ప్రజలకు ఆరోగ్య హక్కును పరిపూర్ణంగా అందించేందుకంటూ రాజస్తాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టం (రైట్ టు హెల్త్) దుమారం రేపుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో రోగులు ముందుగా డబ్బులు చెల్లించకపోయినా ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులు విధిగా చికిత్స చేసి తీరాలని చెబుతోంది. దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రైవేటు వైద్యులు మెరుపు సమ్మెలకు దిగారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెలో లక్ష మంది ప్రైవేటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో దాదాపుగా 2,500 ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన వైద్యులు రెండు వారాలుగా ఉధృతంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
దాంతో అత్యవసర పరిస్థితుల్లోనూ చికిత్స అందించే వైద్యుల్లేక రాష్ట్రంలో రోగులు అల్లాడుతున్నారు. వైద్యం కోసం పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని సీఎం గహ్లోత్ అంటున్నారు. 2018 ఎన్నికల హామీని నెరవేర్చామని చెబుతున్నారు. దేశంలో తొలిసారి రాజస్తానే ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్య మంత్రి ప్రసాద్ లాల్ మీనా గర్వంగా ప్రకటించారు. మరోవైపు ప్రైవేటు డాక్టర్ల వాదన కూడా విని, వారి ఆందోళనలను సీఎం తీర్చాలని కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్ హితవు పలికారు. అలా ఈ చట్టం అధికార కాంగ్రెస్‌లోనూ అంతర్గత పోరుకు దారి తీయొచ్చంటున్నారు.
ఏమిటీ చట్టం?
ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనారోగ్యంతో అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు డాక్టర్లు వైద్యం నిరాకరించకూడదు. ముందుగా డబ్బులు చెల్లించకపోయినా చికిత్స అందించి తీరాలి. చికిత్స పూర్తయ్యాక రోగి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రమాదాలు, పాము కాట్లు, గర్భిణుల ప్రసవంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన ఏ పరిస్థితులైనా ఎమర్జెన్సీ కిందకు వస్తాయి. వాటికి వైద్యం నిరాకరించే ఆస్పత్రి/వైద్యుడు తొలిసారి 10 వేలు జరిమానా చెల్లించాలి. ఆ తర్వాత 25 వేలు, అలా పెరుగుతూ పోతుంది.
చట్టంలో స్పష్టత లేని విషయాలివే!
► ఎమర్జెన్సీ అంటే చట్టంలో సరిగ్గా వివరించలేదు. ఒక్కోసారి తలనొప్పి కూడా
అత్యవసర పరిస్థితి కిందకు వచ్చి బ్రెయిన్ హెమరేజ్‌కి దారి తీయవచ్చు.
► ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా?
► వైద్య పరీక్షలకయ్యే ఖర్చుల సంగతేమిటి? కడుపు నొప్పి, తలనొప్పితో వచ్చి పరీక్షలన్నీ చేశాక తీరా అది ఎమర్జెన్సీ కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందా?
► బిల్లు పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం ఆ సొమ్ముల్ని తిరిగి చెల్లిస్తుంది? ప్రైవేటు ఆస్పత్రులు ఎన్నాళ్లు వేచి చూడాలి?
ప్రైవేటు వైద్యుల నిరసనలెందుకు?
► ప్రైవేటు ఆస్పత్రులను పూర్తిగా రూపుమాపాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని చేశారని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. వైద్యుల జీవించే హక్కును కాలదన్నేలా ఈ చట్టం ఉందని, ఎమర్జెన్సీ అంటూ రోగులు వస్తే వారి సమస్య ఎలాంటిదైనా చికిత్స తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన వల్ల ఇక కనీస విశ్రాంతి కూడా దొరకదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్పత్రులు తమ బాధ్యతను చాకచక్యంగా ప్రైవేటు ఆస్పత్రులపై నెట్టేస్తున్నాయన్న వాదనలున్నాయి. రోగులు బిల్లులు చెల్లించలేని పక్షంలో వాటిని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో చట్టంలో స్పష్టత లేదని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ చట్టం అమలు సరిగ్గా జరగకపోతే రోగులకు, డాక్టర్లకు మధ్య పరస్పరం అపనమ్మకం ఎక్కువైపోతుందని వైద్యుల్లో ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘‘దీన్ని ఆరోగ్య హక్కు చట్టం అని పిలుస్తున్నారు. కానీ ఇందులో రోగుల హక్కుల కంటే వైద్యుని బాధ్యతలే ఎక్కువ! దీన్ని బలవంతంగా రుద్దితే వైద్యులు ఆర్థికంగా, వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు’’అని జైపూర్‌కు చెందిన డాక్టర్ బ్రూనో అన్నారు.
వైద్యులకు వేధింపులు తప్పవా?
► ప్రైవేటు క్లినిక్‌లో డాక్టర్ చికిత్స ఇవ్వడానికి నిరాకరిస్తే అతనిపై రోగి న్యాయపరమైన చర్యలకు దిగొచ్చు. చట్టంలోని ఈ నిబంధన వల్ల తాము వేధింపులకి గురి కాక తప్పదని, అధికార యంత్రాంగం జోక్యం పెరిగిపోయి తప్పుడు కేసులు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని ప్రైవేటు డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ‘‘ఎవరికైనా చిన్న ప్రైవేటు క్లినిక్ ఉంటే ఎమర్జెన్సీ కింద 24 గంటలు తెరిచి ఉంచడం కష్టం. వైద్యులకు వ్యక్తిగత జీవితం ఉండదా? రోగులు కేసు పెడితే దాన్ని సవాల్ చేసే అవకాశం వైద్యులకు లేకుండా చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల్ని వేధించేందుకే’’అని జైపూర్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అమిత్ యాదవ్ విమర్శించారు.
ఉద్దేశం మంచిదే కానీ...
► రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్న వైద్యులు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు అందరికీ ఆరోగ్యం అందించాలనే ఆ చట్టం స్ఫూర్తికి తాము మద్దతుగానే నిలుస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినా చట్టంలో ఎన్నో లొసుగులున్నాయని డాక్టర్ పార్థ శర్మ అన్నారు. వాటినన్నింటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే మంచి కంటే చెడే జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment