జలసిరి... ఆవిరి
శీతాకాలంలోనే నీటి ఎద్దడి
* శివార్లలో వట్టిపోతున్న బోరుబావులు
* జలాశయాల్లో తగ్గుతున్న మట్టాలు
* వేసవి నాటికి సంక్షోభం
* ఆందోళనలో ప్రజలు, అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: ఎముకలు కొరికే చలిలోనూ గ్రేటర్‌లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. బోరు బావుల్లో నీళ్లు పాతాళానికి చేరుకుంటున్నాయి. శివారు ప్రాంతాల వారు ట్యాంకర్లను ఆశ్రయిస్తోండడంతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. జనవరిలోనే ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని నగర వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మహానగర దాహార్తిని తీరుస్తోన్న జలాశయాల్లోనూ నీటిమట్టాలు బాగా తగ్గడంతో వేసవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
నగరంలో గతేడాది కంటే ఈసారి భూగర్భ జల మట్టాలు బాగా పడిపోయాయి. హయత్‌నగర్ మండలంలో అత్యధికంగా 8.95 మీటర్ల మేర నీటి మట్టం పడిపోయింది. నాంపల్లి మండలంలో గతేడాది కంటే 8 మీటర్ల లోతునకు భూగర్భ నీటి నిల్వలు పడిపోయాయి. సరూర్‌నగర్‌లోనూ 6.90 మీటర్ల మేర తగ్గాయి. ఉప్పల్ మండలంలో 5.55 మీటర్లు తగ్గాయి. చార్మినార్‌లో 4.30 మీటర్లు, సైదాబాద్‌లో 3.20 మీటర్ల మేర నీటినిల్వలు తగ్గాయి.
ఇక అమీర్‌పేట్, ఆసిఫ్‌నగర్, బండ్లగూడ, చార్మినార్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి మండలాల్లోనూ గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు తగ్గడం గమనార్హం. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే ఇంకుడు గుంతలు లేకపోవడం, నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం, బోర్ల వినియోగం పెరగడం, ప్రతి ఇంట్లోనూ బోరుబావికి ఆనుకొని రీచార్జింగ్ పిట్ లేకపోవడంతో నీటి మట్టాలు అనూహ్యంగా పడిపోయినట్టు భూగర్భ జలశాఖ అధికారులు తెలిపారు.