ప్రభుత్వ బడిలో చేరిన బడిఈడు చిన్నారులు
కురవి(డోర్నకల్): ‘మా తండాలోని బడిలోనే మా పిల్లలను చదివిస్తాం.. ప్రైవేట్ స్కూల్‌కు పంపించం.. మా బడిని కాపాడుకుంటాం’ అని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకుని తమ పిల్లలను తండాలోని బడిలోకి పంపించిన సంఘటన కురవి మండలం బీబీనాయక్ తండా గ్రామ పంచాయతీలో జరిగింది. తండాలోని బడిఈడు పిల్లలందరూ కురవితోపాటు ఇతర గ్రామాల్లోని ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు.
ప్రైవేట్ స్కూల్ బస్సులు, వ్యాన్‌లు తండాకు వచ్చి పిల్లలను తీసుకెళ్తున్నాయి. బీబీనాయక్ తండా గ్రామ పంచాయతీగా అవతరించడంతో.. మా తండా బడిలోనే మా పిల్లలు చదివించుకుంటాం అని పిల్లల తల్లిదండ్రులు, యువకులు ముందుకు వచ్చి ముక్తకంఠంతో శుక్రవారం తండాకు వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకుని అందులో ఎవరిని ఎక్కనీయకుండా పిల్లలందరినీ నేరుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తీసుకెళ్లి ఉపాధ్యాయులకు అప్పగించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బోడ శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, పాఠశాలకు మరమ్మతులు చేయిస్తే బడిని మంచిగా చూసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ బడిని రక్షించుకుంటామని తెలిపారు. గతంలో స్కూల్‌లో 15 మంది మాత్రమే ఉన్నారని, నేడు 40మంది వరకు ఉన్నారని వివరించారు.
తండాలోని పెద్దలంతా ముక్తకంఠంతో ప్రభుత్వ బడిని రక్షించుకునేందుకు ముందుకు రావడం గొప్ప పరిణామమన్నారు. హెచ్‌ఎం కుమారస్వామి, ఉపాధ్యాయుడు కృష్ణ, బోడ వెంకన్న, బోడ రవీందర్, భూక్యా వీరన్న, భూక్యా స్వామి, భూక్యా సుధాకర్, బోడ నాగేష్, పకీర, భూక్యా నాగార్జున్, భూక్యా నవీన్, అశోక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment