Rajiv Arogyasri
-
మరుపురాని మహానేత
ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాపైనా చెరగని ముద్రవేశారు. ఆరోగ్యశ్రీతో ఎందరికో ప్రాణాలు పోసి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపి.. రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తో అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచారు. నిమ్స్, కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలి అడుగులు పడింది వైఎస్ హయాంలోనే. హ్యాండ్లూమ్ పార్క్, మూసీ కాల్వల ఆధునికీకరణ మహానేత ఘనతే. సోమవారం వైఎస్సార్ జయంతి సందర్భగా ఉమ్మడి జిల్లాలో మహానేత హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలైన సంక్షేమ పథకాలపై ప్రత్యేక కథనాలు.. సాక్షి, యాదాద్రి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేరరెడ్డి హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పై చెరగని ముద్ర వేశారు. వైఎస్ చేపట్టిన పథకాలతో లబ్ధిపొందిన వారు ఆయనను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత, సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అభివృద్ధి ప్రదాతగా వైఎస్సార్ నేడు కీర్తించబడుతున్నారు. జిల్లాలో చేనేత పరిశ్రమను నుమ్ముకుని జీవిస్తున్న వేలా దిమంది వృత్తిదారుల కోసం భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం కనుముక్కుల శివారులో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్‌ను ప్రారంభించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 10వేల మందికి నేడు ఉపాధి లభిస్తోంది. ప్రాణహిత చేవేళ్ల పథకం రూపకల్పన సాగు నీటి వసతి లేని జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల ద్వారా గోదావరి నదీజలాలను అందించడానికి బస్వాపురం రిజర్వాయర్ ప్రతిపాదించి పనులను పూర్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి పథకం పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ప్యాకేజీ 15,16 ద్వారా బస్వాపురం రిజర్వాయర్, సాగునీటి కాల్వల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం రీడిజైనింగ్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ రూపకల్పన చేసిందే. జిల్లాలో వృథాగా పోతున్న మూసీ జలాలను రైతులకు అందించడానికి బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను మంజూరు చేసి జిల్లా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్సార్. ఆలేరులో ఆరోగ్యశ్రీ ప్రారంభం.. ఆలేరులో ఆరోగ్య శ్రీ పథకాన్ని 2007లో ప్రారంభించారు. భువనగిరి మండలం వడాయిగూడెంలో 2009లో రూపాయికి కిలో బియ్యం పథకం ప్రారంభించారు. ఫ్లోరిన్నీటి నివారణకు ఆలేరు నియోజకవర్గానికి రూ.70కోట్లతో ఉదయసముద్రం నుంచి కృష్ణా నీటి సరఫరా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇదేకాక ఉమ్మడి జిల్లాలోనే ఫ్లోరైడ్ నివారణకు అంకురార్పణ చేసిన మహనీయుడు రాజశేఖరరెడ్డి. యాదగిరిగుట్టలో రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం పనులను నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధిపై చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్సార్. బీబీనగర్‌లో ఎయిమ్స్.. వైఎస్ చలవే.. బీబీనగర్ శివారులోని రంగాపూర్ వద్ద నిమ్స్‌ను ప్రా రంభించింది వైఎస్సారే. ప్రస్తుతం కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్ వైఎస్ ప్రారంభించిన నిమ్స్‌లోనే కావడం విశేషం. అప్పట్లోనే ఎయిమ్స్ తరహాలో నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని తపించిన దార్శనికుడు వైఎస్. 2005 డిసెంబర్ 31న శంకుస్థాపన చేశారు. నిమ్స్ పనుల కోసం రూ.100 కోట్లను మంజూరు చేశారు. అనంతరం 2009 ఫిబ్రవరి 22న ఆస్పత్రిని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం నిమ్స్‌లో ఓపి సేవలను ప్రారంభించింది. త్వరలో ఎయిమ్స్వైద్య కళాశాల, పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. అపరసంజీవని.. 108 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనం అపరసంజీవనిగా మారింది. 108వాహన సేవలతో మంది క్షతగాత్రులకు ప్రాణాలు కాపాడుతున్నారు. 2005లో కేవలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు వాహనాలను మాత్రమే కేటాయించి నిర్వాహణ బాధ్యతలను జేవీకే సంస్థకు అప్పగించారు. రెండేళ్ల కాలంలో మంచి ఫలితాలను రావడంతో 2007లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 34 వాహనాలను కేటాయించారు. నిత్యం వందలాది రోడ్డు ప్రమాద బాధితులతో పాటు పాముకాటు, ప్రసవ వేదనలతో బాధపడుతున్న వారిని, ఇతర అత్యవసర వైద్య సేవల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రులకు 108 సిబ్బంది తరలించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. కేవలం 108 నంబర్‌కు ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే కుయ్.కుయ్ మంటూ సంఘటన స్థనానికి చేరుకుని బాధితులను సకాలంలో సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వారిని కాపాడడంలో 108 నిజంగా అపరసంజీవనిగా నిలుస్తోంది. జిల్లాఓ 108 సేవలకు ప్రారంభించిన నాటి నుంచి అంటే 2005 నుంచి 2009 సంవత్సరం నాటికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ ఎమర్జెన్సీ కేసులు 28,999 , ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కేసులు 6,659, రోడ్డు ప్రమాదాల కేసులు 5,322 మందిని సకాలంలో సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి వారి ప్రాణాలను కాపాడడంలో కీలకపాత్రను పోషించింది. 108 సేవలను మరింత బలోపేతం చేసి ప్రజల ప్రాణాలను కాపాడడంలో ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలని, వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. వెలుగులు నింపిన ‘ రాజీవ్ ఆరోగ్యశ్రీ’ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అయిన ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపింది. కారొఇ్పరేట్ స్థాయి వైద్యాన్ని పొందలేక ఎంతోమంది నిరుపేదల ప్రాణాలను వదిలిన సంఘటనలు చూసిన వైఎస్సార్ ఒక డాక్టర్‌గా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలను అందించాలని నిర్ణయించి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉమ్మడి జిల్లాలో 2009 నాటికి 18,101 మంది ప్రాణాలను కాపాడింది. తెల్లరేషన్ కార్డును తీసుకుని వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల విలువ చేసే వైద్యాన్ని పొంది ప్రాణాలను దక్కించుకున్న వారంతా నేడు వైఎస్ రాజశేఖరరెడ్డిని దేవునితో సమానంగా చేతులెత్తి మొక్కుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు అనే బేధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ రకాల జబ్బులకు చికిత్సలు పొందడంతో పాటు శస్త్ర చికిత్సలను చేయించుకున్నారు. ముఖ్యంగా ఖరీదైన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల, అత్యవసర చికిత్సలు, కీళ్ల, మెదడు, కేన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, మూత్రకోశ వ్యాధుల వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలను పొందారు. ఇందుకుగాను సుమారు రూ.53 కోట్ల 22లక్షల 44 వేల 316 రూపాయలు ఖర్చు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే తాము ఏమైపోయే వారమో అని జిల్లాలోని నిరుపేదలు పేర్కొంటున్నారు. తమకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణభిక్ష పెట్టారని.. తాము బతికున్నంతకాలం వైఎస్సార్‌ను మరిచిపోలేమని అంటున్నారు. గోదావరి జలాలు అందించిన అపరభగీరథుడు 50ఏళ్లుగా కరువుకాటకాలు.. దర్భిక్ష పరిస్థితులతో ఉండే తుంగతుర్తి ప్రాంతానికి శ్రీరాంసాగర్ కాల్వ ద్వారా గోదావరిజలాలను తీసుకొచ్చిన అపరభగీరథుడు దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశఖరరెడ్డి. ఎస్సారెస్పీ రెండోదశ పనులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 1996 మార్చి 6న తిరుమలగిరి మండలం ప్రగతినగర్ వద్ద అప్పటి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. అయితే వైఎస్సార్ ప్రతిపక్షనేతగా 2003లో ప్రగతినగర్ వద్ద టీడీపీ ప్రభుత్వం వేసిన శిలాపలకం వద్ద మొక్కలు నాటి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సారెస్పీ రెండోదశ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్పారెస్పీ రెండోదశ పనులకు జలయజ్ఞం కింద నిధులు రూ.550 కోట్లు కేటాయించి 80శాతం పనులను పూర్తి చేశారు. 2009 ఫిబ్రవరి 19న వెలిశాలలో ట్రయల్‌రన్‌లో భాగాంగ నీటిని విడుదల చేశారు. ఈ జలాలతో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నింపి రైతన్న గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్. ఈ కాల్వ ద్వారా ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 70వేల ఎకరాలకు, జిల్లాలో 2లక్షల 57వేల ఎకరాలకు నీరందుతున్నది. తాగునీటి ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. పేద విద్యార్థులకు వరంలాంటిది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజురీయిబర్స్మెంటు పథకం పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వరంలాంటిది. ఈ పథకంతోనే నేను ఇంజనీరింగ్ వరకు చదువుకోగలిగాను. ఈ ఫీజురీయంబర్స్‌మెంటు రాకముందు చాలామంది ఆడపిల్లలు ఇంటర్మీడియేట్లోనే చదువులను మానివేసేవారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌తో అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి స్థిరపడ్డారు. ఇప్పుడు నా స్నేహితురాళ్లు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. – కె. ప్రియాంక, ఇంజనీరింగ్ విద్యార్థిని, మిర్యాలగూడ -
అటకెక్కిన ఆరోగ్య ‘ధీమా’
డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా కర్నూలు జిల్లాలో 22 ఆసుపత్రులను నెట్వర్క్ జాబితాలో చేర్చారు. ఒక్కో ఆసుపత్రికి ఆరు నెలల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో ఆసుపత్రికి రూ.40లక్షల నుంచి రూ.కోటి వరకు రావాల్సి ఉంది. దీంతో పేదలకు ఈ పథకంలో భాగంగా వైద్యసేవలు అందించేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి. మరోవైపు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద రాష్ట్ర ఉద్యోగులకు, ఎన్టీఆర్ వైద్యసేవ లబ్ధిదారులకు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయడం లేదు. ఏపీ ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ సరిపోవడం లేదని రోగులను వెనక్కి పంపుతున్నాయి... * ఇది ఒక్క కర్నూలు జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లో ఇదే దుస్థితి కొనసాగుతోంది. ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ ద్వారా సరైన సేవలు అందకపోవడంతో రాష్ట్ర ఉద్యోగులు, లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం * ఫలితంగా రోగులను వెనక్కు పంపుతున్న వైనం.. * అదనపు ప్యాకేజీలకు హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రుల డిమాండ్ * లేదంటే వైద్యం చేసేది లేదని చెబుతున్న ప్రైవేటు ఆస్పత్రులు సాక్షి, హైదరాబాద్: నిరుపేదల్లో ఏ ఒక్కరూ వైద్యసేవలు అందక ఇబ్బంది పడరాదన్న సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకాన్ని 2008లో ప్రారంభించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న తీరు, ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటున్న స్ఫూర్తిని పరిశీలించి అనేక రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కార్పొరేట్ ఆస్పత్రి ముఖం చూడని పేదరోగికి రెడ్‌కార్పెట్ వేసిన ఆరోగ్యశ్రీ(తాజాగా ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవ) ఆపదలో పడింది. ప్రాణాంతక వ్యాధులతో వెళ్లిన వారికి వైద్యం అందడంలేదు. మరో ఆస్పత్రికి వెళ్లండంటూ కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి సమాధానం వస్తోంది. ఇక హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులైతే ఏపీ నుంచి వచ్చే పేషెంట్లను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీల కంటే 25 శాతం ఎక్కువ ఇస్తేనే వైద్యం చేస్తామంటున్నాయి. మరోవైపు వైద్య చికిత్సలు చేసిన బిల్లుల కోసం నెలల తరబడి తిప్పుకుంటున్నారని ప్రైవేటు ఆస్పత్రులు చెబుతున్నాయి. 850 కోట్లు అడిగితే.. 500 కోట్లు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకానికి రూ.925 కోట్లు ఇచ్చేవారు. సీఎంఆర్ఎఫ్ కింద మరో రూ.350 కోట్లు వచ్చేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 58-42 దామాషా పద్ధతిలో నిధులూ విడదీయాలి. ఈ లెక్కన రూ.547 కోట్లు రావాలి. ప్రీమియం విలువ రూ.2 లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచడం, 938 జబ్బుల జాబితాను 1,038 జబ్బులకు పెంచడంతో రూ.80కోట్లు అదనంగా అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. పథకానికి రూ.850 కోట్లు అవసరమని తేల్చారు. సర్కారు ఇవేమీ పట్టించుకోకుండా రూ.500కోట్లు మాత్రమే కేటాయించింది. అనుమతుల్లో తీవ్ర జాప్యం గత కొంతకాలంగా వైద్యానికి అనుమతుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఖరీదైన జబ్బులుగా చెప్పుకునే న్యూరో(నరాల జబ్బులు), పాలీట్రామా (ప్రమాద కేసులు), గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వాటికి కావాలనే జాప్యం చేస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక కేసులను స్క్రూటినీ(పరిశీలించి) చేయాల్సిన సీనియర్ వైద్యులు తెలంగాణకు వెళ్లిపోయారని, అందుకే ఇక్కడ కేసులకు ముందస్తు అనుమతి ఇచ్చేవారులేరని అధికారులు చెబుతున్నారు. కిడ్నీ, గుండె, యూరాలజీ, క్యాన్సర్ వంటి వ్యాధుల వైద్యానికి హైదరాబాదే కేంద్రంగా ఉంది. ఏపీ నుంచి కనీసం 15 శాతం మంది రోగులు హైదరాబాద్‌కే రావాలి. ఇక్కడ కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నాయి. ఆరోగ్యశ్రీలో గతంలో రోజుకు 2వేల కేసులకు అనుమతులిచ్చేవారు, ఇప్పుడా సంఖ్య 1300కు తగ్గింది. స్పెషలిస్టులు ఎక్కడ? గతంలో 130 జబ్బులను ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే చేయాలని బదలాయించింది. ప్రధానంగా ఏపీలో ఉన్న బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ వైద్యుల కొరత వేధిస్తోంది. బాధితులు ఆరోగ్యశ్రీ కింద చేరితే పట్టించుకునే వారే లేరు. కాక్లియర్ ఇంప్లాంట్స్‌కూ బ్రేకులు ఆరోగ్యశ్రీలో పుట్టుకతోనే చెవిటి, మూగ చిన్నారుల కోసం ఉద్దేశించిందే కాక్లియర్ ఇంప్లాంట్స్. అప్పట్లో 12ఏళ్లలోపు చిన్నారులను గుర్తించి ఒక్కొక్కరికి రూ.6.5లక్షలు చొప్పున ఏడాదికి కనీసం 300మందికి ఇచ్చేవారు. ఆ తర్వాత 2ఏళ్ల వయసులోపే గుర్తించాలని నిబంధన విధించారు. ఈ నిబంధనతో ఇప్పుడా సంఖ్య యాభైకి పడిపోయింది. చెవుడు, మూగ ఉన్నదో లేదో తెలుసుకునేలోపే చిన్నారికి రెండేళ్లు దాటిపోతోంది. రెండేళ్లకు ఒక్కరోజు దాటినా వెనక్కు పంపుతున్నారు. దీంతో ఆ చిన్నారులు శాశ్వతంగా వికలాంగులుగానే ఉండిపోతున్నారు. ఆరోగ్యశ్రీకి ‘సమ్మె’పోటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిబ్బంది చేస్తున్న సమ్మె పేద రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోం ది. కొంతకాలంగా ఆరోగ్యమిత్రలు, కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు పలు సమస్యలపై సమ్మె చేస్తున్నారు. దీంతో ఆస్పత్రుల్లో అనుమతుల నుంచి ట్రస్ట్ అనుమతుల వరకూ అవరోధంగా మారింది. సమస్యను పరిష్కరించడంలో ఇటు సర్కారూ చొరవ చూపలేదు. దీంతో పరిస్థితి దిగజారింది. ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రులు ప్రస్తుతం ఇస్తున్న ప్యాకేజీ కంటే ఎక్కువ డిమాండు చేస్తున్నాయి. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ గుర్తింపు ఉంటే 25% ఎక్కువ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాం. అయినా యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ఏపీలో ఎక్కడా జాప్యం లేదు. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే చర్యలు తీసుకుంటాం. - ఎల్వీ సుబ్రహ్మణ్యం, వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గతంలో గుండె ఆపరేషన్ చేయించుకున్నా. ఏడాది పాటు మందులిచ్చారు. తర్వాత నుంచి మందులు కొనుక్కుంటున్నా. వీటికి నెలకు రూ.4వేలు అవుతోంది. వైద్య పరీక్షలు, మందులకు డబ్బుల్లేక రెండు నెలలుగా ఆస్పత్రికి వె ళ్లలేదు. మా ఆయన రిక్షా తొక్కితే వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నాం. - వయరాల అప్పలనర్స, బైయపురెడ్డిపాలెం, నర్సీపట్నం రెండేళ్ల కిందట గైనిక్ సమస్యతో బాధపడుతున్న నాకు ఆపరేషన్ చేయడానికి పెద్దాస్పత్రి వారు లక్ష ఖర్చవుతుందన్నారు. అంత స్తోమత లేక ఆందోళన చెందా. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో రెండేళ్ల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్నా. ఆయన దయవల్లనే ఇప్పుడు ఆరోగ్యంగా తిరగగలుగుతున్నా. - బేతా నాగేశ్వరమ్మ, పాతనగరం, వాడవీధి, విశాఖ -
ఇక ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’
పథకం పరిధిలోకి 1,038 జబ్బులు సాక్షి, హైదరాబాద్: పేద రోగుల జీవితానికి భరోసానిచ్చిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకం పేరు మారింది. దీన్ని ‘డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవ’గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇకపై డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆరోగ్యశ్రీ బోర్డును పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకూ 26 లక్షల మంది పేద రోగులకు పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు.ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న వైఎస్సార్ ప్రారంభించారు. పథకంలో మరో 100 జబ్బులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 938 జబ్బులకు సేవలందుతున్నాయి. పథకం డాక్టర్ నందమూరి తారకరామావు ఆరోగ్యసేవగా మారిన నేపథ్యంలో మరో 100 జబ్బులకు కూడా వర్తిస్తుంది. ఇకపై 1038 జబ్బులకు ఉచిత ఆరోగ్యసేవలు అందుతారుు. రూ.2.50 లక్షలకు పెంపు: ఆరోగ్యశ్రీ పథకంలో రూ.2 లక్షల వరకు చికిత్స కవరేజీ ఉంది. ఇకపై 1038 జబ్బులకు వర్తించేలా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2.50 లక్షలువర్తింప చేస్తామని పేర్కొన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు. -
ఆరోగ్యశ్రీ కార్డులన్నీ తొలగిస్తాం: మంత్రి కామినేని
హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరును మార్చి త్వరలోనే కొత్త పేరు ఖరారు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డులన్నింటినీ తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఇస్తామని చెప్పారు. అలాగే ఈ పథకంలో రూ. 2 లక్షల ప్యాకేజీని పెంచాలన్న ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. మంత్రి బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం 938 చికిత్సలు లభిస్తున్నాయని.. వాటిని కూడా పెంచుతామని పేర్కొన్నారు. ఆగస్ట్ 15న ప్యాకేజీ పెంపు, చికిత్సల పెంపుపై సీఎం ప్రకటన చేస్తారని తెలిపారు. జర్నలిస్టులకు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి కామినేని తెలిపారు. జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు మంత్రి వివరించారు.