
గుండె కొట్టుకునే వేగం తెలుసుకోవాలంటే స్టెతస్కోప్ కావాలి. రక్తపోటును బీపీ యంత్రంతోనే కొలవాలి. ఇకపై వీటి అవసరం ఉండబోదని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఇంజనీర్లు అంటున్నారు. రక్తపోటు, గుండె, ఊపిరి వేగాలను తెలుసుకునేందుకు వీరు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. దీనిద్వారా రేడియో తరంగాలను శరీరంలోకి పంపుతూ లోపలి అవయవాల కదలికలను పసిగడతారు. ఇందుకు ఒక సెంట్రల్ రీడర్.. చిన్న బిళ్లల్లాంటివి ఉంటాయి.
బిళ్లలను శరీరానికి దగ్గరగా ఉంచుకుంటే చాలు.. అందులోంచి రేడియో సంకేతాలు శరీరంలోకి ప్రసారమై.. గుండె, ఊపిరితిత్తులు, రక్తం తాలూకూ వివరాలు తెలిసిపోతాయి. బిళ్లలోనే ఉండే మైక్రోప్రాసెసర్ ద్వారా సెంట్రల్ రీడర్‌కు ఈ వివరాలు చేరుతాయి. డాక్టర్ దగ్గర ఉండాల్సిన అవసరం లేకపోవడమే కాకుండా.. ఏకకాలంలో దాదాపు 200 మంది వివరాలను సేకరించొచ్చు. ఒక్కో బిళ్లకు ప్రత్యేకమైన ఐడీ, ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల సమాచారం మారిపోవడమంటూ ఉండదు.