స్టెతస్కోప్‌ తగ్గిందా? | Doubts about the need for doctors to use a stethoscope | Sakshi

స్టెతస్కోప్‌ తగ్గిందా?

Published Tue, Jun 25 2024 5:53 AM | Last Updated on Tue, Jun 25 2024 5:58 AM

Doubts about the need for doctors to use a stethoscope

వైద్యులు స్టెతస్కోప్‌ వాడాల్సిన అవసరంపై సందేహాలు

ఈ అంశంపై గ్రేటర్‌ హైదరాబాద్‌లోని వైద్యుల భిన్నాభిప్రాయాలు

స్టెత్‌ వాడాల్సిన అవసరం లేదంటున్న కొందరు.. తప్పనిసరి అంటున్న మరికొందరు 

డిజిటల్‌ యుగంలో స్టెతస్కోప్‌తో పనేంటనే వాదనలు 

అత్యవసర పరిస్థితులు, కొన్ని అంశాల్లో అదే అవసరమంటున్న ఇంకొందరు

డాక్టర్‌ అనగానే మనకు ఠక్కున స్టెతస్కోప్‌ గుర్తొస్తుంది. మెడలో స్టెతస్కోప్‌ వేసుకునో, దానితో చెక్‌ చేస్తూనో ఉన్న వైద్యులు గుర్తుకు వస్తారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు.. గుండె, ఊపిరితిత్తుల్లో చప్పుడు, పల్స్‌ రేటును పరిశీలించేందుకు సుమారు 200 ఏళ్లకుపైగా డాక్టర్లు స్టెతస్కోప్‌ను వాడుతున్నారు. కానీ ప్రస్తుత డిజిటల్‌ యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పేషెంట్‌ పల్స్, హార్ట్‌బీట్‌ తెలుసుకునేందుకు డిజిటల్‌ పరికరాలు వచ్చేశాయి.

దీనితో స్టెతస్కోప్‌తో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ముంబైలోని బాంబే హాస్పిటల్‌లో ‘ఏఐ, హెల్త్‌కేర్‌’అంశంపై జరిగిన కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. స్టెతస్కోప్‌ వాడకంపై చర్చించారు. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలోని వైద్యులు స్టెతస్కోప్‌ను వినియోగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  – సాక్షి, హైదరాబాద్‌

ఇదే తొలిసారి కాదు.. 
స్టెతస్కోప్‌ వాడకంపై ఏళ్ల కిందే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. స్టెతస్కోప్‌ కనిపెట్టి 2016 నాటికి 200 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో అంతా స్టెతస్కోప్‌ రెండు శతాబ్దాల వేడుకలు చేసుకోవాలని భావిస్తుంటే.. అమెరికాకు చెందిన జగత్‌ నరులా అనే కార్డియాలజిస్టు మాత్రం ‘స్టెతస్కోప్‌ చనిపోయింది’అంటూ కామెంట్‌ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అప్పట్లోనే డాక్టర్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. హాప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ రీడ్‌ థామ్సన్‌ మాత్రం దీన్ని ఖండించారు.

మరోవైపు భవిష్యత్తులో సంప్రదాయ స్టెతస్కోప్‌లపై ఆధారపడటం చాలా తగ్గుతుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ సత్యవాన్‌ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న స్టెతస్కోప్‌ల స్థానాన్ని ఎల్రక్టానిక్, డిజిటల్, ఏఐతో రూపొందించిన స్టెతస్కోప్‌లు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్లంతా ఏఐతో నడిచే వాటినే ఉపయోగిస్తారని అంచనా వేశారు. అయితే ఎన్ని కొత్త సాధనాలు వచి్చనా స్టెతస్కోప్‌ వన్నె ఎప్పటికీ తగ్గదని.. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్టెతస్కోప్‌తో చూస్తేనే సంతృప్తి కలుగుతుందని ఊపిరితిత్తుల నిపుణుడు లాన్సెలాట్‌ పింటో చెప్పారు.

స్టెతస్కోప్‌ను ఎప్పుడు కనిపెట్టారు?
స్టెతస్కోప్‌ను 1860 సమయంలో తొలిసారిగా కనిపెట్టారు. అంతకుముందు వైద్యులు నేరుగా పేషెంట్ల శరీరానికి చెవిని ఆనించి గుండె చప్పుడు వినేవారు. ఆ సమయంలో మహిళా రోగుల ఇబ్బందులను గుర్తించి.. ఏదైనా పరికరాన్ని రూపొందించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలిసారిగా ఫ్రెంచ్‌ డాక్టర్‌ రీన్‌ లానెక్‌ కాగితాన్ని ట్యూబ్‌లా చుట్టి స్టెతస్కోప్‌లా వాడారు. ఆయనే దీనికి స్టెతస్కోప్‌ అని పేరు పెట్టారు. గ్రీక్‌ భాషలో స్టెతోస్‌ అంటే ఛాతీ అని.. స్కోపీన్‌ అంటే చూడటమని అర్థం. ఆ తర్వాత కొన్ని రకాల ప్రాథమిక స్టెతస్కోప్‌లు తయారు చేశారు. వాటిని దాదాపు 25 ఏళ్ల పాటు వాడారు. ఆర్థర్‌ లీర్డ్‌ అనే ఐరిష్‌ డాక్టర్‌ కాస్త మెరుగైన స్టెతస్కోప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం వాడుతున్న స్టెతస్కోప్‌ను లిట్‌మన్‌ అనే శాస్త్రవేత్త రూపొందించారు.

పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించొచ్చు.. 
పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులను స్టెతస్కోప్‌తో గుర్తించొచ్చు. గుండె నుంచి ఏదైనా అసాధారణ శబ్దాలు వినిపిస్తే (కార్డియాక్‌ మర్మర్‌) కాంజెనిటల్‌ కార్డియాక్‌ డిసీజెస్‌ ఉన్నట్టు తెలుస్తుంది. స్టెతస్కోప్‌ ద్వారానే దీన్ని గమనించవచ్చు. ఎ­లాంటి డిజిటల్‌ పరికరాలు దీన్ని గుర్తించలేవు. – డాక్టర్‌ నాజ్నీన్‌ తబస్సుమ్, మెడికల్‌ ఆఫీసర్‌

స్టెత్‌కు ఎప్పటికీ వన్నె తగ్గదు 
స్టెతస్కోప్‌ వినియోగం ఎప్పటికీ తగ్గదు. సహాయక సిబ్బంది డిజిటల్‌ పరికరాల ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. కానీ డాక్టర్‌గా స్టెతస్కోప్‌తో రోగిని చూస్తేనే సంతృప్తి కలుగుతుంది. స్టెతస్కోప్‌ కచి్చతత్వం ఎప్పుడూ మారదు.  – శిరందాస్‌ శ్రీనివాసులు, నిమ్స్‌ రేడియోగ్రాఫర్‌  

అత్యవసర సమయాల్లో దానితోనే మేలు 
అత్యవసర సమయాల్లో స్టెతస్కోప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. రోగికి వెంటిలేటర్‌ అమర్చే సమయంలో పైప్‌ సరిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందో లేదో స్టెతస్కోప్‌తోనే తెలుస్తుంది. ముక్కు ద్వారా ఆహారం అందించే పైపులు వేసే సమయంలో కూడా స్టెత్‌ లేనిదే పనికాదు. 
– విరించి విరివింటి, క్లినికల్‌ కార్డియాలజిస్టు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement