మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యసూచీల్లో తెలంగాణను దేశంలో మూడో స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకురావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్య సిబ్బంది, అధికారులకు సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు నూతనోత్సాహంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్రవ్యాప్త ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలతో హరీశ్‌రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలోని సబ్ సెంటర్, పీహెచ్‌సీలవారీగా పురోగతిని సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ మంచి పనితీరు కనబర్చిన డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ వైద్యులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు ఈ నెల 7న వరల్డ్ హెల్త్ డే పురస్కరించుకొని నగదు ప్రోత్సాహంతోపాటు సన్మానం ఉంటుందన్నారు. ప్రతి విభాగంలో ముగ్గురిని ఎంపిక చేసి సన్మానిస్తామని చెప్పారు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి ఇలాంటి కార్యక్రమం ఉంటుందన్నారు. అదే సమయంలో పనిచేయనివారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగాలి
ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సాధారణ డెలివరీలను ప్రో త్సహించాలని హరీశ్‌రావు అన్నారు. ప్రైవే టు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా జరు గుతున్నాయని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతినెలా అన్ని ప్రమాణాల మీద సమీక్ష ఉంటుందని, ప్రతి ఒక్కరూ రిపోర్టులతో సిద్ధంగా ఉండాలన్నారు.
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలు ఎక్కువగా క్షేత్రస్థాయి సందర్శనలు చేయాలని ఆదేశించారు. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల సీజనల్ వ్యాధులు చాలా తగ్గాయన్నారు.
మలేరియా విభాగంలో రాష్ట్రం కేటగిరి రెండు నుంచి ఒకటికి చేరిందని, దీన్ని కేటగిరి సు న్నాకు చేరుకునేలా చేసి, మలేరియా రహిత రాష్ట్రం గా తీర్చిదిద్దాలన్నారు. బస్తీ దవాఖానాల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment