సాక్షి ప్రతినిధి, ఒంగోలు :జిల్లాలో కరువు తన ప్రతాపాన్ని చూపుతోంది. ఈ ఏడాది జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయాయి. శీతాకాలంలోనే బోర్లు ఎండిపోయాయి, బావుల్లో నీరు అడుగంటాయి. పశ్చిమ కృష్ణాలో ఇప్పటికే తాగునీటి సమస్య ఏర్పడింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో భానుడి తీవ్రతకు జిల్లావాసుల గొంతుతడి ఆరిపోవడం ఖాయం. మళ్లీ వర్షాలు పడితేగాని భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేదు. వర్షాల కోసం జూన్ వరకూ ఎదురుచూడక తప్పదని నిపుణులు చెబుతున్నారు.
గత ఐదేరేళ్లలో మునుపెన్నడూ లేనివిధంగా భూగర్భజల మట్టం అడుగంటిపోతోంది. జిల్లావ్యాప్తంగా సర్వేజరిపి పరిశీలిస్తే జనవరి చివరినాటికే భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి. జిల్లాలో 56 మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జలాశయాలకు సమీపాననున్న ప్రాంతాలను గుర్తించి 49 ప్రదే శాల్లో భూగర్భజల మట్టం పరీక్షా యంత్రాలను ఏర్పాటు చేశారు. అన్నిచోట్లా సగటున నీటిమట్టం ఐదున్నర మీటర్ల మేర లోతుల్లోకి పడిపోయింది. గత ఏడాది జనవరినాటికి 8.31 మీటర్ల లోతున భూగర్భ జలాలుంటే ఈ ఏడాది ఇప్పటికే 13.40 మీటర్లకు పడిపోయాయి.
ఈ ఏడాది మే నెలలో 10.92 మీటర్లు ఉంటే డిసెంబర్‌కు 12.15 మీటర్లు, జనవరికి 13.40 మీటర్లకు పడిపోయాయి. పశ్చిమ కృష్ణాలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దత్తత తీసుకున్న కొమరవోలు మండలం దద్దవాడ గ్రామంలో 56.04 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇక్కడ ప్రభుత్వం వేసిన బోరు రోజుకు పది నుంచి 15 బిందెల నీటికి మించి రావడం లేదు. ఇదే గ్రామంలో మరో ప్రైవేటు వ్యక్తి వేయించిన బోరులో కొద్దిగా నీరు వస్తున్నాయి. దీంతో అక్కడే రోజు నీటి కోసం ఎదురుచూస్తూ మహిళలు కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది.
సాగర్ జోన్ -2 పరిధిలో మాత్రమే భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగా ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది. దద్దవాడ తర్వాత బేస్తవారిపేట మండలం పిటకాయలగుల్ల 45.17 మీటర్లు, తర్లుపాడు మండలం తాడివారిపల్లిలో 40.67, బేస్తవారిపేట బసనేపల్లిలో 39.51, మార్కాపురం మండలం సీతానాగులవరంలో 38.66, రాచర్లలో 35.48, మార్కాపురం మండలం నికరంపల్లిలో 34.25, పుల్లల చెరువు మండలం యెండ్రపల్లిలో 33.40, గిద్దలూరులో 32.95, యర్రగొండపాలెం మండలం బోయలపల్లిలో 31.75, కొమరవోలు మండలం బదినేనిపల్లిలో 25.84, రాచర్ల మండలం చొల్లవీడులో 25.64, వేజెండ్లలో 25.18, పెదారవీడులో 24.75, దోర్నాలలో 23.6, దొనకొండ మండలం
కొచ్చెర్ల కోటలో 21.75, వెలిగండ్ల మండలం కె ఆగ్రహారంలో 21.03, పుల్లలచెరువులో 20.75, కనిగిరిలో 20.73 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు చేరుకున్నాయి. ఈ ప్రాంతాలలో ప్రజలు తాగునీటికి వెంపర్లాడుతున్నారు. పశ్చిమ కృష్ణాలో ఎక్కడ చూసినా చెరువులు, బావులు ఎండిపోయాయి. బోర్లు చుక్క నీటికీ ఆధారంగా నిలవలేకపోతున్నాయి. మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని చెరువులు నింపడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం నీరు - చెట్టు పేరుతో మరో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పశ్చిమ కృష్ణాలో చెరువులు నింపకపోతే మరో ఒకటి రెండు నెలల్లో నీటి యుద్ధాలు తప్పని పరిస్థితి ఏర్పడనుంది.
నేడు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
ఒంగోలు టౌన్: శుక్రవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జరగనున్న జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో నీటి ఎద్దడి తీవ్రతను సభ్యులు ప్రస్తావించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్న ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా మంచినీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రజల దాహార్తిని తీర్చే విషయమై అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.
అడుగంటిన పాతాళ‘గంగ’
Published Fri, Feb 20 2015 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement