government doctors
-
నేడు పీహెచ్సీ వైద్యుల చలో విజయవాడ
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ యూనస్‌మీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చలకు ప్రభుత్వం పిలుస్తామని చెప్పడంతో సోమవారం వేచి చూసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందు నిర్దేశించుకున్నట్లు మంగళవారం చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ వైద్యులు విజయవాడలో ర్యాలీ నిర్వహించి ధర్నాచౌక్‌లో శాంతియుత నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించబోమని స్పష్టం చేశారు. -
కోఠిలో కలకలం.. ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్ల దాడి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద కలకలం రేగింది. ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో డీఎంఈ కార్యాలయం ముందు బాధిత వైద్యుడు డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు.సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డీఎంఈకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని.. ఈ జీవో అమలు చేస్తే హైదరాబాద్‌లో పని చేస్తున్న వైద్యులు జిల్లాలకు, జిల్లాలలో పని చేస్తున్న వాళ్లు హైదరాబాద్‌కు 40 శాతం మేర బదిలీలు జరుగుతాయి. ఈ బదిలీ లను అడ్డుకునేందుకు డాక్టర్ పల్లం ప్రవీణ్ కుమార్, బొంగు రమేష్, రాథోడ్ , వినోద్ కుమార్‌లు కుట్ర చేస్తున్నారని డాక్టర్ శేఖర్ ఆరోపించారు.తాను డీఎంఈకు వినతి పత్రం ఇవ్వకుండా తనను అడ్డుకుని. తనపై దాడి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీ లోనే తిష్ట వేశారు. వాటిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకొనేంత వరకు తాను డీఎంఈ కార్యాలయం ముందే బైఠాయిస్తానని వైద్యుడు శేఖర్ చెబుతున్నారు. -
ఏదయా.. ఉస్మా‘నయా’
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవన నిర్మాణంతో పాటు ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పేద రోగుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే నూతన భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ వైద్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేబూని పెద్దపెట్టున నినదించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగానే సచివాలయ నిర్మాణం ఎలా పూర్తయిందని ప్రశ్నించారు. పాతబస్తీలోని మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒవైసీ సోదరులు ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని డిమాండ్ చేశారు. గురువారం నుంచి అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అయిదు రోజుల పాటు వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు పల్లం ప్రవీణ్, బొంగు రమేష్, అజ్మీరా రంగా, లాలూ నాయక్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. – అఫ్జల్‌గంజ్ -
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు చేయకుండా నిషేధం విధిస్తూ వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నేరుగా నియమితులైన క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలకు చెందిన స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు వైద్యులు గానీ, బోధనేతర విభాగం నుంచి బదిలీపై వచ్చిన వైద్యనిపుణులు గానీ ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య విభాగంలో ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో చేరే వైద్యులకు, తెలం గాణ వైద్య విధాన పరిషత్ విభాగాల పరిధిలో స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా నియమితు లయ్యే వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమితులయ్యే డాక్టర్లంద రికీ ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం నిబంధన వర్తిస్తుంది. కొత్తగా నియమితులయ్యే డాక్టర్లంతా తమ అర్హత ధ్రువపత్రాలను రాష్ట్ర వైద్య మండలిలో తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 12,755 వైద్య పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయ నుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం పోస్టు లను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేయనుం డగా..ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. డీఎంఈ పరిధిలోని కాలేజీల్లో నియమితులయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసింది. ఏడాది సీనియర్ రెసిడెంట్ అనుభవం క్లినికల్ విభాగంలో మొత్తం 18 రకాల స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తారు. వాటికి అర్హత వివరాలను మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, రెస్పి రేటరీ మెడిసిన్, సైకియాట్రీ, డెర్మటాలజీ, వెనిరీయోలజీ లెప్రసీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, రేడియో డయాగ్నసిస్, రేడియేషన్ ఆంకాలజీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, హాస్పిటల్ అడ్మిన్, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్ క్లినికల్ పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఎండీ/డీఎన్బీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే ఎండీ పూర్తి చేసిన తర్వాత ఏడాదిపాటు సీనియర్ రెసిడెంట్లుగా పనిచేసిన అనుభవం ఉండాలి. 500కు పైగా పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. ఒక ఏడాది సీనియర్ రెసిడెంట్‌గా పని చేయాలి. ఒకవేళ 500లోపు పడకలున్న ఆసుపత్రిలో డీఎన్బీ కోర్సు చేస్తే.. రెండేళ్లపాటు సీనియర్ రెసిడెంట్‌గా సేవలందించిన వారే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులవుతారని స్పష్టం చేశారు. నాన్ క్లినికల్ విభాగంలో... నాన్ క్లినికల్ విభాగంలో అసిస్టెంట్ పోస్టులుగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకా లజీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఉన్నాయి. వీటికి ఎండీ/ డీఎన్బీ/ఎంఎస్ చదివి ఉండాలి. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీలకు సబ్జెక్టుల్లో ఎండీ తత్సమాన కోర్సు చేసినవారు లేకుంటే ఆ కోర్సుల్లో ఎంఎస్సీ (పీహెచ్డీ) చేసిన వారిని 15% వరకు తీసుకోవచ్చు. ఈ పోస్టుల్లో చేరేవారు ఏడాదిపాటు ట్యూటర్‌గా పనిచేసిన అను భవం ఉండాలి. సూపర్ స్పెషాలిటీలో.. సూపర్ స్పెషాలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగం లో కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, థోరాసిక్ సర్జరీ/కార్డియాక్ సర్జరీ (సీటీ సర్జరీ), యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ పోస్టులున్నాయి. వీటికి ఆయా కోర్సులను బట్టి డీఎం/డీఎన్బీ లేదా ఎంసీ హెచ్/డీఎన్బీ చదివి ఉండాలి. కాగా, విదేశాల్లో 18 రకాల పీజీ కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తారా లేదా అన్న విషయంపై ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు. వైద్యుల వ్యతిరేకత.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయ కుండా నిషేధం విధించడంపై పలువురు వైద్యులు వ్యతిరే కత వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం తక్కువ వేతనాలు ఇస్తూ, ఇలా నిషేధం విధించడం తగదన్నారు. కనీ సం ప్రోత్సాహకాలు ఇవ్వడమో లేదా నిమ్స్ మాదిరిగా సాయంత్రం వేళల్లో పనిచేస్తే ఆదా యం వచ్చే మార్గమైనా వెతికే పనిచేస్తే బాగుంటుందని అంటున్నారు. -
Sakshi Cartoon: ఇక్కడే ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటారంట!
ప్రైవేటు ప్రాక్టీస్ ఎత్తేశారంట సార్..! దానికి బదులు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటారంట! -
నిర్లక్ష్యాన్ని సహించం.. వైద్య సిబ్బందికి మంత్రి విడదల రజని హెచ్చరిక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన డాక్టర్ బాషాను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఉదంతంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక అందిందని.. తదుపరి క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు బాషాను హెడ్ క్వార్టర్ వదిలివెళ్లొద్దని ఆదేశించామన్నారు. ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే సీఎం జగన్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసమే దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిందని వివరించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునికీకరణ, అధునాతన వైద్య పరికరాలు.. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 108, 104తో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం విస్తరించిందని పేర్కొన్నారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా 18,450 మంది తల్లులు, శిశువులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు. -
ధర్మాసుపత్రిలో దాష్టీకం: డాక్టర్లు ప్రాక్టీసుకు.. పేషెంట్లు ప్రయివేటుకు..
కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన రాజనర్సుకు ప్రమాదంలో కుడికాలు విరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ఆటోలో రాగానే అక్కడే కాచుకుని కూర్చున్న అంబులెన్స్ నిర్వాహకులు రాజనర్సు బంధువులను అడ్డగించి ‘ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు.. ఇక్కడ వైద్యులు లేరు. ఉన్నా వైద్యం సరిగా చేయక ప్రాణాల మీదకు తెస్తారని’ భయబ్రాంతులకు గురిచేసి వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇలా వచ్చిన పేషెంట్లను వచ్చినట్లు ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ అంబులెన్స్‌ల నిర్వాహకులు కమీషన్లు దండుకుంటున్నారు. సాక్షి, కరీంనగర్: జిల్లా ఆస్పత్రిలో కమీషన్ల కాసులవర్షం కురుస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు పైసా ఖర్చు లేకుండా వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తుంటే... కొంతమంది కమీషన్లకు కక్కుర్తిపడి పేద రోగులకు ప్రభుత్వ వైద్యం అందకుండా చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు మధ్యాహ్నానికే ‘ప్రయివేటు’ ప్రాక్టీసుకు వెళ్లిపోగా.. అదనుచూసి అంబులెన్స్ డ్రైవర్లు ఆస్పత్రి ఆవరణలో తిష్ట వేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారిని ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఆస్పత్రిలో వైద్యం చేసేందుకు డాక్టర్లు లేదని, ఉన్నా పట్టించుకోరని, తీరా ప్రాణాల మీదకు వచ్చాక ఎక్కడికి పోతారని పేషెంట్ల బంధువులను భయబ్రాంతులకు గురిచేసి ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తూ కమీషన్లు దండుకుంటున్నారు. అవసరమైతే ఉచితంగా అంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఈ దందా యథేచ్చగా సాగుతుండగా.. ఈ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం కొసమెరుపు. చదవండి: (దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా) ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అండతో: ప్రైవేటు అంబులెన్స్‌లను ప్రభుత్వాసుత్రి కంపౌండ్ వెలుపలే ఉంచాలి. కానీ గత కొద్ది రోజులుగా ప్రభుత్వాసుపత్రి సిబ్బంది అండదండలతో కంపౌండ్‌లో అడ్డా పెట్టి అంబులెన్స్‌లకు సీరియల్ నంబర్లు కూడా కేటాయిస్తున్నారు. పేషెంట్ల బంధువులు ద్విచక్రవాహనాలపై వస్తే దూరంగా పార్కింగ్ చేయిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రైవేటు ఆంబులెన్స్‌లకు మాత్రం ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసుకునేందుకు స్థలాలు చూపిస్తున్నారు. దగ్గరుండి పేషెంట్లను అంబులెన్స్‌లలో ప్రైవేటుకు తరలిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ: అంబులెన్స్‌ల ద్వారా పేషెంట్లను తీసుకువచ్చే వారికి 30 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నారు. కమీషన్లు ఇచ్చేందుకు పేషెంట్లను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వైద్యం పొందాల్సిన పేషెంట్లను ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. సెక్యూరిటీ, పీఆర్వోలకు చెప్పాం. ప్రైవేటు ఆంబులెన్స్‌లు కంపౌండ్లోపల పార్కింగ్‌లో పెట్టకూడదని సెక్యూరిటీకి, పీఆర్వోలకు చెప్పాం. ఎవరూ కంపౌండ్ లోపల ప్రైవేటు ఆంబులెన్స్‌లు పెట్టకుండా చర్యలు చేపడతాం. – డాక్టర్ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో -
విస్తారా బంపరాఫర్: వారికి ఉచితంగా విమానయానం
ముంబై: కోవిడ్ విస్తరిస్తున్న వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపరాఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. విస్తారా ఎయిర్‌లైన్స్ ఆదివారం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగా తమ విమానంలో ప్రయాణించొచ్చు అని విస్తారా ప్రకటించింది. ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. ఇక ఉచిత ప్రయాణం ఆఫర్లో విస్తారా ఒక కండీషన్ పెట్టింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను -
సమ్మెకు విరామం
ప్రభుత్వ వైద్యులు ఎట్టకేలకువెనక్కుతగ్గారు. వారంరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీరిపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకుసిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా సమ్మెనువిరమించారు. సమ్మెకుదిగిన వైద్యులంతా శుక్రవారం విధులకు హాజరుకావడంతో రోగులకు కొంత ఊరటలభించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల పోస్టులను పెంచాలని, విద్యార్హతకు సమానంగా వేతనాలు చెల్లించాలని, వైద్య విద్యలో పీజీకి ప్రభుత్వ డాక్టర్లకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, పీజీ వైద్య విద్యార్థులకు నియామక ఇంటర్వ్యూలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ వైద్యులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ వైద్యులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించడం, రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వ డాక్టర్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి, ఉన్నతాధికారులు గతంలో అనేకసార్లు చర్చలు జరిపారు. ఆరు వారాల్లోగా డిమాండ్లను నెరవేరుస్తామని అప్పట్లో మంత్రి విజయభాస్కర్ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు. రోజులుగడుస్తున్నా హామీల అమలును ప్రభుత్వం దాటవేయడంతో అక్టోబర్ 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో గత నెల 25వ తేదీన వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. సుమారు 15 వేల మంది వైద్యుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి. సాధారణ చికిత్సతోపాటు అత్యవసర విభాగం వైద్యులు సైతం సమ్మెకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకులోనయ్యారు. గురువారం ఉదయం చెన్నై జీహెచ్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి ప్రాంగణంలోని వైద్యులను సమ్మె విరమించాల్సిందిగా కోరారు. సమ్మెకు మద్దతుగా బయటి ప్రాంతాల నుంచి వస్తున్నవారిని అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా వైద్యులు నినాదాలు చేశారు. సమ్మెను తీవ్రం చేయడంలో భాగంగా హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు సమ్మెలో పాల్గొనేలా చేశారు. ప్రభుత్వం, వైద్యుల సంఘం ఎవరికివారు పంతాలకు పోవడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ దశలో వైద్యులచేత సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం చొరవచూపేలా ఆదేశించాలని సూర్యప్రకాశం అనే న్యాయవాది గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ విజయభాస్కర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో క్రమశిక్షణ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైనారు. సమ్మెలో ఉన్న సుమారు 50 మంది వైద్యులను గురువారం ఆకస్మిక బదిలీ చేశారు. సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే ఎస్మా చట్టం కింద డిస్మిస్ చేసి, వారి స్థానంలో కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. ఈ పరిణామంతో భీతిల్లిన 2,160 మంది సాయంత్రానికి విధుల్లో చేరారు. శుక్రవారం ఉదయం విధుల్లో చేరని వైద్యుల స్థానాలను ఖాళీలుగా ప్రకటించి కొత్తవారితో భర్తీ చేస్తామని మంత్రి మరోసారి హెచ్చరించారు. అంతేగాక 188 కొత్త డాక్టర్లకు శుక్రవారం నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ సర్వం సిద్ధం చేసుకున్నారు. వైద్యులు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మె విరమిస్తే చర్యలకు సిద్ధమని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు గడువు విధించారు. ఈ పరిణామాలతో దిగొచ్చిన వైద్యుల సంఘం ప్రతినిధులు సమ్మెను తాత్కాలికంగా విరమించి విధుల్లో చేరుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వైద్యులకు ధన్యవాదాలు :మంత్రి విజయభాస్కర్ ప్రభుత్వ విన్నపాన్ని మన్నించి సమ్మెను విరమించిన వైద్యులకు ధన్యవాదాలని మంత్రి విజయభాస్కర్ అన్నారు. మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ, సమ్మెను విరమించినందున ఇప్పటి వరకున్న వైద్యుల సర్వీసును రద్దు (బ్రేక్ ఇన్ సర్వీస్)చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించినట్లు తెలిపారు. -
‘మెడికల్ పీజీ ఇన్ సర్వీస్’ ను పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని కలిశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇన్ సర్వీసు కోటాను పునరుద్ధరించాలని ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ అమలు చేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ప్రసవాల కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావాలని, తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ పోస్టును విధిగా సీనియర్ వైద్యునికే ఇవ్వాలని విజ్ఞఫ్తి చేశారు. శనివారం వారు సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో సమావేశమై దాదాపు రెండు గంటలపాటు తమ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో అధికారులతోపాటు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.నరహరి, కోశాధికారి డాక్టర్ రవూఫ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(ప్రజారోగ్య విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్, సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలు ప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, రాష్ట్ర కోశాధికారి దీన్‌దయాళ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నాగార్జున, డాక్టర్ సాయిబాబా, డాక్టర్ వినోద్, డాక్టర్ సాల్మన్, డాక్టర్ రవితేజ, డాక్టర్ దాక్షాయణి తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం ఆ రెండు సంఘాల నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అవకాశమున్న మేరకు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారని నరహరి తెలిపారు. వైద్యుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వైద్యులు కూ డా ప్రజలకు సేవచేయడానికి అంతే చిత్తశుద్ధి తో పనిచేయాలని మంత్రి కోరారన్నారు. నాణ్యమైన వైద్యం సామాన్యులకు అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుల డిమాండ్లు ఇవీ... ►2016లో యూజీసీ ఇచ్చిన వేతన స్కేల్‌ను అమలు చేయాలి. నాటి నుంచి సంబంధిత బకాయిలు చెల్లించాలి. ►పీజీ వైద్య విద్యను మరింత పరిపుష్టం చేయడం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందజేయడం కోసం నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఫ్యాకల్టీని మరింత బలోపేతం చేయాలి ►బోధనాసుపత్రుల్లోని వైద్యులకు నిర్ణీతకాల పదోన్నతులు కల్పించాలి ►ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించడం ►వైద్యవిధాన పరిషత్ వైద్య ఉద్యోగులకు ట్రెజరీ వేతనాలు అందజేయాలి ►వైద్య విధాన పరిషత్‌లోని వైద్యులందరికీ ఆరోగ్యకార్డులు అందజేయాలి ►2004 తర్వాత చేరిన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ స్కీం బదులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ►జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల అధ్యాపకులకు బేసిక్ వేతనంలో 40 శాతం అదనంగా ప్రోత్సాహకం ఇవ్వాలి ►సిబ్బంది స్థాయిని పెంచి వైద్యులకు త్వరగా పదోన్నతులు వచ్చేలా చూడాలి ►వివిధ రకాలైన అలవెన్సులు త్వరగా విడుదల చేయాలి ►హైదరాబాదులోని వైద్యులకు సంబంధించి జీవో 140 ని అమలు చేయాలి ►వైద్యాధికారులకు వాహన సౌకర్యము లేదా రవాణా భత్యం కల్పించాలి ►జాతీయ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలి ►దూరపు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు, వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి బదిలీలు కల్పించాలి ►వైద్యులపై అన్యాయంగా విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలి ►ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలి ►ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలి -
సమ్మె యోచనలో ప్రభుత్వ వైద్యులు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు సర్కారుకు విన్నవిస్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో తాత్సారం కనిపిస్తుందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా çసమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి.నరహరి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (ప్రజారోగ్య విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్ తదితరులు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు. ఒకట్రెండు రోజుల్లో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని తెలిపారు. నిర్ణీత కాలంలో సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని తేల్చిచెప్పారు. నిర్ణీత కాలంలోనే వైద్యులకు ఆటోమేటిక్‌గా పదోన్నతులు లభించేలా జారీచేసిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలుకావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి డిమాండ్లు ఇవే.. - 2016లో యూజీసీ ఇచ్చిన వేతన స్కేల్‌ను అమలు చేయాలి. అప్పటినుంచి ఇప్పటివరకు సంబంధిత బకాయిలు చెల్లించాలి. - పీజీ వైద్య విద్యను మరింత బలోపేతం చేయాలి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందజేయడం కోసం నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఫ్యాకల్టీని నియమించాలి. - ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలి. - తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో తక్షణమే పదోన్నతులు ఇవ్వాలి. - వైద్య విధాన పరిషత్ వైద్య ఉద్యోగులకు ట్రెజరరీ వేతనాలు అందజేయాలి. - వైద్య విధాన పరిషత్‌లో ఉన్న వైద్యులందరికీ ఆరోగ్య కార్డులు అందజేయాలి. - ఆసుపత్రుల మధ్య సరైన పర్యవేక్షణ నిమిత్తం 33 జిల్లాల్లో డీసీహెచ్ఎస్ పోస్టులను సృష్టించాలి. - ఎంసీహెచ్ ఆసుపత్రుల కోసం అదనంగా ఒక మెడికల్ సూపరింటెండెంట్ పోస్టును మంజూరు చేయాలి. - కేసీఆర్ కిట్ అమలు చేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. - వైద్య విధాన పరిషత్ కమిషనర్ పోస్టును విధిగా సీనియర్ వైద్యునికే ఇవ్వాలి. - పీజీ ప్రవేశాల్లో సర్వీసు కోటాను పునరుద్ధరించాలి. - ప్రసవాల కేసులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి. - 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ స్కీం బదులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. - మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో వివిధ వైద్య విభాగాల అధిపతులను చేర్చాలి. - బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలి. - జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అధ్యాపకులు వెళ్లని పరిస్థితుల నేపథ్యంలో బేసిక్ వేతనంలో 40 శాతం అదనంగా ప్రోత్సాహకం ఇవ్వాలి. - ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో అదనపు సంచాలకులకు పదోన్నతులు ఇవ్వాలి. సీనియర్ వైద్యాధికారిని డైరెక్టర్‌గా నియమించాలి. -
మెడికల్ పీజీ సీట్లలో కోటా పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్లలో ఇన్‌సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఇన్‌సర్వీస్ కోటా సీట్లను సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.సుధాకర్ మాట్లాడుతూ దేశంలో 11 రాష్ట్రాలు ఇన్‌సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయని, దీంతో చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ముందుకు వచ్చారన్నారు. అయితే నీట్ పరీక్షలను తీసుకురావడంతో మొత్తం వ్యవహారం తలకిందులైందన్నారు. దీంతో ప్రజాఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ), కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందన్నారు. ఇన్సర్వీసెస్ కోటా రద్దు నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఇన్‌సర్వీస్ కోటాపై తమిళనాడు ప్రభుత్వ వైద్యులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ను వేశారని, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జాతీయ స్థాయిలో దీనిపై కీలక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఇన్సర్వీస్కోటాను పునరుద్ధరించాలని ఎన్ఎంసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. వైద్యులకు ఇచ్చే వేతనాలు, అలవెన్సులపైనా సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం ఇక నుంచి పూర్తిస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. ఈ సమావేశానికి దక్షిణ భారత రాష్ట్రాల నుంచి డాక్టర్ రాజేశ్గైక్వాడ్( మహారాష్ట్ర), కత్రివేలు(తమిళనాడు), డా.రావూఫ్(కేరళ), డా. జయధీర్(ఏపీ), రంగానాథ్(కర్ణాటక), డాక్టర్ ప్రవీణ్(టీజీజీఎ) తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెక్రటరీ జనరల్ డాక్టర్ లాలుప్రసాద్ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్యాణ్‌చక్రవర్తి, దీన్‌దయాల్, డాక్టర్. జనార్థన్‌తో పాటు పెద్ద ఎత్తున దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది
హైదరాబాద్: ప్రభుత్వ వైద్యులు రోగులకు మెరుగైన సేవలు అందించి ప్రజల్లో నమ్మకం పెంచారని మున్సిపల్, ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటే రోగులు జంకేవారని, ఇప్పడు ఏ చిన్న వ్యాధి వచ్చినా ప్రభుత్వాస్పత్రికే వస్తున్నారని, అందుకు నిదర్శనం నిమ్స్ ఆస్పత్రేనన్నారు. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) సంస్థ రూ.10 కోట్ల వ్యయంతో నిమ్స్‌లో నిర్మించిన కేన్సర్ భవనాన్ని మంత్రి లక్ష్మారెడ్డితో కలసి గురువారం ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో మెఘా సంస్థ 50 పడకల కేన్సర్ విభాగాన్ని అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకు వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య రక్షణకు హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజేషన్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సమాజానికి సేవ చేయాలని..: పీపీ రెడ్డి సొసైటీ తమకు ఈ హోదాను ఇచ్చిందని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తాము సాధ్యమైనంత సహాయం చేస్తున్నామని మెఘా ఇంజనీరింగ్ చైర్మన్ పీపీ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీడీ భవన నిర్మాణం చేపట్టామని, నిమ్స్‌లో మరో పాత భవనాన్ని ఆధునీకరించనున్నామని ప్రకటించారు. మూడేళ్లపాటు తామే నిర్వహణ బాధ్యతలు తీసుకుంటామన్నారు. అనంతరం మహిళావార్డులను మెఘా ఇంజనీరింగ్ ఎండీ కుమారులు పీవీ ప్రణవ్‌రెడ్డి, మానస్ రెడ్డి ప్రారంభించగా, చిన్నపిల్లల వార్డును డైరెక్టర్ మనోహర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, కేన్సర్ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ సదాశివుడు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యుల సమ్మె నోటీసు
సాక్షి, హైదరాబాద్: వైద్యుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘తెలంగాణ ప్రభుత్వ వైద్యుల ఐక్య కార్యాచరణ సమితి’ నోటీసు ఇచ్చింది. ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.శాంతికుమారికి వైద్యుల జేఏసీ చైర్మన్ డాక్టర్ బి.రమేశ్, కన్వీనర్ డాక్టర్ ఆర్.లాలూప్రసాద్‌లు ఈ మేరకు మంగళవారం నోటీసిచ్చారు. ‘పీజీ వైద్య సీట్ల భర్తీలో ఇన్‌సర్వీస్ కోటాలో మార్పులు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన 21, 22 ఉత్తర్వులను రద్దు చేయాలి. ప్రజారోగ్య విభాగంలో వైద్యుల సంఖ్యను పెంచాలి. అత్యవసర అలవెన్సులను పెంచాలి. ప్రభుత్వ వైద్యులకు ప్రొటోకాల్ ఉం డాలి. ఏడో వేతన సంఘం కెరియర్ అడ్వాన్స్మెంట్ అమలు చేయాలి. కేసీఆర్ కిట్‌కు అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలి. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులందరికీ ట్రెజరీ వేతనాలు ఇవ్వాలి. కొత్త జిల్లాలకు డీఎంహెచ్‌వో, డీసీహెచ్ఎస్ పోస్టులను ఏర్పాటు చేయాలి. ఎం జీఎం ఫోరెన్సిక్ వైద్యుడు రజామాలిక్ సస్పెన్షన్ ఎత్తి వేయాలి. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మా ణం వెంటనే చేపట్టాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. -
సర్కార్ వైద్యులకు ‘బయోమెట్రిక్’!
కోల్‌సిటీ(రామగుండం) : జిల్లాలోని సర్కారు వైద్యులు, సిబ్బందికి ‘బయోమెట్రిక్’ భయం పట్టుకుంది. డాక్టర్లతోపాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా.. సొంత పనులపై బయట తిరుగుతున్నారు. అడిగేవారు లేకపోడంతో.. వైద్యులు, సిబ్బంది ఎవరిష్టం వచ్చినట్లు వారు సమయపాలన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి ఆటలకు కలెక్టర్ శ్రీదేవసేన చెక్ పెట్టనున్నారు. పేదలకు సకాలంలో వైద్యం అందాలనే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో వైద్య సిబ్బందిలో వణుకు మొదలయ్యింది. ఇక ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్: జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పంచ్(థంబ్ ఇంప్రెషన్) అమలు చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ను వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారుల ప్రతిపాదనలు..: ప్రభుత్వాస్పత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలనపై జిల్లా కలెక్టర్ సీరియస్‌గా దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుపై వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యశ్రీరావుతోపాటు డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్‌కుమార్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 30 బయోమెట్రిక్ యంత్రాలు: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి, పెద్దపల్లి, మంథని ఆస్పత్రులతోపాటు డీఎంహెచ్ఓ కార్యాలయం, రెండు డెప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయాలు, సుల్తానాబాద్‌లోని సీహెచ్‌సీ, రామగుండంలోని ఆరు యూపీహెచ్‌సీలుతోపాటు మేడారం, రాగినేడు, రాఘవపూర్, శ్రీరాంపూర్, కొలనూరు, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి, గర్రెపల్లి, పూట్నూర్, బసంత్‌నగర్, రామగుండం, గద్దెలపల్లి, ముత్తారం, కమాన్‌పూర్ పీహెచ్సీలలో బయెమెట్రిక్ యంత్రాలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం మంథని ఆస్పత్రిలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. సుమారు 30 బయెమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత వీటిని కొనుగోలు చేయనున్నారు. ఉద్యోగుల్లో గుబులు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయెమెట్రిక్ విధానం అమలు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో వినియోగంలోకి తేవాలని చూస్తున్నారు. దీంతో స్థానికంగా నివాసం ఉండని వైద్యులు, ఇతర సిబ్బంది దూరప్రాంతాల నుంచి అప్ అన్ డౌన్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తాజా నిర్ణయంతో వైద్యులతోపాటు నర్సింగ్‌స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో గుబులు మొదలయ్యింది. గతంలో గాడితప్పింది.. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో గతంలోనే బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. అయితే ఆస్పత్రి అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీంతో సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ మూలకుపడేశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్‌పై సీరియస్‌గా ఉండడంతో, మూలకుపడేసిన యంత్రానికి మరమ్మతులు చేపట్టడానికి చర్యలు ప్రారంభించారు. ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. – డాక్టర్ సూర్యశ్రీరావు, సూపరింటెండెంట్ బయోమెట్రిక్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రితోపాటు మంథని, పెద్దపల్లి ఆస్పత్రులలో బయోమెట్రిక్ యంత్రాలు వినియోగించడానికి చర్యలు ప్రారంభించాం. మంథనిలో వినియోగిస్తున్నాం. మూడు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు తయారు చేశాం. గోదావరిఖనిలో పని చేయని యంత్రానికి మరమ్మతులు కూడా చేయిస్తాం. ప్రతిపాదనలకు కలెక్టర్ అనుమతించాక వాటిని ఫిబ్రవరిలో అమలు చేస్తాం. 25 యంత్రాలు అవసరం...– డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో జిల్లాలో డీఎంహెచ్‌వో, రెండు డెప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలతోపాటు పీహెచ్సీ, 15 సీహెచ్‌సీలు, ఆరు యూహెచ్‌సీలలో బయోమెట్రిక్ విధానం అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. కలెక్టర్ కూడా ఈ విషయంలో సీరిసయ్‌గా ఉన్నారు. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. జిల్లాలో సుమారు 25 బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు తయారు చేసిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు సమర్పిస్తాం. -
ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యుడు సంపాదన
-
పనితీరే పరమావధి
శ్రీకాకుళం: ప్రభుత్వ వైద్యుల పనితీరుపై ప్రభుత్వం నిఘా నేత్రాలు ఉంచనుంది. ప్రభుత్వ విధులకు డుమ్మా కొడు తూ సొంత క్లినిక్‌లపై ప్రేమ ఒలకబోస్తున్న వైద్యుల పని పట్టడానికి పాయింట్ల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. సమయ పాలన పాటించని వైద్యులపై ‘పెర్ఫార్మెన్స్’ అస్త్రాన్ని ప్రయోగించనుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పట్టణాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న డాక్టర్ల పనితీరు తెలుసుకునేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోం ది. వారు రోగులకు అందిస్తున్న వైద్య సేవల ఆధారంగా పాయింట్లు ఇచ్చి వాటి ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని యోచిస్తోంది. ప్రభుత్వం దీనిపై జారీ చేసిన ఈ ఉత్తర్వులపై వైద్యుల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. విధులకు హాజరు కాని వారిలో ఆందోళన నెలకొనగా, చక్కగా పని చేస్తున్న వారు మాత్రం ఎవరి కోసమో తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాయింట్లు ఇలా.. ప్రతి రోజు ఎంత మంది రోగులను పరీక్షించారు, హైరిస్కు ప్రెగ్నెన్సీ కేసులను ఎన్ని గుర్తించారు, వారికి అందించిన వైద్య సేవలు, ఇమ్యునైజేషన్ అమలు, తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ సేవలు, ఎన్టీఆర్ బేబీకిట్, జననీసురక్ష యోజన పారితోషికం, నెలలో విధులకు హాజరైన రోజులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం వంటి అంశాల ఆధారంగా వైద్యులకు పాయింట్లు ఇస్తారు. వీటి ఆధారంగా వైద్యాధికారులకు గ్రేడింగ్‌లు కూడా నిర్ణయిస్తారు. వీటిలో అంశాలకు 5, 2.5 మార్కులు కేటాయిస్తూ పాయింట్లను లెక్కిస్తారు. మొత్తం 100 మార్కులకు వైద్యాధికారుల పనితీరును ప్రతి నెలా లెక్క గట్టి, జిల్లా స్థాయిలో గ్రేడింగ్‌లు ఇస్తారు. నెలలో ఒక వైద్యాధికారి కనీసం 2,500 మంది ఔట్ పేషెంట్లను పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా వైద్యులు వారి చేసిన పనిని జిల్లా స్థాయి అధికారులకు 10వ తేదీలోగా పంపిస్తే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు వీటిని పరిశీలించి పాయింట్లు, గ్రేడింగ్‌లను కేటాయిస్తారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్టు వైద్యాధికారులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. విధుల్లో మంచి పనితీరు కనబరిచిన వైద్యాధికారులకు ప్రోత్సాహకాలను అందివ్వనున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్కుల్లో ముందున్న వారికి నగదు రివార్డులు సైతం ఇద్దామని ఉత్తర్వుల్లో తెలిపారు. -
డాక్టర్లకు నజరానా
‘కేసీఆర్ కిట్’ పథకంలో ప్రభుత్వ వైద్యులకు ప్రోత్సాహకం సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్ పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు డాక్టర్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రసవం చేసే వైద్యులకు రూ. 500.. నర్సులు, ఇతర సహాయక సిబ్బందికి రూ. 500 ఇవ్వనుంది. గిరిజన ప్రాంతా ల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో రూ.1,500 ఇవ్వాలని నిర్ణ యించిన ప్రభుత్వం.. అందులో వైద్యులకు రూ.500, సిబ్బందికి రూ.వెయ్యి ఇవ్వనుంది. పథకంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునే గర్భిణులకు రూ. 12 వేలు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రసవం తర్వాత బాలింతకు, శిశువుకు 16 రకాల వస్తువులతో కిట్ ఇవ్వనున్నారు. ప్రోత్సాహకాలకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేట్ వైద్యుల సేవలు.. వచ్చే నెల 3న కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం ప్రారం భించనుంది. పథకం కింద ప్రసవం చేయించుకోడానికి ఇప్పటికే 2 లక్షల మందికిపైగా గర్భిణులు పేర్లు నమోదు చేసుకున్నారు. పథకానికి పెద్దఎత్తున స్పందన వస్తుం డటం.. ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రైవేట్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఒక్కో పీహెచ్సీ, సీహెచ్‌సీకి రూ. 5 లక్షల వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించారని అధికారులు చెబుతున్నారు. దాదాపు 500 మందికిపైగా ప్రైవేట్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్న ప్రభుత్వం.. వారిని గుర్తించే బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. అయితే ఈ ప్రైవేట్ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి గర్భిణులకు ప్రసవం చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. -
10 నుంచి ప్రభుత్వ వైద్యుల సమ్మె
-
10 నుంచి ప్రభుత్వ వైద్యుల సమ్మె
ఎమర్జెన్సీ ఆపరేషన్లూ నిలిపేస్తామని హెచ్చరిక హైదరాబాద్: దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ప్రభుత్వ వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. గత నెల 23న సమ్మె నోటీసు అందజేసిన వైద్యులు ఈ నెల 10 నుంచి 30వ తేదీ వరకు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఆందోళన కార్యక్రమాలను దశలవారీగా ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ వైద్యభవన్‌లో సమ్మెపోస్టర్ను టీజీడీఏ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొంగు రమేశ్, కోశాధికారి లాలూప్రసాద్ రాథోడ్‌లు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఇతర‡ జిల్లా ఆస్పత్రులకు డైరెక్టర్లను నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, రిమ్స్ మెడికల్ కళాశాలల స్వయం ప్రతిపత్తి రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలుగా ఉత్తర్వులు జారీ చేయాలని, 171 ఆంధ్రా(డీఎంఈ) డాక్టర్లను, డీహెచ్, ఈఎస్‌ఐలకు కేటాయించిన ఆంధ్రావైద్యులను ఏపీకి పంపించాలని అన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని కేంద్రంతో సంప్రదించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని, జీవో నంబర్ 14 ప్రకారం యూనివర్సిటీ ప్రొఫెసర్ల మాదిరిగా యూజీసీ వేతనాలను డీఎంఈ డాక్టర్లకు కూడా వర్తింపచేయాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, మందుల కొరత, నాసిరకం మందుల సమస్యలపై సమ్మెబాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. మే 1 నుంచి 15వ తేదీ వరకు గంటపాటు నిరసనలు, మే 16 నుంచి జూన్ 1 వరకు అన్ని ఓపీ సేవలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి దశలవారీగా ఎమర్జెన్సీ ఆపరేషన్లతోపాటు అన్ని వైద్య సేవలు స్తంభింపచేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీడీఏ నాయకులు డాక్టర్ నరహరి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ నాగార్జున, డాక్టర్ రాజు, ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యుల సమ్మె నోటీసు
⇒ ఏప్రిల్ 10 నుంచి విడతల వారీ సమ్మె ⇒ జూన్ 2 నుంచి అన్ని వైద్య సేవల బహిష్కరణ ⇒ వేతనాల పెంపు, మౌలిక సదుపాయాల కల్పన తదితర డిమాండ్లు సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ వైద్యులు సమ్మె నోటీసు ఇచ్చారు. తమ 28 డిమాండ్లను 18 రోజుల్లోగా పరిష్కరించకుంటే వచ్చే నెల 10 నుంచి విడతల వారీ సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.రమేష్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రవీణ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ బి.రమేష్, కోశాధికారి డాక్టర్ పి.లాలూప్రసాద్ తదితరులు గురువారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేశారు. మరో ప్రతిని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి పంపించారు. డిమాండ్లు పరిష్కరించకుంటే... వచ్చే నెల 10 నుంచి 30 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, మే ఒకటి నుంచి 15 వరకు రోజుకో గంట నిరసన కార్యక్రమం చేపడతామని అందులో పేర్కొన్నారు. అదే నెల 16 నుంచి జూన్ ఒకటి వరకు ఓపీ సేవలను, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి అన్ని రకాల వైద్య సేవలను బహిష్కరిస్తారు. సమస్యలు పరిష్కరించకుంటే... రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ సహా అన్ని బోధన, బోధనేతర ఆసుపత్రులన్నింటిలోనూ సమ్మె ఉంటుందని సంఘం కోశాధికారి డాక్టర్ లాలూప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల మందికి పైగా వైద్యులు సమ్మెలో పాల్గొంటారన్నారు. ప్రభుత్వ వైద్యుల ప్రధాన డిమాండ్లివే... – డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్ పోస్టులను సీనియారిటీ ప్రకారం వైద్యులతో భర్తీ చేయాలి. – గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, జిల్లా తదితర ఆసుపత్రులకు డైరెక్టర్లను నియమించాలన్న ఆలోచనను విరమించుకోవాలి. – వర్సిటీ అధ్యాపకుల మాదిరిగా యూజీసీ స్కేళ్లు, అలవెన్సులు ఇవ్వాలి. – అన్ని రకాల పదోన్నతులు, బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే నిర్వహించాలి. – మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ, రిమ్స్ వంటి పాక్షిక స్వయంప్రతిపత్తి వాటిని సాధారణ మెడికల్ కాలేజీలుగా మార్పు చేయాలి. – తెలంగాణకు కేటాయించిన 171 మంది ఆంధ్రా డాక్టర్లను వెనక్కు పంపించాలి – తప్పుడు ధ్రువీకరణపత్రాలు ఇచ్చిన డాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి – ఆరోగ్య సంచాలకుల పరిధిలోని వారందిరికీ పేస్కేల్ పెంచాలి. 24 రకాల అలవెన్సులు అందజేయాలి. – పదో పీఆర్సీని అమలచేయాలి. పెండింగ్ ఎరియర్స్ ఇవ్వాలి. – వైద్య ఆరోగ్యశాఖపై కిందిస్థాయిలో తహసిల్దార్, ఎంపీడీవో, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి వారి పర్యవేక్షణను రద్దు చేయాలి. ఈఎస్ఐ సిబ్బందిని విభజించి అందులోని వైద్యులకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. -
వైద్యులపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు !
- బేడీలు వేసి పనిచేయించాలేమో - శాసనసభలో వైద్యులపై మంత్రి రమేష్ కుమార్ ఆక్రోశం బెంగళూరు: గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడానికి సిద్ధంగా లేని వైద్యులకు బేడీలు వేసి.. పనిచేయాలని నిర్భందించాలేమోనని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి రమేష్‌కుమార్ శాసనసభలో ఆక్రోశం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఉమేష్‌కత్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాష్ట్రంలో రాష్ట్రంలో 53 వైద్య విద్యా కళాశాలలు ఉండగా అందులో 11 ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయన్నారు. వైద్య విద్య కళాశాలల నుంచి ప్రతి ఏడాది ఐదు వేల మంది ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేస్తున్నారని, అదేవిధంగా సుమారు 2,500 మంది పీజీ వైద్యను పూర్తి చేస్తున్నారన్నారు. అయితే వీరిలో చాలా మంది రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధపడటం లేదన్నారు. పేదలు కడుతున్న పన్నులతో తాము చదువుకున్నామన్న జ్ఞానం ఉండటం లేదన్నారు. అందువల్లే పేదలకు సేవ చేయడానికి ముందుకు రావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుశా వారికి బేడీలు వేసి గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సిందేనని కట్టుదిట్టమైన చట్టాలు చేయాలనేమోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజణ్ణ కలుగజేసుకుని ’మీరు బాధపడకండి. కఠిన చట్టాలు చేసి వారి చేత పనిచేయించుకుందాం.’ అని పేర్కొన్నారు. దీంతో తేరుకున్న రమేష్‌కుమార్ సాధారణ వైద్యులతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గైనకాలజిస్ట్ తదితర నిపుణులైన వైద్యుల కొరత చాలా ఉన్న మాట వాస్తవమేనన్నారు. సమస్య పరిష్కారం కోసం వైద్య విద్యలో పీజీ డిప్లొమో కోర్సును ప్రారంభించనున్నామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ముందుకు వచ్చే వారికి రోజు లేదా గంటల ప్రతిపాదికన కూడా వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రమేష్‌కుమార్ శాసనసభకు తెలిపారు. అదేవిధంగా ప్రతి తాలూకా ఆసుపత్రుల్లో ఒక సైకాలజిస్ట్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఉభయ సభల్లో వివిధ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ఇచ్చిన సమాధానాల్లో కొన్ని ముఖ్యమైనవి... - ప్రస్తుతం వసతి పాఠశాల్లో ఖాళీగా ఉన్న 5,264 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి హెచ్. ఆంజనేయ తెలియజేశారు. - బెంగళూరు నగరంలో 5420 హోర్డింగులు ఉండగా కొన్ని చోట్ల అనధికార అడ్వర్టైజ్మెంట్పోస్టర్లు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఇందుకు సంబంధించిన వారి నుంచి రూ.326 కోట్లు అపరాద రుసుం వసూలు కావాల్సి ఉందని బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ తెలిపారు. - బెంగళూరులో అక్రమంగా నివశిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న 48 మంది విదేశీయులను ఇప్పటికే అరెస్టు చేశామని హోంశాఖ మంత్రి పరమేశ్వర్ తెలిపారు. - రాష్ట్రంలో 3.12 కోట్ల రేషన్ కార్డులు ఉండగా ఇప్పటి వరకూ 3.9 కోట్ల కార్డులకు ఆధార్ సంఖ్యను జతచేర్చామని పౌరసరఫరాల శాఖ మంత్రి యూ.టీ ఖాదర్ తెలిపారు. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే ఆధార్ కార్డు జత చేయని రేషన్ కార్డులను ఇప్పటి వరకూ రద్దు చేయలేదన్నారు. -
డాక్టర్లు కావలెను..
ఏజెన్సీలో వైద్య సేవలు అంతంతే.. జిల్లాలో 21 పోస్టులు ఖాళీ విజృంభిస్తున్న విషజ్వరాలు భద్రాద్రి నుంచి తరలిపోయిన మలేరియా అధికారి పోస్టు సాక్షి, కొత్తగూడెం : నిరంతరం సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న భద్రాద్రి జిల్లాను ప్రభుత్వ వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పూర్తి గిరిజన జిల్లాగా ఉన్న భద్రాద్రిలోని పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్న పరిస్థితుల్లో నిరంతరం వైద్య సేవలు అందించేందుకు అదనపు బృందాలను నియమించాలి. కానీ ఇక్కడ మంజూరైన పోస్టుల్లోనే అనేకం ఖాళీగా ఉన్న దుస్థితి నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఉప ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆయా ప్రాంతాలకు వైద్యాధికారుల పోస్టులను మంజూరు చేసింది. అయితే జిల్లాలో వైద్యాధికారులుగా నియమితులైన వారిలో 27 మంది ఉన్నత విద్యనభ్యసించడానికి మూడు సంవత్సరాలు ఇన్ సర్వీస్ విద్యార్థులుగా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లడంతో వైద్యసేవలు కుంటుపడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం 28 మంది డాక్టర్లకు ఇన్ సర్వీస్‌లో పీజీ వైద్య విద్య అభ్యసించడానికి అవకాశం రాగా, అందులో 27 మంది భద్రాద్రి జిల్లాలో నియమితులైన వారే కావడం గమనార్హం. ఒకరు మాత్రమే ఖమ్మం జిల్లాలో నియమితులైన వారున్నారు. దీంతో జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా, సీజనల్ వ్యాధులతో మన్యం మంచం పట్టినా, కనీస వైద్యసేవలు అందించడానికి డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. నాలుగు పీహెచ్‌సీల్లో డాక్టర్లే లేరు.. గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో రెండు వైద్యాధికారుల పోస్టులు మంజూరైనా అందులో ఒక వైద్యాధికారితోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ప్రాంతంలో ఇద్దరు వైద్యాధికారులు ఉంటే.. అసలు వైద్యాధికారులు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డిప్యుటేషన్ ప్రాతిపదికన నియమించారు. ఇన్ని చేసినా.. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న ఈ తరుణంలో జిల్లాలోని పూర్తి గిరిజన ప్రాంతాలైన జానంపేట, కరకగూడెం, ములకలపల్లి మండలం మంగపేట, చండ్రుగొండ మండలం ఎర్రగుంట పీహెచ్‌సీలకు డాక్టర్లు లేని దుస్థితి నెలకొంది. వీటితోపాటు మరికొందరు వైద్యాధికారులు తమ సొంత ప్రాంతమైన ఆంధ్రాకు బదిలీపై వెళ్లాల్సి ఉండటంతో మరికొన్ని పోస్టులు ఖాళీ కానున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు వైద్యాధికారులను ప్రభుత్వం ఇప్పటికే బదిలీ చేసింది. తెలంగాణలో మలేరియా వ్యాధికి చిరునామాగా ఉన్న భద్రాద్రి జిల్లాలో ఈ సంవత్సరం మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయనే కారణంతో సంవత్సరాల తరబడి భద్రాచలం కేంద్రంగా ఉన్న జిల్లా మలేరియా అధికారి పోస్టును ఈ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు బదలాయించారు. దీంతో జిల్లాలో మలేరియా నివారణ చర్యలు కుంటుపడే ప్రమాదం ఏర్పడింది. మలేరియా వ్యాధి ప్రాథమిక దశనుంచి పూర్తిగా తగ్గేంతవరకు దశలవారీగా చికిత్స చేయాల్సి ఉండటం, ప్రత్యేక పర్యవేక్షణ అవసరమైన నేపథ్యంలో జిల్లాలో ఉన్న మలేరియా అధికారి పోస్టును తీసివేయడం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 సీహెచ్‌సీలు, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచల్లో ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో 65 డాక్టర్ల పోస్టులు జిల్లాకు మంజూరుకాగా, ఇందులో 21 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో గిరిజనులకు సత్వరం వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారాయి. వీటితోపాటు పలుచోట్ల ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. వైద్యుల కొరత నిజమే.. జిల్లాలో వైద్యాధికారుల కొరత ఉన్నమాట వాస్తవమే. దీన్ని అధిగమించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో వైద్యాధికారులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నాం. జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యుల కొరత ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. కాంట్రాక్టు డాక్టర్లతో వైద్యుల కొరత ఉన్న ప్రాంతంలో వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం, -వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
డాక్టర్ల పదవీ విరమణ వయస్సు 62కు పెంచాలి
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి - కేంద్రం 65 ఏళ్లకు పెంచినట్లు ప్రస్తావన హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ సర్కారుకు విన్నవించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రతినిధులు మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల ఉద్యోగ విరమణ వయస్సును 65కు పెంచినట్లు గుర్తు చేశారు. అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే విరమణ వయస్సును పెంచినట్లు పేర్కొన్నారు. విరమణ వయస్సు పెంచడం వల్ల అనేకమంది యువ డాక్టర్లు ప్రభుత్వ సర్వీసులోకి రావడానికి ఆసక్తి కనబర్చుతారని ఐఎంఏ వివరించింది. అంతేగాక సీనియర్ వైద్యుల సేవలు కూడా మరింత వినియోగించుకోవడానికి వీలుపడుతుందని వారు తెలిపారు. -
అగ్రి గోల్డ్ చైర్మన్, ఎండీలకు అస్వస్థత
ఏలూరు అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించి.. ఎగవేశారనే అభియోగాలపై అరెస్టయిన అగ్రి గోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేషుకుమార్ (నారాయణరావు) అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరూ ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సోమవారం వారు అస్వస్థతకు గురవ్వడంతో జైలు సిబ్బంది వెంటనే ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వేరొక ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జిల్లా జైలు వర్గాలు తెలిపాయి. -
ప్రభుత్వ వైద్యులకు మంత్రి హెచ్చరిక
ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడం మానకపోతే తీవ్ర చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. వారికి మొదటి హెచ్చరికగా మూడు ఇంక్రిమెంట్లు కోత విధిస్తామని, అప్పటికీ పద్ధతి మార్చుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగింపు కూడా తప్పదని ఆయన అన్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖలో బదిలీలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. కౌన్సెలింగ్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
వైద్యుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంపు: మోదీ
ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. తన ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైద్యులు ఏడాదికి 12 రోజులు పేద గర్భిణులకు ఉచితంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ''ప్రధానమంత్రిని కాను.. ప్రధాన సేవకుడినని, అలాగే పనిచేస్తానని, 125 కోట్ల మంది భారతీయులకు సేవ చేసేందుకు నిరంతరం కృషిచేస్తానని ఎర్రకోట నుంచే చెప్పాను. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి.. ఎన్నికలు జరుగుతాయి.. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేది ప్రజల కలలు సాకారం చేయడానికే. గత రెండేళ్లలో మా పనితీరు ఎలా ఉందో అందరూ చూశారు. నా ప్రభుత్వం ఈ దేశంలోని పేదలకు అంకితం అని నా మొదటి ప్రసంగంలోనే చెప్పాను. పేదలకు పేదరికం మీద పోరాడే శక్తి ఇచ్చే పథకాల మీదే ఈ రెండేళ్లు దృష్టిపెట్టాను. తమ పిల్లలకు వారసత్వంగా పేదరికం ఇవ్వాలని ఏ తల్లిదండ్రులూ అనుకోరు. రెండేళ్ల ముందు దేశం ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి. ప్రతి రోజూ ఒక కొత్త స్కాం బయటపడేది.. పెద్దపెద్దవాళ్లు స్కాముల్లో మునిగిపోయారని, వేల కోట్లాది రూపాయలు దోచుకున్నారని కథనాలు వచ్చేవి. అసలు ప్రజల సొమ్ము దోచుకోడానికే కుర్చీలో కూర్చోబెడతారా? ఈ దోపిడీని అరికడతానని అప్పుడే చెప్పాను. ఇప్పటికి రెండేళ్లయింది.. ఈ రెండేళ్ల కాలంలో మోదీ సర్కారు ఒక్క రూపాయి తిన్నట్లు ఏమైనా ఆరోపణలొచ్చాయా.. మా ప్రత్యర్థులు ఏమైనా ఆరోపించారా, పత్రికల్లో, టీవీలలో ఏవైనా కథనాలొచ్చాయా? లక్షల మంది మధ్య నిల్చుని ప్రజలను తమ లెక్కలు అడిగే ధైర్యం ఇన్నాళ్ల బట్టి ఎవరికీ లేకపోయింది. గ్యాస్ సిలిండర్లు కేవలం ధనవంతులకు మాత్రమే అందే పరిస్థితులుండేవి. పేదలకు గ్యాస్ పొయ్యి కలలో కూడా కనిపించేది కాదు. ఏం.. కట్టెల పొయ్యి మీదే వంట చేసి పేదలు చచ్చిపోవాలా? నా దేశ ప్రజలు నిజాయితీపరులు కాబట్టే నాకు పనిచేసే శక్తి వచ్చింది. ఎవరైనా గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ వదులుకోగలిగితే వదలాలని కోరాను.. కోటిమందికి పైగా ముందుకొచ్చారు.. ఇది చిన్న నిర్ణయం కాదు. వాళ్లు అందించిన ఈ శక్తితో.. రాబోయే మూడేళ్లలో 5 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తానని చెబుతున్నాను. కట్టెల పొయ్యి ఉన్నచోటల్లా గ్యాస్ పొయ్యిలు అందిస్తాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు మీరే చెప్పండి.. ప్రభుత్వం సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు సమాజంలో పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉంది. ఎందుకంటే, ఆడపిల్లలను తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నారు. 1000 మంది అబ్బాయిలు పుడుతున్నపుడు 1000 మంది అమ్మాయిలు పుట్టకపోతే పరిస్థితి ఏంటి? అందుకే బేటీ బచావ్, బేటీ పఢావ్ అని పిలుపునిచ్చాం. ఇన్నాళ్ల బట్టి ఓటు బ్యాంకుల కోసమే అన్ని పథకాలు పెట్టారు. నాకు జాతి మత భేదాలు లేవు.. ప్రజలే నా కుటుంబం. 125 కోట్ల మంది కోసమే పథకాలు సిద్ధం చేశాం'' అని ఆయన అన్నారు. -
టీ వైద్యులకు అన్యాయం జరగనివ్వం
ప్రభుత్వ వైద్యులకు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల విభజనలో తెలంగాణ వైద్యులకు అన్యాయం జరగనివ్వబోమని మంత్రులు కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇటీవల వైద్యులు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వ వైద్యులు మంగళవారం స్టీరింగ్ కమిటీగా ఏర్పడి మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డిలను కలిశారు. భార్యాభర్తల (స్పౌస్) అంశం ఉంటే తప్ప ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రానికి కేటాయించాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారని స్టీరింగ్ కమిటీ నేత డాక్టర్ లాలూ ప్రసాద్, గెజిటెడ్ వైద్య ఉద్యోగుల నేత జూపల్లి రాజేందర్ తెలిపారు. తమ భేటీ సందర్భంగా కేటీఆర్ సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారన్నారు. సీఎం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను మంత్రులతోపాటు తామూ కలిశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు అన్యాయం జరగకూడదని, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌తో సమావేశమై ప్రభుత్వ వైద్యుల విభజన ప్రక్రియను పరిష్కరించాలని కేటీఆర్ సీఎస్ రాజీవ్‌శర్మను కోరినట్లు వారు తెలిపారు. కాగా, కమలనాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం తయారుచేసిన వైద్యుల విభజన జాబితాలో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని స్టీరింగ్ కమిటీ నేతలు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ జాబితాను రద్దు చేయాలన్నారు. సీఎస్‌ను, మంత్రులను కలసిన వారిలో డాక్టర్లు పల్లం ప్రవీణ్, బి.రమేష్, రమేష్‌రెడ్డి, ఉమాశంకర్, వినోద్ తదితరులున్నారు. -
600 మందికి నోటీసులా?
ఏపీ ప్రభుత్వంపై మండిపడిన వైద్యుల సంఘం సాక్షి, హైదరాబాద్: ఒకరిద్దరు వైద్యులు తప్పుచేస్తే దీన్ని వైద్యులందరికీ ఆపాదించి 600 మంది వైద్యులకు నోటీసులు ఇవ్వడం, ఇంక్రిమెంట్లు కోత వేస్తానని చెప్పడం సరైంది కాదని వైద్యుల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అడ్‌హక్ కమిటీ కన్వీనర్లు డా.విజయేంద్రబాబు, డా.బాబ్జీ శ్యామ్‌కుమార్, డా.మునీశ్వర్‌రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో ప్రైవేటు ప్రాక్టీస్ చేసిన వైద్యులను శిక్షించడంలో తమకు అభ్యంతరం లేదని, కానీ ప్రస్తుతం నోటీసులు అందుకున్న చాలామంది వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేయలేదని తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన వేళల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేసిన వైద్యులకు నోటీసులు ఇచ్చి ఇంక్రిమెంట్లు కోత వేయడం బాధ కలిగిస్తోందన్నారు. వైద్యులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై త్వరలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. -
అనధికారిక సెలవు పెట్టిన వైద్యుల తొలగింపు
-ముఖ్యమంత్రి పేషీ నుంచి వైద్య శాఖకు ఆదేశాలు -బోధనాసుపత్రులకు సర్క్యులర్ జారీ చేసిన డీఎంఈ హైదరాబాద్ : అనధికారికంగా సెలవుపెట్టి నెలల తరబడి డ్యూటీలకు రాకుండా ఉండే వైద్యులను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి పేషీ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏడాదిపాటు సెలవులో ఉన్న వైద్యులను ఒక్కరిని కూడా ఇకపై ఉద్యోగంలో ఉంచాల్సిన అవసరం లేదని తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే నర్సింగ్‌హోంలలో పనిచేస్తున్నారని, ప్రైవేటు క్లినిక్‌లు నడుపుతున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో విచారణ జరిపించి 600 మందికి వైద్యులకు చార్జ్‌మెమోలు జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వైద్యుల్లో కలకలం మొదలైంది. ముఖ్యమంత్రి పేషీ నుంచి వచ్చిన ఆదేశాలతో వైద్య విద్యాశాఖలో తొలి కసరత్తు మొదలైంది. మంత్రి పదే పదే వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో సోమవారం వైద్య విద్యాసంచాలకుల కార్యాలయం నుంచి అన్ని బోధనాసుపత్రులకు, వైద్య కళాశాలలకు సర్క్యులర్ జారీ అయింది. ఇప్పటి వరకూ అనధికారిక సెలవులో ఉన్న వైద్యుల జాబితా ఇవ్వాలని, వారిని తక్షణమే తొలగించేందుకు చర్యలు చేపడతామని సర్క్యులర్‌లో పేర్కొన్నట్టు తెలిసింది. కాగా పునర్విభజనలో కమల్‌నాథన్ కమిటీకి ఆప్షన్లు ఇవ్వని వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తాజా లెక్కల ప్రకారం 30 మందికి పైగా గత ఏడాదిగా అనధికారిక సెలవులో ఉన్నారని, వారిని తొలగించే అవకాశాలున్నట్టు సమాచారం. అలాంటి వైద్యులు ఏమైనా వినతులు ఇచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని కూడా సర్కారు ఆదేశించినట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో వైద్యవిధానపరిషత్, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ విభాగాల నుంచి కూడా వైద్యులపై చర్యలకు ఆదేశాలు వెళ్లనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. -
డాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య వార్
-
డాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య వార్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ డాక్టర్లకు మధ్య వివాదం ముదిరింది. ఏకంగా 650 మంది ప్రభుత్వ డాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీఎంఈలో 240, ఏపీవీవీపీలో 190, డీఎంహెచ్ లో 210 మందికి నోటీసులు పంపారు. విజిలెన్స్ నివేధిక ఆధారంగా సక్రమంగా విధులకు హాజరు కాని వారికే నోటీసులు జారీ చేశామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి.. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారంటూ డాక్టర్లపై ఆరోపణలు వచ్చాయని వివరణ ఇచ్చారు. కాగా.. డాక్టర్లు ప్రభుత్వం తీరుపై మండి పడ్డారు. మంగళవారం నాడు వైద్య శాఖ ఉన్నతాధికారితో భేటీ అయ్యారు. వివరణ కోరకుండానే నోటీసులు ఎలా జారీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. వైద్య వ్యవహారాల్లో కలెక్టర్ల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. వైద్య శాఖ ఉన్నతాధికారి అనుచిత పదజాలంతో డాక్టర్లను దూషించాడని ఆరోపించారు. -
'దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్'
చీపురుపల్లి (విజయనగరం) : 'డాక్టర్లూ.. ఏమిటి మీ సమస్య? నా వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) మీతో మాట్లాడితే తప్పేంటి? నేను రాష్ట్ర మంత్రిని. రాష్ట్రంలో అందరితోనూ మాట్లాడలేను కదా...! మీకు ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి... దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదు' రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ప్రభుత్వ వైద్యులతో అన్న మాటలు ఇవి. మంత్రి పీఎస్ రామకృష్ణ తమను వేధిస్తున్నారంటూ వైద్యులు, ప్రజాప్రతినిధులు, డీఎంహెచ్ఓ వద్ద మొరపెట్టుకున్న విషయాలపై ఈ నెల 10న 'సాక్షి' మెయిన్ ఎడిషన్‌లో 'ఆయనకో దండం' శీర్షికన కథనం వెలువడిన సంగతి తెలిసిందే. శుక్రవారం చీపురుపల్లి వెళ్లిన మంత్రి మృణాళిని స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను పిలిపించి మరీ వారిపై మండిపడ్డారు. వైద్యులంతా రోజూ ఎందుకు విధులకు రావడం లేదని ప్రశ్నించారు. సెలవులు పెట్టకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి క్యాంపులకు వెళ్లిపోతే ఎవరూ అడగకూడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయడం ఇష్టం లేకపోతే రాసిచ్చేయాలని.. దాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని హెచ్చరించారు. -
వీరికి తెలిసింది ‘రెఫర్’ ఒక్కటే
పరిగి: రోగం.. నొప్పి.. ఇంకేదైనాసరే.. పరిగి ప్రభుత్వ వైద్యులను ఆశ్రయించే వారు చెప్పేది ఒక్కటే ‘రెఫర్’. ప్రతి కేసును రెఫర్ చేయడం డాక్టర్లకు పరిపాటు అయిందని స్థానికులు మండిపడుతున్నారు. కాన్పు కోసం ఓ మహిళ ఆస్పత్రికి వస్తే పరీక్షించకుండానే వైద్యులు ఉస్మానియాకు రెఫర్ చేశారు. గంటలోపే స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మహిళకు నార్మల్ డెలివరీ జరిగింది. వివరాలు.. పరిగి గౌరమ్మ కాలనీకి చెందిన లలిత తన కూతురు మంజుల(28)ను కాన్పు కోసం శనివారం తెల్లవారుజామున పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చింది. డ్యూటీ డాక్టర్, నర్సులు పరీక్షించి బీపీ ఎక్కువగా ఉంది.. కాన్పు చేయటం వీలుకాదని ఉస్మానియాకు రెఫర్ చేశారు. డబ్బులు లేక సర్కారు ఆస్పత్రికి వచ్చాం.. అంతదూరం ఎలా వెళ్తామని మంజుల కుటుంబీకులు వైద్యులను నిలదీశారు. చేసేది లేక పక్కనే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. గంటలోపే అక్కడ నార్మల్ డెలివరీ జరిగింది. తల్లిపిల్ల క్షేమంగా ఉన్నారు. బిల్లు మాత్రం రూ.10 వేలు అయింది. అంత డబ్బు తామెక్కడి నుంచి తీసుకురావాలి.. సర్కార్ వైద్యులే ప్రసవం చేస్తే సరిపోయేదని బాలింత కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. మంజుల పరిస్థితి విషమిస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీ ఎలా జరుగుతుందని మండిపడ్డారు. రూ. 10 వేలు మీరే చెల్లించాలని పట్టుబట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు. దీంతో చేసేది లేక మంజుల కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈ విషయమై డ్యూటీ డాక్టర్ కిశోర్‌ను వివరణ కోరగా.. మంజులకు బీపీ ఎక్కువగా ఉండడంతో ఉస్మానియాకు రెఫర్ చేద్దామనుకున్నాం.. అంతలోపే వారు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. -
ఆరోగ్యశ్రీతో ఆస్పత్రుల అభివృద్ధి జరిగింది: వైద్యనిపుణులు
మంత్రి కామినేని వ్యాఖ్యలపై విస్మయం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైద్యారోగ్య శాఖ మంత్రి చేసిన ప్రకటనపై ప్రభుత్వ వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, వైద్యుల కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ... ఆరోగ్యశ్రీ రావడంవల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్లక్ష్యానికి గురయ్యాయనీ, పెద్దాసుపత్రులకు నిధులు తగ్గాయని చెప్పారు. దీనిపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుంటూ 65 శాతం నిధులు ఆస్పత్రులకే వచ్చాయని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన నిధుల్లో 20 శాతం రివాల్వింగ్ ఫండ్ కింద, 45 శాతం ఆస్పత్రి అభివృద్ధి సొసైటీలు (హెచ్‌డీఎస్) కింద వెళ్లాయని చెప్పారు. ఆరోగ్యశాఖమంత్రి సమాధానంపై వైద్య ఆరోగ్య రంగ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించే బడ్జెట్‌కు అతీతమని, ఏ శాఖకు సంబంధించిన బడ్జెట్లోనూ కోత పెట్టి ఆరోగ్యశ్రీకి ఇవ్వలేదని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. పీహెచ్‌సీల నుంచి డీఎంఈ ఆస్పత్రుల వరకూ టీడీపీ హయాంలో పూర్తిగా సర్వనాశనమై ఉన్న దశలో, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌కు అప్పటివరకూ ఇచ్చిన నిధులకంటే 20 శాతం ప్రతి ఏటా పెంచుతూ వచ్చారని గుర్తుచేశారు. ఇది బడ్జెట్లో ఒక చరిత్ర అని ఆరోగ్యరంగ నిపుణులే చెబుతున్నారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ పథకం వచ్చాక వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు పెరిగాయి. ఎక్స్‌రే మెషీన్లు, అనెస్థీషియా వర్క్ స్టేషన్లు, ఆపరేషన్ థియేటర్‌కు సంబంధించిన పరికరాలు తదితర వాటిని గత రెండున్నరేళ్లలో ఆరోగ్యశ్రీ నిధులతో సుమారు రూ.70కోట్లు ఖర్చు చేసి కొన్నారు. మరో రూ.40 కోట్లతో నాలుగు ఎంఆర్ఐ మెషీన్లు కొంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్లక్ష్యానికీ సంబంధమే లేదు. పైగా రాజశేఖరరెడ్డి సీఎం కాగానే 200 ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిని పెంచి పీహెచ్‌సీలుగా మార్చారు. ఏనాడూ ఆయన వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్లో గ్రామీణ వైద్యానికి 40 శాతం నిధులు తగ్గకుండా చూశారు. 2006లో 3,500 మంది సిబ్బందిని నియమించారు. అందులో వైద్యులే 1,100 మంది వరకూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కారణంగా నాలుగు లక్షల మంది క్యాన్సర్ రోగులు వైద్యం పొందారు. గుండెజబ్బుల వాళ్లు లక్షల్లో ఉన్నారని అధికారవర్గాలు చెప్పాయి. ఇలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని విమర్శించడం తగదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
వైద్యులేనా!
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ధర్పల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన జోత్స్న(3)కు ఫిట్స్ రావడంతో మంగళవారం ఉదయం జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. వైద్యులు నిరసనలో ఉన్న విషయం తెలియక వారు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు వైద్యంకోసం తిరిగారు. ఎక్కడా వారికి వైద్యం అందలేదు. చివరికి వారి తల్లిదండ్రులు బాలికను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే బాలిక ప్రాణాలు వదిలింది. నగర సమీపంలోని ముబాకర్ నగర్ వద్ద తారక్ న గర్‌కు చెందిన శ్రీనివాస్(38) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆ స్పత్రిలో వైద్య సహాయం అందకపోవడంతో మంగళ వారం రాత్రి 11.30గంటలకు మృతి చెందాడు. ప్రైవే టు ఆస్పత్రులు మూసి ఉన్నందున శ్రీనివాస్ అనారో గ్యంతో సోమవారం నాడు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరా డు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే శ్రీని వాస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రైవేట్ వైద్యులు సేవలను నిలిపివేయడంపై మంగళవారం జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న స్పందించారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి గోవింద్‌వాగ్‌మోరే, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ భీంసింగ్‌లతో సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఫలంగా ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీలు చేసి వాటిలో సౌకర్యాలు, ఓపీ, ఐపీ సేవల వివరాలు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సేవల నిలుపుదలపై గంటలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న వారు ఆస్పత్రి ైవైద్యులతో కూడిన టాస్క్‌పోర్సును ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అందుకు నిరాకరించారు. తాము కేవలం వైద్యసేవలు మాత్రమే అందిస్తామని, తనిఖీలు చేయబోమంటూ స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఆరోగ్యశాఖాధికారి, సూపరింటెండెంట్ కలెక్టర్‌కు ఉన్న పరిస్థితిని విరించారు. దీంతో కలెక్టర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులను ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి వైద్యసేవలు అందించాలని సూచించారు. నేటి నుంచి రిలే దీక్షలు ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులకు నిరసనగా వైద్యుల ఆందోళన కొనసాగుతుందని అప్నా అధ్యక్షుడు డాక్టర్ శివరాజ్ తెలిపారు. బుధవారం రిలే దీక్షలు చేపడుతామన్నారు. ఇటీవల నిజామాబాద్, బోధన్‌లోని ఆస్పత్రులపై దాడి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర సంఘంతో మాట్లాడి తమ ఆందోళనను రాష్ట్ర వ్యాప్తం చేస్తామన్నారు. కిక్కిరిసిన జిల్లా ఆస్పత్రి ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేయడంతో నాలుగు రోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. స్పెషలిస్టు వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లో ఓపీ కేసులు 350 నమోదు కాగా, మంగళవారం 560 పైగా నమోదయ్యాయి. ప్రభుత్వ వైద్యులపై చర్యలు ప్రైవేట్ వైద్యుల నిరసనకు మద్దతుగా ప్రభుత్వ వైద్యులు సోమవారం చేపట్టిన ధర్నాపై జిల్లా కలెక్టర్ ఆగ్రహించారు. ప్రభుత్వ వైద్యులు ఈ నిరసనలో ఎందుకు పాల్గొన్నారని, తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని కలెక్టర్ ఆస్పత్రి అధికారులను ప్రశ్నించారు.దీంతో ఎంత మంది వైద్యులు నిరసనలో పాల్గొన్నారో వివరాలను అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. వీరిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మెడికల్ కళాశాల తరపున నియమించబడిన వైద్యులపై డీఎంఈ వివరణ కోరారు. నిరసనలో పాల్గొన్న వైద్యుల వివరాలు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్‌ను కోరారు. ఆస్పత్రిపై దాడిచేసిన ఆరుగురి అరెస్టు నిజామాబాద్ క్రైం : నగరంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా లో గల బాంబే నర్సింగ్ హోంపై ఈ నెల 22న రాత్రి దాడిచేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు నాల్గవ టౌన్ రెండవ ఎస్సై రామనాయుడు తెలిపారు. ఆస్పత్రి వైద్యుడి నిర్లక్ష్యంతోనే వినాయక్‌నగర్ హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన సుమలత అనే యువతి మృతి చెందినదన్న కోపంతో ఆమె బంధువులు ఆస్పత్రిపై దాడిచేసినట్లు ఎస్సై తెలిపారు. ఆస్పత్రి వైద్యుడు నరేంద్ర ఫిర్యాదు మేరకు నిందితులైన రవీందర్, పండరి, సురేశ్, కిషన్, రాజబాబు, శ్రీనివాస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. -
‘గైనిక్’ లేరని వెళ్లగొట్టారు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కేసులు పెంచాలని ప్రచారం నిర్వహిస్తున్నా వైద్యులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులకు వచ్చిన గర్భిణులను జాగ్రత్తగా చూసుకుని వారికి కాన్పులు చేయాల్సి ఉండగా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వివిధ సాకులు చెప్పి ఆపరేషన్లు చేయకుండా తప్పించుకుంటున్నారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఉదంతమే అందుకు నిదర్శనం. మిర్యాలగూడ క్రైం, న్యూస్‌లైన్ : పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన మల్లేశం, చంద్రకళ దంపతుల కూతురు లలితను మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోగల కిష్టాపురానికి చెందిన కొండ మట్టయ్యకు ఇచ్చి ఆరేళ్ల కిత్రం వివాహం జరిపించారు. లలితకు నెలలు నిండటంతో శనివారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రికి తీసుకురమ్మని చెప్పి పంపించారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో లలితకు నొప్పులు అధికమై బ్లీడింగ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మళ్లీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 3గంటల పాటు వేచి ఉన్నా వైద్యులు గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. సంబంధిత డాక్టర్లు లేరని, నల్లగొండ లేదా నార్కట్‌పల్లికి వెళ్లమని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. జ్యోతి ఆస్పత్రికి తరలింపు విషయం తెలుసుకున్న పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బత్తిని సోమిదేవి, టీఆర్ఎస్ నాయకుడు విజయ్‌కుమార్‌లు పట్టణంలోని జ్యోతి ఆస్పత్రి వైద్యుడు మువ్వా రామారావు దగ్గరకు వెళ్లి గర్భిణి పరిస్థితిని వివరించారు.వెంటనే స్పందించిన సదరు డాక్టర్ లిలతకు ఆపరేషన్ చేయడానికి అంగీకరించడంతో ఆమెను అక్కడకు తరలించారు. గైనిక్ సర్జన్ సెలవులో ఉన్నారు ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఎస్ నాయక్‌ను వివరణ కోరగా గైనిక్ సర్జన్ రెండురోజులు సెలవులో ఉండటంతో గర్భిణినీ ఆస్పత్రిలో చేర్చుకోలేదని చెప్పారు. లలితను అంబులెన్స్‌లో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలి స్తామన్నారు. -
కాసులిస్తేనే..కాన్పు
గిద్దలూరు, న్యూస్‌లైన్: నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. గిద్దలూరు ఏరియా వైద్యశాలలో ఈ దందా మరీ ఎక్కువైంది. కాన్పు కోసం వచ్చిన వారికి ఆపరేషన్ చేస్తే రూ. 3 వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిని వేధిస్తున్నారు. గర్భిణులు కాన్పులు చేయించుకునేందుకు వైద్యశాలకు వస్తే వారి వద్ద నుంచి వైద్యశాల మరమ్మతులంటూ డొనేషన్ల రూపంలో నగదు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. రాచర్ల మండలం చినగానిపల్లెకు చెందిన నర్ల వెంకటేశ్వరరెడ్డి తన భార్య సుజాతను ఈనెల 6న కాన్పు చేయించేందుకు గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చాడు. అక్కడ సాధారణ కాన్పు కాకపోవడంతో వైద్యుడు సూరిబాబు ఆపరేషన్ చేశారు. ఆ వెంటనే డాక్టర్ సాయి ప్రశాంతి కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేశారు. బుధవారం సుజాతను వైద్యశాల నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఇంటికెళ్లేందుకు సిద్ధమైన ఆమె స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ కోసం వైద్యుల వద్దకు వెళ్లగా, అందుకు వారు రూ. 3 వేలు ఇవ్వాలని చెప్పడంతో కంగుతింది. ఎందుకివ్వాలని ఆమె బంధువులు ప్రశ్నిస్తే డాక్టర్ గారికి స్టెతస్కోప్ కొనుగోలు చేయాలని సిబ్బంది చెప్పడం విశేషం. ఆపరేషన్ చేసే ముందు సిబ్బందికి ఎగ్‌పఫ్, స్ప్రైట్, 5 లీటర్ల డీజల్ తీసుకురావాలని వైద్యులు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇచ్చామని బాధితుడు వెంకటేశ్వరరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. నగదు ఇచ్చేందుకు తమ వద్ద ఏమీ లేదని చెప్పడంతో స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా మధ్యాహ్నం వరకు ఉంచుకుని వారం తర్వాత రావాలని చెప్పి పంపారని బాధితులు తెలిపారు. ఈ సమస్య ఒక్క వెంకటేశ్వరరెడ్డి దంపతులదే కాదు..ఇక్కడికి వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. వైద్యశాలలో రోజూ తమ నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. గిద్దలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆస్పత్రిలో డెలివరీ చేయించుకుంది. ఇక్కడ పనిచేస్తున్న స్వీపర్ ఒకరు రూ. 200 అడిగితే ఇవ్వలేదని ఆమెకు లేని రోగం ఉందని అందరికీ చెప్పింది. దీంతో ఆ మహిళ నాలుగు రోజులుగా ఏడుస్తూ కాలం వెళ్లదీస్తోంది. పేదల కోసం నిర్మించిన వైద్యశాలలో ఇలా నగదు దండుకోవడం ఎంతవరకు సమంజసమని రోగులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసరం కోసం డీజిల్ తెప్పించాం... స్థానిక వైద్యశాల సూపరింటెండెంట్ సూరిబాబును నగదు వసూళ్ల గురించి ప్రశ్నించగా వైద్యశాలకు నిధుల కొరత ఉండటంతో అత్యవసరం కోసం డీజిల్ తెప్పించుకుంటున్నామని, నగదు తీసుకోవడం లేదని చెప్పారు. వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా లేని రోగం ఉన్నట్లు చెప్పిన స్వీపర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు నగదు వసూలు గురించి తెలుపగా, బాధితుల నుంచి ఫిర్యాదు అందితే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
‘వైద్యం’.. వేగిరం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తానంటూ ప్రకటించిన కలెక్టర్ స్మితాసబర్వాల్ అదే విధంగా ప్రభుత్వ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐదు ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చేపట్టిన ‘మార్పు’ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. క్షేత్రస్థాయిలో ఇంకా మార్పు అమలుపై అవగాహన లేకపోవడంతో ఫలితాల సాధనపై వైద్య వర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, వైద్యుల హాజరు తదితరాలను స్వయంగా పర్యవేక్షించేందుకు ‘స్కైప్’ సాంకేతికతను కలెక్టర్ ఆసరా చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 66 పీహెచ్‌సీలకు గాను 50, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో 12కు గాను 9 చోట్ల స్కైప్ టెక్నాలజీ సిద్ధం చేశారు. వైద్యులు, రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడే అవకాశం ఉండటంతో వైద్యులు ఉరుకులు, పరుగుల మీద ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.1.25 కోట్ల ఆసుపత్రి అభివృద్ధి నిధులు ఉండటంతో పారిశుద్ధ్యం నిర్వహణ తదితరాలపై ఖర్చు చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం 52 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందించే ఆస్పత్రులకు నిధులు, సిబ్బంది పెంచుతామంటూనే, పనితీరు బాగా లేనివారిపై వేటు వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. జహీరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య మెరుగ్గా ఉంది. గజ్వేల్, నర్సాపూర్, రామాయంపేట తదితర చోట్ల ఆసుపత్రి ప్రసవాల సంఖ్య పెరగాలంటూ కలెక్టర్ నిర్దేశించారు. ‘మార్పు’ వేగంపై ఆందోళన మాత, శిశు మరణాల రేటు తగ్గింపు లక్ష్యంగా ‘మార్పు’ అమలు దిశగా కలెక్టర్ సంబంధిత విభాగాలను సమాయత్తం చేస్తున్నారు. అయితే ఐదు ప్రభుత్వ శాఖలకు సంయుక్తంగా ఈ కార్యక్రమం అమలు బాధ్యతను అప్పగించారు. స్వయం సహాయక సంఘాలను ‘మార్పు’ అమలులో భాగస్వాములను చేయడంతో వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే నవంబరు నెలాఖరుకల్లా ఫలితాలు చూపాలంటూ లక్ష్యం నిర్దేశించడంపై సంబంధిత శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పది ఆరోగ్య క్లస్టర్లలో స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇవ్వడం తలకు మించిన భారంగా మారేలా కనిపిస్తోంది. ఒక్కోచోట 700 నుంచి వేయి మంది మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉండటంతో ఏర్పాట్లపై సంబంధిత అధికారులు తల పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ‘మార్పు’ అమలు ప్రణాళిక తయారీలో తమను భాగస్వాములను చేసి ఉంటే మెరుగైన శిక్షణకు అవకాశముండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైద్య సేవలు మెరుగు దిశగా కలెక్టర్ వడివడిగా అడుగులు వేస్తుండటంతో, అందుకోలేక సంబంధిత విభాగాలు ఆయాస పడుతున్నాయి. -
నేటినుంచి విధుల్లోకి వైద్యులు
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రభుత్వ వైద్యులు నేటి నుంచి విధుల్లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి వైద్య బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో రోగులకు తీరని నష్టం జరుగుతుందని, వైద్యపరంగా చాలా కోల్పోవాల్సి వస్తుందని వారు వివరించారు. అయితే తమ ఆవేదనను సీఎం సరిగా అర్థం చేసుకోలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద రోగులకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా తాము విధుల్లో చేరుతున్నామని ప్రకటించారు. సోమవారం నుంచి అన్ని ఆస్పత్రుల్లోనూ ఔట్‌పేషంట్ సేవలు, ఆపరేషన్ థియేటర్ సేవలు జరుగుతాయన్నారు. ఇది తాత్కాలిక విరమణే అని, అవసరమైతే మెరుపు సమ్మె చేయడానికి వెనుకాడమని హెచ్చరించారు. తమకు సహకరించిన అందిరికీ అభినందనలు తెలుపుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.రామ్మోహన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సమైక్య జ్వాల.. విభజన ఆగాల
సాక్షి, కర్నూలు: సడలని దీక్షతో సమైక్య ఉద్యమాన్ని జిల్లా ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. విభజన నిర్ణయంపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు విశ్రమించబోమంటూ ప్రతినబూనారు. ఉద్యోగులను చట్టాల పేరిట బెదిరించే ప్రయత్నం చేస్తున్నా.. వారూ మొక్కవోని దీక్షతో రోడ్డెక్కుతూనే ఉన్నారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు మేరకు మంగళవారం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ జేఏసీలు ముట్టడించాయి. దీంతో కర్నూలు, ఆదోని, ఆళ్లగడ్డ, నంద్యాల, నందికొట్కూరు, డోన్, కొలిమిగుండ్ల ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. కర్నూలులో ప్రభుత్వ వైద్యులు కలెక్టరేట్ వద్ద యూపీఏ ప్రభుత్వాన్ని సమాధి చేసి నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆస్తులకు సమీపంలోని దీక్షా శిబిరాలను తొలగించాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు శ్రీకృష్ణదేవరాయ కూడలిలోని దీక్షా శిబిరాలను పోలీసులు తొలగించారు. అయితే 68 రోజులుగా అక్కడే దీక్ష నిర్వహిస్తున్న న్యాయవాదులు ఎండలోనే ఉద్యమాన్ని కొనసాగించారు. టీనోట్‌కు వ్యతిరేకంగా ఆదోనిలో విద్యుత్‌శాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి, పాతబస్టాండ్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. నంద్యాలలో రెవెన్యూ అధికారుల రిలే దీక్ష 35వ రోజుకు చేరుకుంది. పంచాయతీరాజ్ కార్యాలయ ఆవరణలో పీఆర్ ఉద్యోగులు 48వ రోజు దీక్షను కొనసాగించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంజీవనగర్ గేట్, బస్టాండ్, చామకాల్వ సెంటర్లలో ప్రైవేట్ వాహనాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎన్జీఓ కాలనీ ప్రజల ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు. తెలంగాణ నోట్ ప్రతులను ప్రభుత్వ వైద్యులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. పాములపాడులో చౌడేశ్వరి దేవాలయంలో సమైక్యవాదులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందికొట్కూరులో కొత్తబస్టాండ్ నుంచి ర్యాలీ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి పటేల్ విగ్రహం ఎదుట దహనం చేశారు. పత్తికొండలో జేఏసీకి మద్దతుగా వ్యాయామ ఉపాధ్యాయులు దీక్ష చేపట్టారు. బనగానపల్లెలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమం నిర్వహించారు. బేతంచర్లలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా నిర్వహించి సమైక్య నినాదాలతో హోరెత్తించారు.