పెట్‌తో సన్నిహితం!
డాక్టర్ సలహా
నా వయసు 40 ఏళ్లు. ఈ గత ఆరు నెలలుగా దగ్గు, ఆయాసం వస్తున్నాయి. చర్మం మీద దద్దుర్లు కూడా వస్తున్నాయి. నాకు నా పెట్(కుక్కపిల్ల)ని ఒళ్లో పెట్టుకునే అలవాటు ఉంది. అది గోళ్లతో నా ఒంటి మీద గీకుతూ ఉంటుంది, దాని ముఖాన్ని నా ముఖం మీద ఆనిస్తూ ఉంటుంది. నా ఆరోగ్య సమస్యలకు ఈ అలవాటే కారణం కావచ్చా? నాకు గతంలో ఇలాంటి సమస్యలేవీ లేవు. ఏడాది కాలంగా పెట్‌ని పెంచుకోవడం మొదలు పెట్టాను. మా పెట్‌కి వ్యాక్సిన్లు వేయిస్తున్నాను.
- ఎమ్. నీరజ, హనుమాన్ జంక్షన్
మీ సమస్యకు ఆస్త్మా కారణం కావచ్చు, ముందుగా బ్లడ్‌టెస్ట్ (హిమోగ్రామ్), ఎక్స్‌రే (ఛాతీ), లంగ్ ఫంక్షన్ టెస్ట్, ఈసిజి (టు డి ఎఖో), బిపి పరీక్షలు చేయాలి. ఈ పరీక్షల నివేదికలన్నీ నార్మల్‌గా ఉంటే అప్పుడు మీకు పెట్ కారణంగానే ఈ సమస్య వచ్చినట్లు అనుకోవాలి. పెట్స్‌తో సన్నిహితంగా మెలగడం వల్ల కొందరిలో హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వస్తాయి. దాంతో మీరు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి మీరు కొంతకాలం పెట్స్‌కు దూరంగా ఉండి మార్పును గమనించాలి.
కుక్కలు ఇంట్లో తిరుగుతుంటే వాటి నుంచి కొన్ని పరాన్నజీవులు మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఇవి దేహంలో చాలా అవయాల మీద ప్రభావం చూపిస్తాయి. ముందుగా చిన్న సిస్ట్‌లు ఏర్పడి క్రమంగా అవి పెద్దవుతూ దేహంలో కొంత స్పేస్‌ని ఆక్రమిస్తాయి. ఏ అవయవంలో సిస్ట్ ఏర్పడితే ఆ అవయవం రోగగ్రస్తమవుతుంది. కొందరిలో లివర్ పెరగడం, జ్వరం రావడం, ఊపిరితిత్తుల్లో ఉంటే దగ్గు రావడం, మెదడులో ఏర్పడితే ఫిట్స్, తలనొప్పి రావడం, వాంతులు వంటి సమస్యలు వస్తుంటాయి.
ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు కలుగుతుంది. కుక్క పరిశుభ్రంగా లేకపోతే దాని నుంచి పరాన్న జీవులు మనిషి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం మరీ ఎక్కువ. కుక్కల నుంచి సంక్రమించే ఇకైనో కోకస్ అనే పరాన్నజీవిని నివారించే వ్యాక్సిన్ ఏదీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు.
- డాక్టర్ గోవర్ధన్, సీనియర్ ఫిజీషియన్