BP tests
-
2 నెలల్లో అందరికీ బీపీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ పరీక్షలు చేస్తామని, ఇందుకు రూ.33కోట్ల నిధులు కేటాయించామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డేను పురస్కరించుకొని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ)సహకారంతో, గ్లీనీగిల్స్ గ్లోబల్ ఆసుపత్రులు 9000 మందిపై చేసిన సర్వే ఫలితాలను హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్‌లో ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... సీఎస్ఐ సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం, బాధను కల్గిస్తున్నాయన్నారు. కోవిడ్ బారిన పడినవాళ్లలో హైపర్ టెన్షన్ పెరిగినట్టు కనిపిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యని గుర్తించి 90లక్షల మందికి స్క్రీనింగ్ చేస్తే 13లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలిందని చెప్పారు. నిమ్స్ చేసిన ఓ సర్వే ప్రకారం... కిడ్నీ సమస్యలున్న వారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు వెల్లడైందన్నారు. ఇటీవలి కాలంలో ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారనీ, జీవనశైలి మార్పులు కూడా ఈ సమస్యను మరింత పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ, షుగర్‌ను ముందుగా గుర్తించి జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకంగా మారతాయని హెచ్చరించారు. బస్తీదవాఖానాలో పరీక్షల సంఖ్య పెంచుతాం.. రాష్ట్రంలో విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్న మంత్రి.. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌లో తెలంగాణ దేశంలోనే 3 స్థానంలో ఉందని, మరో నాలుగు నెలల్లో మొదటి స్థానంలోకి తీసుకొస్తామని తెలిపారు. నగరంలోని 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రస్తుతం 57 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల నుంచి ఆ సంఖ్యను 120కి పెంచుతామని తెలిపారు. పరీక్షలతో పాటు ఉచితంగా మందులు ఇస్తున్నామని, అవి వాడుతున్నారో, లేదో తెలుసుకునేందుకు కాల్ సెంటర్‌నూ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. పరీక్షల ఫలితాల రిపోర్టులను 24 గంటల్లో మొబైల్ ద్వారా పేషెంట్‌కు, డాక్టర్లకు పంపిస్తున్నామని వివరించారు. ఆయుష్ ఆధ్వర్యంలో 450 వెల్నెస్ సెంటర్ల ద్వారా ఆరోగ్యం పట్ల శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని తెలిపారు. -
మధుమేహం.. మాత్రల వ్యామోహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో వినియోగమవుతున్న మందులే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రంలో అన్ని మందుల కంటే ఎక్కువగా షుగర్ మందులే వినియోగమవుతున్నాయి. పది నెలల కాలంలో 17.72 కోట్ల మెట్ఫార్మిన్ మాత్రలు కొనుగోలు చేసి ఆస్పత్రులకు పంపించారు. ఇందులో రమారమి 15 కోట్లు పైనే గడిచిన పదినెలల్లో వినియోగమయ్యాయి. ఇవి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగమైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులకు వెళ్లి తీసుకున్న వారూ ఉన్నారు. 30 ఏళ్లు దాటిన వారిలో రాష్ట్రంలో కోటికి పైనే మధుమేహ బాధితులు ఉన్నట్టు తాజా అంచనా. ఇటీవలి కాలంలో 35 ఏళ్లు దాటిన వారూ ఎక్కువగా మధుమేహం బారిన పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పట్టణాల్లో 30 శాతం మధుమేహ బాధితులు ఉన్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. బాబోయ్ పెయిన్ కిల్లర్స్! విధిలేని పరిస్థితుల్లో మినహాయిస్తే నొప్పి నివారిణ మందులు వాడకూడదు. కానీ పెయిన్ కిల్లర్స్‌కు మెజారిటీ జనం అలవాటు పడ్డారు. చిన్న చిన్న నొప్పి వచ్చినా డైక్లోఫినాక్ వంటి పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారు. వయసుతో పాటు వచ్చే మోకాళ్ల నొప్పులు భరించలేక చాలామంది రోజూ ఒక డైక్లొఫినాక్ మాత్ర వేసుకోవడం పరిపాటిగా మారింది. ఇలా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ జబ్బులకు గురవుతున్నారు. గడిచిన పది నెలల్లో మన రాష్ట్రంలో దాదాపు 14 కోట్ల డైక్లొఫినాక్ మాత్రలు వినియోగమయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జ్వరాల మాత్రలంటే సాధారణమే. ఇవి ఎప్పుడూ వినియోగంలో మొదటి, రెండో స్థానాల్లో ఉంటున్నాయి. ఈసారికూడా అంతే. జీవనశైలి జబ్బుల్లో ప్రధానమైన రక్తపోటు (బీపీ) మాత్రల వినియోగమూ ఎక్కువే. ఆమ్లొడిపైన్ 5 ఎంజీ ఒక్కటే 9.64 కోట్ల మాత్రలు కొన్నారు. ఇలా ఎక్కువ వినియోగం అయిన మాత్రల్లో జీవనశైలి జబ్బులకు సంబంధించినవే ఉన్నాయి. వ్యాయామం లేకపోవడం వల్లనే.. పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ శారీరక శ్రమ తగ్గిపోతోంది. చాలామంది చిన్న వయసులోనే మధుమేహం బారినపడుతున్నారు. దీంతో పాటు చాలామంది ఒత్తిడిలో ఉండటం కారణమే. కోవిడ్ వచ్చి పోయాక మానసిక స్థితి సరిగా లేకపోవడం, ఎక్కువ స్టెరాయిడ్స్ వాడి శాశ్వత మధుమేహంలోకి నెట్టడం జరిగింది. శారీరక శ్రమ అన్నిటికంటే ముఖ్యం. యువత మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడి లేకుండా ఉండాలి. వ్యాయామం చేయాలి. – డాక్టర్ రాంబాబు, డైరెక్టర్, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ -
గిన్నిస్ బుక్‌లో ‘గాంధీ ఆస్పత్రి’
హైదరాబాద్: తెలంగాణ వైద్య ప్రదాయిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి చరిత్రలో మరో మైలురాయి అధిగమించింది. గంట వ్యవధిలో అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఆస్పత్రి సెమినార్ హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్, జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ రాజారావు, వైద్యులు వినయ్‌శేఖర్, ఆర్ఎంవోలు జయకృష్ణ, శేషాద్రి, సత్యరత్న ఈ వివరాలను వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన గాంధీ ఆస్పత్రిలో గంట వ్యవధిలో 11,416 మందికి బ్లడ్‌ప్రెషర్ (బీపీ) రీడింగ్‌లు నమోదు చేశారు. దేశంలోని 37 కేంద్రాల్లో ఏకకాలంలో ఈ ప్రక్రియ కొనసాగగా, అత్యధికంగా బీపీ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆస్పత్రి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుందని వారు వివరించారు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి శుక్రవారం అధికారికంగా సర్టిఫికెట్ అందిందని తెలిపారు. -
స్టెతస్కోప్, బీపీ యంత్రాలకు చెల్లు?
గుండె కొట్టుకునే వేగం తెలుసుకోవాలంటే స్టెతస్కోప్ కావాలి. రక్తపోటును బీపీ యంత్రంతోనే కొలవాలి. ఇకపై వీటి అవసరం ఉండబోదని అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఇంజనీర్లు అంటున్నారు. రక్తపోటు, గుండె, ఊపిరి వేగాలను తెలుసుకునేందుకు వీరు కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. దీనిద్వారా రేడియో తరంగాలను శరీరంలోకి పంపుతూ లోపలి అవయవాల కదలికలను పసిగడతారు. ఇందుకు ఒక సెంట్రల్ రీడర్.. చిన్న బిళ్లల్లాంటివి ఉంటాయి. బిళ్లలను శరీరానికి దగ్గరగా ఉంచుకుంటే చాలు.. అందులోంచి రేడియో సంకేతాలు శరీరంలోకి ప్రసారమై.. గుండె, ఊపిరితిత్తులు, రక్తం తాలూకూ వివరాలు తెలిసిపోతాయి. బిళ్లలోనే ఉండే మైక్రోప్రాసెసర్ ద్వారా సెంట్రల్ రీడర్‌కు ఈ వివరాలు చేరుతాయి. డాక్టర్ దగ్గర ఉండాల్సిన అవసరం లేకపోవడమే కాకుండా.. ఏకకాలంలో దాదాపు 200 మంది వివరాలను సేకరించొచ్చు. ఒక్కో బిళ్లకు ప్రత్యేకమైన ఐడీ, ఫ్రీక్వెన్సీ ఉండటం వల్ల సమాచారం మారిపోవడమంటూ ఉండదు. -
పెట్‌తో సన్నిహితం!
డాక్టర్ సలహా నా వయసు 40 ఏళ్లు. ఈ గత ఆరు నెలలుగా దగ్గు, ఆయాసం వస్తున్నాయి. చర్మం మీద దద్దుర్లు కూడా వస్తున్నాయి. నాకు నా పెట్(కుక్కపిల్ల)ని ఒళ్లో పెట్టుకునే అలవాటు ఉంది. అది గోళ్లతో నా ఒంటి మీద గీకుతూ ఉంటుంది, దాని ముఖాన్ని నా ముఖం మీద ఆనిస్తూ ఉంటుంది. నా ఆరోగ్య సమస్యలకు ఈ అలవాటే కారణం కావచ్చా? నాకు గతంలో ఇలాంటి సమస్యలేవీ లేవు. ఏడాది కాలంగా పెట్ని పెంచుకోవడం మొదలు పెట్టాను. మా పెట్‌కి వ్యాక్సిన్లు వేయిస్తున్నాను. - ఎమ్. నీరజ, హనుమాన్ జంక్షన్ మీ సమస్యకు ఆస్త్మా కారణం కావచ్చు, ముందుగా బ్లడ్‌టెస్ట్ (హిమోగ్రామ్), ఎక్స్‌రే (ఛాతీ), లంగ్ ఫంక్షన్ టెస్ట్, ఈసిజి (టు డి ఎఖో), బిపి పరీక్షలు చేయాలి. ఈ పరీక్షల నివేదికలన్నీ నార్మల్‌గా ఉంటే అప్పుడు మీకు పెట్ కారణంగానే ఈ సమస్య వచ్చినట్లు అనుకోవాలి. పెట్స్‌తో సన్నిహితంగా మెలగడం వల్ల కొందరిలో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వస్తాయి. దాంతో మీరు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి మీరు కొంతకాలం పెట్స్‌కు దూరంగా ఉండి మార్పును గమనించాలి. కుక్కలు ఇంట్లో తిరుగుతుంటే వాటి నుంచి కొన్ని పరాన్నజీవులు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి దేహంలో చాలా అవయాల మీద ప్రభావం చూపిస్తాయి. ముందుగా చిన్న సిస్ట్లు ఏర్పడి క్రమంగా అవి పెద్దవుతూ దేహంలో కొంత స్పేస్‌ని ఆక్రమిస్తాయి. ఏ అవయవంలో సిస్ట్ ఏర్పడితే ఆ అవయవం రోగగ్రస్తమవుతుంది. కొందరిలో లివర్ పెరగడం, జ్వరం రావడం, ఊపిరితిత్తుల్లో ఉంటే దగ్గు రావడం, మెదడులో ఏర్పడితే ఫిట్స్, తలనొప్పి రావడం, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు కలుగుతుంది. కుక్క పరిశుభ్రంగా లేకపోతే దాని నుంచి పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం మరీ ఎక్కువ. కుక్కల నుంచి సంక్రమించే ఇకైనో కోకస్ అనే పరాన్నజీవిని నివారించే వ్యాక్సిన్ ఏదీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. - డాక్టర్ గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్