private doctors
-
హడావిడిగా ఆరోగ్య చట్టం!
అత్యవసర సమయాల్లో రోగులు ముందుగా డబ్బు చెల్లించకపోయినా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో తక్షణ వైద్య సేవలు అందేలా రాజస్థాన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టంపై (రైట్ టు హెల్త్) అక్కడి వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది! ఈ చట్టాన్ని నిరసిస్తూ లక్ష మందికి పైగా ప్రైవేటు డాక్టర్లు నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. దాదాపు మూడు వేల ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సేవల్ని నిలిపివేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) కూడా వైద్యుల నిరసనకు మద్దతు తెలపడంతో రాజస్థాన్‌లో గత రెండు వారాలుగా ప్రజారోగ్య వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. అత్యవసర చికిత్స కోసం రోగులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళన విరమించేది లేదని వైద్యులు, చట్టాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం పట్టుపట్టి మెట్టు దిగడం లేదు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఆరోగ్య హక్కు చట్టాన్ని తెచ్చామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చెబుతున్నారు. ఎప్పుడో ఇచ్చిన హామీని మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో నెరవేర్చడం వెనుక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాక, రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులన్నవే లేకుండా చేయాలన్న తలంపు కూడా ప్రభుత్వానికి ఉండివుండొచ్చని వైద్యులు ఆరోపిస్తున్నారు. మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీలో ఆరోగ్య హక్కు బిల్లు ఆమోదం పొందింది. వెనువెంటనే వైద్యుల నిరసనలు మొదలయ్యాయి. మార్చి 28న వైద్యులకు మద్దతుగా ఐ.ఎం.ఎ. రంగంలోకి దిగింది. రాజస్థాన్ తెచ్చిన ఈ కొత్త ఆరోగ్య బిల్లు ప్రకారం, ఒక వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం వచ్చినప్పుడు ప్రైవేటు వైద్యులు వైద్య సేవల్ని నిరాకరించకూడదు. డబ్బు చెల్లించలేక పోయినా తక్షణం చికిత్సను అందించి తీరాలి. చికిత్సానంతరం ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అత్యవసర వైద్యం నిరాకరించిన ఆసుపత్రి లేదా వైద్యుడు తొలిసారి 10 వేలు, మళ్లీ అదే తప్పు చేస్తే 25 వేలు జరిమానా చెల్లించాలి. తప్పు మీద తప్పుకు ఆ మొత్తం అలా పెరిగిపోతూ ఉంటుంది. అయితే రోగులకు ప్రభుత్వం కల్పించిన ఈ ఆరోగ్య హక్కు... వైద్యుల జీవించే హక్కును కాలరాసేలా ఉందని, రోగుల అత్యవసర పరిస్థితి ఎలాంటిదైనా కూడా తప్పనిసరిగా చికిత్సను అందించాలన్న చట్ట నిబంధన కారణంగా తమకిక కనీస విశ్రాంతి కూడా దొరకదన్నది వైద్యుల ఆందోళన. వైద్యాన్ని నిరాకరించిన డాక్టరుపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సైతం అనుమ తిస్తున్న తాజా బిల్లు కారణంగా వైద్యులకు వేధింపులు తప్పవనీ, తమపై తప్పుడు కేసులు కూడా నమోదయ్యే ప్రమాదం ఉందనీ ప్రైవేటు వైద్యులు కలవరపడుతున్నారు. అదే సమయంలో చట్టంలోని అంశాల విషయమై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టతను డిమాండ్ చేస్తున్నారు. ఒక్కోసారి మామూలు తలనొప్పిగా అనిపించినది కూడా అత్యవసర స్థితిగా మారి మెదడులో రక్తస్రావానికి దారి తీస్తే అప్పుడేమిటి? అప్పుడు ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? మరి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చుల మాటేమిటి? తలనొప్పి, కడుపునొప్పితో వచ్చినవారికి పరీక్షలన్నీ చేశాక అది ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా? బిల్లును పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది? ఇవీ... సమ్మె బాట పట్టిన వైద్యుల ప్రాథమిక సందేహాలు. ప్రభుత్వం ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. చట్టం ఉద్దేశం మంచిదే కావచ్చు. చట్టంలో అస్పష్టత లేనప్పుడే అది అమోద యోగ్యం అవుతుంది. దేశంలోనే తొలిసారి రాజస్థాన్ ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి ప్రసాద్ లాల్ మీనా గొప్పగా చెబుతున్నారు! అయితే ఇదేమీ పూర్తిగా కొత్తది కాదు. 2021లోనే తమిళనాడు ప్రభుత్వం... అన్ని ఆసుపత్రులూ బాధితులకు విధిగా అత్యవసర వైద్య సేవలను అందించేలా ఒక పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద... బిల్లు చెల్లించలేని రోగుల తరఫున ప్రభుత్వమే ఆసుపత్రులకు రీయింబర్స్ చేస్తుంది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంతో పోల్చడానికి ఈ రీయింబర్స్మెంట్ సరిపోదు. ఆరోగ్యశ్రీ పథకం వీటితో పోల్చితే అత్యంత ప్రభావవంతమైనది, విజయవంతమైనది. దీన్ని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ వైద్యరంగాన్ని కూడా బలోపేతం చేయడంతో అది అన్ని రాష్ట్రాలకూ మోడల్‌గా ఆవిర్భవించింది. రాజస్థాన్ విషయానికి వస్తే ఆరోగ్య హక్కు చట్టాన్ని అక్కడి ప్రభుత్వం హడావిడిగా తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. అటు ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్టం చేయడానికి ఏ ప్రయత్నం చేయకుండా, ఇటు ఆరోగ్యశ్రీ వంటి ఒక బృహత్తర పథకాన్ని ఆలోచించకుండా, ఆ రంగానికి సంబంధించిన ప్రముఖులతో చర్చించకుండా, వైద్యుల భయాలను సంపూర్ణంగా నివృత్తి చేయకుండా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిల్లును ఆమోదించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. బిల్లు అమలులోకి రావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి. ఆరోగ్య హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ఆసుపత్రులేవో ప్రభుత్వం నిర్ణయించాలి. అప్పుడే రీయింబర్స్మెంట్ ప్రక్రియ గురించి స్పష్టత వస్తుంది. ఈ అన్ని దశలలోనూ వైద్యులతో ప్రభుత్వం తప్పక చర్చించాలి. చర్చలకు హామీ ఇస్తూ, సమ్మె విరమించి వెంటనే విధులకు హాజరవాలని వైద్యులను కోరవలసిందీ, ఇందుకు తగిన చొరవ తీసుకోవలసిందీ ప్రభుత్వమే. -
ప్రైవేట్ వైద్యులు వర్సెస్ ప్రభుత్వ చట్టం
ప్రజలకు ఆరోగ్య హక్కును పరిపూర్ణంగా అందించేందుకంటూ రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టం (రైట్ టు హెల్త్) దుమారం రేపుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో రోగులు ముందుగా డబ్బులు చెల్లించకపోయినా ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు విధిగా చికిత్స చేసి తీరాలని చెబుతోంది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రైవేటు వైద్యులు మెరుపు సమ్మెలకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెలో లక్ష మంది ప్రైవేటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2,500 ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు రెండు వారాలుగా ఉధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దాంతో అత్యవసర పరిస్థితుల్లోనూ చికిత్స అందించే వైద్యుల్లేక రాష్ట్రంలో రోగులు అల్లాడుతున్నారు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని సీఎం గహ్లోత్ అంటున్నారు. 2018 ఎన్నికల హామీని నెరవేర్చామని చెబుతున్నారు. దేశంలో తొలిసారి రాజస్తానే ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్య మంత్రి ప్రసాద్ లాల్ మీనా గర్వంగా ప్రకటించారు. మరోవైపు ప్రైవేటు డాక్టర్ల వాదన కూడా విని, వారి ఆందోళనలను సీఎం తీర్చాలని కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ హితవు పలికారు. అలా ఈ చట్టం అధికార కాంగ్రెస్‌లోనూ అంతర్గత పోరుకు దారి తీయొచ్చంటున్నారు. ఏమిటీ చట్టం? ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనారోగ్యంతో అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు డాక్టర్లు వైద్యం నిరాకరించకూడదు. ముందుగా డబ్బులు చెల్లించకపోయినా చికిత్స అందించి తీరాలి. చికిత్స పూర్తయ్యాక రోగి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదాలు, పాము కాట్లు, గర్భిణుల ప్రసవంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన ఏ పరిస్థితులైనా ఎమర్జెన్సీ కిందకు వస్తాయి. వాటికి వైద్యం నిరాకరించే ఆస్పత్రి/వైద్యుడు తొలిసారి 10 వేలు జరిమానా చెల్లించాలి. ఆ తర్వాత 25 వేలు, అలా పెరుగుతూ పోతుంది. చట్టంలో స్పష్టత లేని విషయాలివే! ► ఎమర్జెన్సీ అంటే చట్టంలో సరిగ్గా వివరించలేదు. ఒక్కోసారి తలనొప్పి కూడా అత్యవసర పరిస్థితి కిందకు వచ్చి బ్రెయిన్ హెమరేజ్‌కి దారి తీయవచ్చు. ► ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? ► వైద్య పరీక్షలకయ్యే ఖర్చుల సంగతేమిటి? కడుపు నొప్పి, తలనొప్పితో వచ్చి పరీక్షలన్నీ చేశాక తీరా అది ఎమర్జెన్సీ కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా? ► బిల్లు పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం ఆ సొమ్ముల్ని తిరిగి చెల్లిస్తుంది? ప్రైవేటు ఆస్పత్రులు ఎన్నాళ్లు వేచి చూడాలి? ప్రైవేటు వైద్యుల నిరసనలెందుకు? ► ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని చేశారని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. వైద్యుల జీవించే హక్కును కాలదన్నేలా ఈ చట్టం ఉందని, ఎమర్జెన్సీ అంటూ రోగులు వస్తే వారి సమస్య ఎలాంటిదైనా చికిత్స తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన వల్ల ఇక కనీస విశ్రాంతి కూడా దొరకదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్పత్రులు తమ బాధ్యతను చాకచక్యంగా ప్రైవేటు ఆస్పత్రులపై నెట్టేస్తున్నాయన్న వాదనలున్నాయి. రోగులు బిల్లులు చెల్లించలేని పక్షంలో వాటిని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో చట్టంలో స్పష్టత లేదని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ చట్టం అమలు సరిగ్గా జరగకపోతే రోగులకు, డాక్టర్లకు మధ్య పరస్పరం అపనమ్మకం ఎక్కువైపోతుందని వైద్యుల్లో ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘‘దీన్ని ఆరోగ్య హక్కు చట్టం అని పిలుస్తున్నారు. కానీ ఇందులో రోగుల హక్కుల కంటే వైద్యుని బాధ్యతలే ఎక్కువ! దీన్ని బలవంతంగా రుద్దితే వైద్యులు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు’’అని జైపూర్‌కు చెందిన డాక్టర్ బ్రూనో అన్నారు. వైద్యులకు వేధింపులు తప్పవా? ► ప్రైవేటు క్లినిక్‌లో డాక్టర్ చికిత్స ఇవ్వడానికి నిరాకరిస్తే అతనిపై రోగి న్యాయపరమైన చర్యలకు దిగొచ్చు. చట్టంలోని ఈ నిబంధన వల్ల తాము వేధింపులకి గురి కాక తప్పదని, అధికార యంత్రాంగం జోక్యం పెరిగిపోయి తప్పుడు కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రైవేటు డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ‘‘ఎవరికైనా చిన్న ప్రైవేటు క్లినిక్ ఉంటే ఎమర్జెన్సీ కింద 24 గంటలు తెరిచి ఉంచడం కష్టం. వైద్యులకు వ్యక్తిగత జీవితం ఉండదా? రోగులు కేసు పెడితే దాన్ని సవాల్ చేసే అవకాశం వైద్యులకు లేకుండా చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల్ని వేధించేందుకే’’అని జైపూర్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అమిత్ యాదవ్ విమర్శించారు. ఉద్దేశం మంచిదే కానీ... ► రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న వైద్యులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు అందరికీ ఆరోగ్యం అందించాలనే ఆ చట్టం స్ఫూర్తికి తాము మద్దతుగానే నిలుస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా చట్టంలో ఎన్నో లొసుగులున్నాయని డాక్టర్ పార్థ శర్మ అన్నారు. వాటినన్నింటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే మంచి కంటే చెడే జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా
కాసుల కోసం కక్కుర్తిపడి ప్రైవేటు వైద్యులు చేస్తున్న కుటుంబ నియంత్రణ (సంక్షేమ) ఆపరేషన్లు గిరిజన మహిళలకు ప్రాణాంతకమవుతున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్య ముఠా ప్రైవేటుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న వైనం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసింది. గిరిజన మహిళల అమాయకత్వాన్ని, అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని.. మత్తు మందు కూడా సరిగా ఇవ్వకుండా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం ఈదులపాలెం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఉన్న సలుగు రోడ్డులో ఓ మెడికల్ షాపు వద్ద నెలకు ఒకసారి కుటుంబ సంక్షేమ ఆపరేషన్లను విచ్చలవిడిగా నిర్వహిస్తూ భారీగా డబ్బు గుంజుతున్నారు. చిన్న ఆపరేషన్ జరగాలంటేనే మత్తు వైద్య నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. అలాంటిది వారు లేకుండానే వైద్యులు, కొంతమంది సిబ్బంది గిరిజన మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. – పాడేరు ఒక్కో ఆపరేషన్‌కు రూ.8,500 అనకాపల్లిలో ఓ ప్రభుత్వాస్పత్రికి చెందిన గైనిక్ వైద్యుడితోపాటు ఇతర వైద్య సిబ్బంది ముఠాగా ఏర్పడి అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక ఆపరేషన్‌కు రూ.20 వేలు ఖర్చవుతుందని, తామైతే కేవలం రూ.8,500లకే ఆపరేషన్ చేస్తామని ప్రచారం చేస్తున్నారు. గతనెలలో కూడా ఈదులపాలెం మెడికల్ షాపులో 35 మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈదులపాలెం మెడికల్ షాపు వెనుక మహిళలకు ఆపరేషన్లను చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి అక్కడకు చేరుకుని ఆ తతంగాన్నంతా కెమెరాలో బంధించారు. మత్తు సరిగా ఇవ్వకుండానే.. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు సరిగా ఇవ్వకపోవడంతో గిరిజన మహిళలు నరకయాతనతో పెద్దపెట్టున ఏడ్చారు. అయినా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వారికి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ చేశాక వారిని క్షణమైనా కోలుకోనీయకుండా వెంటనే బయటకు తరలించేశారు. మహిళలను జీసీసీడీఆర్ డిపో ఆవరణలో, ఆటోల్లో పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆయా గ్రామాలకు తరలించేశారు. వీరికి స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలో తాత్కాలిక నిషేధం గిరిజన ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ తాత్కాలికంగా నిషేధం విధించింది. ఏజెన్సీలో జనాభా తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లను ప్రస్తుతం నిర్వహించడం లేదు. కోవిడ్ నిబంధనలు కూడా ఇందుకు కారణం. అయితే ఆపరేషన్లు చేయాలని గిరిజనుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పాడేరు, అరకులోయ ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తాం. ఈ నెల 15 నుంచి ఆపరేషన్ల నిర్వహణకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్లను పునఃప్రారంభిస్తాం. ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రైవేటు క్లినిక్‌లు, మెడికల్ షాపుల్లో మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం చట్టరీత్యా నేరం. –డాక్టర్ కె.లీలాప్రసాద్, ఇన్చార్జి ఏడీఎంహెచ్‌వో, పాడేరు నా కుమార్తె ఆపరేషన్‌కు రూ.8 వేలు ఇచ్చాను నా కుమార్తె ఆపరేషన్‌కు డాక్టర్‌కు రూ.8 వేలు చెల్లించాను. ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ చేయడం లేదని ప్రచారం జరగడంతో ప్రైవేటు మెడికల్ షాపులో ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం. మైదాన ప్రాంతాల్లోని పెద్ద ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఈదులపాలెంలోనే నా కుమార్తెకు ఆపరేషన్ చేయించా. –సీదరి సీతమ్మ, తరగం గ్రామం, దేవాపురం పంచాయతీ, పాడేరు మండలం -
Online Doctor Consultation: ఆన్లైన్ వైద్యానికి డిమాండ్
సాక్షి, విజయవాడ: ప్రైవేట్ వైద్యులు ఆన్లైన్ కన్సల్టేషన్ బాటపట్టారు. కోవిడ్, ఇతర రుగ్మతల బారిన పడిన వారికి ఫోన్, వాట్సప్ ద్వారా చికిత్సలను సూచిస్తున్నారు. కొందరు వైద్యులు ఆస్పత్రులు తెరుస్తున్నా రోగుల్ని 6 అడుగుల దూరం నుంచే పరిశీలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కారణంగా చాలామంది రోగులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఫోన్ ద్వారానే వైద్యులను సంప్రదించి.. వారు సూచించిన ల్యాబ్ పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. కరోనా స్వల్ప లక్షణాలున్న వారు ఆందోళన చెంది ఆస్పత్రుల్లో బెడ్స్ కోరం తిరగటం కంటే ఆన్లైన్ పద్ధతిలోనే చికిత్స చేయించుకుంటున్నారు. పలువురు వైద్యులు తమ ఫోన్ నంబర్ ఇచ్చి.. డిజిటల్ విధానంలో ఫీజు చెల్లిం చగానే లైన్లోకి వచ్చి రోగికి వైద్య సలహాలు ఇస్తు న్నారు. పరీక్ష నివేదికలను వాట్సప్ ద్వారా రప్పిం చుకుని పరిశీలించి చికిత్స సూచిస్తున్నారు. ఈ విధానం వల్ల వైద్యుడి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా కన్సల్టేషన్ త్వరగా పూర్తయిపోతోంది. అత్యవసర కేసుల్లో ఈ విధానం పనికిరాదని, అలాంటి వారు ఆన్లైన్ వైద్యం కోసం ప్రయత్నిస్తే ప్రాణాల మీదకు వస్తుందని పలువురు చెబుతున్నారు. లాభాలివీ.. ఆస్పత్రులకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండటం వల్ల పక్క వారికి కరోనా ఉంటే అది మనకు సోకుతుందనే భయం ఉండదు. తేలికపాటి లక్షణాలకే ప్రయాసపడి వెళ్లి వైద్యుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. వైద్యులు రిపోర్టులు చూసి రోగులకు ధైర్యం చెబుతున్నారు. దీనివల్ల తమకు ప్రాణా పాయం లేదనే ధైర్యం రోగుల్లో వస్తోంది. తాము చెప్పదలుచుకున్న విషయాలను ముందుగా రాసుకుని చెప్పడానికి వీలుంటుంది. వైద్యుడు ఫోన్ నంబర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే ఫోన్ చేసి సంప్రదించవచ్చు. కరోనా తొలి దశలోనే సాధారణ, మధ్య తరగతి వారికి ఆన్లైన్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అన్ని వేళలా మంచిది కాదు ఆన్లైన్ వైద్యం అన్నివేళలా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. రోగుల్ని చూసిన తరువాత వైద్యుడు అంచనాకు వచ్చి వైద్యం ప్రారంభించాలి. తొలుత స్వల్ప లక్షణాలు కనిపించినా తరువాత రోగం ముదిరే ప్రమాదం ఉంది. అప్పుడు ఆస్పత్రికి వెళ్లి చేరినా రోగం కంట్రోల్ కాకపోవచ్చు. రోగి తన లక్షణాలన్ని చెప్పలేకపోతే వైద్యడు సరిౖయెన మందు ఇవ్వకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయుక్తం ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ వైద్యం ఉపయుక్తంగా వుంది. అయితే, అన్ని వేళలా ఇది పనిచేయదు. అమెరికాలో టెలీ మెడిసిన్ విధానం ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆన్లైన్ వైద్యంలో అలా జరగడం లేదు. ఈ విధానం ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ మనోజ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ -
ఏం పర్లేదు.. ఎంబీబీఎస్ పట్టా, పలుకుబడి, డబ్బులుంటే చాలు!
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేషన్‌రోడ్డులోని ఓ మహానీయుని పేరిట ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితం వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండానే వైద్యం నిర్వహించారు. పరిశీలించేందుకు అధికారులు ఆస్పత్రికి రాగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అక్కడ లేరు. తీరా ఆరా తీస్తే నిర్మల్‌లో ఓ వైద్యుడి దగ్గర పనిచేసిన వ్యక్తి ఆ వైద్యుడి సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. ఆ వైద్యుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పని చేస్తున్నాడు. దీంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిని మూసివేయించారు. ఏ వైద్యుడి పేరిట ఆస్పత్రి కోసం దరఖాస్తు చేశారో ఆయనకు కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ఏడాది కిందట రాంనగర్లో ఓ ఆర్ఎంపీ క్లినిక్ ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నాడు. ఏకంగా పడకలు ఏర్పాటు చేసి సెలూన్ బాటిళ్లు సైతం ఎక్కిస్తున్నాడు. ఆ ఆర్ఎంపీ తన పేరు కింద ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు రాసుకున్నాడు. ఈ విషయం కొంత మంది వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు వైద్య పట్టా అడగడంతో ఆ నకిలీ వైద్యుడి బాగోతం బట్టబయలైంది. ఇలా చాలా మంది ఆర్ఎంపీలు ఎంబీబీఎస్ వైద్యులు అందించే వైద్యం అందిస్తామని చెప్పడం విశేషం. వీరిలో కొంత మంది ఆపరేషన్లు చేయిస్తామని చెప్పడమే కాదు.. ప్రైవేట్ వైద్యుల దగ్గరకు పంపి వారి నుంచి కమిషన్లు కూడా తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. సాక్షి. ఆదిలాబాద్: వైద్య విద్య చదవకపోయినా ఫర్వాలేదు.. ఎంబీబీఎస్ పట్టా, పలుకుబడి, డబ్బులుంటే చాలు ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. తెలిసిన డాక్టర్‌కు చెందిన పట్టాను తీసుకువెళ్లి క్లినిక్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వైద్యాశాఖకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించకుండా అనుమతి ఇవ్వడంతో కొంతమంది వైద్యం పేరిట దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ తతంగం జోరుగా సాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంతో ప్రైవే ట్ క్లినిక్‌ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ప్రజల అనారోగ్యాలే పెట్టుబడి ముందుకు సాగుతున్నారు. అదే విధంగా వైద్య పరీక్షల పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారు. ప్రజల ఆరోగ్యమే పెట్టుబడిగా.. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 100 ప్రైవేట్ క్లినిక్‌లు ఉన్నాయి. వీటిలో 12 నర్సింగ్ హోంలు, 12 క్లినిక్‌లు, 16 డెంటల్ క్లినిక్‌లు, 5 కంటి ఆసుపత్రులు, 44 ఆసుపత్రులు, 11 ల్యాబ్‌లు ఉన్నాయి. ఇటీవల జిల్లాలో ఆస్పత్రుల సంఖ్య పుట్టగొడుగుల్లా పెరిగాయి. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వైద్య వ్యాపారం చేస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్న కొంతమంది వైద్యులతో పాటు మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు చెందిన వారితో ఒప్పందం చేసుకొని క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ అనుమతి తీసుకున్న వైద్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ ఆ ఆస్పత్రి మాత్రం అలాగే కొనసాగుతోంది. అలాగే అర్హతలు లేకపోయినా మెడికల్ షాపుల, ల్యాబ్‌ల నిర్వహణ చేపడుతున్నారు. వైద్యుడు వారానికి ఓసారి రావడం, ఫోన్ల ద్వారానే రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వైద్యం అందిస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. టెస్ట్‌ల పేరిట దోపిడీ.. ఆస్పత్రికి రోగి వెళ్లిన వెంటనే మొదట పరీక్షల పేరిట దోపిడీ చేస్తున్నారు. ల్యాబ్‌లో అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయించడం, ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు పూర్తి చేయకపోయిన.. ల్యాబ్‌లో పని చేసి నేర్చుకున్న వారే టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆ పీహెచ్‌సీల్లో, రిమ్స్‌లో పని చేసే ల్యాబ్ టెక్నిషీయన్లు ప్రైవేట్ ఆస్పత్రి ల్యాబ్‌లో పనులు చేస్తున్నారు. తనిఖీలు నామమాత్రం.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు నామమాత్రంగా చేయడంతో ప్రైవేట్ క్లినిక్‌లు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. అందినకాడికి ఫీజులు వసూలు చేయడం, అనవసర మందులు కొనుగోలు చేసే విధంగా చూస్తున్నారు. రోగి ప్రాణభయంతో గత్యంతరం లేక డబ్బులు దారపోస్తున్నారు. మూడు నెలలకోసారైన వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అక్కడ ఏ విధంగా వైద్యం అందుతుంది.. వసతులు ఉన్నాయా.. లేదా.? వైద్యుడు ఉన్నాడా లేడా.? అనే అంశాలపై అరా తీయాలి. కానీ ఇవేమి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు గల్లీకొకరు పుట్టుకొస్తున్నారు. బృందం ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తాం జిల్లాలోని ఆన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో వంద ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. వీటిన్నింటీని తనిఖీ చేస్తాం. ఇందుకు బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తు చేసుకున్న వైద్యులు ఉన్నారా లేదా.? అర్హత గల ల్యాబ్ టెక్నిషీయన్ ఉన్నారా.. లేదా? అనేది చూస్తాం. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలి. గ్లూకోజ్‌లు, ఇంజక్షన్లు వేయకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు ఉన్న వారే ఆస్పత్రులు నిర్వహించాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో అనవసర టెస్ట్‌లు చేస్తున్నారు నాకు ఇటీవల ఆరోగ్యం బాగా లేక ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను. అంతంత మాత్రంగానే జ్వరం ఉన్నా.. అన్ని టెస్ట్‌లు చేశారు. దాదాపు రూ.3వేలు ఖర్చు అయింది. టెస్ట్‌లు అన్నీ నార్మల్‌గా ఉన్నట్లు వచ్చాయి. అనవసరంగా పరీక్షలు నిర్వహించారు. – శ్రీనివాస్, తలమడుగు -
వరవరరావుకి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు నిర్వహించాలి
ముంబై: బీమా కోరెగావ్ కేసులో తలోజా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విప్లవకవి వరవరరావుకి నానావతి ఆసుపత్రికి చెందిన ప్రైవేట్ వైద్యుల బృందంచే వీడియో కన్సల్టేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్ళి నేరుగా వైద్య పరీక్షలు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వైద్య పరీక్షల నివేదికను నవంబర్ 16 లోపు కోర్టుకి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడి ఆరోగ్య పరిరక్షణకు నానావతి ఆసుపత్రి వైద్యుల పరీక్షలే ఉపయోగకరమని కోర్టు అభిప్రా యపడింది. వరవరరావు బెయిలు విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. వరవరరావు భార్య హేమలత, తన భర్తని మెరుగైన చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి మార్చాలని, ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్వతంత్ర వైద్యుల ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని, వరవరరావుకు ఉన్న ఆరోగ్య సమస్యలరీత్యా ఆయన్ను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, అతను జైలులోనే చనిపోయే ప్రమాదం ఉన్నదని వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర వ్యాఖ్యానించారు. -
కరోనా వార్... ప్రైవేటు రె‘ఢీ’!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌తో పోరాడేందుకు ప్రైవేటు వైద్యులు రె‘ఢీ’ అయ్యారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా బాధితులకు చికిత్సలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా సేవలకు అనుమతి ఇచ్చింది. జనరల్ ఫిజీషియన్, పల్మనాలజీ, హృద్రోగ వైద్యుడు, ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులతో పాటు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు...అవసరమైన పడకలు, ఐసీయూలో వెంటిలేటర్ ఫెసిలిటీ ఉన్న ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లకు చికిత్సలు చేసే అవకాశం కల్పించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 39 ఆస్పత్రులు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి, 350కిపైగా పడకలను సమ కూర్చాయి. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపుతున్న విషయం తెలిసిందే. (నగరానికి చేరుకున్నఢిల్లీ స్పెషల్ ట్రైన్) ఇప్పటి వరకు ఇవి కేవలం శాంపిల్స్ సేకరణకే పరిమితమయ్యాయి. ఇకపై పూర్తిస్థాయి వైద్యసేవలను అందించనున్నాయి. రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో అదనపు పడకలను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నాయి. అయితే కరోనా చికిత్సలకు ఏ ఆస్పత్రిలో ఎంత ఛార్జీ వసూలు చేయాలి? వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరాలను కూడా కరోనా ఖాతాలో జమ చేసి..వారి నుంచి భారీగా వసూలు చేసే అవకాశమూ లేకపోలేదు. (గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్ మృతి ) ఇతర పేషెంట్లు రారంటూ కొత్త పేచీ ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులను చేర్చుకునేందుకు సంశయిస్తున్నాయి. ఆస్పత్రిలో కరోనా వైరస్ బాధితులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డు, పడకలు ఏర్పాటు చేసినప్పటికీ...సాధారణ రోగులు భయపడే అవకాశం ఉంది. ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లు ఉంటే ..ఇతర పేషెంట్లు ఆస్పత్రికి వచ్చేందుకు వెనుకాడుతుంటారు. దీంతో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన రోగులను ఇన్పేషెంట్లుగా చేర్చుకునేందుకు వెనుకాడుతున్నట్లు తెలిసింది. అదనపు ఖర్చులెలా? అంతేకాదు సాధారణ చికిత్సలతో పోలిస్తే కరోనా చికిత్సలు కొంత ఖరీదుతో కూడినవి. సాధారణ జ్వరంతో వచ్చిన పేషెంట్‌కు అయిన ఖర్చుతో పోలిస్తే ..కరోనా బాధితుని చికిత్సల ఖర్చు 20 నుంచి 30 శాతం అదనంగా ఉంటుంది. బిల్లింగ్ విషయంలో ఒక్కో ఆస్పత్రి ఒక్కో రకంగా వ్యవహరిస్తుంటాయి. కొన్ని ఆస్పత్రుల్లో ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్‌లో చికిత్సకు అవకాశం ఉంది. అయితే ఆయా ఇన్సూరెన్స్ సంస్థలు కేవలం మందులు, రూమ్ రెంట్, సర్జరీ6 ఛార్జీలే చెల్లిస్తుంటాయి. కరోనా పేషెంట్లకు చికిత్స అందించే వైద్యులు ఇతర సిబ్బంది పీపీఈ కిట్స్ తప్పని సరిగా వాడాల్సిందే. ఒక్కో కిట్ ధర రూ.వెయ్యికి పైగా ఉంటుంది. ఇలా ఒక్కో రోగికి రోజుకు ఐదు కిట్స్ అవసరం అవుతుంటాయి. వీరు త్వరగా కోలుకోవాలంటే డ్రైఫ్రూట్స్ సహా ఇతర పౌష్టికాహారం అందజేయాల్సిందే. సాధారణ భోజనంతో పోలిస్తే ఈ డ్రైఫ్రూట్స్ ఖర్చు ఎక్కువ. డిస్పోజల్స్ సహా ఫుడ్డ్ ఐటెమ్స్ ఆరోగ్య బీమా పథకంలో వర్తించవు. ఈ అదనపు ఖర్చులను రోగులే భరించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ సోకిన బాధితుడికి రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స అందించాల్సి ఉంటుంది. రోగి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జై ఇంటికి వెళ్లే వరకు వైద్యం ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఆరోగ్యశ్రీ, ఇతర లబ్ధిదారులపై స్పష్టత కరువు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మే 12వ తేదీ వరకు నగరంలో ప్రభుత్వం గుర్తించిన 39 ప్రైవేటు ఆస్పత్రుల్లో (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్–ఎస్ఏఆర్ఐ) 2601 మంది అనుమానితులు చేరారు. వీరి నుంచి స్వాబ్స్ సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు నిమ్స్‌కు పంపారు. వీరిలో 102 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నెగిటివ్ వచ్చిన వారిలో ఇతర సమస్యలుంటే...ఇన్పేషెంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందించారు. ప్రభుత్వం ప్రస్తుతం ఆయా ఆస్పత్రులన్నింటిలోనూ ఇన్‌పేషెంట్ చికిత్సలకు అనుమతి ఇచ్చింది. అయితే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందాలా? ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలా? అనేది రోగి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రులు కూడా రోగి అంగీకారం మేరకే నడుచుకోవాలి. పేద, మధ్య తరగతి రోగులతో పాటు సీహెచ్ఎస్, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఇఎస్ఐ, ఆర్టీసీ, ఇతర ప్రభుత్వ, అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు అందించే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. -
కరోనా మూడో దశకు చేరుకుంటే?
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశకి చేరుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల న్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ప్రా రంభించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. కరోనా మూ డో దశలోకి వస్తే గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థా యి కరోనా ఆసుపత్రిగా మార్చేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా చికిత్సకే వినియోగించేలా తయారు చేయాలని చెప్పారు. ఇప్పటికే గాంధీలో చే యాల్సిన ఆపరేషన్లను ఉస్మానియా ఆసుపత్రి లో చేస్తున్నారన్నారు. నెలాఖరు వరకు మిగ తా అన్నీ విభాగాలనూ తరలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డిని ఆదేశించారు. కింగ్‌కోఠి ఆసుపత్రిని కూడా కరోనా చికిత్సలకు సిద్ధంగా ఉంచాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రుల సేవలనూ వినియోగిం చుకొనేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలిపారు. మూడో దశలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు షట్‌డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుండి వచ్చిన వారిని, వారితో కలసిన వారిని పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వొద్దని ఆదేశించారు. కావాల్సిన వైద్య పరికరాలు అన్నీ సమీకరించుకోవాలన్నారు. ఇద్దరు డాక్టర్లకు కరోనా వైరస్ గురువారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో 44 మందికి కరోనా వైరస్ సోకిందన్నారు. అందరూ కోలుకుంటున్నారన్నారు. గురువారం ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా, అందులో ఇద్దరు ఒక ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ఉన్నారన్నారు. వారిద్దరూ ఇటీవల దేశంలోనే పలు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. వీరిని కలసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా గమనించాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని మంత్రి కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేవారు, ఆశ వర్కర్లు ఎక్కడ పని చేసే వారు అక్కడే ఉండేలా చూడాలని, సెలవులు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం ఉన్న చోట్ల సిబ్బందికి భోజన, రవాణా సదుపాయం కల్పించాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి డేటా ఉండాలని చెప్పారు. వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగితే అవసరమయ్యే ఆసుపత్రులు, సిబ్బంది, వైద్య పరికరాలపై చర్చించారు. కరోనా రోగుల సంఖ్య పెరిగితే ముం దుగా అవసరమయ్యేది పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అన్నారు. వాటిని సాధ్యమైనన్ని ఎక్కువ కొని పెట్టుకోవాలని ఆదేశించారు. తక్కువ ధరకు నాణ్యమైన పరికరాలు కొనుగోలు చే యాలని ఆదేశించారు. ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు సమకూర్చుకోవాలన్నారు. డీఆర్డీవోలో వెంటిలేటర్ల తయారీకి కేంద్రం అనుమతివ్వాలి.. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశా ఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి ఈటల రాజేందర్ హాజరయ్యారు. కరోనా రోగులకు చికిత్స సమయంలో ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్స్, వెంటిలేటర్లు, ఐసీయూ పరికరాలను హైదరాబాద్‌లోని డీఆర్డీవో, బీడీఎల్, ఈసీఐఎల్ సంస్థల్లో తయారు చేయడానికి అనుమతినివ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఈటల తెలిపారు. ఎన్–95 మాస్క్‌లు, పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్స్, వెంటిలేటర్స్ అందించాలని కోరినట్లు తెలిపారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. కోవిడ్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సం తృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రెండు వారాలు కీలకమైనవన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని అబ్జర్వేషన్లో ఉంచాలని, హోమ్ క్వారంటైన్ నుంచి బయటికి రాకుండా చూడాలని కోరారు. ఆశ వర్కర్లకు ఇన్సూరెన్స్ చేసినట్లు ప్రకటించారు. వైద్య సిబ్బందికి వైరస్ సోకకుండా చూసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. -
రోగిని తీసుకొస్తే ‘నీకింత... నాకింత’
‘‘కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్‌లోని ఓ హాస్పిటల్‌కు జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన వ్యక్తిని బంధువులు, ఆర్ఎంపీ సహకారంతో తీసుకొచ్చారు. కాలు తొంటిభాగం విరగడంతో బాల్ రీప్లేస్మెంట్ చేయాలన్నాడు డాక్టర్. వెంటనే హాస్పిటల్ నిర్వాహకుడు రంగప్రవేశం చేశాడు. రూ.2 లక్షల ప్యాకేజీ కింద బేరం కుదిరింది. అడ్వాన్స్ చెల్లించి ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్ పీఆర్వో అక్కడికక్కడే 30 శాతం కమీషన్ రూ.60 వేలు ఆర్ఎంపీకి ఇచ్చేశాడు.’’ ‘‘ఓ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ రిఫరెన్స్‌తో వచ్చిన రోగి నుంచి ఓ ప్రైవేటు హాస్పిటల్ వైద్యం కోసం లక్ష రూపాయలు వసూలు చేసింది. అయితే ఆర్ఎంపీకి ఇవ్వాల్సిన 30 శాతం కమీషన్ ఇవ్వలేదు. దీంతో సదరు ఆర్ఎంపీ సమస్యను వాళ్ల అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హాస్పిటల్ యాజమాన్యం కొంత మొత్తాన్ని కమీషన్‌గా చేతిలో పెట్టి పంపించారు. తనకు రావలసిన పూర్తి కమీషన్ కోసం ఆయన చాలా కాలమే పోరాడాడు.’’ ‘‘1980–90 దశకంలో పీపుల్స్‌వార్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మెడికల్ ప్రాక్టీషనర్లుగా రూ.లక్షల్లో సంపాదించిన వాళ్లు ఉమ్మడి కరీంనగర్లో ఉన్నారు. వైద్యంతోపాటు గర్భ విచ్చిత్తి స్పెషలిస్టుగా రూ.లక్షలు సంపాదించిన ఓ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ కరీంనగర్‌లోని ఓ సినిమా థియేటర్ సమీపంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాడు. ఈ అబార్షన్ స్పెషలిస్టు హాస్పిటల్‌పై గతంలో దాడి కూడా జరిగింది. కన్సల్టెంట్ డాక్టర్లతో, ఎలాంటి సర్టిఫికెట్ లేకపోయినా తాను కూడా వైద్యం చేస్తూ ఇప్పటికీ ‘క్యాష్పిటల్’ను నిర్వహిస్తున్నాడు. తాను వచ్చిన దారిలోనే మెడికల్ ప్రాక్టీషనర్లనే ఏజెంట్లుగా చేసుకుని వైద్య వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.’’ సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలో హాస్పిటల్స్ డబ్బులు సంపాదించి పెట్టే ‘క్యాష్’పిటల్స్గా మారాయి. వైద్యం పక్కా వ్యాపారంగా తయారైంది. వైద్యుడే ఆసుపత్రి స్థాపించి రోగులకు సేవలు అందించే కాలం నుంచి వైద్యున్ని నియమించుకుని, ఆర్ఎంపీలు, అంబులెన్స్ డ్రైవర్లు, పీఆర్వోల సాయంతో వ్యాపారం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. రోగం లేకపోయినా.. సృష్టించి వైద్యం చేసే స్థాయికి కరీంనగర్‌లోని ‘కాసు’పత్రులు దిగజారాయి. రోగి బాధను, భయాన్ని ‘క్యాష్’ చేసుకునే వ్యాపారం ప్రణాళికాబద్ధంగా సాగిపోతోంది. కొత్తగా ఏర్పాటైన దవాఖానాల నుంచి అంతో ఇంత పేరున్న హాస్పిటళ్ల వరకు గ్రామాలు, కోల్‌బెల్ట్ ఏరియాలోని మెడికల్ ప్రాక్టీషనర్ల పైనే ఆధారపడి వ్యాపారం సాగిస్తున్నాయి. రోగి చెల్లించే ఫీజుల నుంచి 30 నుంచి 60 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నాయి. చివరకు ఒకటి రెండు కార్పొరేట్ ఆసుపత్రులు సైతం కమీషన్లు ఇచ్చి రోగులను ఆసుపత్రులకు రప్పించుకునే దయనీయ స్థితి కరీంనగర్లో నెలకొంది. రోగిని తీసుకొస్తే నీకింత... నాకింత అనే ధోరణిలో వైద్య వ్యాపారం సాగిపోతోంది. రోగుల డబ్బుతో హైఫై బతుకులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ(రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్) నుంచి పట్టణాల్లోని పెద్ద డాక్టర్ల వరకు పేద, మధ్య తరగతి రోగుల నుంచి వసూలు చేసే డబ్బులతోనే బతుకుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇన్‌పేషంట్‌గా చేరినప్పుడే “రెఫర్ బై’ అనే కాలంలో సదరు మెడికల్ ప్రాక్టీషనర్ పేరును రాసుకుని వసూలు చేసిన మొత్తం నుంచి మాట్లాడుకున్న కమీషన్ ఇవ్వడం పరిపాటిగా మారింది. కరీంనగర్ జిల్లాలో జరిగే వైద్య వ్యాపారంలో మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పేషెంట్లదే సింహభాగమని చెప్పవచ్చు. ఆయా ప్రాంతాల ఆర్ఎంపీలు నేరుగా కరీంనగర్‌లోని తమకు కమీషన్లు ఇచ్చే ఆసుపత్రులకు బలవంతంగా పంపిస్తున్నారు. ప్రొఫెషనల్ డాక్టర్ కూడా సంపాదించలేనంత సొమ్మును కేవలం రెఫరల్ కేసుల ద్వారా ఆర్ఎంపీలు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో డాక్టర్లను నియమించుకుని సొంతంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకున్నవారు కూడా ఉన్నారు. దీంతో కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు పూర్తిగా ఆక్రమ మార్గంలోనే పయనిస్తున్నాయి. ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లకు లక్షల రూపాయల వేతనాలు ఇస్తూ పోషిస్తున్నాయి. ఆ ఖర్చును సైతం రోగులపై రుద్దుతూ.. మరో వైపు డాక్టర్లకు సైతం రోగుల సంఖ్య పెంచేలా టార్గెట్లు నిర్దేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాలు, సింగరేణి కోల్‌బెల్ట్‌లోని ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్ఎంపీల ద్వారా వచ్చిన రోగుల నుంచి వసూలు చేసిన సొమ్మును అందరూ కలిసి పంచుకుంటున్నారు. ఇదంతా పెద్ద మాఫియాగా నడుస్తున్న వ్యవహారం. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో వీరి వ్యాపారం దిగ్విజయంగా సాగిపోతోంది. మెడికల్ టెర్మినాలజీ తెలియకున్నా... అక్షరం ముక్క మెడికల్ టెర్మినాలజీ రాని ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ల పేరుతో చలామణి అవుతున్నారు. ఇంటికి వచ్చి మందులు ఇచ్చే మెడికల్ ప్రాక్టీషనర్ల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. కమీషన్లు, గిఫ్టులు, వాటాలు, స్టార్ హోటళ్లలో విందులు, విదేశీయానాలు ఇలా చెప్పుకుంటూ పోతే... కొందరు ఆర్ఎంపీలు అనుభవిస్తున్న రాజభోగం అంతా ఇంతా కాదు. కరీంనగర్‌తోపాటు కొన్ని పట్టణాల్లోని ప్రైవేటు, కార్పొరేట్‡ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలకు 20 నుంచి 60 శాతం వరకు హాస్పిటళ్ల స్థాయిని బట్టి కమిషన్లు ఇచ్చి మరీ రోగులను ఆసుపత్రులకు రప్పించుకుంటున్నా రు. ఇలాంటి కమీషన్లకు ఆశపడుతున్న ఆర్ఎంపీలు రోగులను భయపెట్టి మరీ వారు చెప్పిన ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నా చితకా వైద్యం చేసుకునే ప్రాక్టీషనర్లు ప్రైవేటు ఆసుపత్రులను, వైద్యులను శాసించే స్థాయికి ఎదిగారు. అవసరం లేకపోయినా రోగుల్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించి అడ్డగోలు ఆపరేషన్లు చేయిస్తున్నారు. చిన్నపాటి జబ్బులకు కూడా రకరకాల పరీక్షలు చేయించి తమ వాటా తీసుకుంటున్నారు. ఇటీవల ఆర్ఎంపీలు ఏర్పా టు చేస్తున్న క్లినిక్‌ల సంఖ్య పెరుగుతోంది. వీళ్లకు కమీషన్లు ఇచ్చేందుకు ప్రతీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీఆర్వో (పేషంట్ రిలేషన్ ఆఫీసర్)ను ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఆపరేషన్‌కు ఎంత కమీషన్ ఇవ్వాలి, ఏ ఆర్ఎంపీలకు ఎంత ముట్టజెప్పాలో వీరు చూసుకుంటారు. అప్పుడప్పుడూ గ్రామాలకు వెళ్లి ఆర్ఎంపీలతో కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. జిల్లా వైద్యాధికారులు ఎవరూ పీఎంపీ, ఆర్ఎంపీల ద్వారా సాగుతున్న దందాపై కనీసం దృష్టి పెట్టడం లేదు. కోల్‌బెల్ట్ ఏరియాలో మాఫియాగా సింగరేణి ప్రాంతంలో మెడికల్ ప్రాక్టీషనర్ల దందా మాఫియాగా తయారైంది. బొగ్గు గనులు అధికంగా ఉన్న పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖ ని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీ, బేగంపేటతోపాటు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, సీసీసీ, రవీంద్రఖని, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, ఆసిఫాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మెడికల్ ప్రాక్టీస్ ద్వారా లక్షల్లో సంపాదించిన వారు ఉన్నారు. గని కార్మికుల కోసం సింగరేణి ఏరి యా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా మెడికల్ ప్రాక్టీషనర్లేనే ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ప్రమాదాల నుంచి పెద్ద రోగాల వరకు సింగరేణి ఉచితంగా చికిత్స చేయించే అవకాశాలను కాదని, కార్మికులను ఏమార్చి చికిత్స కోసం ఆర్ఎంపీ, పీఎంపీలు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పంపిస్తున్నారు. సింగరేణి నుంచి రిఫరల్ కేసులుగా వచ్చే రోగులకు సంబంధించి అధిక మొత్తంలో కమీషన్లు ముట్ట జెపుతున్నాయి కరీంనగర్ హాస్పిటళ్లు. వేల మంది మెడికల్ ప్రాక్టీషనర్ల ద్వారా... కరీంనగర్ జిల్లాలో 259 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కరీంనగర్ పట్టణంలోనే 200 వరకు చిన్నా, పెద్ద ఆసుపత్రులున్నాయి. వీట న్నింటికీ అనుసంధానంగా సుమారు 3 వేల మంది ఆర్ఎంపీలు పనిచేస్తున్నారు. గ్రామాల్లో జ్వరం, దగ్గు, దమ్ము, ప్రాథమిక చికిత్స వరకు ఆర్ఎంపీ, పీఎంపీలు చేసే వైద్యంపై అభ్యంతరాలు ఏమీ ఉండవు. నిబంధనల ప్రకారం ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మినహా ఆపరేషన్లు చేయడం, స్టెరాయిడ్స్ ఇవ్వడం, యాంటీ బయోటిక్స్ వాడకూడదు. కరీంనగర్ గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల వంటి పట్టణాల్లో ప్రైవేటు ఆసుపత్రులకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే సాధనాలుగా వీరు మారిపోయారు. -
మెడికల్ కాలేజీలకు విజిటింగ్ ఫ్యాకల్టీ
సాక్షి, హైదరాబాద్: ► డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి.. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్‌గా ఉన్నారు. అనేక అంతర్జాతీయ మెడికల్ సంస్థల్లో సభ్యులుగా, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిత్యం అంతర్జాతీయ వైద్య వేదికలపై ప్రసంగిస్తుంటారు. అధునాతన వైద్యరంగంలో నూతన పంథాలను ప్రవేశపెట్టారు. ► డాక్టర్ సోమరాజు.. కేర్ వ్యవస్థాపకుడు. వైద్య రంగంలో ఎంతో అనుభవం గడించారు. ప్రొఫెసర్‌గా సేవలందించారు. అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని అందించారు. అంతర్జాతీయస్థాయిలో వైద్య వేదికలపై సెమినార్లు ఇచ్చారు. ► డాక్టర్ గురువారెడ్డి.. సన్‌షైన్ వ్యవస్థాపకుడు. వైద్యరంగంలో వచ్చిన అనేక మార్పులను అందిపుచ్చుకొని ఆసుపత్రిని తీర్చిదిద్దారు. దేశవిదేశాల్లో వైద్యరంగంలో వచ్చిన మార్పులు ఒడిసిపట్టుకున్నారు. ఇలాంటి ప్రముఖులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. అధునాతన వైద్య పరిజ్ఞానా న్ని, పరికరాలను తమ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగా వచ్చే ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులకు విజిటింగ్ ఫ్యాకల్టీగా వీరే బోధిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ఆలోచనను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు చెందిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) ఆచరణలోకి తెచి్చంది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ప్రైవేటు రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులను ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ‘విజిటింగ్ ఫ్యాకలీ్ట’గా నియమించుకునే వెసులుబాటు కలి్పస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండే ప్రముఖ వైద్యులను కూడా నియమించుకోవడానికి అనుమతించింది. ప్రస్తుతం దేశంలో మెడికల్ కాలేజీల్లో విజిటింగ్ ఫ్యాకల్టీ అనే అంశం లేదు. 30 ఏళ్ల క్రితం విజిటింగ్ ఫ్యాకల్టీ వ్యవస్థ ఉండగా, దాన్ని ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టారు. ప్రైవేట్ లేదా ప్రభుత్వ మెడికల్ కాలేజీ విజిటింగ్ ఫ్యాకలీ్టని నియమించుకోవచ్చు, కానీ ఈ నియామకం ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల సంఖ్యలో 50 శాతానికి మించకూడదు. పెరగనున్న ప్రతిష్ట.. రాష్ట్రంలో 21 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిల్లో ఎంబీబీఎస్ సీట్లు 4,790 ఉండగా, పీజీ మెడికల్ సీట్లు 1,400 ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 2,358 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా, 1,051 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 1,307 ఖాళీలున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చాలాచోట్ల బోధనా సిబ్బంది సామర్థ్యంపై విమర్శలున్నాయి. రోజువారీ వైద్యరంగంలో వస్తున్న మార్పులను, అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవట్లేదన్న విమర్శలున్నాయి. దీంతో వైద్య విద్య నాసిరకంగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని మెడికల్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపట్లేదు. దీంతో ప్రముఖ ప్రైవేటు వైద్యులను విజిటింగ్ ఫ్యాకలీ్టగా తీసుకుంటే ఆయా కాలేజీల్లో వైద్య బోధన మెరుగుపడుతుందని ఎంసీఐ ఉద్దేశంగా చెబుతున్నారు. ప్రముఖ వైద్యుల పేర్లను ఆయా కాలేజీల వెబ్సైట్లలో పెట్టడం ద్వారా వాటి ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తున్నారు. నెలకు నాలుగు క్లాసులు, ఒక్కో క్లాసు మూడు గంటలు ఉండేలా చేయాలని బీవోజీ నిర్ణయించింది. విజిటింగ్ ఫ్యాకలీ్టకి ఎంత పారితోíÙకం ఇవ్వాలనేది ఆయా కాలేజీల ఇష్టానికే వదిలేశారు. విజిటింగ్ ఫ్యాకల్టీ తప్పనిసరిగా పీజీ పూర్తి చేసి, సంబంధిత స్పెషాలిటీలో కనీసం 8 ఏళ్లు అనుభవం కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 70 సంవత్సరాలుగా నిర్ధారించారు. విజిటింగ్ ఫ్యాకల్టీని మొదట ఏడాది కాలానికి నియమిస్తారు. తర్వాత మరో ఏడాది పొడిగించుకోవచ్చు. మెడికల్ కాలేజీ సీట్లను కాపాడుకోవడంలో విజిటింగ్ ఫ్యాకలీ్టని పరిగణనలోకి తీసుకోరు. వైద్యవిద్య ప్రమాణాలు పెరుగుతాయి ప్రైవేటు రంగంలో ప్రముఖులైన దేశ విదేశీ వైద్యులను మెడికల్ కాలేజీల్లో విజిటింగ్ ఫ్యాకలీ్టగా నియమించడం వల్ల వైద్యవిద్య నాణ్యత పెరుగుతుంది. అధునాతన పరిజ్ఞానాన్ని విద్యార్థులు, రెగ్యులర్ ఫ్యాకలీ్టకి కూడా అందించడానికి వీలవుతుంది. ఆయా మెడికల్ కాలేజీల ప్రతిష్ట కూడా పెరుగుతుంది. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంతోమంది ప్రముఖులున్నారు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వైద్య విద్య నాణ్యత మరింత పెరుగుతుంది. డాక్టర్ సోమరాజు, డాక్టర్ శాంతారాం, డాక్టర్ మానస్ పాణిగ్రాహి, డాక్టర్ బాలాంబ వంటి ప్రముఖ వైద్యులు విజిటింగ్ ఫ్యాకల్టీగా వస్తే ఆయా స్పెషాలిటీల్లో విద్యార్థులకు అత్యంత నాణ్యమైన వైద్య విద్య అందించడానికి వీలు కలుగుతుంది. – డాక్టర్ పుట్టా శ్రీనివాస్, డైరెక్టర్, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ -
వైద్యులంటే నెత్తుటి వ్యాపారులా?
విశ్లేషణ ప్రయివేటు వైద్యశాలలు పాటిస్తున్న భయానక రహస్య వ్యవహారాల వల్ల రోగికి స్వయం నిర్ణయ స్వేచ్ఛ లేకుండా పోతోంది. రాజ్యాంగం ఇచ్చిన బతుకు హామీ కొందరు బాగా చదువు‘కొన్న’ డాక్టర్ల దుర్మార్గాలకు బలైపోతోంది. వైద్యం ప్రస్తుత జీవనశాస్త్రం కాదు. వైద్యులు ధన్వంతురులూ కాదు. చికిత్స జీవన్మరణ సమస్య. ప్రభుత్వ దవాఖానాల్లో చచ్చినా వైద్యం దొరకదు. ప్రయివేటు నర్సింగ్ హోమ్స్‌లో చచ్చింతరువాత కూడా వైద్యమే అని ఒక విమర్శ. కోటికొక్కరు తప్ప మిగిలిన డాక్టర్లు కుత్తుకలు కోసే నెత్తురు వ్యాపారులనీ కత్తుల రత్తయ్యల కన్న తీసిపోని వారేమీ కాదని తెలుసుకోవాలి. చికిత్సార్థులై వచ్చిన వారు సజీవులైన నాగరికులనీ, వారి డబ్బుతో బతికే డాక్టర్లు, వారి స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించాల్సి ఉంటుందని వారికి ప్రతిరోజూ పాఠాలు చెప్పవలసిన దుస్థితి ఉంది. వారి సమ్మతి పొందడం అంటే అనస్తీషియా ఎక్కించే ముందో ఆపరేషన్ టేబుల్ మీదో కాగితాల మీద బరబరా సంతకాలు గీకమనడం కాదు. పూర్తిగా సమస్య వివరించి, చికిత్స వివరాలుచెప్పి, పరిణామాలు విశదం చేసి, ప్రత్యామ్నాయాలు ఉంటే చెప్పి, తరువాత హితులతో సంప్రదించి, ఆలోచించి చెప్పే సమ్మతిని చట్టబద్ధమైన సమ్మతి అంటారు. స్వయం నిర్ణయాధికార స్వేచ్ఛ అంటే. వారూ వారూ మాట్లాడుకుని కత్తులు ప్రయోగించడం రోగి స్వేచ్ఛ అనిపించుకోదు మన దేశంలో అస్పష్ట చట్టాల గురించి డాక్టర్లకే తెలియదు. మెడికల్ కౌన్సిల్ చట్టం కింద చేసిన కొన్ని రెగ్యులేటరీ నియమాల ప్రకారం రోగికి లేదా అతని బంధువులకు అడిగిన 72 గంటలలోగా మొత్తం చికిత్స రికార్డులు ఇవ్వాలని డాక్టర్లను నిర్దేశించారు. అంటే ప్రయివేటు డాక్టర్లయినా ప్రభుత్వ డాక్టర్లయినా సరే రోగి చికిత్సావివరాలు తమ సొమ్ముగా భావించి రహస్యాలు దాచి రోగులకు ఇవ్వకుండా ఏడిపించే అధికారం లేదు. అది కూడా సమాచారం నిర్వచనం కిందికే వస్తుంది. రోగ నిర్ధారణ పరీక్షా నివేదికలు, ఎక్స్ రేలు, తదితర స్కాన్ రిపోర్టులు, డాక్టరు ఇచ్చిన సలహాలు, రాసిన మందులు వాటి డోసులు, చికిత్స వివరాలు అన్నీ ఈ సమాచార నిర్వచనం కిందకు వస్తాయి. నిశాప్రియ భాటియా వర్సెస్ భారత మానవ ప్రవర్తనా పరిశీలనా సంస్థ కేసులో, చికిత్స పొందిన వ్యక్తికి ఆ చికిత్స వివరాలు తెలుసుకునే హక్కు ఉందని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్లు, సమాచార హక్కు చట్టం, వినియోగ దారుల చట్టం ప్రకారం కూడా ఈ హక్కును అమలు చేయవలిసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్ర సమాచార కమిషన్ CIC/AD/A/2013/001681-S కేసులో 23.4.2014న వివరించింది. ప్రతి ప్రయివేటు, ప్రభుత్వ వైద్యుడు, వైద్యశాల కూడా రోగులకు ఎప్పడికప్పుడు పూర్తి వివరాలు ఇవ్వడానికి ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరి రికార్డును వారుగానీ వారి శ్రేయోభిలాషులు కాని అడిగి తీసుకోవచ్చని ఈ తీర్పు వివరించింది. మరొకరి చికిత్సా వివరాలు ఇవ్వవచ్చా లేదా అనే ప్రశ్నను మిస్ జెజె వర్సెస్ భారత మానవ ప్రవర్తనా పరిశోధనా సంస్థ కేసులో విచారించారు. తన భర్తకు సంబంధించిన చికిత్స వివరాలు కావాలని భార్య అడిగింది. అతను మానసిక రోగంతో నరకం చూపుతున్నాడనీ, రకరకాలుగా వేధిస్తున్నాడని, అసలు ఈయనగారికి ఏం జబ్బుందో తనకు తెలియజేయాలని ఆమె కోరింది. ఈ భర్త అతని బంధువులు ఇతనికి ఉన్న జబ్బు సంగతి ముందే చెప్పకుండా ఆరోగ్యవంతుడని నమ్మించి పెళ్లికి ఒప్పించారని, భార్య, ఆమె తమ్ముడు సమాచార కమిషన్‌కు వివరించారు. ఆ వ్యక్తి మానసిక రోగాలకు సంబంధించి తమవద్ద ఉన్న సమాచారం ఒక ధర్మకర్తకు ఇచ్చినటువంటి సమాచారమనీ కనుక ధర్మకర్తలుగా ఆ సమాచారం వెల్లడిచేయజాలమని వైద్యసంస్థ అధికారులు నిరాకరించారు. మొదటి అప్పీలు అధికారి కూడా ఇదే తీర్పుచెప్పారు. భర్తకు చికిత్సలేని రోగం ఉంటే భార్య విడాకులు తీసుకోవచ్చని హిందూవివాహచట్టం 1955లో నిర్దేశించారు. రోగం ఏమిటో తెలియకుండా విడాకులు సాధించలేరు. మానసిక శారీరక రోగాలున్న భర్త వల్ల భార్య ప్రాణాలకు (లేదా భార్య వల్ల భర్త ప్రాణాలకు) ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు పరిష్కారం విడాకులే. పెళ్లికిముందే ఆరోగ్య వివరాలు వధూవరులు పరస్పరం చెప్పుకోవాలి. రోగాలు చెప్పకుండా పెళ్లిచేస్తే ఆ ఒప్పందం చెల్లదు. జీవన హక్కు వివాహ హక్కు, స్వయం నిర్ణయ హక్కు ఆరోగ్య సమాచారంపైన ఆధారపడి ఉంటాయి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ -
డాక్టర్లకు నజరానా
‘కేసీఆర్ కిట్’ పథకంలో ప్రభుత్వ వైద్యులకు ప్రోత్సాహకం సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్ పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు డాక్టర్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రసవం చేసే వైద్యులకు రూ. 500.. నర్సులు, ఇతర సహాయక సిబ్బందికి రూ. 500 ఇవ్వనుంది. గిరిజన ప్రాంతా ల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో రూ.1,500 ఇవ్వాలని నిర్ణ యించిన ప్రభుత్వం.. అందులో వైద్యులకు రూ.500, సిబ్బందికి రూ.వెయ్యి ఇవ్వనుంది. పథకంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ. 12 వేలు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రసవం తర్వాత బాలింతకు, శిశువుకు 16 రకాల వస్తువులతో కిట్ ఇవ్వనున్నారు. ప్రోత్సాహకాలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేట్ వైద్యుల సేవలు.. వచ్చే నెల 3న కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారం భించనుంది. పథకం కింద ప్రసవం చేయించుకోడానికి ఇప్పటికే 2 లక్షల మందికిపైగా గర్భిణులు పేర్లు నమోదు చేసుకున్నారు. పథకానికి పెద్దఎత్తున స్పందన వస్తుం డటం.. ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రైవేట్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఒక్కో పీహెచ్సీ, సీహెచ్‌సీకి రూ. 5 లక్షల వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారని అధికారులు చెబుతున్నారు. దాదాపు 500 మందికిపైగా ప్రైవేట్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్న ప్రభుత్వం.. వారిని గుర్తించే బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. అయితే ఈ ప్రైవేట్ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి గర్భిణులకు ప్రసవం చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. -
నెలకు ఒక్క రోజు సేవలందించండి
ప్రయివేటు వైద్యులకు కలెక్టర్ వినతి కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : పేద గర్భిణిలకు నెలకు ఒక్కసారి వైద్య సేవలందించాలని ప్రయివేటు గైనకాలజిస్టులకు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి మాతృత్వ అభియాన్ పథకం అమలులో భాగంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రయివేటు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులతో కలెక్టర్ గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తల్లి – పిల్లల మరణాలు సంభవించకూడదని ప్రధాన మంత్రి మాతృత్వ అభియాన్ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. దేశంలోని ఏ ఒక్క గర్భిణీ కూడా ఎలాంటి ముందస్తు పరీక్షలు లేకుండా ప్రసవానికి వెళ్లకూడదనేది ఈ పథకం ఉద్దేశమన్నారు. జిల్లాలో 38 ప్రభుత్వ వైద్యశాలల్లో స్కానింగ్ యంత్రాలున్నాయని, చాలాచోట్ల గైనకాలజిస్టుల సహకారం కోరుతున్నామన్నారు. ప్రతి నెలా 9వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ వైద్య శాలలోగర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు వివరించారు. ఆ రోజులో వీలు కల్పించుకుని ఎంపిక చేసుకున్న ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి వైద్య సేవలందించాలని కోరారు. పేద గర్భిణిలకు సేవలందించేందుకు రాజమహేంద్రవరం పరిసరాల్లోని గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ గత నెలలో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 4 వేలకు పైగా స్కానింగ్‌లు నిర్వహించినట్టు తెలిపారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్‌కిషోర్, అప్మా అద్యక్షుడు డాక్టర్ శాంతారామ్, ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ శ్రీరామ్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పవన్‌కుమార్, గైనకాలజిస్టులు ప్రమీళ, ఎస్ పద్మ, కె దుర్గ, అన్నపూర్ణ, సుస్మిత, సునీత తదితరులు సమావేశానికి హాజరయ్యారు. -
ప్రైవేట్ వైద్యుల మరో ఘరానా మోసం!
హైదరాబాద్: ప్రైవేట్ వైద్యుల ఘరానా మోసాలు రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. అనారోగ్యం కారణంగా ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు మోసపోయిన ఘటన నగరంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధ జంట వద్ద ఆరోగ్య సమస్యలతో ఎల్బీ నగర్ లోని ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయిస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని మాయ మాటలు చెప్పారు. దీనిలో భాగంగానే వారి వద్ద నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. అయితే దీనిపై మోసపోయామని గ్రహించిన ఆ దంపతులు పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన డాక్టర్లు రాంజీ, నాగభూషణంలుగా తెలుస్తోంది. -
స్వైన్‌ఫ్లూపై భయం వద్దు
⇒ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది ⇒ నేటి నుంచి జిల్లా అంతటా ఫీవర్ సర్వే ⇒ వైద్యులు, మందులు అందుబాటులోనే ఉంచాం ⇒ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రులకు రావాలి ⇒ ప్రైవేటు వైద్యులు రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలి ⇒ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ⇒ కలెక్టర్ రాహుల్ బొజ్జా సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో స్వైన్‌ఫ్లూ తీవ్రత లేదని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, వ్యాధిని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. స్వైన్‌ఫ్లూను అరికట్టేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా బుధవారం ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం నాలుగు స్వైన్‌ఫ్లూ కేసులు మాత్రమే నమోదు అయినట్లు చెప్పారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించిన రోగులను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య బృందాలు ప్రజల వద్దకు వెళ్లి ఇంట్లో ఎవరైనా జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో కొన్నిరోజులుగా బాధపడుతుంటే వారిని పరిశీలిస్తారని తెలిపారు. వారి నుంచి రక్తం నమూనాలను సేకరించడం జరుగుతుందన్నారు. రక్తం నమూనాలను పరిశీలించటం ద్వారా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులను గుర్తిస్తామని తెలిపారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులకు అవసరమైన చికిత్సలు అందజేసేందుకు అన్ని ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రత్యేకంగా స్వైన్‌ఫ్లూ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్యులతో పాటు మందులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రోగులు ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వెంటనే వారికి అవసరమైన చికిత్సలు చేయటం ఆరంభమవుతుందన్నారు. మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. స్వైన్‌ఫ్లూ ఎదుర్కొనే విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రోగులు తమ వద్దకు వస్తే వారిని మూడు, నాలుగు రోజుల పాటు తమ వద్ద ఉంచుకోకుండా వెంటనే ప్రభుత్వాస్పత్రులకు పంపాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు రోగుల సంక్షేమానికి ప్రాధ్యానత ఇవ్వాలని తెలిపారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న రోగులు బయట సంచరించకుండా వెంటనే ప్రభుత్వాస్పత్రులకు రావాలని కలెక్టర్ సూచించారు. స్వైన్‌ఫ్లూను ఎదుర్కోవడంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో వెంటనే యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్యం పనులు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రజలు తమ చుట్టుపక్కల పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా కోరారు. స్వైన్‌ఫ్లూ కారకమైన హెచ్-1, ఎన్-1 వైరస్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుందని, చిన్నపిల్లలు, గర్భిణిలు, వృద్ధులకు వ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉంటుందన్నారు. జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు, గొంతువాపు స్వైన్‌ఫ్లూ లక్షణాలుగా తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చల్లగాలికి దూరంగా ఉండడం వల్ల స్వైన్‌ఫ్లూకు దూరంగా ఉండవచ్చని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న రోగులు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. స్వైన్ ఫ్లూ వచ్చిన రోగులు భయపడవద్దని వైద్యులు నిర్ధేశించిన మందులు వాడితే సరిపోతుందని తెలిపారు. -
వైద్యం షురూ
- ఆందోళన విరమించిన ప్రైవేటు వైద్యులు - జోక్యం చేసుకున్న ఐఎంఏ రాష్ట్రం సంఘం - వైద్యుల సమ్మెపై కలెక్టర్ అసహనం - మృతుల కుటుంబాలను ఎవరు ఓదారుస్తారని ప్రశ్న - వైద్య సహాయం అందక జిల్లాలో మొత్తం ముగ్గురు మృతి నిజామాబాద్ అర్బన్/కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎట్టకేలకు జిల్లాలో ప్రైవేటు వైద్యులు బుధవారం ఆందోళన విరమించారు. ప్రైవేటు ఆస్పత్రులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నాలుగు రోజులుగా ఆస్పత్రులను మూసివేసి డాక్టర్లు వైద్య సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందక జిల్లాలో ముగ్గురు మరణించారు. మరోవైపు వైద్యుల తీరుపై ప్రజాగ్రహం వ్యక్తమయ్యింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వైద్యుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. పరిణామాలు తీవ్ర మవుతుండడంతో ఇండియన్ మెడికల్ ఆసోసియేషన్ రాష్ట్ర సంఘం జోక్యం చేసుకుంది. ఆస్పత్రులను మూసివేసి వెద్య సేవలు బంద్ చేయడం సమంజసం కాదని ఐఎంఏ జిల్లా నేతలకు హితవు పలికింది. తర్జనభర్జన అనంతరం వైద్యులు తమ ఆందోళనను విరమించి వైద్యసేవలను ప్రారంభించారు. అంతకు ముందు వైద్యులు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను కలిసి ప్రైవేటు ఆస్పత్రులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వెద్యులు ఆస్పత్రులను మూసివేసి వైద్యసేవలను నిలిపివేసిన తీరుపై తీవ్రంగా నిరసించారు. ‘‘మీ ఆందోళన వల్ల వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఎవరిది బాధ్యత. వారి కుటుంబ సభ్యులను ఎలా ఓదార్చుతారు. ముందు దీనికి సమాధానం చెప్పండి. ఆ తర్వాతే మాట్లాడండి’’ అంటూ కలెక్టర్ మండిపడ్డారు. ‘‘మీ వల్ల అమాయకులైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చాలు. ఆందోళన విరమించి ఆస్పత్రులు తెరవండి’’ అని సూచించారు. ఐఎంఏ జిల్లా చైర్మన్ రవీందర్‌రెడ్డి, కేంద్ర సంఘం నాయకుడు అప్పారావు, అప్నా రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్‌రెడ్డి, సభ్యులు నరేందర్‌రెడ్డి. వీఎస్.రావు, బాపురెడ్డి, అశోక్‌రెడ్డి కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఆస్పత్రులపై జరుగుతున్న దాడుల గురించి వివరించారు. దీంతో కలెక్టర్ స్పందించారు. దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని చెప్పినా వైద్యులు వినకుండా ఆస్పత్రులను బంద్ చేసి ఆందోళనకు దిగారన్నారు. ప్రైవేట్ వైద్యుల చర్య వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమ్మెకు వెళ్లేముందు మానవతా దృక్పథంతో ఆలోచించి ఉండాల్సిందని పేర్కొన్నారు. వైద్యుల మధ్య విభేదాలుకలెక్టర్ను కలిసి వెళ్లిన అనంతరం వైద్యులు ఐఎంఏ హాల్లో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ర్ట, జిల్లా నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆస్పత్రులు మూసివేసి నిరసన తెలపడం సమంజసం కాదని, వెంటనే నిరసన విరమించాలని రాష్ట్ర నాయకుడు నీలి రాంచందర్ ఇతర వైద్యులను కోరారు. రాష్ట్ర నాయకత్వం ఆయనను సమర్థించింది. దీనిని కొందరు వైద్యులు వ్యతిరేకించారు. దీంతో రాంచందర్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. నిరసన వల్ల జిల్లా యంత్రాంగం, ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుందని గమనించాలని కోరినా కొందరు వైద్యులు వినిపించుకోలేదు. అయితే ఎట్టకేలకు నిరసనను విరమించడానికి వైద్యులు అంగీకరించారు. ఇటు జిల్లా యంత్రాంగం, అటు పలు సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చేసేదేమీలేక వైద్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వివాదం ఇలా మొదలైంది బోధన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రితో మంగళవారం పూజ (20) అనే యువతి ఇద్దరు కవలలకు జన్మనిచ్చి మరణించింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు మైరుగైన వైద్య సేవలు అందించలేదని ఆరోపిస్తూ ఆస్పత్రిపై దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి జనరేటర్‌కు నిప్పు పెట్టారు. మరుసటి రోజే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బొంబాయి నర్సింగ్ హోమ్‌లో అర్షమొలలకు చికిత్స పొందిన సుమలత అనే మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. ఆమె బంధువులు ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి నిప్పంటిచారు. దీంతో సంఘటితమైన వైద్యులు జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఆస్పత్రులను మూసివేసి వైద్యసేవలను బంద్ చేశారు. వీరికి మద్దతుగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సైతం ఒకరోజు వైద్య సేవలను నిలిపి వేశారు. దీంతో జిల్లాలో వేలాది మంది రోగులు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. జిల్లాలో సకాలంలో వైద్య సహాయం అందకపోవడంతో ఓ బాలికతో పాటు ఇద్దరు మృత్యువాత పడ్డారు. -
డబ్బులు లేవని చికిత్స చేయని వైద్యులు
-
ఈహెచ్ఎస్ రేట్లను ఒప్పుకోం
ఉద్యోగుల వైద్య పథకం (ఈహెచ్ఎస్)పై ప్రభుత్వానికి, ప్రైవేటు ఆస్పత్రులకు మధ్య పేచీ మొదలైంది. లక్షలాదిమందికి సంబంధించిన వైద్యంపై తమను సంప్రదించకుండానే ప్యాకేజీ రేట్లను ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం(ఆశా), ఏపీ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్(అప్నా) ఆరోపించాయి. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పాయి. ఆరోగ్యశ్రీ సీఈవోను కలిసి తమ అభిప్రాయాన్నీ చెప్పాయి. ప్రస్తుత రేట్లు తమకు ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతం కాదని పేర్కొన్నాయి. రేట్లు తక్కువగా నిర్ణయించి మెరుగైన వసతులు కల్పించాలంటే తమవల్ల కాదని, ఎలాంటి వైద్యం అందుతుంతో ఉద్యోగులే తేల్చుకోవాల్సి ఉందని తెలిపాయి. దీనిపై రెండ్రోజుల్లో ఆశా, అప్నా సంఘాలు ఓ నిర్ణయానికి రానున్నట్టు తెలిసిం ది. మరోవైపు 1885 జబ్బుల్లో 347 జబ్బుల్ని మౌలిక వసతుల్లేని ప్రభుత్వాసుపత్రులకు బదలాయించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వెలిబుచ్చాయి. ఆరోగ్యశ్రీ నుంచి తొలగిస్తాం: ప్రభుత్వ హెచ్చరిక ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్)ను కార్పొరేట్ ఆస్పత్రులుగానీ, ప్రైవేటు నర్సింగ్ హోంలుగానీ వ్యతిరేకిస్తే వాటిని ఆరోగ్యశ్రీ ప్యానెల్ నుంచి తీసేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి కూడా ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ప్యానెల్లో 340 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ఈహెచ్ఎస్ పరిధిలోకొచ్చే ఉద్యోగులకు సేవలందించాలని, లేకుంటే ఆరోగ్యశ్రీ ప్యానల్ నుంచి తొలగించి, కొత్త ఆస్పత్రులను తీసుకుంటామనడమేగాక.. కొత్త ఆస్పత్రులు దరఖాస్తు చేసుకోవచ్చంటూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. హెల్త్ కార్డులపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. తాము పదేపదే చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వం తాననుకున్న తీరులో కార్డుల జారీకి యత్నిస్తోందంటున్న ఉద్యోగ సంఘాలు.. ఈ అంశంపై మరోసారి సీఎంతో చర్చించాలని నిర్ణయించాయి. -
మంచంపట్టిన పల్లె
నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్: పారిశుధ్యలోపం జిల్లా ప్రజల పాలిట శాపంగా మారింది. విషజ్వరాలు ప్రబలుతుండటంతో పల్లెలకు పల్లెలే మంచం పట్టాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు హాస్పిటళ్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా కొందరు ప్రైవేటు వైద్యులు వైద్యపరీక్షల పేరిట అందినకాడికి గుంజుకుంటున్నారు. అల్పపీడనాలు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల కాలంలో తరచూ వర్షం కురుస్తోంది. అదే సమయంలో పారిశుధ్యంపై అధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఎక్కడ చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. మురుగునీరు నిల్వ చేరడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వీటి నిర్మూలనకు అధికారుల చర్యలు కరువవడంతో దోమలు కుట్టి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధానంగా డెంగీ, చికున్‌గున్యా బారిన పడి విలవిలలాడుతున్నారు. ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మరోవైపు వైద్యఆరోగ్యశాఖలోని కొందరు ఉద్యోగులు పారిశుధ్య నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని 77 పీహెచ్‌సీలు, 14 సీహెచ్‌సీల పరిధిలో 477 ఉపకేంద్రాలు ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు 2013-14లో ఒక్కో సబ్సెంటర్కు రూ.10 వేల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను ఎక్కడా సద్వినియోగం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎక్కువశాతం నిధులను అధికారులు, సిబ్బంది కలిసి స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దోమలు స్వైరవిహారం చేస్తూ, ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో డెంగీ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి, వింజమూ రు, రాపూరు, దగదర్తి, చేజర్ల, తల మంచి, కొడవలూరు, పొట్టేపాళెం తదితర ప్రాంతాల్లో డెంగీ వ్యాధి ప్రబలుతోంది. పదుల సంఖ్యలో ప్రజలు డెంగీ బారిన పడితే అధికారుల లెక్కలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో రెండు డెంగీ కేసులే నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో వాటిని ఎక్కించుకునే విషయంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ప్లేట్లెట్లు సకాలంలో అందుబాటులో లేక కొందరు మృత్యువాత పడుతున్నారు. దీనిని అవకాశంగా చేసుకున్న పలువురు వైద్యులు వివిధ రకాల పరీక్షల పేరుతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులకు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితులు నెలకొనడం ఇందుకు నిదర్శనం. మరోవైపు ఐదారేళ్ల క్రితం జిల్లా ప్రజలను వణకించిన చికున్‌గన్యా మళ్లీ జడలు విప్పుతోంది. కుటుంబాలకు కుటుం బాలే వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి బారిన పడినవారు నెలల తరబడి కోలుకోలేని పరిస్థితి ఉండటంతో పేద,మధ్య తరగతి ప్రజలు కుటుంబాలు గడవక అవస్థ పడుతున్నారు. వ్యాధులు ప్రబలేందుకు కారణమైన దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లాలో రెండు డెంగీ కేసులు గుర్తించాం. దోమల నివారణకు వైద్య,ఆరోగ్య, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో పారిశుధ్య నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోయాం. డాక్టర్ సుధాకర్, డీఎంహెచ్ఓ కంటి మీద కునుకు కరవు దోమల కారణంగా రాత్రిపూట కంటి మీద కునుకు ఉండటం లేదు. అవి కుట్టి ఎక్కడ రోగాల బారిన పడతామేమోనని భయంగా ఉంది. దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. సుజాత, ఏసీనగర్, నెల్లూరు డెంగీతో భయం దోమలు కుట్టి ఎక్కువ మంది డెంగీ బారిన పడుతున్నారు. ఇప్పటికే ఆత్మకూరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయినా దోమల నివారణకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. సందానీ, ఆత్మకూరు పారిశుధ్యం అధ్వానం పల్లెల్లో పారిశుధ్యం దారుణంగా ఉంది. ఎక్కడ చూసినా మురుగు పేరుకుపోవడంతో దోమలు ఎక్కువైపోయాయి. రోడ్లపై మురుగునీరు పారుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అంజి, తోటపల్లి, టీపీగూడురు