
డాక్టర్లకు నజరానా
‘కేసీఆర్ కిట్’ పథకంలో ప్రభుత్వ వైద్యులకు ప్రోత్సాహకం
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్ పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు డాక్టర్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రసవం చేసే వైద్యులకు రూ. 500.. నర్సులు, ఇతర సహాయక సిబ్బందికి రూ. 500 ఇవ్వనుంది. గిరిజన ప్రాంతా ల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో రూ.1,500 ఇవ్వాలని నిర్ణ యించిన ప్రభుత్వం.. అందులో వైద్యులకు రూ.500, సిబ్బందికి రూ.వెయ్యి ఇవ్వనుంది. పథకంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ. 12 వేలు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రసవం తర్వాత బాలింతకు, శిశువుకు 16 రకాల వస్తువులతో కిట్ ఇవ్వనున్నారు. ప్రోత్సాహకాలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి.
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేట్ వైద్యుల సేవలు..
వచ్చే నెల 3న కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారం భించనుంది. పథకం కింద ప్రసవం చేయించుకోడానికి ఇప్పటికే 2 లక్షల మందికిపైగా గర్భిణులు పేర్లు నమోదు చేసుకున్నారు. పథకానికి పెద్దఎత్తున స్పందన వస్తుం డటం.. ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రైవేట్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఒక్కో పీహెచ్‌సీ, సీహెచ్‌సీకి రూ. 5 లక్షల వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారని అధికారులు చెబుతున్నారు. దాదాపు 500 మందికిపైగా ప్రైవేట్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్న ప్రభుత్వం.. వారిని గుర్తించే బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. అయితే ఈ ప్రైవేట్ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి గర్భిణులకు ప్రసవం చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది.