సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో వినియోగమవుతున్న మందులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో అన్ని మందుల కంటే ఎక్కువగా షుగర్ మందులే వినియోగమవుతున్నాయి. పది నెలల కాలంలో 17.72 కోట్ల మెట్‌ఫార్మిన్ మాత్రలు కొనుగోలు చేసి ఆస్పత్రులకు పంపించారు. ఇందులో రమారమి 15 కోట్లు పైనే గడిచిన పదినెలల్లో వినియోగమయ్యాయి.
ఇవి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగమైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులకు వెళ్లి తీసుకున్న వారూ ఉన్నారు. 30 ఏళ్లు దాటిన వారిలో రాష్ట్రంలో కోటికి పైనే మధుమేహ బాధితులు ఉన్నట్టు తాజా అంచనా. ఇటీవలి కాలంలో 35 ఏళ్లు దాటిన వారూ ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పట్టణాల్లో 30 శాతం మధుమేహ బాధితులు ఉన్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి.
బాబోయ్ పెయిన్ కిల్లర్స్!
విధిలేని పరిస్థితుల్లో మినహాయిస్తే నొప్పి నివారిణ మందులు వాడకూడదు. కానీ పెయిన్ కిల్లర్స్‌కు మెజారిటీ జనం అలవాటు పడ్డారు. చిన్న చిన్న నొప్పి వచ్చినా డైక్లోఫినాక్ వంటి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు. వయసుతో పాటు వచ్చే మోకాళ్ల నొప్పులు భరించలేక చాలామంది రోజూ ఒక డైక్లొఫినాక్ మాత్ర వేసుకోవడం పరిపాటిగా మారింది.
ఇలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ జబ్బులకు గురవుతున్నారు. గడిచిన పది నెలల్లో మన రాష్ట్రంలో దాదాపు 14 కోట్ల డైక్లొఫినాక్ మాత్రలు వినియోగమయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జ్వరాల మాత్రలంటే సాధారణమే. ఇవి ఎప్పుడూ వినియోగంలో మొదటి, రెండో స్థానాల్లో ఉంటున్నాయి. ఈసారికూడా అంతే. జీవనశైలి జబ్బుల్లో ప్రధానమైన రక్తపోటు (బీపీ) మాత్రల వినియోగమూ ఎక్కువే. ఆమ్లొడిపైన్ 5 ఎంజీ ఒక్కటే 9.64 కోట్ల మాత్రలు కొన్నారు. ఇలా ఎక్కువ వినియోగం అయిన మాత్రల్లో జీవనశైలి జబ్బులకు సంబంధించినవే ఉన్నాయి.
వ్యాయామం లేకపోవడం వల్లనే..
పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ శారీరక శ్రమ తగ్గిపోతోంది. చాలామంది చిన్న వయసులోనే మధుమేహం బారినపడుతున్నారు. దీంతో పాటు చాలామంది ఒత్తిడిలో ఉండటం కారణమే. కోవిడ్ వచ్చి పోయాక మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఎక్కువ స్టెరాయిడ్స్ వాడి శాశ్వత మధుమేహంలోకి నెట్టడం జరిగింది. శారీరక శ్రమ అన్నిటికంటే ముఖ్యం. యువత మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడి లేకుండా ఉండాలి. వ్యాయామం చేయాలి.
– డాక్టర్ రాంబాబు, డైరెక్టర్, విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
Comments
Please login to add a commentAdd a comment