం కూడా అందలేదు. కరువు సహాయక చర్యలు కనుమరుగయ్యాయి. పంటల నష్ట పరిహారం అటకెక్కింది. గత ఖరీఫ్‌లో 347 మండలాలను కరవు మండలాలుగా సర్కారు ప్రకటించింది. ఏడు జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం ఉన్నట్లు వెల్లడించింది. వరుస కరువులతో అల్లాడుతున్న రాష్ట్రం ప్రత్యేకించి 2018 రబీ నుంచి గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడని తీవ్ర దుర్భిక్షాన్ని చవిచూసింది. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా అటు ఖరీఫ్, ఇటు రబీ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరువు నుంచి రైతులు కష్టపడి కాపాడుకున్న పంటలకు కూడా కనీస మద్దతు ధరలు దక్కడం లేదు. రైతుబజార్లు, మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతుంటే ఉత్పత్తిదారులకు మాత్రం కనీస ఆదాయం రావడం లేదు. కాగా, కరవు పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి చూపాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రమంగా నీరుగారిపోతోంది.  దాదాపు 1,307 గ్రామాల్లో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూలీలకు పనులు కల్పించలేదని సమాచారం. ఉన్న ఊళ్లో వ్యవసాయ పనులు లేక, ఉపాధి హామీ పథకం అమలు కాక ఆయా గ్రామాల నుంచి నిరుపేదలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. 

వేధిస్తున్న పశుగ్రాసం కొరత 
పాలకుల ఉదాసీనత, పశు సంవర్థక శాఖ మొద్దునిద్ర పశువుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం మనుషులనే కాదు, పశువులను సైతం కాటేస్తోంది. ఆకలి తీర్చుకోవడానికి కాసింత మేత, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు లేక పశువులు విలవిల్లాడుతున్నాయి. ఇన్నాళ్లూ సొంత కుటుంబ సభ్యుల్లాగా పెంచుకున్న పశువుల ఆకలి కేకలు వినలేక రైతులు వాటిని అయినకాడికి అమ్మేస్తున్నారు. పాడి ఆవులు, గేదెలను సైతం పోషించలేక దళారులకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌ యార్డులు, సంతల నుంచి పశువులు లారీల్లో కబేళాలకు తరలిపోతున్న దృశ్యాలు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయి. రైతుల నుంచి దళారీలు తక్కువ ధరకే పశువులను కొనేసి కేరళ, తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో వేసవి ప్రారంభంలోనే పశుగ్రాసం కొరత తీవ్రమైంది.

గుంటూరు జిల్లా మొదలు రాయలసీమలోని అన్ని జిల్లాలను పశుగ్రాసం కొరత వేధిస్తోంది. ఆయా ప్రాంతాల్లో లారీ వరిగడ్డి ధర రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి ప్రతిరోజూ వందల సంఖ్యలో వరిగడ్డి లారీలు రాయలసీమకు రవాణా అవుతున్నాయి. అంత ధర పెట్టి వరి గడ్డిని కొనలేని రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. కబేళాలకు తరలిన పశువుల సంఖ్య మూడు నెలల్లోనే రెండు లక్షలకు చేరుకుంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల గేదెలు, 12 లక్షల ఆవులు, 40 లక్షల గొర్రెలు, 8 లక్షల మేకలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ వేసవిలో గ్రాసం కొరత లేకుండా చూస్తామంటూ ప్రవేశపెట్టిన ‘ఊరూర పశుగ్రాస క్షేత్రాల పథకం’ ఆచరణలో విఫలమైంది. అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో కేవలం 10 మండలాల్లోనే పశుగ్రాసం లభ్యమవుతున్నట్లు సమాచారం. 

పిట్టల్లా రాలుతున్న ‘ఉపాధి’ కూలీలు 
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసే కూలీలు ఎండల తీవ్రతను తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. రాష్ట్రంలో ఈ వేసవిలో పదుల సంఖ్యలో కూలీలు మృత్యువాత పడ్డారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఐదుగురు మరణించారు. ‘ఉపాధి’ పనులు చేస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడం వల్ల కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం.. వేసవిలో పనులు చేసే కూలీలకు కచ్చితంగా నీడ కల్పించాలి. ఇందుకోసం టార్పాలిన్‌ షెడ్లు వేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. కూలీల దాహం తీర్చేందుకు మంచినీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించాల్సి ఉన్నా.. ఇవి అందుబాటులో ఉండడం లేదు. ఉదయం ఇళ్ల వద్ద నుంచి బిందెలు, సీసాల్లో తీసుకెళుతున్న నీళ్లు కొద్దిసేపటికే అయిపోతుండడంతో దాహంతో కూలీల గొంతులు ఎండుతున్నాయి. కూలీల తాగునీరుకు ప్రత్యేకంగా ఎలాంటి బడ్జెట్‌ను విడుదల చేయలేదు. పనుల ప్రాంతంలో ప్రథమ చికిత్స చేసేందుకు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. 

నిలువ నీడ లేదు.. నీరు లేదు 
ఎండలు మండిపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పనులు చేస్తున్న ప్రాంతంలో సేద తీరేందుకు చెట్లు లేవు. అధికారులు కనీసం టార్పాలిన్‌ టెంట్లు కూడా వేయడం లేదు. ఎండలకు తట్టుకోలేకపోతున్నాం. తాగేందుకు మంచినీరు సైతం అందుబాటులో ఉంచడం లేదు.
    – రంగప్ప, కూలీ, తెర్నేకల్, కర్నూలు జిల్లా 

గ్లూకోజ్‌ నీరు ఒక్కరోజే ఇచ్చారు 
ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న మాకు కేవలం ఒక్కరోజు మాత్రమే గ్లూకోజ్‌ నీటిని అందించారు.  తాగునీరు లేకపోవడం వల్ల దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి బిందెతో తెచ్చుకుంటున్నాం. ఎండలు తట్టుకోలేక చాలామంది అస్వస్థతకు గురవుతున్నారు
    – వేణుగోపాల్, కూలీ, రాంపురం, కర్నూలు జిల్లా

పల్నాడులో ఊళ్లకు ఊళ్లే ఖాళీ 
ఆర్థిక ప్రగతిలో ఇతర జిల్లాల కంటే గుంటూరు జిల్లా ముందంజలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం కాగితాలపై వృద్ధి రేటు గణాంకాలను గొప్పగా చూపిస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు సర్కారు గణాంకాలను వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో పల్నాడు సహా ఇతర ప్రాంతాల్లో కరువు విలయ తాండవం చేస్తోంది. మండు వేసవిలో గుక్కెడు తాగునీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ సాగు, తాగు నీరు లేక పల్నాడు ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక రైతులు, రైతు కూలీలు ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేసి వలస పోతున్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నా  ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీసం ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం సున్నా.

పల్నాడు ప్రాంతంలోని వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామంలో 600 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామంలో ఆరు బోర్లు ఉండగా, ప్రస్తుతం ఏ ఒక్క బోరులోనూ సరిపడా తాగునీరు లభించడం లేదు. దీంతో గ్రామంలో 400 కుటుంబాలు వలస వెళ్లాయి. చక్రాయపాలెం తండాలో 275 కుటుంబాలు నివసిస్తుండగా, ఇక్కడ తాగునీటికి తీవ్ర కటకట నెలకొంది. మేకలదిన్నె తండా, మన్నేపల్లి తండా, రెవిడిచెర్ల తదితర గ్రామాల్లోనూ బోర్లు పనిచేయడం లేదు. మండలంలో  17కు పైగా పంచాయతీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే మండలం పమిడిపాడు గ్రామంలో వాటర్‌ ట్యాంకుల వద్ద రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదంలో ఒక వ్యక్తి మరణించాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

బోర్లు వేసి అప్పుల పాలయ్యాం... 
గ్రామాల్లో ఉన్న బోర్లన్నీ ఎండిపోయాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. సాగు నీరు లేక పత్తి, మిర్చి పంటలు ఎండిపోయాయి. నీళ్ల కోసం బోర్ల మీద బోర్లు వేసి అందరం అప్పుల పాలయ్యాం. ఈ దుర్భిక్ష పరిస్థితులను ఎన్నడూ చూడలేదు.
    – బి.గురువయ్య, రైతు, షోలాయేపాలెం, బొల్లాపల్లి 

గ్రామాల్లో వృద్ధులు, పిల్లలే ఉన్నారు 
నేను ఎంటెక్‌ చదువుతున్నా. ప్రస్తుతం సెలవుల్లో సొంతూరికి వచ్చా. కరువు పరిస్థితుల వల్ల  గ్రామంలో అందరూ వలస వెళ్లారు. మా తల్లిదండ్రులు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లారు. వృద్ధులు, వేసవి సెలవుల్లో ఇళ్లకు వచ్చిన పిల్లలు మాత్రమే ఊళ్లో ఉన్నారు.
    – బాణావత్‌ వెంకటేశ్‌ నాయక్, గంగుపల్లి తండా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement