Stethoscope
-
స్టెతస్కోప్ తగ్గిందా?
డాక్టర్ అనగానే మనకు ఠక్కున స్టెతస్కోప్ గుర్తొస్తుంది. మెడలో స్టెతస్కోప్ వేసుకునో, దానితో చెక్ చేస్తూనో ఉన్న వైద్యులు గుర్తుకు వస్తారు. పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు.. గుండె, ఊపిరితిత్తుల్లో చప్పుడు, పల్స్ రేటును పరిశీలించేందుకు సుమారు 200 ఏళ్లకుపైగా డాక్టర్లు స్టెతస్కోప్‌ను వాడుతున్నారు. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితులు మారిపోయాయి. పేషెంట్ పల్స్, హార్ట్‌బీట్ తెలుసుకునేందుకు డిజిటల్ పరికరాలు వచ్చేశాయి.దీనితో స్టెతస్కోప్‌తో ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల ముంబైలోని బాంబే హాస్పిటల్లో ‘ఏఐ, హెల్త్‌కేర్’అంశంపై జరిగిన కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు.. స్టెతస్కోప్ వాడకంపై చర్చించారు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని వైద్యులు స్టెతస్కోప్‌ను వినియోగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ఇదే తొలిసారి కాదు.. స్టెతస్కోప్ వాడకంపై ఏళ్ల కిందే భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. స్టెతస్కోప్ కనిపెట్టి 2016 నాటికి 200 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పట్లో అంతా స్టెతస్కోప్ రెండు శతాబ్దాల వేడుకలు చేసుకోవాలని భావిస్తుంటే.. అమెరికాకు చెందిన జగత్ నరులా అనే కార్డియాలజిస్టు మాత్రం ‘స్టెతస్కోప్ చనిపోయింది’అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై అప్పట్లోనే డాక్టర్ల మధ్య పెద్ద చర్చ నడిచింది. హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ రీడ్ థామ్సన్ మాత్రం దీన్ని ఖండించారు.మరోవైపు భవిష్యత్తులో సంప్రదాయ స్టెతస్కోప్లపై ఆధారపడటం చాలా తగ్గుతుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సత్యవాన్ శర్మ కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న స్టెతస్కోప్‌ల స్థానాన్ని ఎల్రక్టానిక్, డిజిటల్, ఏఐతో రూపొందించిన స్టెతస్కోప్‌లు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు. డాక్టర్లంతా ఏఐతో నడిచే వాటినే ఉపయోగిస్తారని అంచనా వేశారు. అయితే ఎన్ని కొత్త సాధనాలు వచి్చనా స్టెతస్కోప్ వన్నె ఎప్పటికీ తగ్గదని.. రోగి ఆస్పత్రికి వచ్చిన వెంటనే స్టెతస్కోప్‌తో చూస్తేనే సంతృప్తి కలుగుతుందని ఊపిరితిత్తుల నిపుణుడు లాన్సెలాట్ పింటో చెప్పారు.స్టెతస్కోప్‌ను ఎప్పుడు కనిపెట్టారు?స్టెతస్కోప్‌ను 1860 సమయంలో తొలిసారిగా కనిపెట్టారు. అంతకుముందు వైద్యులు నేరుగా పేషెంట్ల శరీరానికి చెవిని ఆనించి గుండె చప్పుడు వినేవారు. ఆ సమయంలో మహిళా రోగుల ఇబ్బందులను గుర్తించి.. ఏదైనా పరికరాన్ని రూపొందించాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలిసారిగా ఫ్రెంచ్ డాక్టర్ రీన్ లానెక్ కాగితాన్ని ట్యూబ్‌లా చుట్టి స్టెతస్కోప్‌లా వాడారు. ఆయనే దీనికి స్టెతస్కోప్ అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో స్టెతోస్ అంటే ఛాతీ అని.. స్కోపీన్ అంటే చూడటమని అర్థం. ఆ తర్వాత కొన్ని రకాల ప్రాథమిక స్టెతస్కోప్‌లు తయారు చేశారు. వాటిని దాదాపు 25 ఏళ్ల పాటు వాడారు. ఆర్థర్ లీర్డ్ అనే ఐరిష్ డాక్టర్ కాస్త మెరుగైన స్టెతస్కోప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం వాడుతున్న స్టెతస్కోప్‌ను లిట్మన్ అనే శాస్త్రవేత్త రూపొందించారు.పిల్లల్లో గుండె సమస్యలు గుర్తించొచ్చు.. పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులను స్టెతస్కోప్‌తో గుర్తించొచ్చు. గుండె నుంచి ఏదైనా అసాధారణ శబ్దాలు వినిపిస్తే (కార్డియాక్ మర్మర్) కాంజెనిటల్ కార్డియాక్ డిసీజెస్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టెతస్కోప్ ద్వారానే దీన్ని గమనించవచ్చు. ఎలాంటి డిజిటల్ పరికరాలు దీన్ని గుర్తించలేవు. – డాక్టర్ నాజ్నీన్ తబస్సుమ్, మెడికల్ ఆఫీసర్స్టెత్కు ఎప్పటికీ వన్నె తగ్గదు స్టెతస్కోప్ వినియోగం ఎప్పటికీ తగ్గదు. సహాయక సిబ్బంది డిజిటల్ పరికరాల ద్వారా రోగి ఆరోగ్య పరిస్థితిపై ప్రాథమిక సమాచారం సేకరిస్తారు. కానీ డాక్టర్‌గా స్టెతస్కోప్‌తో రోగిని చూస్తేనే సంతృప్తి కలుగుతుంది. స్టెతస్కోప్ కచి్చతత్వం ఎప్పుడూ మారదు. – శిరందాస్ శ్రీనివాసులు, నిమ్స్ రేడియోగ్రాఫర్ అత్యవసర సమయాల్లో దానితోనే మేలు అత్యవసర సమయాల్లో స్టెతస్కోప్ ఎంతో ఉపయోగపడుతుంది. రోగికి వెంటిలేటర్ అమర్చే సమయంలో పైప్ సరిగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిందో లేదో స్టెతస్కోప్‌తోనే తెలుస్తుంది. ముక్కు ద్వారా ఆహారం అందించే పైపులు వేసే సమయంలో కూడా స్టెత్ లేనిదే పనికాదు. – విరించి విరివింటి, క్లినికల్ కార్డియాలజిస్టు -
నకిలీ డాక్టర్లకు చెక్..
సాక్షి, హైదరాబాద్: అర్హత లేకున్నా వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారిపై, అక్రమంగా ఆసుపత్రులు నడుపుతున్నవారిపైనా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంసీ) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో అర్హత లేకున్నా ప్రాక్టీస్ చేస్తున్న రెండు ఆసుపత్రు లకు ఇటీవలే ఎన్నికైన కొత్త మండలి నోటీసులు జారీ చేసింది. సదరు ఆసుపత్రుల్లో యాంటీబయా టిక్స్, స్టెరాయిడ్స్ వంటి షెడ్యూల్డ్ డ్రగ్స్‌ను గుర్తించి ఈ మేరకు వాటిపై కేసులు నమోదు చేసింది. ఇంకా అనేక చోట్ల నకిలీ వైద్యుల దందాపై దాడులకు శ్రీకారం చుట్టింది. డాక్టర్లుగా చెప్పుకునే ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు పెడతామని మండలి హెచ్చరించింది. పేరుకు ముందు ‘డాక్టర్’ హోదా పెట్టుకున్నా, ఆసుపత్రి అని రాసి ఉన్న బోర్డులు ప్రదర్శించినా, రోగులకు ప్రిస్క్రిప్షన్ రాసినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఆర్ఎంపీల ముసుగులో రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలు 30 వేల మంది వర కు ఉన్నారని ఓ అంచనా. ప్రతీ గ్రామంలో వారు ప్రాక్టీస్ చేస్తుంటారు. అయితే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆర్ఎంపీలు, పీఎంపీల ముసుగులో డాక్టర్లుగా చెలామణీ అవుతూ.. ఇష్టారాజ్యంగా అబార్షన్లు చేయడం, అత్యధిక మోతాదులో ఉన్న యాంటీబయాటిక్స్ ఇవ్వడం, చిన్న రోగాలకు కూడా అధికంగా మందులు రాస్తున్నారని మండలి గుర్తించింది. ఇటీవల నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉన్న ఒక అర్హతలేని ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్‌ను పరిశీలిస్తే, శిశువుకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ మెరోపెనెమ్ రాయడం చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సహజంగా శిశువులకు ఉపయోగించే యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు పెద్దలకు ఉప యోగించేవి కాకుండా ప్రత్యేకంగా ఉంటాయి. పెద్ద లకు వాడే ఇంజెక్షన్లు శిశువుకు ప్రాణాంతకంగా మారతాయి. మలక్‌పేటలోని ఆ నకిలీ డాక్టర్ మాది రిగానే చాలామంది నకిలీ డాక్టర్లు మానసిక ఔష ధాల ప్రిస్క్రిప్షన్‌లోనూ ఇష్టారాజ్యంగా మందులు రాస్తున్నారని తేలింది. ఈ నేపథ్యంలో నకిలీ డిగ్రీని ప్రదర్శించడం, అర్హత లేకున్నా ప్రిస్క్రిప్షన్లు రాయ డం వంటి దృష్టాంతాలను మండలి తీవ్రంగా తీసు కుంది. మరోవైపు అడ్డగోలుగా అల్లోపతి మందు లను సూచిస్తున్న ఇద్దరు నకిలీ ఆయుష్ వైద్యులను గుర్తించి వారిపై ఆయుష్ శాఖకు లేఖ రాసింది. ఇక నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సాయాన్ని కూడా తీసుకోవాలని మండలి నిర్ణయించింది. నకిలీ ప్రైవేట్ ప్రాక్టీషనర్ల ద్వారా రోగులకు మందులు అందకుండా చేయాలని నిర్ణయించింది. -
పరి పరిశోధన
కొత్త ఫిల్టర్‌తో మంచినీళ్లు + లిథియం! సముద్రపు నీటి నుంచి లవణాలన్నింటినీ వేరు చేస్తే.. భూమ్మీద ఎవరికీ తాగు/సాగు నీటి కొరత అస్సలు ఉండదు. దురదృష్టం ఏమిటంటే ఈ పనిచేసేందుకు ఇప్పటివరకూ సమర్థమైన పద్ధతి ఏదీ లేకపోవడం. ఇజ్రాయెల్‌తోపాటు అనేక దేశాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అమెరికా తయారు చేసిన ఓ సరికొత్త ఫిల్టర్ పుణ్యమా అని సమస్య పరిష్కారంలో గణనీయమైన పురోగతి సాధించాము. ఎందుకంటే ఈ ఫిల్టర్ ఒకవైపు నిర్లవణీకరణ (ఉప్పునీటిని మంచినీటిగా మార్చడం) చేస్తూనే.. ఇంకోవైపు భూమ్మీద అతితక్కువ మోతాదులో ఉందనుకుంటున్న లిథియంను ఉత్పత్తి చేయగలదు! లిథియం స్మార్ట్ఫోన్లతోపాటు అన్ని రకాల గాడ్జెట్లలో వాడే బ్యాటరీల తయారీకి కీలకమన్న సంగతి తెలిసిందే. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంఓఎఫ్) అనే ప్రత్యేక పదార్థం ద్వారా ఇది సాధ్యమైందని మోనాష్, సీఎస్ఐఆర్వో, టెక్సస్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు అంటున్నారు. కేవలం ఒకగ్రాము ఎంఓఎఫ్ పదార్థాన్ని పూర్తిస్థాయిలో విస్తరిస్తే.. ఒక ఫుట్‌బాల్ మైదానం అంత ఉంటుందని.. ఇంతటి ఎక్కువ ఉపరితల వైశాల్యమున్న పదార్థాలతో నిర్లవణీకరణ ఎక్కువ సమర్థంగా జరుగుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త హాంటింగ్ వాంగ్ తెలిపారు. సముద్రపు నీరులో ఉండే లిథియం అయాన్లను కూడా వీటితో వేరు చేసి వాడుకోవచ్చునని చెప్పారు. ఎంఓఎఫ్ ఫిల్టర్లు అతితక్కువ విద్యుత్తును వాడుకోవడమే కాకుండా.. ఎక్కువ మోతాదులో మంచినీటిని అందిస్తాయి కాబట్టి.. ఈ కొత్త పద్ధతి ద్వారా చాలా చౌకగా మంచినీరును సిద్ధం చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ స్తెతస్కోప్... జ్వరం చేస్తే.. శరీర ఉష్ణోగ్రత ఎంతుందో తెలుసుకునేందుకు థర్మామీటర్‌ను ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మరి గుండె కొట్టుకునే వేగం మొదలుకొని... ఊపిరితిత్తుల్లో ఉండే సాధారణ సమస్యల వివరాలు తెలియాలంటే? ఏముందీ.. ఫొటోలో కనిపిస్తున్న స్తెతోమీ వాడితే సరిపోతుంది అంటున్నారు పోలాండ్‌కు చెందిన ఆడమ్ మికీవిజ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. తరచూ ఊపిరితిత్తుల పనితీరుపై సమాచారం తెలుసకోవాల్సిన ఉబ్బస రోగగ్రస్తులకు ఉపయోగపడేలా దీన్ని తాము తయారు చేశామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక అప్లికేషన్ ఆధారంగా పనిచేసే ఈ వైర్లెస్ స్తెతోమీ.. శరీరంపై పరికరాన్ని ఏ ప్రాంతంలో ఉంచాలో కూడా అదే సూచిస్తుంది. ఆ తరువాత గుండెకొట్టుకునే వేగంతోపాటు శరీర ఉష్ణోగ్రత, ఊపిరితీసుకునేటప్పుడు వచ్చే శబ్దాలను కూడా రికార్డు చేస్తుంది. వేర్వేరు ఆరోగ్య సమస్యలున్న వారి వివరాలు, శబ్దాలతో వీటిని పోల్చి చూస్తుంది. వివరాలు స్తెతోమీ వెనుకవైపున ఉన్న స్క్రీన్‌పై కనిపిస్తాయి. అత్యవసరంగా వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటే.. ఆ విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతోపాటు రోగి తాలూకూ వివరాలన్నింటినీ స్మార్ట్‌ఫోన్‌కు పంపి.. భవిష్యత్తు అవసరాల కోసం స్టోర్ చేస్తుంది కూడా. ఇప్పటికే తాము స్తెతోమీని ఆసుపత్రుల్లో పరీక్షించి చూశామని... తగినన్ని నిధులు సమకూరిన తరువాత వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అంటున్నారు శాస్త్రవేత్తలు. -
స్టెతస్కోప్, బీపీ యంత్రాలకు చెల్లు?
గుండె కొట్టుకునే వేగం తెలుసుకోవాలంటే స్టెతస్కోప్ కావాలి. రక్తపోటును బీపీ యంత్రంతోనే కొలవాలి. ఇకపై వీటి అవసరం ఉండబోదని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఇంజనీర్లు అంటున్నారు. రక్తపోటు, గుండె, ఊపిరి వేగాలను తెలుసుకునేందుకు వీరు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. దీనిద్వారా రేడియో తరంగాలను శరీరంలోకి పంపుతూ లోపలి అవయవాల కదలికలను పసిగడతారు. ఇందుకు ఒక సెంట్రల్ రీడర్.. చిన్న బిళ్లల్లాంటివి ఉంటాయి. బిళ్లలను శరీరానికి దగ్గరగా ఉంచుకుంటే చాలు.. అందులోంచి రేడియో సంకేతాలు శరీరంలోకి ప్రసారమై.. గుండె, ఊపిరితిత్తులు, రక్తం తాలూకూ వివరాలు తెలిసిపోతాయి. బిళ్లలోనే ఉండే మైక్రోప్రాసెసర్ ద్వారా సెంట్రల్ రీడర్‌కు ఈ వివరాలు చేరుతాయి. డాక్టర్ దగ్గర ఉండాల్సిన అవసరం లేకపోవడమే కాకుండా.. ఏకకాలంలో దాదాపు 200 మంది వివరాలను సేకరించొచ్చు. ఒక్కో బిళ్లకు ప్రత్యేకమైన ఐడీ, ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల సమాచారం మారిపోవడమంటూ ఉండదు. -
మెడలో స్టెతస్ హోప్
డాక్టర్లు ఊళ్లల్లో పని చెయ్యాలంటే... ఆర్డర్లు వెయ్యాలని ప్రభుత్వాలు అనుకుంటాయి! కానీ మన డాక్టర్లలో ఉన్న సేవానిరతికి అవకాశం ఇస్తే.. స్ఫూర్తిని కలిగిస్తే.. ఎంత చెయ్యగలరో షైనీని చూసి తెలుసుకోవచ్చు. రోగికి సేవ చెయ్యడం ధర్మం అయితే... ప్రాణాలకు తెగించి సేవలు అందించే డాక్టర్లకు\మెడలో ఏ మెడల్ వెయ్యాలి? స్టెతస్కోప్ కాదు.. స్టెతస్ హోప్ వెయ్యాలి. హోప్ ఆఫ్ స్టెతస్కోప్ వెయ్యాలి! సూడాన్.. సహారా ఎడారిలోని ఓ రెఫ్యూజీ క్యాంప్! రాత్రి మూడు గంటలు... విపరీతమైన చలి! చీమచిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం! సాయుధులైన కొంతమంది ఆ క్యాంప్‌లోని డాక్టర్లను, వాళ్ల వైద్యపరికరాలను దోచుకోవడానికి వచ్చారనే వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ఎక్కడివాళ్లక్కడ తమ టెంట్‌కు జిప్ లాగేసుకొని ముసుగుపెట్టారు. ఓ లేడీ డాక్టర్ కూడా గబగబా తన టెంట్ జిప్ని లాక్ చేయబోయింది. కాని అది పనిచేయలేదు. ఎవరైనా చిన్న చాకుతో ఆ టెంట్‌ను కత్తిరించి లోపలున్న తన మీద ఈజీగా దాడీ చేసేయొచ్చు. ఆ ఆలోచనరాగానే లోపలి నుంచి భయం.. బయట నుంచి చలి ఆమెకు వణుకు పుట్టించాయి. ఎడారి అవతల ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు వార్తల రూపంలో అరిచే రేడియో కూడా ఆ రాత్రి మూగబోయింది. ఆ శబ్దంతో దుండగులు తేలిగ్గా క్యాంప్ జాడను తెలుసుకుంటారనే జాగ్రత్తతో. పేరుకు టెంట్లో ఉంది కాని ఆమె దృష్టి అంతా ఆ చీకటి పరిసరాల మీదే ఉంది. మెడలదాకా దుప్పటి కప్పుకొని టెంట్ పల్చని గోడలవైపే చూస్తోంది. ఏవో గుసగుసలు వినిపించాయి. అలర్ట్ అయిపోయింది ఆ డాక్టర్. ఇంతలోకే ముగ్గురు మనుషుల నీడలు ఆ టెంట్ గోడల మీద అంతకంతకూ పెద్దవవుతూ కనిపించసాగాయి. బిగుసుకుపోయింది. ఆ ముగ్గురిలో ఒకడి దగ్గర గన్ ఉన్నట్లుంది. దాని నీడ స్పష్టంగా కనిపిస్తోంది... తనవైపే గురిపెట్టినట్టు దగ్గరగా. భయంతో గట్టిగా కళ్లుమూసుకుంది! ఎన్ని క్షణాలు గడిచాయో తెలియదు.. కాని ఆ గుసగుసలు దూరమై అస్పష్టంగా వినిపించసాగాయి. అప్పుడు కళ్లు తెరిచింది. టెంట్ గోడల మీద నీడలు లేవు. గట్టిగా నిట్టూర్చి ఎడమవైపు నుంచి కుడివైపు తిరిగి ఒత్తిగిలి పడుకుంది. ఆమె పేరు షైనీ కాకి. నిత్యం అంతర్యుద్ధాలు, యుద్ధాలతో అట్టుడుకుతూ, అంటువ్యాధులు, పోషకాహారలేమి, కరువుతో కలవరపడుతున్న నైజీరియా, సూడాన్, సొమాలియా, యెమెన్లలో వైద్యసేవలందిస్తున్న యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్. శిబిరాల్లోని బాధితులు, శరణార్థుల నాడీ పట్టుకొని ఆ దేశాల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. వైద్యవిద్యను ఒక దీక్షగా .. ప్రాక్టీస్‌ను ఓ సర్వీస్‌గా నమ్మే షైనీ ‘‘మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఎమ్ఎస్ఎఫ్)’’ అంటే డాక్టర్స్ వితవుట్ బార్డర్స్ అనే సంస్థలో చేరింది. ఎల్లలు లేని వైద్య సేవే ఈ ఆర్గనైజేషన్ లక్ష్యం. ఎమ్ఎస్ఎఫ్ వలంటీర్‌గా ఒక మిషన్ తర్వాత ఇంకో మిషన్‌లోకి మారుతూ మూడేళ్లపాటు ఆ ప్రస్థానాన్ని కొనసాగించింది. ఎవరీ డాక్టర్ షైనీ? ఆంధ్రా అమ్మాయి. విజయవాడలో పుట్టిపెరిగిన డాక్టర్ ఆమె. 2009లో వెల్లూర్‌లోని సీఎమ్సీ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుంది. మిగిలిన వాళ్లలా సొంతంగా నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలని, లేదంటే ఏదైనా కార్పోరేట్ హాస్పిటల్లో చేరి తన మెడిసిన్ డిగ్రీకి అయిన ఖర్చుని రాబట్టుకోవాలని అనుకోలేదు. ఆమె తల్లిదండ్రులకూ ఆ అంచనా లేదు. అందుకే ఎంబీబీఎస్ అయిపోగానే గ్రామీణప్రాంతాల్లో ప్రాక్టీస్ చేయాలనే కూతురి అభిప్రాయాన్ని గౌరవించారు. ఆ ప్రోత్సాహంతో ఆమె ఉత్తరప్రదేశ్, అలహాబాద్‌లోని లెప్రసీ ఆసుపత్రిలో డాక్టర్ కొలువు చూసుకుంది. చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యం మొదలుపెట్టింది. శాపం కాదు రోగం కుష్టువ్యాధి అధికంగా ఉన్న ఊళ్లు తిరుగుతుంటే ఆ ప్రాంతాలు ఎంత అంధకారంలో ఉన్నాయో అర్థమైంది షైనీకి. ఆ గ్రామాల్లోని వాళ్లు కుష్టుని గతజన్మ పాపంగా, దేవుడి శాపంగా భావించి చికిత్సకు దూరంగా ఆ రోగాన్ని భరించడం ఆమెను విస్మయపరిచింది. వ్యాధి లక్షణాలు బయటపడుతున్నా.. పుళ్లు ముదిరి వేళ్లు ఊడుతున్నా .. ఆ బాధను భరిస్తూ ఇళ్లల్లోనే ఉండేవారు తప్ప హాస్పిటల్‌కు వచ్చేవారు కాదు. పైగా ఇరుగుపొరుగుకు తెలిస్తే వెలివేస్తారనే భయంతో కదల్లేని పరిస్థితి వచ్చినా పక్కింటి వారి సహాయం కోరేవారు కాదు. అది శాపం కాదు రోగమని.. ముదిరితే ప్రమాదమని చెప్పినా అర్థం చేసుకునే ఇంగితం కనిపించలేదు. మొండిగా వైద్యం చేస్తే ఒప్పుకునే స్థితిలో లేరు. అప్పుడనిపించింది షైనీకి.. వీళ్లకు ముందు కావాల్సింది మందులు కాదు మాటలు... చికిత్స కాదు, చైతన్యం అని. తోటి డాక్టర్లను కలుపుకొని ఓ టీమ్‌గా ఏర్పడి ఊళ్లోని జనాలకు చేతన కల్పించే కార్యక్రమం మొదలుపెట్టింది. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, అది లేకపోతే కలిగే అనారోగ్యం, దాని ప్రభావం అన్నీ విడమర్చి చెప్పసాగింది. ఆ తర్వాత కుష్టువ్యాధి గురించీ అవగాహన కలిగించడం మొదలుపెట్టింది. అదొక వ్యాధి అని, కేవలం ట్రీట్మెంట్ ద్వారే నయమవుతుందని చెవినిల్లు కట్టుకొని పోరింది. నయమైన కేస్ స్టడీస్‌ని ఉదాహరణలుగా చూపించింది. ఆమె శ్రమ వృథా కాలేదు. జనాల్లో మార్పు రాసాగింది. నెమ్మదిగా ఆసుపత్రికి రావడం ప్రారంభించారు. అలా ప్రతిగ్రామం తిరిగి ప్రజలను మేలుకొలిపి.. కుష్టువ్యాధిని పూర్తిగా నయం చేసింది. ఇప్పటికీ అలహాబాద్ చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలు డాక్టర్ షైనీని తమ వరంగా తలుస్తారు. డాక్టర్స్ వితవుట్ బార్డర్స్... 2013లో షైనీ కజిన్ ఒకరు కారు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. మూడు నెలలు మనిషే కాలేదు. తన గదికే పరిమితమైంది. ఆ క్రమంలోనే ఓ వార్ మూవీ చూసిందామె. అందులో ఎమ్ఎస్ఎఫ్ (డాక్టర్స్ విత్ అవుట్ బార్డర్స్) తరపున ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి క్షతగాత్రులకు స్వచ్ఛందంగా వైద్యం చేయడం ఆమెను ఆకర్షించింది. ఆలోచింపచేసింది. అప్పటిదాకా ఆవరించి ఉన్న డిప్రెషన్ వదిలిపోయి మనసు దూదిపింజ అయింది. వెంటనే ఎమ్ఎస్ఎఫ్కి దరఖాస్తు చేసుకుంది. షైనీకి నిరీక్షించే అవకాశం ఇవ్వకుండా రెండు రోజుల్లోనే ఎమ్ఎస్ఎఫ్ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆన్లైన్లోనే ఆ ప్రక్రియా పూర్తి అయింది. డాక్టర్స్ విత్ అవుట్ బార్డర్స్‌లో చేర్చుకుంటున్నట్టు షైనీకి మెయిల్ పంపారు. అలా హద్దుల్లేని సేవకోసం స్టెత్ పట్టుకుంది డాక్టర్ షైనీ కాకి. ఫస్ట్ మిషన్ ఎమ్ఎస్ఎఫ్ మిషన్‌లో భాగంగా ఆమె మొదట ఇథియోపియా, సొమాలియా సరిహద్దులోని అంతర్యుద్ధ ప్రాంతానికి వెళ్లింది. శాంతి అనే పదం వినపించని, కనిపించని ప్రదేశం అది. పెద్దా, చిన్నా అంతా ఆయుధాలతో సంచరించే స్థలం డాక్టర్ అయినా, లాయర్ అయినా హోదాతో ప్రమేయం లేకుండా కొత్తవాళ్లు ఎవరు ఎదురైనా తుపాకులతోనే పలకరిస్తారు. ఆ వాతావరణాన్ని చూసి హడలిపోయింది షైనీ. తమకు అక్కడి రాజకీయాలతో ఏమాత్రం సంబంధంలేదని చెప్పినా వాళ్లు నిర్థారించుకున్నాకే వీళ్లు విధులు చేపట్టాలి. ఇథియోపియా సైన్యం, సొమాలియా పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ సామాన్య జనానికి వైద్యం అందించడానికే వచ్చారని సాక్ష్యాలు చూశాక కాని వాళ్లను వైద్యశిబిరాల్లోకి పంపించలేదు. ఎమర్జెన్సీ రూమ్‌లో ఆమెకు డ్యూటీ పడింది. క్షతగాత్రులు, హెచ్ఐవీ, టీబీ, చిన్నపిల్లల వార్డ్స్ అన్నీ అక్కడే. ఆమె పని చేస్తున్నంతసేపు ఆమె వెంటే ఉండేవారు సాయుధులైన స్థానికులు. సహారాలో ఆసరాగా.. సౌత్ సుడాన్లో ఆమె సెకండ్ మిషన్. అక్కడి రెఫ్యూజీ క్యాంపుల్లో పోషకాహార లేమితో బాధపడుతున్న పిల్లలు, పిల్లతల్లులను చూసి చలించిపోయింది షైనీ. ‘‘బలమైన ఆహారం లేక పాలుపడని తల్లులు గుండెలవిసేలా ఏడుస్తుంటే దుఃఖం ఆపుకోలేకపోయేదాన్ని. బాత్రూమ్లోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. ఇక్కడికి వచ్చాక కూడా ఆ దృశ్యాలు వెంటాడుతున్నాయి. ఒక్కోసారి నిద్రే పట్టదు’’ అని బాధపడుతుంది. అక్కడి సివిల్ వార్, దాని పర్యవసానాల వల్ల ప్రజల జీవనస్థితిగతులు అస్తవ్యస్థమయ్యాయి. ‘‘డ్రింకింగ్ వాటర్ ఉండదు, సరైన తిండి దొరకదు, వైద్యం అయితే అందని పండే. ఎక్కడపడితే అక్కడ మురికితో కంపుకొడుతుంటుంది. దాంతో అంటురోగాలు. ఆ క్యాంప్‌లో నేను కలరా పేషంట్స్‌ను ట్రీట్చేసేదాన్ని’’ అంటూ అక్కడి పరిస్థితితులను వివరిస్తుంది డాక్టర్ షైనీ. సుడాన్ నుంచి నైజీరియా వెళ్లింది. అక్కడా పోషకాహారలేమే ప్రధాన సమస్య. మాల్‌న్యూట్రిషన్‌తో వందల మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. అలా మరణం అంచువరకు వెళ్లిన చాలామంది పిల్లలకు వైద్యంచేసి వాళ్ల ప్రాణాలు నిలిపింది ఈ డాక్టరమ్మ. తన ట్రీట్మెంట్తో ఆ సహారాదేశాల్లోని ఎంతోమందికి ఆసరాగా నిలిచింది మన ఆడబిడ్డ. వెనక్కి రావాలనిపించింది.. సుడాన్లో చాలా చిత్రమైన పరిస్థితులు. వాతావరణపరంగా విపరీతమైన వేడి ఒక సమస్య అయితే అక్కడి రాజకీయ అస్థిరత, దాడులు ఇంకో సమస్య. రెఫ్యూజీ క్యాంపుల్లో పని చేస్తున్న ఎమ్ఎస్ఎఫ్ డాక్టర్లను సైతం కిడ్నాప్ చేసిన సందర్భాలు ఎన్నోట. ‘‘అలాంటివి విన్నప్పుడు భయమేసేది. అక్కడి ఎండను చూసినప్పుడు మా ఇల్లు, ఇంట్లో కంఫర్ట్స్ గుర్తొచ్చేవి. ఒక్క క్షణం ఆ ఎండకు ఎక్స్పోజ్ అయినా చర్మం ఎర్రగా కందిపోయి మంట పుడుతుంది. ఉప్పునీళ్లు తప్ప మంచినీటి జాడే ఉండదు. ఇవన్నీ భరించలేక ఇండియాకు రావాలనిపించేది. కాని వెంటనే నా కళ్లముందున్న పేషంట్స్, డాక్టర్‌గా నేను చేయాల్సిన డ్యూటీని గుర్తుచేసేవారు. అంతే! హోమ్‌సిక్ పోయి ఆ చాలెంజెస్‌ను ఎదుర్కొనే శక్తి వచ్చేది’’ అని చెప్తుంది షైనీ. ఇవన్నీ ఒకెత్తయితే వర్క్ చాలెంజెస్ మరో ఎత్తు అంటుంది ఆమె. ‘‘క్యాంప్స్లోని లోకల్ స్టాఫ్ ముఖ్యంగా మగవాళ్లు నేను ఏదైనా చెప్తే వినేవారు కాదు. ట్రీట్మెంట్కి సంబంధించి సూచనలు, సలహాలు, ఈవెన్ ఆర్డర్స్ వేసినా నిర్లక్ష్యంగా ఉండేవారు. కారణం.. వాళ్లందరికన్నా నేను చిన్నదాన్నవడం, స్త్రీని కావడం! మేల్ డామినేషన్ ఎక్కువ. ఒక అమ్మాయి చెప్తే మేం వినాలా? అని అనుకునేవాళ్లు. అదీకాక.. అక్కడున్న ప్రతివాళ్లు మన వెనక మన గురించి కామెంట్ చేసేవాళ్లు. టీజ్ చేసేవాళ్లు. ఒకసారైతే అక్కడి ఆరోగ్యశాఖ సిబ్బందితో నాకు చాలా ప్రాబ్లం అయింది. వాళ్ల మీద కంప్లయింట్ ఇచ్చాను కూడా. కాని ఏమీ జరగలేదు. అప్పుడనిపించింది.. వదిలేసి వెళ్లిపోదామని. మళ్లీ వెంటనే నా డ్యూటీ ఆపింది నన్ను. నాకు నా పేషంట్ ముఖ్యం, స్టాఫ్ కాదు కదా.. నా పేషెంట్‌కి లాయల్‌గా ఉండాలి.. అక్కడి సిబ్బంది కాదు కదా.. అనుకొని ఏది ఏమైనా సరే నా అసైన్మెంట్ అయిపోయే వరకు ఉండాలని డిసైడ్ చేసుకున్నా’ అంటూ నాటి చేదు జ్ఞాపకాలను షేర్ చేసుకుంటుంది షైనీ. ఏం నేర్చుకుంది? ‘‘ఆడవాళ్లకు చాలా అడ్డంకులుంటాయి. అలాగని జీవితం ఎలా వెళ్తే అలా సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. మనకూ లక్ష్యాలుండాలి. వాటిని సాధించాలి. చాలెంజెస్‌ను ఎదుర్కోవాలి. నల్లేరు మీద ఎవరైనా నడుస్తారు. యుద్ధంలో సాగడమే కదా సాహసం. మన ప్రధాన శత్రువు భయమే. దాన్ని జయించాలి. మన గొంతును ప్రపంచానికి వినిపించాలి. మనల్ని అణచివేయాలనుకునే అధికారానికి తలవంచాల్సిన పనిలేదు. మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు పర్యవసానాలకు బెదరొద్దు. మనమే కాదు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రోగ్రెసివ్‌గా మార్చాలి’’ అని తన జీవితం నేర్పిన పాఠాన్ని తోటి మహిళలకు స్ఫూర్తిగా చూపించాలనుకుంటోంది డాక్టర్ షైనీ కాకి. 60 దేశాల్లో 25 వేల సిబ్బందితో.. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఎమ్ఎస్ఎఫ్) లేదా డాక్టర్స్ వితవుట్ బార్డర్స్ ఒక అంతర్జాతీయ సంస్థ. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు ఉన్న దేశాల్లో అత్యవసర వైద్యసహాయం అందిస్తుంది. ప్రస్తుతం 60 దేశాల్లో మూడువేల మంది డాక్టర్లు, నర్సులు, మంచినీరు, శానిటేషన్ ఎక్స్పర్ట్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఇతర ప్రొఫెషనల్స్‌తోపాటు ఆయాదేశాల్లో 25వేల మంది స్టాఫ్‌ను అపాయింట్ చేసుకుని విస్తృతమైన సేవలందిస్తోంది ఎమ్ఎస్ఎఫ్. - శరాది -
పురుడు పోసేలోపు స్టెతస్కోప్ చోరీ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ప్రసవం చేస్తున్న సమయంలో డ్యూటీ డాక్టర్ స్టెతస్కోప్‌ను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో కాన్పుల విభాగంలో( లేబర్‌రూమ్) ఈనెల 2వ తేదీన గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమాదేవి విధులు నిర్వహిస్తున్నారు. పలువురు గర్భిణిలకు కాన్పులు చేసే పనిలో డాక్టర్ నిమగ్నమైన సమయంలో సుమారు 25వేల ఖరీదు చేసే ఆమె స్టెతస్కోప్‌ను ఎవరో దొంగిలించారు. దీనిపై ఈనెల 4వ తేదీన ఆస్పత్రి అధికారులకు ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్టెతస్కోప్‌తోపాటు డాక్టర్ బ్యాగ్‌లో ఉన్న 8 వేల రూపాయలు సైతం చోరీకి గురయ్యాయి. అయితే ఈ సంఘటనలో నేటి వరకు ఎలాంటి పురోగతి లేదు. చోరీల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినా, సెక్యూరిటి సిబ్బందిని నియమించినా ఆస్పత్రిలో నిత్యం చోరీలు జరుగుతూ ఉండటం విమర్శలకు తావిస్తోంది. -
స్టెతస్కోప్ @200 ఏళ్లు
డాక్టర్ హస్తభూషణం స్టెతస్కోప్.. డాక్టర్ పేరు వినగానే కళ్ల ముందు కదలాడేదీ స్టెతస్కోప్.. డాక్టర్ దగ్గరికి వెళ్లగానే ముందు పరీక్షించేదీ ఈ స్టెతస్కోప్‌తోనే.. మనందరితో ఎంతో అనుబంధం ఉన్న ఈ స్టెతస్కోప్ చరిత్ర ఇప్పటిది కాదు 200 ఏళ్ల నాటిది. దీన్ని 1816 జనవరి 12న తొలిసారిగా ఉపయోగించారు. ఫ్రెంచ్ వైద్యుడైన రీన్ థియోఫిల్లే హయాసింథే లెన్నెక్ దీన్ని తయారు చేశారు. అప్పటిదాకా హృదయ స్పందనలు తెలుసుకోవాలంటే డాక్టర్ నేరుగా తన చెవిని రోగి ఛాతీపై ఉంచి వినేవారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఓ యువతి లెన్నెక్ దగ్గరికి రాగా, ఆమె ఛాతీపై తల పెట్టేందుకు ఇబ్బంది పడ్డారట. ఈ సంఘటనతో స్టెతస్కోప్ రూపకల్పన చేశారు. ఎన్ని రకాల కొత్త టెక్నాలజీలు వచ్చినా ఇప్పుడు డాక్టర్ చేతిలో స్టెతస్కోప్ ఉండాల్సిందే. 1816.. పారిస్‌లో లెన్నెక్ కనుగొన్నారు. పిల్లనగ్రోవి మాది రిగా ఉండే ఓ కర్ర గొట్టం ద్వారా ఒకే చెవితో గుండె చప్పుడు వినేవారు. 1851 ఆర్థర్ లేర్డ్ అనే ఐరిస్‌కు చెందిన వైద్యుడు 1851లో రెండు చెవుల ద్వారా వినగలిగే స్టెతస్కోప్ తయారు చేశారు. అయితే 1852లో జార్జ్ కామన్ అనే వైద్యుడు దీన్ని మరింతగా మెరుగుపరిచి, ఈ డిజైన్‌ను వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించారు. 1873 ఈ కాలంలో స్టెతస్కోప్లలో అనేక మార్పులు జరిగాయి. అయితే ఇవి క్లినికల్ ప్రాక్టీస్‌లో ప్రాచుర్యంలోకి రాలేదు. 1840.. గోల్డింగ్ బర్డ్ అనే వైద్యుడు వంచేందుకు వీలుండే గొట్టంతో స్టెత్‌ను తయారు చేశారు. దీని సహాయంతో కూడా ఒకే చెవి ద్వారా వినొచ్చు. 1940 తొలి స్టెత్ తయారైన దాదాపు దశాబ్దం తర్వాత రెండు రకాల స్టెతస్కోప్‌లు అభివృద్ధి చెందాయి. ఒకటి శ్వాస వ్యవస్థను తెలుసుకునేందుకు కాగా, రెండోది హృదయ స్పందనలకు సంబంధించింది. ఈ స్టెతస్కోప్ రాను రాను అనేక మార్పులు చెంది ఇప్పుడు మనం చూస్తున్న స్టెత్ రూపుదిద్దుకుంది. -
స్టెతస్కోప్‌కు కాలం చెల్లినట్లే..
స్మార్ట్‌ఫోన్ తరహాలో ఉండే పరికరం అందుబాటులోకి.. న్యూయార్క్: ఇక ముందు మీకు వైద్యులెవరూ స్టెతస్కోప్‌తో కనిపించకపోవచ్చు. రక్తపోటు వంటి ఇతర శారీరక ప్రక్రయలనూ ఓ చిన్ని పరికరంతోనే పరీక్షించొచ్చు. దీంతో గత 200 ఏళ్లుగా వైద్యులు వినియోగిస్తున్న స్టెతస్కోప్‌కు కాలం చెల్లినట్లే. న్యూయార్క్‌లోని మౌంట్ సైని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన భారత సంతతి వైద్యుడు జగత్ నరులా ఈ విషయాన్ని వెల్లడించారు. అల్ట్రా సౌండ్ (తక్కువ పౌనపున్యం ఉన్న ధ్వని) సాంకేతికతతో పనిచేసే ఈ పరికరం కేవలం ఒక స్మార్ట్‌ఫోన్‌లా ఉంటుందని, దానిని మీ గుండె, ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర భాగాలపై ఉంచి పరీక్ష చేయవచ్చని జగత్ తెలిపారు. దీనివల్ల ఫలితాలు కూడా చాలా వరకూ కచ్చితంగా ఉంటాయని పేర్కొన్నారు.