బడిలో బయోమెట్రిక్‌ | Biometric System In Government Schools In Telangana | Sakshi
Sakshi News home page

బడిలో బయోమెట్రిక్‌

Published Fri, May 25 2018 11:42 AM | Last Updated on Fri, May 25 2018 11:42 AM

Biometric System In Government Schools In Telangana - Sakshi

బయోమెట్రిక్‌

పరకాల రూరల్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం.. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకుగాను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేందుకు కసరత్తు చేస్తోం ది. జిల్లా వ్యాప్తంగా 659 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 454 ప్రాథమిక, 74 ప్రాథమి కోన్నత, 131 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో మొత్తం కలిపి 46,154 మంది విద్యార్థులు ఉన్నా రు. జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఒక్కరు మాత్ర మే రెగ్యులర్‌ ఎంఈఓ ఉండగా.. మిగతా 14 మండలాల్లో సీనియర్‌ ప్రధానోపాధ్యాయులే ఇన్‌చార్జి ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు.

డీఈఓ సైతం వరంగల్‌ అర్బన్, రూరల్‌ జిల్లాలకు ఒక్కరే ఉన్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల్లో చాలా మంది సమయపాలన పాటించడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా విద్యాబోధన కుంటుపడి విద్యార్థుల హాజరు శాతం పడిపోవడంతోపాటు ఫలితాలు సైతం ఆశించిన మేర రావడలేదనే విమర్శలు ఏళ్ల తరబడి వస్తున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం గాడితప్పిన పాఠశాలల పాలనను దారిలోకి తీసుకురావడానికి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలులోకి తెస్తోంది.  

ప్రయోగాత్మకంగా 100 పాఠశాలల్లో.. 
మొదటగా జిల్లాలోని 100 పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల ను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను అందించా రు. ఈ విధానంతో పాఠశాలల్లో ప్రార్థన సమయానికి ముందు, పాఠశాల ముగిసిన అనంతరం  ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల హాజరును వేలి ముద్రల ద్వారా నమోదు చేయనున్నట్లు అధి కారులు పేర్కొంటున్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం, విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడి మెరుగైన విద్యాబోధన జరిగి ఉత్తమ ఫలి తాలు సాధించవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వేలిముద్రల హాజరు నమోదుతో సన్న బియ్యంతో అందిస్తున్న మధ్యాహ్నభోజన పథకంలో అక్రమాలకు తావు లేకుండా అమలు చేయవచ్చని పేర్కొంటున్నారు. 

బయోమెట్రిక్‌తో అనేక ప్రయోజనాలు
ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉపాధ్యాయుల్లో నిబద్ధత పెరుగుతుంది. పాఠశాలకు హాజరు కాని విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యే కంగా శ్రద్ధ పెట్టి వారు రెగ్యులర్‌గా స్కూల్‌ వచ్చేలా చేయవచ్చు. దీంతో మెరుగైన విద్యను అందించేందుకు వీలు కలుగుతుంది. బయోమెట్రిక్‌ విధానం ఆహ్వానించ దగిన మంచి విషయం.
– కామిడి సతీష్‌ రెడ్డి,ప్రభుత్వఉపాధ్యాయుడు, సామాజిక రచయిత

విద్యార్థులకు లాభం చేకూరుతుంది
పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానంతో విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఉపాధ్యాయులు అడ్డగోలుగా విధులకు గైహాజరు కాకుండా ఉంటారు. విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి. 
– పసుల సంపత్, నాగారం 

సర్కారు స్కూళ్ల బలోపేతానికి దోహదం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి బయోమెట్రిక్‌ విధానం దోహదపడుతుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ పద్ధతిని అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల నుంచి పాఠశాలల వివరాలు సేకరించి పంపించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఎంపిక చేసిన పాఠశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేస్తాం.
– కె.నారాయణరెడ్డి, డీఈఓ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement