అటకెక్కిన ఆరోగ్య ‘ధీమా’ | Payment of bills for private hospitals In Severe delay | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ఆరోగ్య ‘ధీమా’

Published Mon, Aug 24 2015 3:20 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

అటకెక్కిన ఆరోగ్య ‘ధీమా’ - Sakshi

అటకెక్కిన ఆరోగ్య ‘ధీమా’

డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా కర్నూలు జిల్లాలో 22 ఆసుపత్రులను నెట్‌వర్క్ జాబితాలో చేర్చారు. ఒక్కో ఆసుపత్రికి ఆరు నెలల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో ఆసుపత్రికి రూ.40లక్షల నుంచి రూ.కోటి వరకు రావాల్సి ఉంది. దీంతో పేదలకు ఈ పథకంలో భాగంగా వైద్యసేవలు అందించేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి. మరోవైపు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద రాష్ట్ర ఉద్యోగులకు, ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోవడం లేదని రోగులను వెనక్కి పంపుతున్నాయి...

* ఇది ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లో ఇదే దుస్థితి కొనసాగుతోంది. ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ ద్వారా సరైన సేవలు అందకపోవడంతో రాష్ట్ర ఉద్యోగులు, లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
 
ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
* ఫలితంగా రోగులను వెనక్కు పంపుతున్న వైనం..
* అదనపు ప్యాకేజీలకు హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రుల డిమాండ్
* లేదంటే వైద్యం చేసేది లేదని చెబుతున్న ప్రైవేటు ఆస్పత్రులు

సాక్షి, హైదరాబాద్: నిరుపేదల్లో ఏ ఒక్కరూ వైద్యసేవలు అందక ఇబ్బంది పడరాదన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని 2008లో ప్రారంభించారు.

అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న తీరు, ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటున్న స్ఫూర్తిని పరిశీలించి అనేక రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కార్పొరేట్ ఆస్పత్రి ముఖం చూడని పేదరోగికి రెడ్‌కార్పెట్ వేసిన ఆరోగ్యశ్రీ(తాజాగా ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవ) ఆపదలో పడింది. ప్రాణాంతక వ్యాధులతో వెళ్లిన వారికి వైద్యం అందడంలేదు. మరో ఆస్పత్రికి వెళ్లండంటూ కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి సమాధానం వస్తోంది.

ఇక హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులైతే ఏపీ నుంచి వచ్చే పేషెంట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీల కంటే 25 శాతం ఎక్కువ ఇస్తేనే వైద్యం చేస్తామంటున్నాయి. మరోవైపు వైద్య చికిత్సలు చేసిన బిల్లుల కోసం నెలల తరబడి తిప్పుకుంటున్నారని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి.
 
850 కోట్లు అడిగితే.. 500 కోట్లు ఇచ్చారు
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.925 కోట్లు ఇచ్చేవారు. సీఎంఆర్‌ఎఫ్ కింద మరో రూ.350 కోట్లు వచ్చేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 58-42 దామాషా పద్ధతిలో నిధులూ విడదీయాలి. ఈ లెక్కన రూ.547 కోట్లు రావాలి. ప్రీమియం విలువ రూ.2 లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచడం, 938 జబ్బుల జాబితాను 1,038 జబ్బులకు పెంచడంతో రూ.80కోట్లు అదనంగా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. పథకానికి రూ.850 కోట్లు అవసరమని తేల్చారు. సర్కారు ఇవేమీ పట్టించుకోకుండా రూ.500కోట్లు మాత్రమే కేటాయించింది.
 
అనుమతుల్లో తీవ్ర జాప్యం
గత కొంతకాలంగా వైద్యానికి అనుమతుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఖరీదైన జబ్బులుగా చెప్పుకునే న్యూరో(నరాల జబ్బులు), పాలీట్రామా (ప్రమాద కేసులు), గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వాటికి కావాలనే జాప్యం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక కేసులను స్క్రూటినీ(పరిశీలించి) చేయాల్సిన సీనియర్ వైద్యులు తెలంగాణకు వెళ్లిపోయారని, అందుకే ఇక్కడ కేసులకు ముందస్తు అనుమతి ఇచ్చేవారులేరని అధికారులు చెబుతున్నారు.

కిడ్నీ, గుండె, యూరాలజీ, క్యాన్సర్ వంటి వ్యాధుల వైద్యానికి హైదరాబాదే కేంద్రంగా ఉంది. ఏపీ నుంచి కనీసం 15 శాతం మంది రోగులు హైదరాబాద్‌కే రావాలి. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో గతంలో రోజుకు 2వేల కేసులకు అనుమతులిచ్చేవారు, ఇప్పుడా సంఖ్య 1300కు తగ్గింది.
 
స్పెషలిస్టులు ఎక్కడ?
గతంలో 130 జబ్బులను ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే చేయాలని బదలాయించింది. ప్రధానంగా ఏపీలో ఉన్న బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ వైద్యుల కొరత వేధిస్తోంది. బాధితులు ఆరోగ్యశ్రీ కింద చేరితే పట్టించుకునే వారే లేరు.
 
కాక్లియర్ ఇంప్లాంట్స్‌కూ బ్రేకులు
ఆరోగ్యశ్రీలో పుట్టుకతోనే చెవిటి, మూగ చిన్నారుల కోసం ఉద్దేశించిందే కాక్లియర్ ఇంప్లాంట్స్. అప్పట్లో 12ఏళ్లలోపు చిన్నారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.6.5లక్షలు చొప్పున ఏడాదికి కనీసం 300మందికి ఇచ్చేవారు. ఆ తర్వాత 2ఏళ్ల వయసులోపే గుర్తించాలని నిబంధన విధించారు. ఈ నిబంధనతో ఇప్పుడా సంఖ్య యాభైకి పడిపోయింది. చెవుడు, మూగ ఉన్నదో లేదో తెలుసుకునేలోపే చిన్నారికి రెండేళ్లు దాటిపోతోంది. రెండేళ్లకు ఒక్కరోజు దాటినా వెనక్కు పంపుతున్నారు. దీంతో ఆ చిన్నారులు శాశ్వతంగా వికలాంగులుగానే ఉండిపోతున్నారు.
 
ఆరోగ్యశ్రీకి ‘సమ్మె’పోటు
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిబ్బంది చేస్తున్న సమ్మె పేద రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోం ది. కొంతకాలంగా ఆరోగ్యమిత్రలు, కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు పలు సమస్యలపై సమ్మె చేస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో అనుమతుల నుంచి ట్రస్ట్ అనుమతుల వరకూ అవరోధంగా మారింది. సమస్యను పరిష్కరించడంలో ఇటు సర్కారూ చొరవ చూపలేదు. దీంతో పరిస్థితి దిగజారింది.
 
ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు
హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులు ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ కంటే ఎక్కువ డిమాండు చేస్తున్నాయి. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ గుర్తింపు ఉంటే 25% ఎక్కువ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాం. అయినా యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ఏపీలో ఎక్కడా జాప్యం లేదు. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే చర్యలు తీసుకుంటాం.     
- ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
 
గతంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నా. ఏడాది పాటు మందులిచ్చారు. తర్వాత నుంచి మందులు కొనుక్కుంటున్నా. వీటికి నెలకు రూ.4వేలు అవుతోంది. వైద్య పరీక్షలు, మందులకు డబ్బుల్లేక రెండు నెలలుగా ఆస్పత్రికి వె ళ్లలేదు. మా ఆయన రిక్షా తొక్కితే వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నాం.    
- వయరాల అప్పలనర్స, బైయపురెడ్డిపాలెం, నర్సీపట్నం
 
రెండేళ్ల కిందట గైనిక్ సమస్యతో బాధపడుతున్న నాకు ఆపరేషన్ చేయడానికి పెద్దాస్పత్రి వారు లక్ష ఖర్చవుతుందన్నారు. అంత స్తోమత లేక ఆందోళన చెందా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో రెండేళ్ల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నా. ఆయన దయవల్లనే ఇప్పుడు ఆరోగ్యంగా తిరగగలుగుతున్నా.    
- బేతా నాగేశ్వరమ్మ, పాతనగరం, వాడవీధి, విశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement