గోదావరిఖనిలో మూలకుపడిన బయోమెట్రిక్ యంత్రం
కోల్‌సిటీ(రామగుండం) : జిల్లాలోని సర్కారు వైద్యులు, సిబ్బందికి ‘బయోమెట్రిక్’ భయం పట్టుకుంది. డాక్టర్లతోపాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా.. సొంత పనులపై బయట తిరుగుతున్నారు. అడిగేవారు లేకపోడంతో.. వైద్యులు, సిబ్బంది ఎవరిష్టం వచ్చినట్లు వారు సమయపాలన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి ఆటలకు కలెక్టర్ శ్రీదేవసేన చెక్ పెట్టనున్నారు. పేదలకు సకాలంలో వైద్యం అందాలనే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో వైద్య సిబ్బందిలో వణుకు మొదలయ్యింది.
ఇక ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్: జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పంచ్(థంబ్ ఇంప్రెషన్) అమలు చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ను వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
అధికారుల ప్రతిపాదనలు..: ప్రభుత్వాస్పత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలనపై జిల్లా కలెక్టర్ సీరియస్‌గా దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుపై వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యశ్రీరావుతోపాటు డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్‌కుమార్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో 30 బయోమెట్రిక్ యంత్రాలు: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి, పెద్దపల్లి, మంథని ఆస్పత్రులతోపాటు డీఎంహెచ్‌ఓ కార్యాలయం, రెండు డెప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయాలు, సుల్తానాబాద్‌లోని సీహెచ్‌సీ, రామగుండంలోని ఆరు యూపీహెచ్‌సీలుతోపాటు మేడారం, రాగినేడు, రాఘవపూర్, శ్రీరాంపూర్, కొలనూరు, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి, గర్రెపల్లి, పూట్నూర్, బసంత్‌నగర్, రామగుండం, గద్దెలపల్లి, ముత్తారం, కమాన్‌పూర్ పీహెచ్‌సీలలో బయెమెట్రిక్ యంత్రాలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం మంథని ఆస్పత్రిలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. సుమారు 30 బయెమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత వీటిని కొనుగోలు చేయనున్నారు.
ఉద్యోగుల్లో గుబులు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయెమెట్రిక్ విధానం అమలు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో వినియోగంలోకి తేవాలని చూస్తున్నారు. దీంతో స్థానికంగా నివాసం ఉండని వైద్యులు, ఇతర సిబ్బంది దూరప్రాంతాల నుంచి అప్ అన్ డౌన్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తాజా నిర్ణయంతో వైద్యులతోపాటు నర్సింగ్‌స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో గుబులు మొదలయ్యింది.
గతంలో గాడితప్పింది..
గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో గతంలోనే బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. అయితే ఆస్పత్రి అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీంతో సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ మూలకుపడేశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్‌పై సీరియస్‌గా ఉండడంతో, మూలకుపడేసిన యంత్రానికి మరమ్మతులు చేపట్టడానికి చర్యలు ప్రారంభించారు.
ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. – డాక్టర్ సూర్యశ్రీరావు, సూపరింటెండెంట్
బయోమెట్రిక్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రితోపాటు మంథని, పెద్దపల్లి ఆస్పత్రులలో బయోమెట్రిక్ యంత్రాలు వినియోగించడానికి చర్యలు ప్రారంభించాం. మంథనిలో వినియోగిస్తున్నాం. మూడు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు తయారు చేశాం. గోదావరిఖనిలో పని చేయని యంత్రానికి మరమ్మతులు కూడా చేయిస్తాం. ప్రతిపాదనలకు కలెక్టర్ అనుమతించాక వాటిని ఫిబ్రవరిలో అమలు చేస్తాం.
25 యంత్రాలు అవసరం...– డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో
జిల్లాలో డీఎంహెచ్‌వో, రెండు డెప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలతోపాటు పీహెచ్‌సీ, 15 సీహెచ్‌సీలు, ఆరు యూహెచ్‌సీలలో బయోమెట్రిక్ విధానం అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. కలెక్టర్ కూడా ఈ విషయంలో సీరిసయ్‌గా ఉన్నారు. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. జిల్లాలో సుమారు 25 బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు తయారు చేసిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు సమర్పిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment