bio metric system
-
వైద్య సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు
భీమవరం(ప్రకాశం చౌక్): పేద, మధ్యతరగతి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరింత పారదర్శక సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా ఫేస్ రికగ్నేషన్ (ముఖ ఆధారిత) యాప్ ద్వారా హాజరు వేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. గురువారం (డిసెంబర్ 1) నుంచి జిల్లావ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానుంది. ఆయా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది అందరూ ఈ విధానంలోనే హాజరు వేయాల్సి ఉంటుంది. దీనిద్వారా వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే నిర్దేశించిన సమయంలోనే హాజరు వేయాల్సి ఉండటంతో విధులకు డుమ్మా కొట్టే అవకాశం ఉండదు. డ్యూటీ సమయంలో వైద్యులు, సిబ్బంది కచ్చితంగా ఆస్పత్రిలోనే ఉండి సేవలు అందించేలా ఈ కొత్త యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. రోజుకు మూడు సార్లు చొప్పున.. వైద్యులు, సిబ్బంది రోజుకు మూడుసార్లు ఆస్పత్రిలో ముఖ ఆధారిత యాప్ ద్వారా హాజరు వేయాలి. ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 4 గంటలకు హజరు వేయాల్సి ఉంటుంది. రోజుకు మూడుసార్లు కచ్చితంగా హాజరు వేయాల్సిందే. జిల్లాలో 1,212 మంది.. జిల్లాలో ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వైద్యులు, అన్నిరకాల సిబ్బంది కలిపి మొత్తం 1,212 మంది ఉన్నారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో 500 మంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 712 మంది ఉన్నారు. 99 శాతం మేర ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. నేటి నుంచి అమలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అంతా ప్రభుత్వ నూతనంగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా బయోమెట్రిక్ వేయాలి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలోని అన్ని ఆస్పత్రుల నుంచి సుమారు 1,212 వైద్య సిబ్బందికి సంబంధించి ప్రక్రియ చేపట్టగా 98 శాతం మేర నమోదు కార్యక్రమం పూర్తి చేశారు. రోజుకు మూడుసార్లు వైద్య సిబ్బంది యాప్ ద్వారా బయోమెట్రిక్ వేస్తారు. –మహేశ్వరరావు, డీఎంహెచ్ఓ, పశ్చిమగోదావరి జిల్లా -
అంతా.. ట్రిక్కే..!
అధ్యాపకులు లేకున్నా రిజిస్టర్లలో పేర్లుంటాయి..విద్యార్థులు లేకున్నా లెక్కల్లో చూపిస్తూ ప్రైవేట్ విద్యా సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అంతా మాయ చేస్తున్నాయి.. ఇదేమని అడిగేవారు లేకపోవడంతో బయోమెట్రిక్ విధానాన్ని యాజమాన్యాలు పక్కదోవ పట్టిస్తున్నాయి. విద్యార్థుల స్కాలర్ షిప్‌లు స్వాహా చేస్తున్నాయి. రూ.లక్షల్లో ప్రభుత్వ నిధులను కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి, నెల్లూరు : ఇంటర్ కళాశాలల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఇంటర్ కళాశాలల్లో బయోమెట్రిక్ ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల హాజరును పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి విధిగా యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. అయితే జిల్లాలో ఏ ఒక్క కళాశాలలో కూడా బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయలేదు. బయోమెట్రిక్ ఏర్పాటుకు నిరాకరిస్తే కళాశాల గుర్తింపు రద్దు చేస్తామన్న హెచ్చరికను కూడా వారు పెడచెవిన పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ఆదేశాలు విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలల్లో ఉన్న పరిస్థితులపై ప్రస్తుతం నోరు మెదపడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్ రూపంలో కొంత మొత్తాన్ని అందజేస్తున్నారు. బోగస్ హాజరుతో ప్రభుత్వం ఇచ్చే నిధులను కార్పొరేట్, ప్రభుత్వ యాజమాన్యాలు పక్కదారి పట్టిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు హాజరు తక్కువ ఉందని విద్యార్థుల నుంచి కొత్త మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలో 126 కార్పొరేట్, 26 ప్రభుత్వ, 15 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి దాదాపు 60వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను ప్రతినెలా మంజూరు చేస్తుంది. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.325 చొప్పున 10 నెలలకు రూ.3,250 విడుదల చేస్తుంది. బోగస్ హాజరు చూపిస్తూ పలు కళాశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ప్రతిరోజు కళాశాలలకు రావాల్సిన అవసరం ఉండదని, పాస్ చేయించే బాధ్యత తమదేనని గ్యారెంటీ ఇచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులనుఎక్కువ మొత్తంలో చేర్చుకుంటున్నారు. వారు రోజు కళాశాలకు రాకపోయిన రికార్డుల్లో హాజరు చూపిస్తూ స్కాలర్‌షిప్పును ఎంచక్కా మెక్కేస్తున్నారు. అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబరును బయోమెట్రిక్‌కు అనుసంధానం చేసింది. ప్రతిరోజు విద్యార్థి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ హాజరును పరిగణలోకి తీసుకుని స్కాలర్‌షిప్పును ప్రభుత్వం విడుదల చేస్తుంది. ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు ఆదేశించారు. కళాశాలలో పనిచేసే అధ్యాపకుల హాజరు సైతం బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాలని తెలిపారు. ఆర్ఐఓలే బాధ్యులు ... జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేయకపోతే ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్ఐఓ)నే బాధ్యులు అవుతారని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం బయోమెట్రిక్ యంత్రాల అమలుపై ఎవరూ నోరు మెదపడం లేదు. ఇంటర్ బోర్డు అధికారులు సైతం పట్టించకోవడం లేదు. బయోమెట్రిక్ హాజరు లేకుండా ఏ ఒక్క కళాశాల నుంచి స్కాలర్షిప్పులకు దరఖాస్తులు స్వీకరించరాదని, పరీక్షల నిర్వహణకు, నామినల్ రోల్స్‌కు కూడా సిఫార్సు చేయవద్దని ఇంటర్‌బోర్డు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఇంటర్ బోర్డు చెప్పినట్లు యంత్రాలు అమలు చేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టేనని కొన్ని కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. మాన్యువల్ విధానం ఉంటే విద్యార్థులు వచ్చినా రాకున్నా హాజరు వేసుకుని స్కాలర్‌షిప్పు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించవచ్చనే ఆలోచనలో ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు ఉన్నట్లు తెలిసింది. యంత్రాలు ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా నష్టదాయకమని భావించి వాటిని నిరాకరిస్తున్నారని సమాచారం. అయితే బయోమెట్రిక్ ద్వారా హాజరు పరిగణలోకి తీసుకంటే తమ పిల్లలు రోజు కళాశాలకు వెళుతున్నారా..లేదన్నది తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఒక్కో యంత్రం ధర రూ.30వేల నుంచి రూ.35వేలుగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా ప్రతి కళాశాలలో బయోమెట్రిక్ యంత్రం తప్పనిసరిగా బిగించాల్సిందేనని ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే శ్రీనివాసరావు, స్పష్టం చేశారు. ఏర్పాటు చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రెవెన్యూలో బయోమెట్రిక్..
ఖానాపురం: చిన్నగా ఆఫీస్‌కు వెళుదామనుకునే రెవెన్యూ ఉద్యోగులకు ఇక కుదరదు. కార్యాలయానికి వెళ్లి కనబడి ఇతర పనులు చూసుకుందామనుకుంటే ఇక ఆ ఆటలు చెల్లవు.. సమయం పాటించని ఉద్యోగులకు బయోమెట్రిక్‌తో పరుగులు పెట్టించడానికి అధికారులు సమయాత్తమవుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో సమయపాలన పాటించేవిధంగా ప్రభుత్వం బయోమెట్రిక్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.జిల్లా వ్యాప్తంగా 16 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో తహసీల్దార్, డీటీ, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు వీఆర్వో, వీఆర్ఏ, కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటలకు విధులకు హాజరై, సాయంత్రం 5 గంటలకు విధులు ముగించాల్సి ఉంటుంది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి మొదట 2012 నుంచి 2014 సంవత్సరం వరకు బయోమెట్రిక్ విధానాన్ని చేపట్టారు. నాడు ఉద్యోగులు ఆధార్ ఎన్రోల్మెంట్ సరిగ్గా చేయకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారు. ఆ తర్వాత బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల కాలంలో రెవెన్యూశాఖపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోసారి తహసీల్దార్ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి కలెక్టర్ ముండ్రాతి హరిత, జేసీ రావుల మహేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగే దానికంటే ముందే కలెక్టరేట్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాలు అమలు చేసి తహసీల్దార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే లక్ష్యంగా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రస్తుతం బయోమెట్రిక్ విధానాన్ని విజయవంతంగా సాగిస్తున్నారు. ఐదు రోజులుగా ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు కలెక్టర్ హరిత కా ర్యాలయ సిబ్బందికి సూచించారు. ఈ నెల 2 నుం చే అమలు చేయాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గత వారం రోజులకు పైగా సిబ్బంది బయోమెట్రిక్ విధానాన్ని వినియోగించుకోవడానికి ఆధార్‌ను ఎన్రోల్మెంట్ చేసుకోవ డం జరిగింది. ఆలస్యం చేయకుండా మంగళవా రం నుంచి తప్పకుండా ఉద్యోగులు బయోమెట్రిక్‌ను వినియోగించాలనే స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఉద్యోగులు ఆధార్ ఎన్రోల్ చేసుకుం టూనే విధుల హాజరును చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 191 మంది ఉద్యోగులు రి జిస్టర్ చేసుకోగా 180 మంది ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆక్టివేట్ కావడం జరిగింది. అలాగే జిల్లాలో మంగళవారం రోజున 59 మంది బయోమెట్రిక్‌ను ఉపయోగించినట్లు సమాచారం. తేలనున్న ఉద్యోగుల సంఖ్య బయోమెట్రిక్ విధానంతో జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల సంఖ్య స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ఉద్యోగల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉండటంతో ప్రజలకు న్యాయమైన సేవలు అందడంలేదు. కొన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఐదుగురు లోపు మాత్రమే ఉద్యోగులు ఉండడంతో ప్రజలకు కావాల్సిన సేవలు అందించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థి«తులు ఏర్పడుతున్నాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా పూర్తిస్థాయిలో ఉద్యోగుల సంఖ్య తెలిసే అవకాశం ఉండగా విధులకు ఎంత మంది హాజరవుతున్నారనే విషయం కలెక్టరేట్లో ఉన్నతాధికారులు ప్రతీ రోజు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సంఖ్య తేలిన తర్వాత కావాల్సిన ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి పంపించడానికి కలెక్టరేట్ అధికారులు సమయాత్తమవుతున్నారు. వీఆర్వోలకు మినహాయింపు బయోమెట్రిక్ విధానాన్ని తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులకు మాత్రమే వినియోగించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వీఆర్వోలు, వీఆర్ఏలకు బయోమెట్రిక్‌ను అనుసంధానం చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో వారికి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు విధులపై నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి బయోమెట్రిక్ చాలా ఉపయోగపడనుంది. బయోమెట్రిక్‌ను అందుబాటులోకి తీసుకువస్తుండడంతో గ్రామాల్లోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమలుకు శ్రీకారం చుట్టాం ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్‌కు శ్రీకారం చుట్టాం. ఈ నెల 2 నుంచి అమలు చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందుకున్నాం. ఇప్పటికే కలెక్టరేట్లో అమలు చేయడం జరుగుతుంది. ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభిస్తున్నం. – రాజేంద్రనాథ్, కలెక్టరేట్ ఏఓ -
సన్నబియ్యం సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట
నల్లగొండ : సన్నబియ్యం సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. 2015 జనవరి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేసే సన్నబియ్యానికి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు ఈపాస్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్ బియ్యం సరఫరాకు సంబంధించి ఈపాస్ విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ప్రతినెలా వందల క్వింటాళ్ల బియ్యం మిగులుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ ఇటీవల జిల్లా పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలకు సన్నబియ్యం సరఫరాలో కూడా ఈపాస్ విధానాన్ని అమలు చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. సన్నబియ్యం అక్రమాలకు అడ్డుకట్ట ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఒకటినుంచి10వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి విద్యార్థికి 1 నుంచి 5వ తరగతి వారికి 100 గ్రాములు, 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల భోజనాన్ని పెడుతున్నారు. అదే విధంగా హాస్టల్ విద్యార్థులకు రోజూ 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 500 గ్రాములు, 6 నుంచి 10వ తరగతి వారికి 600 గ్రాముల భోజనాన్ని అందిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులు హాజరు కాకున్నా వచ్చినట్లుగా లెక్కలు చూపి అక్కడక్కడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడంలేదు. వారు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న భోజనాన్నో, ఇంటికి వెళ్లి తిని రావడమో చేస్తున్నారు. అలాంటి వారిని కూడా మధ్యాహ్న భోజనం చేసినట్లుగా తప్పుడు లెక్కలు రాస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. హాస్టళ్లలో కూడా అదే పరిస్థితి. విద్యార్థులు ఇళ్లకు వెళ్లినా వాళ్లు హాస్టల్లో ఉన్నట్లుగానే లెక్కలు సృష్టించి సంబంధిత హాస్టల్ వెల్ఫేర్ అధికారులు సన్నబియ్యాన్ని డ్రా చేస్తున్నారు. అలా అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని ఈపాస్ ద్వారానే అడ్డుకట్ట వేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రస్తుతం ఎంఈఓలు ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అనుగుణంగా ఎంఈఓలు, తహసీల్దార్లకు లెక్కలు అందిస్తున్నారు. వారు ఇండెంట్ పెడితే దాని ఆధారంగా సంబంధిత రేషన్ షాప్‌నకు సన్నబియ్యం వస్తున్నాయి. అక్కడినుంచి పాఠశాలలకు తీసుకెళ్తున్నారు. పనిచేయని బయోమెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నా అవి వాడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరం బయోమెట్రిక్‌ను కచ్చితంగా అమలు చేయడంతోపాటు బియ్యం సరఫరాలో ఈపాస్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. స్కూల్, హాస్టల్ అధికారుల వేలిముద్రలతో బియ్యం సరఫరా పాఠశాలకు సరఫరా అయ్యే బియ్యం సరఫరాకు సంబంధించి రేషన్‌షాపుల నుంచి కాకుండా నేరుగా సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఆ పాఠశాలలకు సంబంధించి బియ్యాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వ్యక్తి వేలిముద్ర తీసుకొని ఇవ్వనున్నారు. అదే విధంగా హాస్టల్‌కు సంబంధించి వేలిముద్ర ఆధారంగా బియ్యాన్ని ఇస్తారు. తద్వారా బియ్యం పక్కదారి పట్టదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో నేరుగా పాఠశాల, హాస్టల్ వారు ఎన్ని బియ్యం తీసుకున్నారని తేలిపోతుంది. అక్కడ విద్యార్థులకు వండిపెడతారు. అక్కడ ప్రతి నెలా మిగిలిన బియ్యం బయటికి తీసుకెళ్లే అవకాశం ఉండదు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ పాస్ విధానం అమలు చేయడం ద్వారా సన్నబియ్యంలో అక్రమాలకు అడ్డుకట్టపడి సక్రమంగా పిల్లలకు భోజనం అందే అవకాశం ఉంది. -
సారోళ్లకు ఏమైందో!
ఒంగోలు టౌన్: ఉపాధ్యాయ శాఖలో కలకలం రేగింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరైన వెంటనే ఉదయం, సాయంత్రం రెండు పూటలా బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. అయితే శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 355 మంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్ హాజరు వేయలేదు. ఆ ఉపాధ్యాయులు సెలవు పెట్టినా, ఒకవేళ ఓడీ చేస్తున్నా సమాచారాన్ని తప్పనిసరిగా ఏపీటెల్ యాప్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. కానీ 355 మంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్ హాజరు వేయకపోవడం, ఏపీటెల్ యాప్ ద్వారా సమాచారం చేరవేయక పోవడంతో జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు సీరియస్‌గా తీసుకున్నారు. 355 మంది ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. శనివారంలోగా సరైన కారణాలతో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయోమెట్రిక్‌తో బ్రేక్‌లు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్ పరిధిలో 3097 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 14137 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రతిరోజూ పాఠాలు బోధిస్తుండాలి. బయోమెట్రిక్ హాజరు అమలు కాకముందు వరకు అనేకమంది ఉపాధ్యాయులు ఆడిందే ఆట, పాడిందే పాటగా ఉండేది. పాఠశాలకు వెళితే వెళ్లినట్లు, వెళ్లకపోయినా వెళ్లినట్లుగానే ఉండేది. ఎందుకంటే ఆ పాఠశాలల్లో ఉండే ఉపాధ్యాయుల మ«ధ్య అండర్ స్టాండ్ ఉండటమే. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో అయితే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉండేవి. ఒకరి తర్వాత మరొకరు సొంత పనుల పేరుతో పాఠశాలలకు డుమ్మా కొడుతూ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు మాత్రం చేసుకుంటూ ఉండేవారు. మండల విద్యాశాఖాధికారి, ఉప విద్యాశాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి ఎప్పుడైనా అలాంటి పాఠశాలలు తనిఖీ చేసిన సమయంలో వెంటనే విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఆ రోజు పాఠశాలకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయుడిని సేవ్ చేసేందుకు ముందుగా సిద్ధం చేసుకొని ఉంచిన సెలవు చీటిని బయటకు తీసేవారు. ఆ సెలవు చీటిలో అప్పటికప్పుడు ఆ రోజు తేదీ రాసి అటెండెన్స్ రిజిస్టర్లో పెట్టేవారు. ఇలా ఒకరికొకరు ఉపాధ్యాయులు సహకరించుకుంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం కంటే సొంత పనులపైనే ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చారు. బేజార్.. రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వ శాఖల్లో విస్తరిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ బయోమెట్రిక్ హాజరు పరిధిలోకి తీసుకువచ్చింది. ఉదయం పాఠశాల తెరిచిన వెంటనే, సాయంత్రం పాఠశాల మూసివేసే ముందు రెండుసార్లు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. అయితే మొదట్లో బయోమెట్రిక్‌కు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో మాన్యువల్‌గా అనుమతి ఇస్తున్నారు. అదే సమయంలో బయోమెట్రిక్‌లో తప్పనిసరిగా వచ్చినట్లుగా థంబ్ వేయాల్సి ఉంటుంది. సాంకేతిక పరమైన సమస్య తొలగిన తరువాత ఆ ఉపాధ్యాయుడు ఆ సమయంలో తరగతులకు హాజరై బయోమెట్రిక్ హాజరు వేశారా లేదా అన్నది తేలుతుంది. సిగ్నల్స్ అందని ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఇలాంటి విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. దీంతో తప్పించుకొని తిరిగే ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ రూపంలో బ్రేక్‌లు పడినట్లయింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఒక్కరోజే 355 మంది ఉపాధ్యాయులు బయోమెట్రిక్ హాజరు వేయకుండా, సెలవు లేదా ఓడీకి వెళ్లినా ఆ సమాచారం కూడా ఏపీటెల్ యాప్ ద్వారా తెలియజేయకపోవడంతో జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మెమోల రూపంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లయింది. ఏదిఏమైనప్పటికీ జిల్లాలోని 355మంది ఉపాధ్యాయులకు ఒకేసారి మెమోలు జారీ చేయడం విద్యాశాఖలో, ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
బయోమెట్రిక్‌కు బైబై..
నావంద్గికి చెందిన మాల సుభద్రమ్మకు ప్రభుత్వం అంత్యోదయ కార్డు మంజూరు చేసింది. ఈమెకు ప్రతినెలా 35 కిలోల బియ్యం వస్తాయి. సుభద్రమ్మ ఇద్దరు కొడుకులకు వారి కుటుంబ సభ్యులతో వేర్వేరు రేషన్ కార్డులు ఉండటంతో.. తన కార్డులో ఆమె పేరు మాత్రమే ఉంది. బియ్యం తీసుకునేందుకు షాపు వద్దకు వెళ్లి.. బయోమెట్రిక్ మిషన్‌లో వేలుపెడితే ఎప్పుడూ ముద్రలు వచ్చేవి కావు. దీంతో ఎనిమిది నెలలుగా స్థానిక వీఆర్ఏ వచ్చి వేలిముద్ర వేసి బియ్యం ఇప్పిస్తున్నారు. ఇలా ప్రతినెలా నావంద్గిలో ఐదుగురు లబ్ధిదారులు వీఆర్ఏ కోసం ఎదురు చూస్తుంటారు. బషీరాబాద్ రంగారెడ్డి : ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను జోడించి లబ్ధిదారులకు సులభంగా నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేద ప్రజలు కడుపునిండా తినాలనే సంకల్పంతో సర్కారు అందజేస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకంలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు మరో పకడ్బందీ చర్యను అమలు చేయనుంది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ద్వారా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నా.. వృద్ధులు, రోజు పనులు చేసే కూలీలు, రక్తహీనత ఉన్నవారి వేలిముద్రలు బయోమెట్రిక్‌లో నమోదు కావడం లేదు. దీంతో వారు సరుకులు తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం బియ్యం పంపిణీని మరింత పారదర్శకంగా అమలు చేయడంతో పాటు, లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరేలా ఐరిస్ విధానాన్ని తీసుకువస్తోంది. డీలర్ల వినతుల నేపథ్యంలో రేషన్ లబ్ధిదారుల అవస్థలు తీరనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రేషన్ సరుకుల పంపిణీలో ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన సర్కారు ఐరిస్ విధానాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా ఇప్పటివరకూ వేలిముద్రలు నమోదు కాకపోవడంతో సరుకులకు దూరమైన వారి కష్టాలు తొలగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పద్ధతిని అమలు చేసేందుకు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 588 రేషన్ షాపుల పరిధిలో 2,31,271 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీటిలో పేరున్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం నెలనెలా 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందజేస్తోంది. ఇందుకోసం ప్రతి నెలా జిల్లాకు 5,316 టన్నుల రేషన్ బియ్యం సరఫరాచేస్తుంది. ఇప్పటివరకు డీలర్లు బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతీ నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఏ గ్రామంలోనైనా సరుకులు తీసుకునేలా పోర్టబులిటీ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే పలుమార్లు ఈ పాస్ బయోమెట్రిక్ మిషన్లు మొరాయించడం, నెట్వర్క్ పనిచేయకపోవడం వంటి కారణాలతో గడువులోపు పంపిణీ పూర్తికావడంలేదని డీలర్ల నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. ముఖ్యంగా వేలిముద్రలు రాని వృద్ధులు, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి, రక్తహీనత ఉన్నవారికి బయోమెట్రిక్‌లో రావడంలేదు. దీంతో అలాంటి వారికి గతంలో గ్రామ వీఆర్ఏల వేలిముద్రలను వేసి సరుకులు అందజేసేవారు. ఈ క్రమంలో పలు చోట్ల వీఆర్ఏలు, డీలర్లు కలిసి అక్రమాలకు పాల్పడిన సంఘటనలు వెలుగుచూడటంతో ఆస్థానంలో నుంచి వీఆర్ఏలను తొలగించి గిర్దవరి, డిప్యూటీ తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయిం చారు. ఇప్పటివరకు వేలిముద్రలు రాని వారికోసం వీఆర్ఓలు షాపుల వారీగా వెళ్లి ఫింగర్ ప్రింట్ వేస్తే తప్ప లబ్ధిదారులకు బియ్యం రాలేదు. ఇది ఓ ప్రహసనంలా మారడంతో ప్రభుత్వం ఐరిస్ విధానం అమలుకు సిద్ధమైంది. ఇందులో మొదట లబ్ధిదారుల కనుపాపలను ఐరిస్ యంత్రంలో నిక్షిప్తం చేస్తారు. ఆధార్ అనుసంధానంలా ఆన్లైన్లో కనుపాపలు సరిపోలితే వారికి రేషన్ సరుకులు అందజేస్తారు. ఇలా కుటుంబంలో ఎవరైనా రేషన్ షాపునకు వెళ్లి సరుకులు తీసుకోవచ్చు. ఇప్పటికే జిల్లాకు ఐరిస్ యంత్రాలు చేరుకున్నట్లు రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు. గడువు పెంచే అవకాశం.. ప్రస్తుతం బియ్యం పంపిణీ పదిహేను రోజుల పాటుసాగుతోంది. అయితే బఫర్ గోదాంల నుంచి డీలర్లకు నెలాఖరు వరకు బియ్యం రావడం లేదు. రవాణా, అధికారుల అలసత్వం వంటి కారణాలతో 5 నుంచి పది రోజుల జాప్యం జరుగుతోంది. ఈ కారణంగానే జిల్లాలో ఆగస్టు కోటాలో ఏకంగా 1,060 టన్నుల బియ్యం మిగులు కావడంతో ప్రభుత్వం మరో రెండు రోజుల పాటు ఆన్లైన్ గడువు పెంచింది. ఇలాంటి సమస్యల వలన గడువును 20వతేదీ వరకు పెంచేలా నిర్ణయం తీసుకోబోతుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఆదేశాలు వచ్చాయి బయోమెట్రిక్ స్థానంలో.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఐరిస్ విధానం అమలు చేయాలని ప్రభుత్వ నుంచి ఆదేశాలు వచ్చాయి. అక్టోబరు మాసం నుంచి కొత్త పద్ధతి ద్వారానే లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తాం. జిల్లాలోని 588 రేషన్ దుకాణాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించాం. ఈ పద్ధతి ద్వారా వేలిముద్రలు స్కాన్ కాని వారి కష్టాలు దూరమవుతాయి. – పద్మజ, జిల్లా పౌర సరఫరాల అధికారి -
డిగ్రీకీ బయోమెట్రిక్
లక్ష్మణచాంద(నిర్మల్) : డిగ్రీ స్థాయికి వచ్చాక విద్యార్థులు చదువుపై కాకుండా సరదాలపై ఆసక్తి చూపుతుంటారు. కళాశాలకు సరిగా రారు. దీంతో ఎక్కువ మంది పరీక్షల్లో ఫెయిలవుతూ ఉంటారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం (2018–19) నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో వేలిముద్ర హాజరు (బయోమెట్రిక్) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కళాశాలలకు ఇప్పటికే ఉత్తర్వులు సైతం అందాయి. విద్యార్థుల హాజరు వివరాలు సంబంధిత విశ్వవిద్యాలయం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఈ–పాస్ విధానానికి అనుసంధానం చేయనున్నారు. గైర్హాజరు నివారించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 104 ఉన్నాయి. ఇందులో 16వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే హాజరు విషయంలో అధికారులు, ఆయా కళాశాలల యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించకపోవడంతో చాలా మంది గైర్హాజరవుతున్నారు. కొంతమంది స్వయం ఉపాధి పొందుతూ విద్యాభ్యాసం చేస్తున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు కళాశాలలకు వెళ్లినా తరగతులకు హాజరుకావడం లేదు. పరీక్షల సమయం వచ్చినప్పుడు లేదా ఉపకార వేతనాల దరఖాస్తుల సమయంలోనే కనిపిస్తున్నారు. సంబంధిత యాజమాన్యాల సహకారంతో ఆ సమయంలో 75 శాతం హాజరు ఉండేలాగా చూసుకునేవారు. ఈ పరిస్థితికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది. బయోమెట్రిక్‌తో హాజరు నమోదు ప్రస్తుతం అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో డిగ్రీలోనూ అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రతీ కళాశాలలో బయోమెట్రిక్ పరికరాలు సిద్ధం చేయాలని ఇప్పటికే విద్యాశాఖ ఆయా కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల పేర్లు, కోర్సు, విద్యా సంవత్సరం తదితర వివరాలను ఇందులో నమోదు చేస్తారు. వీటి ఆధారంగా ప్రతీ రోజు విద్యార్థుల హాజరును వేలిముద్రల ద్వారా నమోదవుతోంది. ఈ వివరాలను మార్చేందుకు అవకాశం లేకపోవడంతో ఇకపై కళాశాలలకు రాకుండా నిర్ణీత హాజరుశాతం పొందడం విద్యార్థులకు కష్టమే. అధ్యాపకులకూ వర్తింపు ఈ హాజరు విధానం కేవలం విద్యార్థులకే కాకుండా అ«ధ్యాపకులకూ వర్తింపజేయనున్నారు. విద్యార్థుల హాజరు సక్రమంగా లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. తనిఖీల సమయంలో, ఇతర అవసరాల్లో అప్పటికప్పుడు తాత్కాలిక సిబ్బందిని నియమించి ఎలాగోలా నెట్టుకొచ్చేవారు. ఈ విషయం ఉన్నత విద్యామండలికి తెలిసినా ఏమి చేయలేని పిరిస్థితి. అయితే ఇకపై అలా కుదరదు. బోధన, బోధనేతర సిబ్బందిని తప్పనిసరిగా నియమించుకోవాల్సిందే. ప్రైవేట్‌లోనే కాదు.. ప్రభుత్వ కళాశాలల్లోను ఖాళీగా ఉన్న పోస్టులను శాశ్వత లేదా ఒప్పంద, పొరుగు సేవల విధానంలో నియమించాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ తీసుకున్న నూతన నిర్ణయంతో ఇక అన్ని కళాశాలల్లోను పూర్తి స్థాయిలో అధ్యాపకులు అందుబాటులోకి వస్తారు. బోధన మెరుగుపడి విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. హాజరు లేకుంటే ఉపకారవేతనాలు కట్.. విద్యార్థుల హాజరు 75శాతం లేకుంటే ఉపకార వేతనాలు మంజూరు అయ్యే అవకాశం ఉండదు. ఈమేరకు తమ పిల్లలు సక్రమంగా కళాశాలకు హాజరు అయ్యేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేకుంటే ఆర్థిక భారం తప్పకపోవచ్చు. యాజమాన్యాల ఆందోళన విద్యాశాఖ నిర్ణయంతో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలలో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు విద్యార్థులు కళాశాలకు రాకున్నా హాజరు అయినట్లుగా ఆన్లైన్లో నివేదికలు నమోదు చేసేవారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు, బోధన రుసుములు సులభంగా పొందేవారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు తప్పనిసరి కావడంతో వారంతా అయోమయంలో పడిపోయారు. విద్యార్థుల హాజరు నిర్దేశిత ప్రకారం లేకుంటే పరీక్షలకు అనుమతించే అవకాశం ఉండదు. ఉపకార వేతనాలు పొందడానికి విద్యార్థుల వివరాలు సిఫారసు చేయరాదు. పైగా కళాశాల రుసుముల చెల్లింపుకోసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది. కళాశాలకు సక్రమంగా రాని విద్యార్థుల ఫీజులు చెల్లిస్తారనే గ్యారంటీ కూడా ఉండదు. ఒకవేళ డిటెన్షన్‌కు గురి అయితే పైతరగతులకు అనుమతించరు. ఫలితంగా ఉపకార వేతనాల జారీ నిలిచిపోతుంది. బయోమెట్రిక్‌కు ఏర్పాట్లు డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేందుకు గాను ఈ విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థుల వివరాలు జియోట్యాగింగ్ చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం పట్టవచ్చు. అప్పటి వరకు అన్ని కళాశాలలో బయోమెట్రిక్ పరికరాలు సిద్ధం చేసుకోవాలని ఇటీవల ప్రిన్సిపాళ్ల మీటింగ్‌లో తెలియజేసాం. – పురుషోత్తం, రిజిస్ట్రార్, కాకతీయ యూనివర్సిటీ -
వేలిముద్రలు : ఏపీ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు
సాక్షి, అమరావతి: తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ వేలిముద్రల ఉదంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తోంది. తెలంగాణలో సిమ్‌కార్డుల అమ్మకాల కోసం నకిలీ వేలిముద్రలు తయారు చేసిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి కాపీల డౌన్‌లోడ్‌ను నిలిపివేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ సర్వర్‌ను నిలిపివేసింది. పెద్దపల్లి జిల్లాలో బయటపడిన నకిలీ వేలిముద్రల కుంభకోణంలో నిందితుడు సంతోష్‌కుమార్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ నుంచి డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేశాడన్న సంగతి తెలిసిందే. వాటి ఆధారంగా నిందితుడు నకిలీ వేలిముద్రలు తయారు చేయడంతో ఆధార్ బయోమెట్రిక్ భద్రత సవాలుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు 7.4 లక్షల సర్టిఫైడ్ రిజిస్ట్రేషన్ కాపీలు జారీ కాగా.. విజయవాడ, గుంటూరు జిల్లాల్లోనే 2.5 లక్షల డాక్యుమెంట్లు డౌన్లోడ్ అయ్యాయని అధికారులు తెలిపారు. వీటిలో కొన్నింటిని నకిలీ ఆధార్, సిమ్ కార్డులు పొందడానికి వినియోగించినట్టు ఏపీ, కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో వెలుగుచూసిన నకిలీ వేలిముద్రల స్కాం తరహాలో ఏపీలో కూడా ఏమైనా అవకతవకలు జరిగాయా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నకిలీ వేలిముద్రల స్కాం ; నిందితుడి విచారణ
సాక్షి, హైదరాబాద్: సిమ్‌కార్డుల అమ్మకాల్లో టార్గెట్‌ను చేరుకోవడానికి నకిలీ వేలిముద్రలు తయారు చేసిన నిందితుడిని విచారణ నిమిత్తం పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్ వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి సేకరించిన వేలిముద్రలకు నకిలీ వేలిముద్రలు తయారు చేసి సంతోష్‌కుమార్ దాదాపు ఆరువేల సిమ్‌కార్డులు ఆక్టివేషన్ చేశాడు. అయితే, ప్రాథమిక విచారణలో సిమ్‌కార్డుల విక్రయానికి సంబంధించిన టార్గెట్‌ను పూర్తిచేయడానికే నకిలీ వేలిముద్రలు తయారు చేసినట్టు బయడపడినా, ఎవరైనా సంఘవిద్రోహ శక్తులకు అతను సిమ్‌కార్డులు అందించాడా? ఈ నకిలీ వేలిముద్రల తయారీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. వేల సంఖ్యలో నకిలీ వేలిముద్రల స్కాం బయటపడడం ఆధార్ బయోమెట్రిక్ భద్రతకు సవాల్‌గా నిలిచింది. కాగా, ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దేందుకు యూఐడీఏఐ అధికారులు రంగంలోకి దిగారు. -
బడిలో బయోమెట్రిక్
పరకాల రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం.. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు కసరత్తు చేస్తోం ది. జిల్లా వ్యాప్తంగా 659 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 454 ప్రాథమిక, 74 ప్రాథమి కోన్నత, 131 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో మొత్తం కలిపి 46,154 మంది విద్యార్థులు ఉన్నా రు. జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఒక్కరు మాత్ర మే రెగ్యులర్ ఎంఈఓ ఉండగా.. మిగతా 14 మండలాల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులే ఇన్చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. డీఈఓ సైతం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు ఒక్కరే ఉన్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల్లో చాలా మంది సమయపాలన పాటించడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా విద్యాబోధన కుంటుపడి విద్యార్థుల హాజరు శాతం పడిపోవడంతోపాటు ఫలితాలు సైతం ఆశించిన మేర రావడలేదనే విమర్శలు ఏళ్ల తరబడి వస్తున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం గాడితప్పిన పాఠశాలల పాలనను దారిలోకి తీసుకురావడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెస్తోంది. ప్రయోగాత్మకంగా 100 పాఠశాలల్లో.. మొదటగా జిల్లాలోని 100 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల ను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందించా రు. ఈ విధానంతో పాఠశాలల్లో ప్రార్థన సమయానికి ముందు, పాఠశాల ముగిసిన అనంతరం ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల హాజరును వేలి ముద్రల ద్వారా నమోదు చేయనున్నట్లు అధి కారులు పేర్కొంటున్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం, విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడి మెరుగైన విద్యాబోధన జరిగి ఉత్తమ ఫలి తాలు సాధించవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వేలిముద్రల హాజరు నమోదుతో సన్న బియ్యంతో అందిస్తున్న మధ్యాహ్నభోజన పథకంలో అక్రమాలకు తావు లేకుండా అమలు చేయవచ్చని పేర్కొంటున్నారు. బయోమెట్రిక్‌తో అనేక ప్రయోజనాలు ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉపాధ్యాయుల్లో నిబద్ధత పెరుగుతుంది. పాఠశాలకు హాజరు కాని విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యే కంగా శ్రద్ధ పెట్టి వారు రెగ్యులర్‌గా స్కూల్ వచ్చేలా చేయవచ్చు. దీంతో మెరుగైన విద్యను అందించేందుకు వీలు కలుగుతుంది. బయోమెట్రిక్ విధానం ఆహ్వానించ దగిన మంచి విషయం. – కామిడి సతీష్ రెడ్డి,ప్రభుత్వఉపాధ్యాయుడు, సామాజిక రచయిత విద్యార్థులకు లాభం చేకూరుతుంది పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానంతో విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఉపాధ్యాయులు అడ్డగోలుగా విధులకు గైహాజరు కాకుండా ఉంటారు. విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. – పసుల సంపత్, నాగారం సర్కారు స్కూళ్ల బలోపేతానికి దోహదం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బయోమెట్రిక్ విధానం దోహదపడుతుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ పద్ధతిని అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల నుంచి పాఠశాలల వివరాలు సేకరించి పంపించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎంపిక చేసిన పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తాం. – కె.నారాయణరెడ్డి, డీఈఓ -
వేలిముద్రతో వేతనానికి లింక్ !
వత్సవాయి (జగ్గయ్యపేట) : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని ఇక నుంచి అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు, ఆయాలకు కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైన తరువాత వేలిముద్ర వేస్తేనే వేతనం అనే మెలిక పెట్టనున్నారు. బుధవారం నుంచి ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ఉన్న బయోమెట్రిక్ యంత్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు వేలిముద్ర వేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఈ విధానం గురించి అంగన్వాడీలకు తెలియజేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, ఆయాలు సమీపంలోని పాఠశాలకు వెళ్లి వేలిముద్ర వేయాల్సిఉంటుంది. సీడీపీవోలు, సూపర్వైజర్లు ఇప్పటికే వారి కార్యాలయాల్లో వేలిముద్ర వేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఈ విధానం అమలు చేసిన తరువాత హాజరు నమోదును బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించనున్నారు. గ్రేడ్ల విధానం ♦ 90 శాతం కంటే హాజరు ఎక్కువగా ఉంటే ఏ గ్రేడ్ ♦ 70 శాతంలోపు బి గ్రేడ్ ♦ 50 శాతం లోపు సీ గ్రేడ్‌గా పరిగణిస్తారుసీ గ్రేడ్‌గా వచ్చిన కేంద్రాల నిర్వాహకులకు ఒకటి, రెండు సార్లు హెచ్చరించి తరువాత వారి జీతాలలో కోత పెడతారు. భవిష్యత్తులో వేతనాల పెంపు. పదోన్నతులు వంటి అంశాలన్నింటికీ ఇది కీలకంగా మారనుంది. కృష్ణా జిల్లాలో 6,700 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కృష్ణా జిల్లాలో చిల్లకల్లు, నందిగామ, కంచికచర్ల, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట, నూజివీడు, విజయవాడ, 1, 2, గన్నవరం, ఉయ్యూరు, కంకిపాడు, గుడివాడ, మండవల్లి, కైకలూరు, బంటుమిల్లి, అవనిగడ్డ, మొవ్వ, పామర్రు, బందరు అర్బన్, బందరు రూరల్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో 3,350 మంది కార్యకర్తలు, 3,350 మంది ఆయాలు పనిచేస్తున్నారు. అమలు సాధ్యమయ్యేనా..? ఈ విధానం అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు అమలు సాధ్యమయ్యేనా అనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బయోమెట్రిక్ ద్వారా నానా ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ బిజీగా ఉండడంతో వెంటనే వేలిముద్రలు పడక వాటిముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. పది మంది చొప్పున టీచర్లు ఉండే పాఠశాలల్లో బయోమెట్రిక్ వేసేందుకే గంటసేపు పడుతోంది. సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇక అంతే సంగతులు. ఇక గ్రామానికి నాలుగు నుంచి ఐదు వరకు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, పెద్ద గ్రామాలైతే పది వరకు ఉన్నాయి. గంటల తరబడి టీచర్లు, ఆయాలు వేలిముద్రలు పడిందాకా అక్కడే ఉంటే ఇక అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులను ఎప్పుడు తీసుకురావాలి, వారి అలనాపాలనా ఎవరూ చూడాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు సుమారు కిలోమీటరుపైనే దూరం ఉంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో అంతదూరం నడిచివెళ్లి బయోమెట్రిక్ వేసి రావాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కేంద్రాల్లోనే బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయాలి అంగన్వాడీ కేంద్రాల్లోనే బయోమెట్రిక్ విధానం పెట్టాలి. ఉదయం, సాయంత్రం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వేలిముద్ర వేయాలంటే కష్టం. ప్రభుత్వం అన్ని రకాల సర్వేలను అంగన్వాడీలతో చేయించుకుంటూ వారిని పనిదొంగలుగా చూస్తున్నారు. గ్రామాల్లో తనిఖీలకు వచ్చే ప్రతి అధికారి, ప్రజాప్రతిని«ధులు అంగన్వాడీ టీచర్లను బెదిరించేవారే. ప్రభుత్వం అంగన్వాడీల సేవలను అన్ని విధాలుగా వాడుకుంటూ వారికి వేతనాలు పెంచే విషయంలో మాత్రం పట్టించుకోవడంలేదు.– సుప్రజ, అంగన్వాడీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి త్వరలో అమల్లోకి.. అంగన్వాడీలు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి వేలిముద్ర వేయాల్సిఉంటుంది. హాజరు శాతాన్ని బట్టి గ్రేడ్లుగా విభజిస్తారు. బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు అందిస్తారు. – గ్లోరి, ఐసీడీఎస్ సీడీపీవో, చిల్లకల్లు -
సర్కార్ వైద్యులకు ‘బయోమెట్రిక్’!
కోల్‌సిటీ(రామగుండం) : జిల్లాలోని సర్కారు వైద్యులు, సిబ్బందికి ‘బయోమెట్రిక్’ భయం పట్టుకుంది. డాక్టర్లతోపాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా.. సొంత పనులపై బయట తిరుగుతున్నారు. అడిగేవారు లేకపోడంతో.. వైద్యులు, సిబ్బంది ఎవరిష్టం వచ్చినట్లు వారు సమయపాలన లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి ఆటలకు కలెక్టర్ శ్రీదేవసేన చెక్ పెట్టనున్నారు. పేదలకు సకాలంలో వైద్యం అందాలనే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో వైద్య సిబ్బందిలో వణుకు మొదలయ్యింది. ఇక ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్: జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో పంచ్(థంబ్ ఇంప్రెషన్) అమలు చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. ఇటీవల గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా సూపరింటెండెంట్ సూర్యశ్రీరావు, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ను వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారుల ప్రతిపాదనలు..: ప్రభుత్వాస్పత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలనపై జిల్లా కలెక్టర్ సీరియస్‌గా దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుపై వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యశ్రీరావుతోపాటు డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్‌కుమార్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 30 బయోమెట్రిక్ యంత్రాలు: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి, పెద్దపల్లి, మంథని ఆస్పత్రులతోపాటు డీఎంహెచ్ఓ కార్యాలయం, రెండు డెప్యూటీ డీఎంహెచ్ఓ కార్యాలయాలు, సుల్తానాబాద్‌లోని సీహెచ్‌సీ, రామగుండంలోని ఆరు యూపీహెచ్‌సీలుతోపాటు మేడారం, రాగినేడు, రాఘవపూర్, శ్రీరాంపూర్, కొలనూరు, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి, గర్రెపల్లి, పూట్నూర్, బసంత్‌నగర్, రామగుండం, గద్దెలపల్లి, ముత్తారం, కమాన్‌పూర్ పీహెచ్సీలలో బయెమెట్రిక్ యంత్రాలు అమలు చేయనున్నారు. ప్రస్తుతం మంథని ఆస్పత్రిలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. సుమారు 30 బయెమెట్రిక్ యంత్రాలను కొనుగోలు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత వీటిని కొనుగోలు చేయనున్నారు. ఉద్యోగుల్లో గుబులు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో బయెమెట్రిక్ విధానం అమలు చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో వినియోగంలోకి తేవాలని చూస్తున్నారు. దీంతో స్థానికంగా నివాసం ఉండని వైద్యులు, ఇతర సిబ్బంది దూరప్రాంతాల నుంచి అప్ అన్ డౌన్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తాజా నిర్ణయంతో వైద్యులతోపాటు నర్సింగ్‌స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో గుబులు మొదలయ్యింది. గతంలో గాడితప్పింది.. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో గతంలోనే బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. అయితే ఆస్పత్రి అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీంతో సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ మూలకుపడేశారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్‌పై సీరియస్‌గా ఉండడంతో, మూలకుపడేసిన యంత్రానికి మరమ్మతులు చేపట్టడానికి చర్యలు ప్రారంభించారు. ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. – డాక్టర్ సూర్యశ్రీరావు, సూపరింటెండెంట్ బయోమెట్రిక్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రితోపాటు మంథని, పెద్దపల్లి ఆస్పత్రులలో బయోమెట్రిక్ యంత్రాలు వినియోగించడానికి చర్యలు ప్రారంభించాం. మంథనిలో వినియోగిస్తున్నాం. మూడు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు తయారు చేశాం. గోదావరిఖనిలో పని చేయని యంత్రానికి మరమ్మతులు కూడా చేయిస్తాం. ప్రతిపాదనలకు కలెక్టర్ అనుమతించాక వాటిని ఫిబ్రవరిలో అమలు చేస్తాం. 25 యంత్రాలు అవసరం...– డాక్టర్ ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో జిల్లాలో డీఎంహెచ్‌వో, రెండు డెప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలతోపాటు పీహెచ్సీ, 15 సీహెచ్‌సీలు, ఆరు యూహెచ్‌సీలలో బయోమెట్రిక్ విధానం అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. కలెక్టర్ కూడా ఈ విషయంలో సీరిసయ్‌గా ఉన్నారు. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. జిల్లాలో సుమారు 25 బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలుకు తయారు చేసిన ప్రతిపాదనలను కలెక్టర్‌కు సమర్పిస్తాం. -
కేజ్రీవాల్ నిర్ణయం.. ప్రజల ఆకలి తిప్పలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ప్రజలను పస్తులు ఉంచుతూ.. విమర్శలకు తావునిస్తోంది. ఆధార్ డేటా ఆధారంగా రేషన్ కోసం ప్రవేశపెట్టిన బయో మెట్రిక్ విధానం విఫలం కావటంతో .. ఐరిష్ స్కాన్, ఓటీపీల ద్వారా రేషన్ సరుకులు అందిస్తామని ప్రకటించించింది. అయితే రెండువారాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు దిగింది. బయో మెట్రిక్ విధానం... అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1న ఓ కొత్త నిర్ణయం ప్రకటించింది. ఆధార్ కార్డులోని డేటాతో వేలి ముద్రలు సరిపోతేనే రేషన్ అందిస్తామని స్పష్టం చేసింది. రేషన్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించి.. అర్హులైనవారికి లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సర్కార్ ప్రకటించింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అవేం పట్టించుకోని ప్రభుత్వం ఢిల్లీలోని 2,255 రేషన్‌షాపులకు ఈ-పీవోఎస్(e-PoS.. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలను అందించింది. అయితే ఆధార్డేటాతో కొందరు లబ్ధిదారుల వేలిముద్ర మ్యాచ్ కాలేదు. దీంతో రేషన్ ఇచ్చేందుకు డీలర్లు నిరాకరించగా.. లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేశారు. విషయం అధికారుల దృష్టికి రావటంతో తక్షణ చర్యలు చేపట్టారు. తాత్కాలికంగా కంటిపాపల్ని స్కాన్ చేసి కొత్తగా పాస్వర్డ్లు ఇస్తామని, తద్వారా రేషన్ పొందొచ్చని ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ ప్రకటించింది. ఇందుకోసం ఈనెల 15న తేదీ నుంచి పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. తీరా కార్యాలయానికి వెళ్లిన లబ్ధిదారులు మళ్లీ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అధికారులెవరూ అక్కడ లేరని, ఉన్నవారు కూడా స్పందించటం లేదని, తాము పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వివరణ... విమర్శలపై ఢిల్లీ ఆహార శాఖ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పందించారు. వైఫై కనెక్టివిటీ మూలంగానే సమస్య ఉత్పన్నమైందని.. పునరుద్ధరించి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొత్తం 15 లక్షల మంది రేషన్ లబ్ధిదారుల్లో 98 శాతం మంది రేషన్ తీసేసుకున్నారని.. 2 శాతం(26, 650 మంది) మాత్రం అందుకోలేకపోయారని ఆయన చెబుతున్నారు. ఖండించిన రేషన్ డీలర్లు... అయితే రేషన్ డీలర్లు మాత్రం మంత్రి వాదనను కొట్టిపడేస్తున్నారు. రేషన్ డీలర్ల సంఘం సెక్రెటరీ సౌరభ్ గుప్తా స్పందిస్తూ... ‘‘ నా సొంత వైఫైతో కనెక్ట్ చేసినా మెషీన్లు పని చేయటం లేదు. బేల్(BEL) నుంచి వచ్చిన ఇంజనీర్లు యాంటీనాలు ఇచ్చారు. కానీ, అవి కూడా ఇప్పుడు పని చేయటం లేదు’’ అని తెలిపారు. అంతేకాదు 98 శాతం మందికి రేషన్ అందుతుందా? అన్న ప్రశ్నకు గుప్తా నుంచి సరైన సమాధానం అందలేదు. ఈ గొడవలేమీ లేకుండా మాన్యువల్‌గా రేషన్ సరుకులు ఇవ్వాలని షాపులకు ఆదేశాలు అందినప్పటికీ.. అవి కూడా సక్రమంగా అమలు కావటం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. బీజేపీ విమర్శలు.. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, కేజ్రీవాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. ఓ పద్ధతి ప్రకారం నడుస్తున్న వ్యవస్థను కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రయోగాలతో చెడగొట్టి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తోందని తివారీ విమర్శించారు. (ఎన్డీటీవీ సర్వే కథనం ప్రకారం...) -
ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ అవస్థలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి రామాపురం మండలం నల్లగుట్టపల్లె హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గంగాధర్. నూతనంగా ఆ పాఠశాల ఉపాధ్యాయుల హాజరును బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. బయోమెట్రిక్ మిషన్లు పంపిణీ చేశారు. అయితే అక్కడ నెట్వర్క్ సరిగా పని చేయకపోవడంతో ఇలా చెట్లు, పుట్టలు, గుట్టలు ఎక్కి మిషన్‌లో హాజరును నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాయచోటి రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొదటి దఫాగా జిల్లాలోని 3,178 ప్రభుత్వ పాఠశాలలకు గానూ 1,795 పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును బయోమెట్రిక్ విధానంతోనే నమోదు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందుకు సంబంధించి బయోమెట్రిక్ మిషన్లు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బయోమెట్రిక్ హాజరును రెండు పూటలా ప్రవేశపెట్టడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు నెట్వర్క్ సమస్యలు లేకపోవడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే గ్రామీణ , మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో నెట్వర్క్ సమస్య ఉంది. బయోమెట్రిక్ మిషన్లు పని చేయకపోవడంతో ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. బయోమెట్రిక్ విధానానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఖచ్చితంగా పాటించి తీరాలన్న నిబంధనలు పెట్టడం, అందుకు బయోమెట్రిక్ మిషన్లు పని చేయకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు వాపోతున్నారు. పాఠశాలలకు బయోమెట్రిక్ విధానానికి అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించిన తరువాతనే ఇటువంటి వి«ధానాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. ఈ విధంగా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై అదనపు ఒత్తిడిలతో మానసికంగా కుంగిపోయేటట్లు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసిన బయోమెట్రిక్ మిషన్లు నాసిరకంగా ఉన్నాయని, అందులో సరైన డేటా లేదని, అందువల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. -
సెప్టెంబర్ 3 నుంచి ఎంసెట్-3 హాల్‌టికెట్లు
► 11వ తేదీన రాత పరీక్ష, ఈసారి పక్కాగా ఏర్పాట్లు ► ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ మిషన్ ► పరీక్ష ప్రారంభానికి గంట ముందే వేలిముద్రల సేకరణ ► వెబ్సైట్లో 2011 నుంచి ఎంసెట్ మోడల్ పేపర్లు హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 నిర్వహణకు ఎంసెట్ కమిటీ పక్కా చర్యలు చేపడుతోంది. సెప్టెంబరు 11వ తేదీన జరిగే రాత పరీక్షను పూర్తిస్థాయిలో నిఘా నీడన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పోలీసు శాఖ ఉన్నతాధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించింది. పలుమార్లు మెడికల్ ఎంసెట్‌కు హాజరవుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. 1981లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు, ఎంబీబీఎస్ చేస్తున్న వారు ఎందుకు ఎంసెట్‌కు హాజరవుతున్నారన్న అంశంపై లోతైన విచారణ జరుపాలని పోలీసు శాఖను కోరింది. మరోవైపు ఈసారి పరీక్ష కేంద్రాల్లో జామర్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతోంది. విద్యార్థులకు 3వ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. 9వ తేదీ వరకు విద్యార్థులు ఎంసెట్-3 వెబ్సైట్ నుంచి (tseamcet.in) హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఎంసెట్ -2 లీకేజీ వ్యవహారంలో చోటుచేసుకున్న తప్పిదాలు, పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారించింది. ఎంసెట్-2 పరీక్ష సమయంలో పలు పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. పరీక్షకు హాజరయ్యే పలువురు విద్యార్థుల నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్ డాటా) తీసుకోలేకపోయారు. బయోమెట్రిక్ పరికరాలు మొరాయించడంతో వేలి ముద్రలు తీసుకోకుండా కొంతమందిని పరీక్షకు అనుమతించినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎంసెట్-2 పరీక్ష పత్రం లీకేజీ ఘటన వెలుగులోకి వచ్చిన క్రమంలో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పక్కా చర్యలు చేపడుతోంది. 11వ తేదీన జరుగనున్న ఎంసెట్-3 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 56,153 మంది (ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న వారంతా) హాజరుకానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్షకు బయోమెట్రిక్ మిషన్ల సంఖ్యను పెంచేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఎంసెట్-2లో ప్రతి 250 మందికి ఒక మెషిన్ ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి వేలిముద్రలు సేకరించింది. ఈసారి ప్రతి 200 మందికి ఒక మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఒకవేళ సాంకేతిక సమస్యలు తలెత్తినా అప్పటికప్పుడే మరో మెషిన్ ఏర్పాటు చేసేందుకు అదనంగా బయోమెట్రిక్ పరికరాలను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది. ఎంసెట్-2లో పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు నుంచి వేలిముద్రలు స్వీకరించేలా చర్యలు చేపట్టగా, ఎంసెట్-3లో పరీక్ష సమయానికి గంట ముందు నుంచే విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకునేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థుల వెసలుబాటు కోసం 2011 నుంచి జరిగిన అన్ని ఎంసెట్ పరీక్షల ప్రశ్నాపత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
భారంగా ‘ఫీజు’ బకాయిలు
► మొత్తం రూ.6 వేల కోట్లు అవసరం ► అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం బకాయిలు ప్రభుత్వవర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి (2016-17) అవసరమైన బడ్జెట్, గత రెండేళ్ల పాత బకాయిలను కలుపుకుని మొత్తం రూ.6 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంటుకు అవసరమవుతాయి. అందులో 2014-15 బకాయిల కింద రూ. వెయ్యి కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా, 2015-16కు సంబంధించి రూ.2400 కోట్లు, 2016-17 విద్యాసంవత్సరానికి దాదాపు రూ.2,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కనీసం వచ్చే ఏడాది నుంచైనా ఈ పథకం కింద అర్హులకే ప్రయోజనం కలిగేలా, అసలైన కాలేజీలకే ఫీజులు అందేలా చర్యలు తీసుకోవాలని ఫ్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. బయోమెట్రిక్‌తో చెక్..: ఫీజు రీయింబర్స్మెంట్ అందుతున్నదనే భావనతో అంతగా శ్రద్ధ లేకపోయినా కొందరు ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులను చదువుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరగతులకు హాజరు కాకుండానే, పరీక్షల్లో కనీస మార్కులు సాధించకుండానే వచ్చే ఏడాదికి ప్రమోట్ అవుతున్నారని, ఇటువంటి అంశాల్లో ఆయా కాలేజీలు సైతం విద్యార్థులకు ప్రోద్భలమిచ్చి సహకరిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ప్రతిరోజు కచ్చితంగా విద్యార్థుల అటెండెన్‌్రను బయోమెట్రిక్ విధానం ద్వారా పర్యవేక్షణ నెలవారీ పరీక్షలు మొదలు, వార్షిక పరీక్షలకు సంబంధించిన మార్కులను ఆయా యూనివర్శిటీలే ఇచ్చేలా చేయడం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంటులో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు నివేదించారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు అభ్యసించే ఒక్కో విద్యార్థికి రూ.1.84 లక్షల మేర (కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1.44 లక్షలు, విద్యార్థులకు స్కాలర్షిప్ కింద రూ.40 వేలు కలుపుకుని) ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లిస్తున్నట్లుగా అధికారులు అంచనా వేశారు. కచ్చితంగా బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్‌ను పర్యవేక్షిస్తే, ఒక్క ఏడాదిలోనే కాలేజీలకు రెగ్యులర్‌గా హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య తేలుతుందని, తద్వారా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు, అన్ని నియమనిబంధనలు పాటించి సక్రమంగా నిర్వహించే కాలేజీలకు మాత్రమే ఈ పథకం ఫలాలు అందేలా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం అమలుపై ఒక స్పష్టమైన అవగాహన, ఇతరత్రా అంశాల పరిశీలనకు అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలను తీసుకోనుంది. ముందుగా ఈ పథకం అమలుతీరును పరిశీలించేందుకు కాలేజీల తనిఖీలు చేపట్టనుంది. -
ఉపాధి కూలీలపై పిడుగు
సాక్షి, నల్లగొండ పొమ్మనలేక పొగబెట్టినట్లు ఉంది సర్కారు తీరు. ‘ఉపాధి’ లో గతంలో బయోమెట్రిక్ విధానం.. తాజాగా ఆధార్ అనుసంధానం తెరమీదకు తీసుకొచ్చింది. పారదర్శకత పేరుతో ఏడాదికో విధానాన్ని ప్రవేశపెడుతుండడంతో కూలీలు బెంబేలెత్తుతున్నారు. ఆధార్ నమోదు కోసం ఇప్పటికే సతమతమవుతున్న కూలీలకు మరో తలనొప్పి రానుంది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల జాబ్‌కార్డులకు ‘ఆధార్’ ముడిపెట్టిన విషయం తెలిసిందే. అయితే అనుసంధానం కాని కూలీల వేతనాల చెల్లింపులు త్వరలో నిలిచిపోనున్నాయి. ఈ మేరకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఉపాధి కూలీల వివరాలకు ఆధార్ నంబర్‌ను కొన్ని నెలలుగా అనుసంధానం చేస్తున్నారు. కాకపోతే చెల్లింపులు బయోమెట్రిక్ విధానం ద్వారానే జరుగుతున్నాయి. ఇది ఇక మరికొన్ని రోజులే కొనసాగనుంది. ఇదీ పరిస్థితి... జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 11.46 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. ఇందులో సరాసరిగా 80వేల మంది కూలీలు రోజువారీగా పనులు చేస్తున్నారు. గతంలో మా న్యువల్ విధానం ద్వారా కూలీలకు చెల్లింపులు జరిగేవి. ఈ పద్ధతి 2001 మార్చి వరకు కొనసాగింది. ఆ సమయంలో కూలీలు పనులకు హాజరు కాకున్నా సిబ్బంది డబ్బులు డ్రా చేశారన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. తద్వారా నిధులు పక్కదారి పట్టాయని సర్కారు గుర్తించింది. ఈ నేపథ్యంలో మాన్యువల్ స్థానంలో బయోమెట్రిక్ పద్ధతిని తీసుకొచ్చారు. కూలీల వేలిముద్రల ఆధారంగా ఇప్పటివరకు వేతనాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే దీనికీ త్వరలో స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. ‘ఆధార్’తో ముడి... కొన్ని నెలల క్రితమే కూలీల జాబ్‌కార్డుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం మొదలు పెట్టారు. జిల్లాలో 8.46 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఆరు నెలలుగా 5.63 లక్షల కార్డుల వివరాలు ఆధార్ నంబర్ (యూఐడీ)తో అనుసంధానం చేశారు. ఇందులో 4.78లక్షల కార్డులకు సంబంధించిన వివరాాల నమోదు మాత్రమే విజయవంతమైంది. సాంకేతిక కారణాల వల్ల మిగిలినవి అందుకు నోచుకోలేదు. ఇంకా 2.83లక్షల కార్డులు ఆధార్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. అయితే చాలామంది కూలీలు ఇప్పటికే ఆధార్ కోసం వివరాలు అందజేశారు. ఇదంతా జరిగి నెలలు గడుస్తున్నా... ఇప్పటికీ కార్డులు అందడం లేవు. ఇంకొంతమంది అసలు నమోదే చేయించుకోలేదు. అయితే అతి త్వరలో ఆధార్ అనుసంధానం కాని కూలీలకు చెల్లింపులు నిలిచిపోనున్నాయి. దీంతో దాదాపు మూడు లక్షల మంది కూలీలు వేతనాలకు నోచుకోనట్టే. అంతేగాక ఆధార్ నమోదు చేసినా... విజయవంతం కానివారి కూలీల పరిస్థితేంటన్నది తేలాల్సి ఉంది. తొందరెందుకు...? ఉపాధి పథక ంలో కూలీలకు వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత కోసం నూతన విధానాలకు అవలంబించాలనుకోవడం సబబే. అయితే ఆ పద్ధతిని విజయవంతం చేయాలంటే పూర్వ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాని ప్రణాళికేమీ లేకుండా అనుకున్నదే తడువుగా ఁఆధార్*తో ముడిపెట్టడం ఏంటన్న మౌలిక ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతోంది. పూర్తిస్థాయిలో కూలీలందరికీ ఆధార్‌కార్డు అందజేశాక ఈ విధానాన్ని అమలు చేస్తే ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ కూలీలకు అరకొరగా కార్డులు అందజేసి చెల్లింపులు నిలిపివేస్తామనడం అర్థరహితం. ఫలితంగా లక్షల మంది కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి కైనా అనుసంధాన నిర్ణయాన్ని వాయిదా వే యడం గాని, లేదా పూర్తిగా తొలగించడంగాని చేస్తేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తంమవుతోంది. -
పె(టె)న్షన్..!
సాక్షి, నల్లగొండ: సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో పెన్షన్‌దారుల్లో అయోమయం నెలకొంది. ఇచ్చే రూ.500, రూ.200 కోసం పూటకో నిబంధన పెట్టి ముప్పు తిప్పలు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు (ఈఐడీ/యూఐడీ) ఇలా.. అన్నీ కావాలని అడుగుతుండడంతో బేజారు పడుతున్నారు. ఆధార్ ఉంటేనే పెన్షన్ ఇస్తామని.. నిబంధన లేకున్నా ఆధార్ నంబర్ మాత్రం తీసుకోవాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆధార్ లేకుంటే పెన్షన్ రాదేమోనన్న భయం పెన్షన్‌దారులకు పట్టింది. వారు తమ రేషన్‌కార్డు నంబర్ తప్పక అప్పగించాలని తేల్చిచెప్పింది. అయితే కొంతమందికి రేషన్‌కార్డు లేకపోగా.. ఉన్నవారికి నంబర్లు తప్పుగా నమోదు కావడం, పేర్లలో అక్షర దోషాలు ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటువంటి వారు జిల్లాలో వేలమంది ఉన్నారు. తప్పుల తిప్పలు... జిల్లాలో ఉన్న దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. వారిలో వృద్ధాప్య 1.86లక్షలు, వితంతు 1.09 లక్షలు, వికలాంగ 52 వేలు, అభయహస్తం 25 వేలు, గీత కార్మికులు 11 వేలు, చేనేత 9వేల మంది పెన్షన్‌దారులు ఉన్నారు. వీరికి నెలనెలా సగటున రూ. 12 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. మొత్తం 3.94 లక్షలమంది పెన్షన్‌దారులకు నెలనెలా సగటున రూ.12 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. వీరిలో ఇప్పటివరకు 3.30లక్షల మంది మాత్రమే తమ రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను ఎంపీడీఓలకు అప్పగించారు. మిగిలిన వారిలో 32వేల మందికి సంబంధించి అసలు రేషన్ కార్డు నంబర్లు లేవు. 2012లో నిర్వహించిన ఇంటింటి సర్వే సమయంలో 36వేలకు పైగా మంది రేషన్‌కార్డులు తొలగించారు. వీరిలో దాదాపు 4వేల మంది తిరిగికార్డు పొంది తమ నంబర్‌ను అధికారులకు అందజేశారు. మిగిలిన 32వేల మంది పెన్షన్‌దారుల రేషన్‌కార్డు నంబర్ ఆన్లైన్లో నమోదు చేస్తే ... చెల్లదు అని సమాధానం వస్తోంది. రేషన్‌కార్డుల్లో నమోదైన మరో 32వేల మంది పేర్లు, నంబర్లు.. ఆన్లైన్లో ఉన్న పెన్షన్‌దారుల డేటాతో సరిపోలడం లేదు. పేర్లలో ఒక్క అక్షర దోషం ఉన్నా తిరస్కరిస్తున్నారు. ఇది కూడా తలనొప్పిగా మారింది. అందుబాటులో లేరు.. రేషన్‌కార్డుల జిరాక్స్‌లు అందిస్తే తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయవచ్చని, తద్వారా భవిష్యత్‌లోనూ ఎలాంటి సమస్యలూ ఎదరుకాబోవని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేర్లు, నంబర్లు తప్పుగా నమోదైన వారి రేషన్‌కార్డుల జిరాక్స్ ప్రతులను సేకరించాలని పంచాయతీ సెక్రటరీలకు అధికారులు సూచించారు. కొంతమందికి సంబంధించిన జిరాక్స్‌లు మాత్రమే సేకరించి వారు చేతులు దులుపుకుంటున్నారు. స్థానికంగా పెన్షన్‌దారులు అందుబాటులో లేకపోవడంతో సేకరణ సాధ్యం కావడంలేదని అంటున్నారు. కొందరికే... జిల్లాలో ఉన్న పెన్షన్‌దారుల్లో 182మంది మినహా మిగిలిన వారంతా బయోమెట్రిక్ విధానం ద్వారానే పెన్షన్పొందుతున్నారు. జిల్లాకేంద్రంలో ఉంటున్న ఈ 182మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులు. వీరికి చేతి వేళ్లు లేకపోవడంతో మాన్యువల్ పద్ధతిన నెలనెలా పెన్షన్ అందజేస్తున్నారు. ఇప్పుడున్న బయోమెట్రిక్ విధానంలోనూ కొత్తగా ఆధార్ అథెంటిక్ పేమెంట్ సిస్టంను సర్కారు ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ప్రతి పెన్షన్‌దారుడు నుంచి ఆధార్ నంబర్‌ను సేకరించాలని అధికారులకు సూచించింది. బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ పొందుతున్న 3,94,362మందిలో 1,18,565మంది మాత్రమే తమ ఆధార్ నంబర్‌ను మండలాధికారులకు అందజేశారు. మిగిలిన 2,75,797 మంది అందుకు దూరంగా ఉన్నారు. కనీసం ఆధార్ నమోదు చేసుకుని కార్డు రాని వారు కనీసం ఈఐడీ (ఎన్రోల్మెంట్ నంబర్) ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. చాలామంది పెన్షన్‌దారులు అసలు ఆధార్ నమోదు చేయించుకోలేదు. వీరేం చెయ్యాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. -
బయోమెట్రిక్ భయం
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు వేలిముద్రల లింక్ విద్యా సంవత్సరం చివరిలో వింత ఆలోచన ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో విద్యార్థుల అవస్థలు కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్న కళాశాలల యాజమాన్యాలు ఖమ్మం, న్యూస్‌లైన్: స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇప్పటికే ఆధార్‌కార్డు అనుసంధానంతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు ఇప్పుడు బయోమెట్రిక్ భయం పట్టుకుంది. మరో మూడు నెలల్లో విద్యాసంవత్సరం పూర్తి కావస్తుండగా ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన వింత ఆలోచనతో అటు కళాశాల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికిప్పుడు విద్యార్థుల వేలిముద్రలు సేకరించే పని పెట్టుకుంటే విలువైన సమయం వృథా అవుతుందని, అనుసంధానం అయ్యేది ఎప్పుడు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యేది ఎప్పుడు.. అని యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం వరకైనా దీనిని వాయిదా వేయాలని కోరుతూ పలు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నాయి. పేద విద్యార్థులకు పెద్ద చదువులు అందుబాటులోకి తేవాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉన్నత విద్యనభ్యసించే వారికి ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర చదువుల వారికి స్కాలర్షిప్లను ఎలాంటి నిబంధనలు లేకుండా అందించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వీటికి కోత పెట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తూ విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రెన్యువల్ కోసం ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ పలుచోట్ల ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, నమోదు చేసుకున్నా కార్డులు చేతికి అందకపోవడంతో ఇంకా 14 వేల మందికి పైగా విద్యార్థులు రెన్యువల్ చేసుకోలేదు. ఇప్పుడు కొత్త స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు పాత వాటి రెన్యువల్‌కు బయోమెట్రిక్ విధానం తప్పనిసరి అని, దీని ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ సైట్‌కు విద్యార్థుల డేటా వస్తే తప్ప నిధులు మంజూరు కావని ప్రభుత్వం మెలిక పెట్టింది. వెంటనే బయోమెట్రిక్ మిషన్లు కొనుగోలు చేసి విద్యార్థుల వేలిముద్రలు సేకరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పాటు కళాశాలల యాజమాన్యాలకు బయోమెట్రిక్ విధానంపై శిక్షణ కూడా ఇచ్చారు. విద్యా సంవత్సరం చివరిలో వింత పోకడ... మరో మూడు నెలల్లో విద్యాసంవత్సరం ముగియనుంది. ఈ సమయంలో ప్రభుత్వ వింత ఆలోచనతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. బయోమెట్రిక్ విధానం అమలుకు ముందుగా కళాశాల యాజమాన్యాలు ఆయా యంత్రాలను కొనుగోలు చేయాలి. విద్యార్థి వేలిముద్ర, కళాశాల ప్రిన్సిపాల్ వేలిముద్రను స్కాన్‌చేసి ఆధార్ కార్డు, ఈ పాస్ దరఖాస్తుతోపాటు విద్యార్థి పూర్తి డేటాను ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఇది జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ సైట్‌కు అనుసంధానం అయితేనే నిధులు విడుదలవుతాయి. జిల్లాలో రెన్యువల్ విద్యార్థులు 65,196 మంది, 56 వేలకు పైగా కొత్త విద్యార్థుల వేలిముద్రలు అనుసంధానం చేయాలంటే ఈ తంతు ముగిసేటప్పటికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది. దీనికి తోడు పరీక్షల ముందు తమ విలువైన సమయం వృథా అవుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బయోమెట్రిక్ విధానాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెడితే విద్యార్థి స్కాలర్షిప్ దరఖాస్తు సమర్పించేటప్పుడే ఆధార్, బయోమెట్రిక్ తంతు కూడా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయడం ఇబ్బందికరమని, దీనిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని కోరుతూ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.