సాక్షి, హైదరాబాద్: పాతాళగంగ రోజురోజుకూ పడిపోతోంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వేసవి తీవ్రత పెరగడం, చివరిదశలో ఉన్న పంటలకు బోర్ల ద్వారా భూగర్భ జల వినియోగం ఎక్కువ కావడంతో భగూర్భమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 13.40 మీటర్లకు అడుగంటింది. గతేడాది మార్చి మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 1.52 మీటర్ల దిగువకు పడిపోయాయి. ఈ ఏడాది మార్చిలో సాధారణ వర్షపాతం 865 మిల్లీమీటర్లు ఉండగా, కేవలం 724 మిల్లీమీటర్ల మేర మాత్రమే వర్షపాతం నమోదైంది. ఏకంగా 16 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. 33 జిల్లాలకు గానూ 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 17 జిల్లాలో 20 నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
ఈ ప్రభావంతో చాలా జిల్లాలో చెరువులు నిండలేదు. ప్రాజెక్టుల్లోనూ నీటి చేరిక తక్కువగా ఉండటంతో కాల్వల ద్వారా నీటి విడుదల జరగలేదు. ఈ కారణంగా భూగర్భమట్టాల్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు. రాష్ట్రంలో 5 మీటర్ల కన్నా తక్కువమట్టంలో భూగర్భజలాల లభ్యత కేవలం 4.6 శాతం ప్రాంతాల్లో మాత్రమే ఉండగా, 5 నుంచి 10 మీటర్ల పరిధిలో 33.5 శాతం, 10 నుంచి 15 మీటర్ల పరిధిలో 27 శాతం, 15 నుంచి 20 శాతం పరిధిలో 19.2 శాతం, 20 మీటర్లకు ఎక్కువన 15.6 శాతం మేర భూగర్భ మట్టాలున్నాయి.
4 మీటర్ల కంటే లోతుకు భూగర్భ జలమట్టం
రాష్ట్రంలోని 584 మండలాల పరిధిలో భూగర్భమట్టాలను పరిశీలించగా గతేడాది మార్చిలో రాష్ట్ర సగటు నీటిమట్టం 11.88 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 13.40 మీటర్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 1.52 మీటర్ల మేర తగ్గుదల కనిపించింది. గతేడాదితో పోలిస్తే 4 మీటర్ల కంటే లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయిన జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ , నారాయణపేట, మేడ్చల్, హైదరాబాద్ ఉన్నాయి. వికారాబాద్ మండల బట్వారంలో ఏకంగా 41.51 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పడిపోగా, మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట, షాద్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్‌లో 40 మీటర్ల మేర భూగర్భమట్టం పడిపోయింది. రాష్ట్రంలోని 69 శాతం బోరుబావుల్లో నీరు ఇంకిపోయినట్లు భూగర్భ జలవిభాగ నివేదిక వెల్లడిస్తోంది.
వే‘గంగా’ పడిపోతోంది..!
Published Sun, Apr 28 2019 1:50 AM | Last Updated on Sun, Apr 28 2019 1:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment