హడావిడిగా ఆరోగ్య చట్టం! | Sakshi Editorial On Right to Health Government of Rajasthan | Sakshi
Sakshi News home page

హడావిడిగా ఆరోగ్య చట్టం!

Published Tue, Apr 4 2023 12:01 AM | Last Updated on Tue, Apr 4 2023 12:01 AM

Sakshi Editorial On Right to Health Government of Rajasthan

అత్యవసర సమయాల్లో రోగులు ముందుగా డబ్బు చెల్లించకపోయినా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో తక్షణ వైద్య సేవలు అందేలా రాజస్థాన్‌ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టంపై (రైట్‌ టు హెల్త్‌) అక్కడి వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది! ఈ చట్టాన్ని నిరసిస్తూ లక్ష మందికి పైగా ప్రైవేటు డాక్టర్లు నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తున్నారు.

దాదాపు మూడు వేల ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సేవల్ని నిలిపివేశాయి. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐ.ఎం.ఎ.) కూడా వైద్యుల నిరసనకు మద్దతు తెలపడంతో రాజస్థాన్‌లో గత రెండు వారాలుగా ప్రజారోగ్య వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది.

అత్యవసర చికిత్స కోసం రోగులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళన విరమించేది లేదని వైద్యులు, చట్టాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం పట్టుపట్టి మెట్టు దిగడం లేదు. 

2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఆరోగ్య హక్కు చట్టాన్ని తెచ్చామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ చెబుతున్నారు. ఎప్పుడో ఇచ్చిన హామీని మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో నెరవేర్చడం వెనుక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాక, రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులన్నవే లేకుండా చేయాలన్న తలంపు కూడా ప్రభుత్వానికి ఉండివుండొచ్చని వైద్యులు ఆరోపిస్తున్నారు.

మార్చి 21న రాజస్థాన్‌ అసెంబ్లీలో ఆరోగ్య హక్కు బిల్లు ఆమోదం పొందింది. వెనువెంటనే వైద్యుల నిరసనలు మొదలయ్యాయి. మార్చి 28న వైద్యులకు మద్దతుగా ఐ.ఎం.ఎ. రంగంలోకి దిగింది. 

రాజస్థాన్‌ తెచ్చిన ఈ కొత్త ఆరోగ్య బిల్లు ప్రకారం, ఒక వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం వచ్చినప్పుడు ప్రైవేటు వైద్యులు వైద్య సేవల్ని నిరాకరించకూడదు. డబ్బు చెల్లించలేక పోయినా తక్షణం చికిత్సను అందించి తీరాలి. చికిత్సానంతరం ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.

అత్యవసర వైద్యం నిరాకరించిన ఆసుపత్రి లేదా వైద్యుడు తొలిసారి 10 వేలు, మళ్లీ అదే తప్పు చేస్తే 25 వేలు జరిమానా చెల్లించాలి. తప్పు మీద తప్పుకు ఆ మొత్తం అలా పెరిగిపోతూ ఉంటుంది.

అయితే రోగులకు ప్రభుత్వం కల్పించిన ఈ ఆరోగ్య హక్కు... వైద్యుల జీవించే హక్కును కాలరాసేలా ఉందని, రోగుల అత్యవసర పరిస్థితి ఎలాంటిదైనా కూడా తప్పనిసరిగా చికిత్సను అందించాలన్న చట్ట నిబంధన కారణంగా తమకిక కనీస విశ్రాంతి కూడా దొరకదన్నది వైద్యుల ఆందోళన.

వైద్యాన్ని నిరాకరించిన డాక్టరుపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సైతం అనుమ తిస్తున్న తాజా బిల్లు కారణంగా వైద్యులకు వేధింపులు తప్పవనీ, తమపై తప్పుడు కేసులు కూడా నమోదయ్యే ప్రమాదం ఉందనీ ప్రైవేటు వైద్యులు కలవరపడుతున్నారు. అదే సమయంలో చట్టంలోని అంశాల విషయమై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టతను డిమాండ్‌ చేస్తున్నారు. 

ఒక్కోసారి మామూలు తలనొప్పిగా అనిపించినది కూడా అత్యవసర స్థితిగా మారి మెదడులో రక్తస్రావానికి దారి తీస్తే అప్పుడేమిటి? అప్పుడు ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? మరి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చుల మాటేమిటి? తలనొప్పి, కడుపునొప్పితో వచ్చినవారికి పరీక్షలన్నీ చేశాక అది ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా? బిల్లును పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం రీయింబర్స్‌ చేస్తుంది? ఇవీ... సమ్మె బాట పట్టిన వైద్యుల ప్రాథమిక సందేహాలు.

ప్రభుత్వం ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. చట్టం ఉద్దేశం మంచిదే కావచ్చు. చట్టంలో అస్పష్టత లేనప్పుడే అది అమోద యోగ్యం అవుతుంది.

దేశంలోనే తొలిసారి రాజస్థాన్‌ ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి ప్రసాద్‌ లాల్‌ మీనా గొప్పగా చెబుతున్నారు! అయితే ఇదేమీ పూర్తిగా కొత్తది కాదు. 2021లోనే తమిళనాడు ప్రభుత్వం... అన్ని ఆసుపత్రులూ బాధితులకు విధిగా అత్యవసర వైద్య సేవలను అందించేలా ఒక పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద... బిల్లు చెల్లించలేని రోగుల తరఫున ప్రభుత్వమే ఆసుపత్రులకు రీయింబర్స్‌ చేస్తుంది.

అయితే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంతో పోల్చడానికి ఈ రీయింబర్స్‌మెంట్‌ సరిపోదు. ఆరోగ్యశ్రీ పథకం వీటితో పోల్చితే అత్యంత ప్రభావవంతమైనది, విజయవంతమైనది. దీన్ని ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ వైద్యరంగాన్ని కూడా బలోపేతం చేయడంతో అది అన్ని రాష్ట్రాలకూ మోడల్‌గా ఆవిర్భవించింది. 

రాజస్థాన్‌ విషయానికి వస్తే ఆరోగ్య హక్కు చట్టాన్ని అక్కడి ప్రభుత్వం హడావిడిగా తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. అటు ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్టం చేయడానికి ఏ ప్రయత్నం చేయకుండా, ఇటు ఆరోగ్యశ్రీ వంటి ఒక బృహత్తర పథకాన్ని ఆలోచించకుండా, ఆ రంగానికి సంబంధించిన ప్రముఖులతో చర్చించకుండా, వైద్యుల భయాలను సంపూర్ణంగా నివృత్తి చేయకుండా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిల్లును ఆమోదించినట్లు కనిపిస్తోంది.

ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. బిల్లు అమలులోకి రావాలంటే గవర్నర్‌ ఆమోదం పొందాలి. ఆరోగ్య హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ఆసుపత్రులేవో ప్రభుత్వం నిర్ణయించాలి. అప్పుడే రీయింబర్స్‌మెంట్‌ ప్రక్రియ గురించి స్పష్టత వస్తుంది. ఈ అన్ని దశలలోనూ వైద్యులతో ప్రభుత్వం తప్పక చర్చించాలి. చర్చలకు హామీ ఇస్తూ, సమ్మె విరమించి వెంటనే విధులకు హాజరవాలని వైద్యులను కోరవలసిందీ, ఇందుకు తగిన చొరవ తీసుకోవలసిందీ ప్రభుత్వమే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement