పురుడు పోసేలోపు స్టెతస్కోప్ చోరీ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి ప్రసవం చేస్తున్న సమయంలో డ్యూటీ డాక్టర్ స్టెతస్కోప్‌ను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో కాన్పుల విభాగంలో( లేబర్‌రూమ్) ఈనెల 2వ తేదీన గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమాదేవి విధులు నిర్వహిస్తున్నారు. పలువురు గర్భిణిలకు కాన్పులు చేసే పనిలో డాక్టర్ నిమగ్నమైన సమయంలో సుమారు 25వేల ఖరీదు చేసే ఆమె స్టెతస్కోప్‌ను ఎవరో దొంగిలించారు.
దీనిపై ఈనెల 4వ తేదీన ఆస్పత్రి అధికారులకు ఆమె లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్టెతస్కోప్‌తోపాటు డాక్టర్ బ్యాగ్‌లో ఉన్న 8 వేల రూపాయలు సైతం చోరీకి గురయ్యాయి. అయితే ఈ సంఘటనలో నేటి వరకు ఎలాంటి పురోగతి లేదు. చోరీల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినా, సెక్యూరిటి సిబ్బందిని నియమించినా ఆస్పత్రిలో నిత్యం చోరీలు జరుగుతూ ఉండటం విమర్శలకు తావిస్తోంది.