సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా వీరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేటగిరీల వారీగా గతంలో చెల్లించిన దానికంటే స్వల్ప మొత్తంలో ప్రీమియాన్ని పెంచి, ఉద్యోగుల నగదు రహిత వైద్య పథకం (ఈహెచ్‌ఎస్)ను పటిష్టంగా అమలు చేస్తారు. ఈ మేరకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇకపై ఆస్పత్రులకు సకాలంలో నిధులు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులకు వైద్యం ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ నిధులను గ్రీన్‌చానెల్‌లో చేర్చారు. దీనివల్ల సకాలంలో, ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ప్రీమియంలో మార్పులు ఇలా...
► కొత్త ప్రీమియం రేట్ల ప్రకారం రెండు స్లాబులు నిర్ణయించారు.
► గతంలో నెలకు రూ.90 చెల్లించే ఉద్యోగులు ఇక నుంచి రూ.225 చెల్లిస్తారు.
► గతంలో నెలకు రూ.120 చెల్లించేవారు ఇప్పుడు రూ.300 చెల్లిస్తారు.
► దీని ప్రకారం ఏడాదికి ఉద్యోగుల నుంచి రూ.400 కోట్లు వస్తాయని అంచనా. అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేస్తుంది.
► పెంచిన ప్రీమియం 2019, డిసెంబర్ నుంచి వర్తిస్తుంది.
► అన్ని యూనివర్సిటీలు, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు, వైద్యవిధాన పరిషత్ విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గతంలో ఈ పథకంలో లేరు. ఇప్పుడు వీరిని కూడా చేర్చారు.
9,000 మందిని పథకం పరిధిలో చేర్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే..
వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేసే 9 వేల మంది గతంలో ఈ పథకంలో లేరు. ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి విన్నవించినా స్పందించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వీళ్లందరినీ పథకం కిందకు తీసుకురావడంతో వారికి మెరుగైన వైద్యం అందే అవకాశం కలిగింది.
–ఉల్లి కృష్ణ, అధ్యక్షులు, కె.సురేష్, ప్రధాన కార్యదర్శి (వైద్యవిధాన పరిషత్ ఉద్యోగుల సంఘం)
Comments
Please login to add a commentAdd a comment