వైద్యులంటే నెత్తుటి వ్యాపారులా? | Private Doctors Should Give The Patient The Details Of The Treatment | Sakshi
Sakshi News home page

వైద్యులంటే నెత్తుటి వ్యాపారులా?

Published Fri, May 18 2018 2:29 AM | Last Updated on Fri, May 18 2018 2:32 AM

Private Doctors Should Give The Patient The Details Of The Treatment - Sakshi

విశ్లేషణ 

ప్రయివేటు వైద్యశాలలు పాటిస్తున్న భయానక రహస్య వ్యవహారాల వల్ల రోగికి స్వయం నిర్ణయ స్వేచ్ఛ లేకుండా పోతోంది. రాజ్యాంగం ఇచ్చిన బతుకు హామీ కొందరు బాగా చదువు‘కొన్న’ డాక్టర్ల దుర్మార్గాలకు బలైపోతోంది. వైద్యం ప్రస్తుత జీవనశాస్త్రం కాదు. వైద్యులు ధన్వంతురులూ కాదు. చికిత్స జీవన్మరణ సమస్య. ప్రభుత్వ దవాఖానాల్లో చచ్చినా వైద్యం దొరకదు. ప్రయివేటు నర్సింగ్‌ హోమ్స్‌లో చచ్చింతరువాత కూడా వైద్యమే అని ఒక విమర్శ.  కోటికొక్కరు తప్ప మిగిలిన డాక్టర్లు కుత్తుకలు కోసే నెత్తురు వ్యాపారులనీ కత్తుల రత్తయ్యల కన్న తీసిపోని వారేమీ కాదని తెలుసుకోవాలి. 

చికిత్సార్థులై వచ్చిన వారు సజీవులైన నాగరికులనీ, వారి డబ్బుతో బతికే డాక్టర్లు, వారి స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించాల్సి ఉంటుందని వారికి ప్రతిరోజూ పాఠాలు చెప్పవలసిన దుస్థితి ఉంది. వారి సమ్మతి పొందడం అంటే అనస్తీషియా ఎక్కించే ముందో ఆపరేషన్‌ టేబుల్‌ మీదో కాగితాల మీద బరబరా సంతకాలు గీకమనడం కాదు. పూర్తిగా సమస్య వివరించి, చికిత్స వివరాలుచెప్పి, పరిణామాలు విశదం చేసి, ప్రత్యామ్నాయాలు ఉంటే చెప్పి, తరువాత హితులతో సంప్రదించి, ఆలోచించి చెప్పే సమ్మతిని చట్టబద్ధమైన సమ్మతి అంటారు. స్వయం నిర్ణయాధికార స్వేచ్ఛ అంటే. వారూ వారూ మాట్లాడుకుని కత్తులు ప్రయోగించడం రోగి స్వేచ్ఛ అనిపించుకోదు

మన దేశంలో అస్పష్ట చట్టాల గురించి డాక్టర్లకే తెలియదు. మెడికల్‌ కౌన్సిల్‌ చట్టం కింద చేసిన కొన్ని రెగ్యులేటరీ నియమాల ప్రకారం రోగికి లేదా అతని బంధువులకు అడిగిన 72 గంటలలోగా మొత్తం చికిత్స రికార్డులు ఇవ్వాలని డాక్టర్లను నిర్దేశించారు. అంటే ప్రయివేటు డాక్టర్లయినా ప్రభుత్వ డాక్టర్లయినా సరే రోగి చికిత్సావివరాలు తమ సొమ్ముగా భావించి రహస్యాలు దాచి రోగులకు ఇవ్వకుండా ఏడిపించే అధికారం లేదు. అది కూడా సమాచారం నిర్వచనం కిందికే వస్తుంది. రోగ నిర్ధారణ పరీక్షా నివేదికలు, ఎక్స్‌ రేలు, తదితర స్కాన్‌ రిపోర్టులు, డాక్టరు ఇచ్చిన సలహాలు, రాసిన మందులు వాటి డోసులు, చికిత్స వివరాలు అన్నీ ఈ సమాచార నిర్వచనం కిందకు వస్తాయి. 

నిశాప్రియ భాటియా వర్సెస్‌ భారత మానవ ప్రవర్తనా పరిశీలనా సంస్థ కేసులో, చికిత్స పొందిన వ్యక్తికి ఆ చికిత్స వివరాలు తెలుసుకునే హక్కు ఉందని, ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రెగ్యులేషన్లు, సమాచార హక్కు చట్టం, వినియోగ దారుల చట్టం ప్రకారం కూడా ఈ హక్కును అమలు చేయవలిసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్ర సమాచార కమిషన్‌ CIC/AD/A/2013/001681-S కేసులో 23.4.2014న వివరించింది. ప్రతి ప్రయివేటు, ప్రభుత్వ వైద్యుడు, వైద్యశాల కూడా రోగులకు ఎప్పడికప్పుడు పూర్తి వివరాలు ఇవ్వడానికి ముందే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరి రికార్డును వారుగానీ వారి శ్రేయోభిలాషులు కాని అడిగి తీసుకోవచ్చని ఈ తీర్పు వివరించింది.

మరొకరి చికిత్సా వివరాలు ఇవ్వవచ్చా లేదా అనే ప్రశ్నను మిస్‌ జెజె వర్సెస్‌ భారత మానవ ప్రవర్తనా పరిశోధనా సంస్థ కేసులో విచారించారు. తన భర్తకు సంబంధించిన చికిత్స వివరాలు కావాలని భార్య అడిగింది. అతను మానసిక రోగంతో నరకం చూపుతున్నాడనీ, రకరకాలుగా వేధిస్తున్నాడని, అసలు ఈయనగారికి ఏం జబ్బుందో తనకు తెలియజేయాలని ఆమె కోరింది. ఈ భర్త అతని బంధువులు ఇతనికి ఉన్న జబ్బు సంగతి ముందే చెప్పకుండా ఆరోగ్యవంతుడని నమ్మించి పెళ్లికి ఒప్పించారని, భార్య, ఆమె తమ్ముడు సమాచార కమిషన్‌కు వివరించారు. ఆ వ్యక్తి మానసిక రోగాలకు సంబంధించి తమవద్ద ఉన్న సమాచారం ఒక ధర్మకర్తకు ఇచ్చినటువంటి సమాచారమనీ కనుక ధర్మకర్తలుగా ఆ సమాచారం వెల్లడిచేయజాలమని వైద్యసంస్థ అధికారులు నిరాకరించారు. మొదటి అప్పీలు అధికారి కూడా ఇదే తీర్పుచెప్పారు. భర్తకు చికిత్సలేని రోగం ఉంటే భార్య విడాకులు తీసుకోవచ్చని హిందూవివాహచట్టం 1955లో నిర్దేశించారు. రోగం ఏమిటో తెలియకుండా విడాకులు సాధించలేరు.  మానసిక శారీరక రోగాలున్న భర్త వల్ల భార్య ప్రాణాలకు (లేదా భార్య వల్ల భర్త ప్రాణాలకు) ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు పరిష్కారం విడాకులే. పెళ్లికిముందే ఆరోగ్య వివరాలు వధూవరులు పరస్పరం చెప్పుకోవాలి. రోగాలు చెప్పకుండా పెళ్లిచేస్తే ఆ ఒప్పందం చెల్లదు. జీవన హక్కు వివాహ హక్కు, స్వయం నిర్ణయ హక్కు ఆరోగ్య సమాచారంపైన ఆధారపడి ఉంటాయి.

మాడభూషి శ్రీధర్‌ 
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement