private school bus
-
ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
మహబూబ్‌నగర్ క్రైం/ జడ్చర్ల టౌన్: ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల– పాలమూరు ప్రధాన రహదారిపై జాలీహిల్స్ సమీపంలో చోటుచేసుకుంది. జడ్చర్ల నుంచి 43 మంది విద్యార్థులతో వస్తున్న బస్సు పాఠశాలకు సమీపంలో యూటర్న్ తీసు కోగా.. రోడ్డు డౌన్ ఉండటం వల్ల వెనకాల వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం త ప్పింది. బస్సు బోల్తా పడగానే స్థానికులు వెంటనే గా యపడిన విద్యార్థులను చికిత్స కోసం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 9మంది విద్యార్థుల తలల కు గా యాలు కాగా.. మరో 8 మందికి స్వల్ప గాయాల వడంతో వైద్యులు చికిత్స అందించారు. విద్యార్థులందరూ క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని పాఠశాల ప్రిన్సిపాల్ సురేశ్ తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే కొందరు లారీ డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. పరామర్శించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బస్సు ప్రమాదంలో గాయపడి ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ పాటించడంతో పాటు సైన్ బోర్డులు, లైనింగ్స్ పెంచేలా చూస్తామన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, సీనియర్ నాయకుడు నాగురావు నామాజీ కూడా విద్యార్థులను పరామర్శించారు. -
అదుపు తప్పి వరద నీటిలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు
శంషాబాద్ రూరల్: ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపుతప్పి వాగుపక్కన వరద నీటిలోకి దూసుకెళ్లింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని సుల్తాన్‌పల్లి–కేబీ దొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న ఎంటేరు వాగులో వర్షాల కారణంగా వరదనీరు పారుతోంది. వాగుపై సుల్తాన్‌పల్లి శివారులో చిన్న కల్వర్టు ఉంది. ఏడాది కిందట ఈ కల్వర్టు పూర్తిగా దెబ్బతిని రెండు చోట్ల భారీ గుంతలు పడ్డాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం వాగులో వరద పెరగడంతో రాకపోకలను నిలిపివేశారు. ఇరు వైపులా గ్రామాల శివారులో పోలీసులు బారికేడ్లు పెట్టారు. ఉదయం ఓ ప్రైవేట్ స్కూలు బస్సు కేబీ దొడ్డి వద్ద ఆరుగురు విద్యార్థులను ఎక్కించుకుని ఎంటేరువాగు మీదుగా సుల్తాన్‌పల్లి వైపు వెళ్తుండగా.. వాగులో వరద ఎక్కువగా ఉందని అటు వైపు వెళ్లవద్దని స్థానికులు బస్సు డ్రైవర్‌కు సూచించారు. ఇవేవి లెక్క చేయకుండా డ్రైవర్ బారికేడ్లను తొలగించి బస్సుతో ఎంటేరువాగు వద్దకు చేరుకున్నాడు. కల్వర్టు సమీపంలోకి రాగానే వరద నీళ్లలో దారి కనిపించక బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దిగింది. ఈ క్రమంలో బస్సు ఓ వైపు ఒరిగిపోవడంతో భయంతో విద్యార్థులు కేకలు వేశారు. గమనించిన స్థానికులు వెళ్లి విద్యార్థులను జాగ్రతగా బయటకు తీసుకొచ్చారు. బస్సు మరింత ముందుకు వెళ్లి ఉంటే వరదనీటిలో కొట్టుకుపోయేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జేసీబీతో బస్సు తొలగింపు.. రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన స్కూలు బస్సును స్థానికులు జేసీబీతో అక్కడి నుంచి తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. -
స్కూల్ బస్సు బోల్తా: 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
సాక్షి, బాపట్ల: అమృతలూరు మండలం కూచిపూడి వద్ద స్కూల్ బస్సు బోల్తా పడటంతో 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సులో మొత్తం 35 మంది విద్యార్థులు ఉన్నారు. కూచిపూడి-పెద్దపూడి గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది. స్వాతంత్ర్య వేడుకలు ముగించుకుని విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి.. -
బడి బస్సులు భద్రమేనా?
తాండూరు టౌన్: పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండానే రయ్రయ్ మంటూ వెళ్తున్నాయి. చిన్నారుల జీవితాలతో ప్రైవేటు స్కూల్ బస్సుల యజమానులు చెలగాటుమాడుతున్నారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. డొక్కు బస్సులతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పటికీ బస్సుల ఫిట్నెస్, పర్మిట్లను రవాణా శాఖాధికారులు తనిఖీలు చేయలేదు. దీంతో పలు బస్సులకు ఫిట్నెస్, పర్మిట్ లేకున్నా రోడ్డెక్కి దర్జాగా స్కూల్ పిల్లలను తరలిస్తున్నాయి. బస్సు పూర్తి స్థాయి కండీషన్లో ఉంటేనే రోడ్లపై తిరగడానికి అర్హత ఉంటుంది. కండీషన్ లేని బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలించినపుడు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం లేని బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 20 శాతం బస్సులకే ఫిట్నెస్ జిల్లా పరిధిలో పలు ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తంగా 191 స్కూల్ బస్సులు ఉన్నాయి. గతేడాది అక్కడక్కడా పలు స్కూల్ బస్సులు విద్యార్థులను తరలిస్తూ ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. 191 బస్సుల్లో ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్న బస్సులు కేవలం 38 మాత్రమే ఉండటం విశేషం. మిగిలిన 153 బస్సులు అంటే 80శాతం బస్సులు ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే విద్యార్థులను తరలిస్తున్నారు. యాజమాన్యాలతో కుమ్మకై ్క అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ లేని బస్సుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినపుడు హంగామా చేయకుండా ముందు జాగ్రత్తగా బస్సులను తనిఖీలు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కానరాని సేఫ్టీ పరికరాలు ● ఫిట్నెస్, పర్మిట్లు మాత్రమే కాకుండా ప్రతి స్కూల్ బస్సులో ఆర్టీఏ నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉండాలి. ● చిన్నారులు కిటికీల నుంచి బయటకు తొంగి చూడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి. ● ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రాథమిక చికిత్స చేయడానికి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండాలి. ● బస్సులో అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. స్కూల్ బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ర్యాక్స్ ఉండాలి. ● బస్సు బయట రేడియం స్టిక్కర్లు అంటించాలి. ప్రమాదం జరిగినపుడు అద్దాలను పగుల గొట్టేందుకు సుత్తె వంటి పనిముట్లు ఉండాలి. ● అగ్ని ప్రమాదం సంభవించినపుడు మంటలను ఆర్పేందుకు అవసరమైన అగ్ని నిరోధక రసాయన సిలిండర్లు ఉండాలి. అలాగే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు స్కూల్ బస్సులు నడపరాదు. ● ఇలాంటి నిబంధనలతో కూడిన బస్సుల్లో మాత్రమే విద్యార్థులను తరలించేందుకు అనుమతులు ఇస్తారు. నిబంధనల ప్రకారం లేని బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేయాల్సి ఉంటుంది. తనిఖీలు ముమ్మరం చేశాం పాఠశాలలు ప్రారంభం కాకముందే యాజమాన్యం బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. జిల్లాలో కేవలం 38 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. తనిఖీలు ముమ్మరం చేశాం. ఇప్పటికీ రెండు బస్సులను సీజ్ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తప్పవు. – వెంకట్ రెడ్డి, ఆర్టీఓ -
40 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ బోల్తా.. విద్యార్థి మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా రహత్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు చంద్రాపూర్ గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలపాలైన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అందులోని విద్యార్థులు తెలిపారు. తమ తోటి విద్యార్థి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: పీఎఫ్ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు -
స్కూల్ ఫీజులు తగ్గించాలని పేరెంట్స్ ధర్నా
ఓల్డ్ బోయిన్పల్లి: కరోనా మహమ్మారి.. లాక్డౌన్ తదితర కారణాలతో అర్థికంగా చితికిపోయి బతుకుతున్న ప్రజలపై ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజులను అమాంతం పెంచి చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఓల్డ్ బోయిన్‌పల్లిలోని సెయింట్ యాండ్రూస్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. పెంచిన స్కూల్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను పట్టుకుని కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటిస్తూ ధర్నా చేశారు. ఉదయం 9 గంటలకు మొదలైన ధర్నా మాధ్యాహ్నం వరకు కొనసాగింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా స్కూల్ గేట్లు మూసివేయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న బోయిన్పల్లి, తిరుమలగిరి పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల చొరవతో 50 శాతం ఫీజులను తగ్గించాలని యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... కరోనా విపత్కర సమయంలో తాము ఉద్యోగాలు కోల్పోవడంతో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. గతంలోనే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా çపట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం క్రితం జరిపిన చర్చల్లో మంగళవారం వస్తే చర్చిస్తామని చెప్పిన స్కూల్ యాజమాన్యం తమను లోపలికి అనుమతించకుండా గేట్లు మూసివేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 శాతం ఫీజులు తగించాలి... అన్లైన్ ద్వారా నడుస్తున్న తరగతుల కోసం వసూలు చేస్తున్న ఫీజుల్లో 50 శాతం తగ్గించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ. 18 వేలు ఉండేదన్నారు. దానిపై ఒక్కసారిగా రూ. 6100 పెంచారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఒక పక్క ప్రభుత్వం ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకోవచ్చని చెబితే ట్యూషన్ ఫీజు పేరుతో ఏకంగా రూ. 6100 పెంచడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. -
ప్రాణం తీసిన పాఠశాల బస్సు
అనంతపురం, ధర్మవరం రూరల్: ప్రైవేట్ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. డ్రైవర్ గమనించకుండా ముందుకెళ్లడంతో వెనుకచక్రాల కిందపడి ఎల్కేజీ విద్యార్థి ప్రాణం విడిచాడు. క్లీనర్ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చిగిచెర్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దవాడైన కుమారుడు శ్రీపాద చరణ్‌రెడ్డి (4)ధర్మవరంలోని గాంధీనగర్‌లో ఉన్న సాయి విక్టరీ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. ఈ స్కూలుకు చిగిచెర్ల, చింతలపల్లి, వసంతపురం, గరుడంపల్లి తదితర గ్రామాల నుంచి విద్యార్థులు బస్సులో వెళ్లి వస్తుంటారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం స్కూలు వదలగానే విద్యార్థులను స్వస్థలాలకు వదిలిరావడానికి బస్సు బయల్దేరింది. చిగిచెర్లలో విద్యార్థులను దించిన డ్రైవర్ మరో వీధి వైపునకు బస్సును తిప్పుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే బస్సుకు వెనుకవైపున్న శ్రీపాద చరణ్రెడ్డిపై వెనుకచక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ నగేష్‌బాబు గ్రామానికి చేరుకొని, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ నాగరాజును అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. క్లీనర్ లేకుండా బస్సును పంపారు.. విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేర్చాల్సిన పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శించింది. క్లీనర్ స్థానంలో పీఈటీని బస్సులో పంపారు. అయితే ఆ పీఈటీ సెల్‌ఫోన్‌ను చూసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగిపోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లీనర్‌ను పంపి ఉంటే బాలుడు బతికి ఉండేవాడని అన్నారు. బాలుడి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బడి బస్సులపై విజి‘లెన్స్’!
చదువులు, రవాణ పేరిట వేలాది రూపాయలు దండుకుంటున్న పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను గాలికొదిలేశాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో నడుస్తోన్న బస్సుల్లో డొల్లతనం బుధవారం విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలైంది. జిల్లాలో గుడివాడ, బందరు మండలాల్లోని ఎనిమిది ప్రైవేటు పాఠశాలలకు చెందిన 42 బస్సులను విజిలెన్స్, రవాణ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బస్సుల్లో ఉన్న లోపాలు అధికారులు గుర్తించి.. 6 బస్సులను సీజ్ చేయడమే కాకుండా ఎంవీఐ యాక్ట్ కింద మరో 38 బస్సులపై కేసులు నమోదు చేశారు. సాక్షి, అమరావతిబ్యూరో/గుడివాడ/కోనేరు సెంటర్ : ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధను.. ఆ విద్యార్థులను పాఠశాలలకు తరలించేందుకు, తిరిగి వారిని గమ్యస్థానాలకు చేర్చే విషయంలో చూపడం లేదు. నిత్యం వినియోగిస్తున్న బస్సుల నిర్వహణను గాలికొదిలేశాయి. డాక్యుమెంట్ల పరంగా అన్ని బస్సులు పక్కాగా ఉన్నప్పటికీ భద్రత పరంగా మాత్రం నాసిరకమేనని తేలింది. అలాగే కనీస మౌలిక సౌకర్యాలు కూడా చాలా బస్సుల్లో కనిపించని పరిస్థితి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం విద్యార్థుల ప్రాణాలకు పెనుముప్పే వాటిల్లే అవకాశం పొంచి ఉంది. 90 శాతం బస్సుల్లో అగ్నిమాపక నివారణ పరికరాలు లేకుండానే బస్సులు రహదారులు ఎక్కుతున్నాయి. చాలా మంది డ్రైవర్లు నిబంధనలు పాటించడం లేదు. యూనిఫాం వేసుకోవడం మానేశారు. బస్సును శుభ్రంగా ఉంచుకోవడం లేదు. డ్రైవర్ల వెనుక ఉండాల్సి రూట్‌మ్యాప్ జాడే కనిపించడం లేదు. బయటపడ్డ డొల్లతనం బస్సుల నిర్వహణ, తదితర అంశాలపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విజిలెన్స్ ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో విజిలెన్స్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అధికారులు జిల్లాలో బందరు, గుడివాడ మండలాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో భాష్యం, రవీంద్రభారతి, విశ్వభారతి, శ్రీచైతన్య, విద్యాలయ, కేకేఆర్ గౌతం పాఠశాలలకు చెందిన 41 బస్సులను తనిఖీలు చేసిన అధికారులు బస్సుల నిర్వహణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. భద్రతాపరంగా అధ్వానంగా ఉన్న 6 బస్సులను సీజ్ చేశారు. మరో 38 బస్సులపై రవాణా చట్టం కింద కేసులు నమోదు చేసి యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు. అలాగే వాటిని మరమ్మతులు చేసిన తర్వాత రవాణా శాఖ వద్ద అనుమతి పొందాకే వాటిని రోడ్లపై అనుమతించాలని ఆదేశించినట్లు విజిలెన్స్ డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్లు, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గోతిలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు
అనంతపురం, ధర్మవరం రూరల్: సీతారాంపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ప్రైవేటు స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో ఉన్న శ్రీ ప్రార్థన విద్యానికేతన్ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు పది మంది విద్యార్థులతో జాతీయ రహదారిపై వెళ్తోంది. సీతారాంపల్లి వద్దకు రాగానే బస్సులో ఉన్న పిల్లలు అల్లరి చేస్తుండటంతో డ్రైవర్ వెనక్కు తిరిగి మందలించాడు. అంతే.. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నీలిమ అనే విద్యార్థిని కాలు విరిగింది. మరో తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని గాయపడిన విద్యార్థులను 108లో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఇంటిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు సోమందేపల్లి: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంటి బయట బట్టలు ఉతుకుతున్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం అనంతపురం వైపు నుంచి హిందూపురం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు సోమందేపల్లి మండలం చాలకూరులోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న నాగరత్నమ్మ ఇంటిని ఢీకొట్టింది. రెండు గదులు దెబ్బతిన్నాయి. ఇంటి బయట బట్టలు ఉతుకుతున్న నాగరత్నమ్మ తల్లి గంగమ్మ తీవ్రంగా గాయపడింది. బస్సు ఒక దూసుకురావడం గమనించి అక్కడున్న మరికొంతమంది పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. టైర్ల వద్ద వీల్ అలైన్మెంట్ దెబ్బతినడంతో అదుపుతప్పి ఇంటిని ఢీకొన్నట్లు డ్రైవర్ తెలిపాడు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా రోడ్డుపైకి వచ్చి పడ్డాయి. సిలిండర్‌లో గ్యాస్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కోపోద్రిక్తులైన స్థానికులు ఆర్టీసీ డ్రైవర్ మౌలానాపై చేయిచేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డ్రైవర్‌ను అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. గాయపడ్డ వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
బండను ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు
దంతాలపల్లి (డోర్నకల్): ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపు తప్పి బండను ఢీకొనడంతో ముందు చక్రం ఊడింది. దీంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. దంతాలపల్లిలోని సెయింట్ మేరీస్ హైస్కూల్ బస్సు రోజువారీగా గురువారం సుమారు 45 మంది విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. బొడ్లాడ గ్రామ శివారులో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పెద్ద బండను ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు చక్రం ఊడి దెబ్బతిన్నది. డ్రైవర్ ప్రవీణ్, క్లీనర్‌తో సహా నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బస్సులో నుంచి విద్యార్థులను కిందికి దింపారు. దుబ్బతండాకు చెందిన విద్యార్థి రాంచరణ్ భుజానికి బలంగా దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
అను‘మతి’ ఉండే చేస్తున్నారా..?
చిత్తూరు అర్బన్: ధనార్జనే ధ్యేయంగా వెలుస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఏ మాత్రం నియమ నిబంధనలను పట్టించుకోవడంలేదు. కాలం చెల్లిన బస్సుల్లో పసి పిల్లల్ని కుక్కేస్తూ ప్రాణాల మీదకు తెస్తున్నారు. మామూళ్లు తీసుకోవడం.. ఒత్తిళ్లకు తలొగ్గడానికి అలవాటు పడ్డ రవాణాశాఖ అధికారులు అభంశుభం తెలియని పిల్లల రక్తం కళ్ల చూస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి ఏటా జూన్ 12వ తేదీలోపు పిల్లల్ని తీసుకెళ్లే బస్సులు, వ్యాన్లకు ఏడాది వరకు రవాణాశాఖ అధికారులు సామర్థ్యపు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. పిల్లలు విద్యాసంస్థల బస్సుల్లో కూర్చోపెట్టి తీసుకెళ్లడానికి ప్రతి వాహనానికి ఎఫ్‌సీ తప్పనిసరి. కండీషన్ లేని బస్సులతో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. అందుకే సంవత్సరానికి ఓ సారి పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల కండీషన్‌ను మోటారు వాహన తనిఖీ అధికారులు (ఎంవీఐ) పరిశీలిస్తారు. బస్సుల టైర్లు, వేగం, ఇంజిన్ సామర్థ్యం లాంటివి తనిఖీ చేసిన తరువాతే ఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. జిల్లాలోని చాలా మంది ఎంవీఐలు స్కూల్ బస్సుల కండీషన్ తనిఖీ చేసే సమయంలో బస్సుకు ఓ రేటును మాట్లాడుకుని మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఫలితంగా జిల్లాలో 30 శాతం వరకు విద్యా సంస్థల వాహనాలు సరైన కండీషన్లో లేకనే రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. ఎఫ్‌సీ కోసం వచ్చే విద్యాసంస్థల బస్సులో తప్పనిసరిగా జీపీఎస్ (గ్లోబల్ పొజిషన్ సిస్టమ్) పరికరాన్ని ఉంచాలని ఈ సారి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. విద్యార్థుల భద్రతా ప్రమాణాల్లో భాగంగా జీపీఎస్ పరికరం తప్పనిరయ్యింది. ప్రస్తుతం 500లకు పైగా బస్సులు ఎఫ్‌సీలు లేకుండా, జీపీఎస్ పరికరాలు పెట్టుకోకుండా యథేచ్ఛగా వాహనాల్లో విద్యార్థులను ఎక్కించుకుని తిప్పుతున్నా అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎఫ్‌సీలు ఏవీ.. జిల్లాలో 2,235 స్కూల్ బస్సులు ఉన్నాయి. చిత్తూరు ప్రాంతీయ రవాణ శాఖ పరిధిలో 1,121 స్కూల్ బస్సులు, తిరుపతి పరిధిలో 1,104 వరకు బస్సులున్నాయి. గతేడాది ఎఫ్‌సీ పత్రాలు తీసుకున్న బస్సులకు ఈ ఏడాడి జూన్ 15వ తేదీ నాటికి గడువు ముగిసింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇవి రోడ్లపైకి రావడానికి వీల్లేదు. అలాగే 15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులు విద్యార్థులను ఎక్కించుకోవడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే విద్యాసంస్థల నిర్వాహకులు వాహనాలను కండీషన్లో ఉంచుకుని, రిపేర్లు పూర్తి చేసి రవాణ శాఖ నుంచి మరో ఏడాది చెల్లుబాటుకు ఎఫ్‌సీ తీసుకోవాలి. జిల్లాలోని 200లకు పైగా బస్సులకు ఎఫ్‌సీలు లేవు. సామర్థ్యంలేని బస్సుల్లో పరిమితికి మించి పిల్లల్ని ఎక్కించుకువెళుతున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేయాల్సిన అధికారులు మౌనంగా ఉండిపోతున్నారు. అధికార పార్టీ నేతల నుంచి రవాణాశాఖ అధికారులకు ఒత్తిళ్లు వస్తుండడమే ఇందుకు కారణం. క్రిమినల్ కేసు పెడతాం మా రికార్డుల ప్రకారం 120 వరకు బస్సులకు ఎఫ్‌సీలు లేవు. ఇవి రోడ్లపైకి కూడా రావడంలేదు. మా వాళ్లు తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఎఫ్‌సీలు లేకుండా బస్సుల్లో పాఠశాలల పిల్లల్ని ఎక్కిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అంతేగాక పాఠశాలల నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటాం. – ప్రతాప్, ఉప రవాణ కమిషనర్, -
మా తండా బడిని కాపాడుకుంటాం..
కురవి(డోర్నకల్): ‘మా తండాలోని బడిలోనే మా పిల్లలను చదివిస్తాం.. ప్రైవేట్ స్కూల్‌కు పంపించం.. మా బడిని కాపాడుకుంటాం’ అని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకుని తమ పిల్లలను తండాలోని బడిలోకి పంపించిన సంఘటన కురవి మండలం బీబీనాయక్ తండా గ్రామ పంచాయతీలో జరిగింది. తండాలోని బడిఈడు పిల్లలందరూ కురవితోపాటు ఇతర గ్రామాల్లోని ప్రైవేట్ స్కూల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సులు, వ్యాన్లు తండాకు వచ్చి పిల్లలను తీసుకెళ్తున్నాయి. బీబీనాయక్ తండా గ్రామ పంచాయతీగా అవతరించడంతో.. మా తండా బడిలోనే మా పిల్లలు చదివించుకుంటాం అని పిల్లల తల్లిదండ్రులు, యువకులు ముందుకు వచ్చి ముక్తకంఠంతో శుక్రవారం తండాకు వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకుని అందులో ఎవరిని ఎక్కనీయకుండా పిల్లలందరినీ నేరుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తీసుకెళ్లి ఉపాధ్యాయులకు అప్పగించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ బోడ శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, పాఠశాలకు మరమ్మతులు చేయిస్తే బడిని మంచిగా చూసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ బడిని రక్షించుకుంటామని తెలిపారు. గతంలో స్కూల్లో 15 మంది మాత్రమే ఉన్నారని, నేడు 40మంది వరకు ఉన్నారని వివరించారు. తండాలోని పెద్దలంతా ముక్తకంఠంతో ప్రభుత్వ బడిని రక్షించుకునేందుకు ముందుకు రావడం గొప్ప పరిణామమన్నారు. హెచ్ఎం కుమారస్వామి, ఉపాధ్యాయుడు కృష్ణ, బోడ వెంకన్న, బోడ రవీందర్, భూక్యా వీరన్న, భూక్యా స్వామి, భూక్యా సుధాకర్, బోడ నాగేష్, పకీర, భూక్యా నాగార్జున్, భూక్యా నవీన్, అశోక్ పాల్గొన్నారు. -
స్కూల్ బస్ బ్రేక్ ఫెయిల్
శ్రీకాకుళం , కవిటి: కంచిలిలోని ఓ పేరుపొందిన ప్రైవేట్ స్కూల్ బస్‌కు బ్రేక్ ఫెయిల్ అయింది. అందులో ప్రయాణిస్తున్న సుమారు 50 మంది చిన్నారులు ఉలిక్కిపడ్డారు. హాహాకారాలు చేసి ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సును రోడ్డుపక్కనే ఉన్న ఓ తాటిచెట్టుకు పక్కనుంచి ఢీకొట్టించి నిలిపేయడంతో చిన్నారులు ఊపిరిపీల్చుకున్నారు. కవిటి మండలం బాలాజీపుట్టుగ మలుపు వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచిలి నుంచి దూగానపుట్టుగ మీదుగా బి.గొనపపుట్టుగలోని విద్యార్థులను తీసుకువెళ్లేందుకు వస్తున్న స్కూల్ బస్సు సరిగ్గా బాలాజీపుట్టుగ మలుపు వద్దకు వచ్చే సమయానికి బ్రేక్ ఫెయిల్ అయింది. బస్సు యాక్సిలరేటర్ తక్కువ వేగంలోనే ఉన్నా రోడ్డు బాగా ఏటవాలులో ఉండడంతో బస్సు వేగం నియంత్రించలేనంతగా పెరిగింది. బస్సు వేగాన్ని నియంత్రించేందుకు డ్రైవర్ బ్రేక్‌ను తొక్కాడు. కానీ బస్సు వేగం తగ్గలేదు సరికదా బాగా అదిమినా ఆగలేదు. ఇలా ఇరుకైన సింగిల్‌వే రోడ్డులో డ్రైవర్ చాకచక్యంగా అరకిలోమీటరు ప్రయాణించాడు. చివరకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రోడ్డుపక్కనే ఉన్న తాటిచెట్టుకు బస్సును పక్కనుంచి ఢీకొట్టించి ఆపేశాడు. పెద్దగా శబ్ధం రావడంతో సమీపంలో కొబ్బరి తోటల్లో ఉన్న రైతులంతా అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న పిల్లలకు ఏమైందోనని ఆందోళనతో బస్సులోకి వెళ్లారు. అదృష్టవశాత్తూ ఏ పిల్లవాడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే డ్రైవర్‌ను స్థానికులు దేహశుద్ధి చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్థానికంగా మోటార్‌వాహనాలపై అవగాహన ఉన్న వ్యక్తి బస్సు బ్రేక్‌ఫెయిల్ అయిందా అని డ్రైవర్‌ను ప్రశ్నించాడు. బస్సు కండిషన్ దారుణంగా ఉందని అతడు అంగీకరించాడు. ఐదారు నెలలుగా చెబుతున్నా యాజమాన్యం బస్సును మార్చడంలేదని తెలిపాడు. అంతేకాకుండా టైర్లు దయనీయమైన స్థితిలో ఉండడాన్ని చూసిన స్థానికులు బస్సులో ఉన్న పాఠశాల సిబ్బందిని నిలదీశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధతీసుకుని కాలంచెల్లిన బస్సులకు అనుమతులు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. అప్పట్లో బాగానే ఉంది దీనిపై ఇచ్ఛాపురం మోటార్వెహికల్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్‌ను ‘సాక్షి’ సంప్రదించింది. దీనిపై ఆయన స్పందిస్తూ ఏడాది ప్రారంభంలో తనిఖీల సమయంలో బస్సు బాగానే ఉందని మూడు నాలుగు నెలల్లోనే దారుణంగా మార్చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇలాంటి వాహనాలపై తక్షణమే తనిఖీలు నిర్వహించి అనుమతులపై పునఃసమీక్ష చేస్తానని తెలిపారు. -
తీరని కడుపుకోత
చిట్టిపొట్టి మాటలతో స్కూల్ బ్యాగులు వేసుకొని అమ్మ.. నాన్న బై.. అంటూ పాఠశాలకు బయలుదేరిన పిల్లలు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటారో..? లేదో..? అన్న భయం ప్రైవేట్ పాఠశాలలకు పంపే విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంటోంది. కొన్నేళ్లుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనం... సంగారెడ్డి క్రైం: సరైన శిక్షణ నైపుణ్యం కలిగిన డ్రైవర్లనే ఎంచుకొని ప్రైవేట్ పాఠశాలల బస్సులను నడిపేందుకు నియమించుకోవాలి. లాభపేక్షతో యాజమాన్యాలు తక్కువ వేతనంతో పని చేస్తే వారిని నియమించుకుంటున్నాయి. సరైన శిక్షణ లేని డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మద్యం మత్తులో బస్పులు నడపడం కూడా మరో కారణం. ఇటీవల సంగారెడ్డి మండలం ఫసల్వాది చౌరస్తా వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపిన సంఘటనలో హత్నూర మండలానికి చెందిన విద్యార్థులు గాయపడిన సంగతి విదితమే. కొన్నేళ్ల క్రితం జూలై 24న వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వేగేటు వద్ద పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో 16 మంది విద్యార్థులు, డ్రైవర్, క్లీనర్ మృతి చెందగా.. మరో 18 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ సంఘటన మారుమూల ప్రాంతాల్లోని అనేక కుటుంబాల్లో చీకట్లను నింపింది. నేటికీ పాలకులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గుణపాఠం నేర్చుకోలేదనే విమర్శలున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం రోజురోజుకు ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మౌలిక వసతులు లేకపోయినా... శిక్షణ,అర్హత లేని వారితో ఏర్పాటు చేస్తున్నారు. పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలించడం పరిపాటైంది. ఏటా రవాణా శాఖ అధికారులు పాఠశాలల ప్రారంభ సమయంలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను ‘మమ’ అనిపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల బస్సుల నిర్వహణపై అధికారులు పర్యవేక్షించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిట్నెస్ పరీక్షల సమయంలో మాత్రం బ్యాడ్జ్ నెంబర్ కలిగిన డ్రైవర్లతో అనుమతి పొందుతున్నారు. తర్వాత యథావిధిగా బ్యాడ్జ్ నెంబర్, అనుభవం లేనివారితో నెట్టుకొస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు
నర్సంపేట రూరల్: మండలంలోని ముత్తోజీపేటలో సర్పంచ్, ఎంపీటీ సభ్యురాలు, మహిళా సంఘాల ప్రతినిధులు కలిసి తమ గ్రామం నుంచి నర్సంపేటకు విద్యార్థులను తీసుకెళుతున్న ప్రైవేట్ పాఠశాలల బస్సును సోమవారం నిలిపివేశారు. విద్యార్థులను దింపి, వారందరిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మండ మహేందర్, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లపల్లి లావణ్యరాంప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం తొలిసారిగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారని, చిన్నారులను ఈ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజ లు సర్పంచ్, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ‘చిన్నారులను ప్రైవేట్ పాఠశాలలకు పంపించమని, ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తామని’ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
గుంటూరు: ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి స్కూల్ బస్సు అదుపు తప్పి కాల్పలోకి దూసుకెళ్లింది. అదృష్టవాశాత్తూ ఈ బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులు క్షేమంగా బయట పడ్డారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు వద్ద గురువారం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థిని మృతి
-
స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థిని మృతి
పాలకొల్లు టౌన్:ప్రైవేట్ స్కూల్ బస్సు పాలకొల్లు బ్రాడీపేట బైపాస్‌రోడ్డులో బుధవారం సాయంత్రం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో యూకేజీ విద్యార్థిని నూజర్ల రిషిత(5) మరణించింది. 10మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సన్‌షైన్ స్కూల్ వదిలిన తరువాత పెనుమదం, గుమ్మలూరు, ఆచంట గ్రామాలకు చెందిన సుమారు 20మంది విద్యార్థులతో స్కూల్ బస్సు బుధ వారం సాయంత్రం బయలుదేరింది. పాల కొల్లు బ్రాడీపేట బైపాస్‌రోడ్డుకు వచ్చేసరికి బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. ఆ ప్రాంతంలో క్రికెట్ ఆడుతున్న యువకులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన పాలకొల్లు సబ్బేవారిపేటకు చెందిన రిషితను పాలకొల్లులోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిం ది. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపటంతో అదుపుతప్పి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రైవేట్ వాహన డ్రైవర్ అయిన రిషిత తండ్రి సతీష్, తల్లి దుర్గ ఆసుపత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. వారి దుఃఖాన్ని ఎవరూ ఆపలేకపోయూరు. ప్రమాదంలో కొండేటి చంద్రకళ (6వతరగతి, ఆచం ట), కర్ని దీపిక (4వ తరగతి, గుమ్మలూరు), బాలం ఆనందకుమార్ (6వ తరగతి, ఆచం ట), బొక్కా తరుణ (6వ తరగతి, ఆచంట), కర్ణి ప్రేమచంద్ (5వ తరగతి, గుమ్మలూరు), కర్ణి మౌనిక (1వ తరగతి, గుమ్మలూరు)కు స్వల్పగాయాలు అ య్యూ యి. వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించా రు. రిషిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పట్టణ సీఐ కోలా రజనీకుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆసుపత్రికి వచ్చి రిషిత తల్లిదండ్రులను అనునయించారు. -
దూసుకువచ్చిన మృత్యువు
రాజమండ్రి క్రైం/రాజమండ్రి రూరల్ :మృత్యువు బస్సు రూపంలో రెప్పపాటులో దూసుకువచ్చి, ముగ్గురిని బలి తీసుకుంది. మరో ఐదుగురిని తీవ్ర గాయాలపాలు చేసింది. రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో ఆదివారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. 16వ నంబరు జాతీయ రహదారిపై వేమగిరి వైపు వెళుతున్న ఒక ప్రైవేటు పాఠశాల బస్సు బ్రేకులు ఫెయిలవడంతో అదుపు తప్పి ఒక కారును, మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొని, పక్కనే ఉన్న డ్రైనేజీలోకి దూసుకుపోయి, హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మండపేట గొల్లపుంతకు చెందిన ఇనపకోళ్ల దుర్గాప్రసాద్ (13), రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న (55) అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా కాకినాడ రూరల్ కరప మండలం కోదాడకు చెందిన శివనేని మహాలక్ష్మి (70) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్టీరింగ్ నొక్కేయడంతో గాయపడ్డ బస్సు డ్రైవర్ ఎం.శ్రీను రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో ఆదివారం తీరని విషాదం నింపింది. అధికారులు, ప్రజాప్రతినిధుల సందర్శన బస్సు ప్రమాద సమాచారం తెలుసుకున్న కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఏఎస్పీ సిద్ధారెడ్డి, తూర్పు మండల డీఎస్పీ ఆస్మా ఫర్హీన్, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్, సెంట్రల్ డీఎస్పీ కులశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రభుత్వాసుపత్రి, బొల్లినేని ఆసుపత్రులకు వెళ్ళి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. ఈ నెల 3న కాకినాడలో జరగబోయే రోడ్ సేఫ్టీ సమావేశంలో మోరంపూడి వద్ద నిత్యం జరుగుతున్న ప్రమాదాల గురించి చర్చించి, నివారణకు నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారని చెప్పారు. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఎన్హెచ్ఏఐ, మున్సిపాలిటీ, ఆర్అండ్బీ శాఖలను గతంలోనే కోరామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. జాతీయ రహదారి పక్కన వైన్ షాపులను తొలగించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను కోరామన్నారు. ఈ ప్రమాదంపై విచారణాధికారిగా జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావును నియమించారు. ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో స్కూలు బస్ డ్రైవర్‌ను పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. బస్సులో విద్యార్థులెవరూ లేరన్నారు. బస్సు ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ అధికారులతో మాట్లాడి, వాహనాన్ని తనిఖీ చేసి చర్యలు చేపడతామన్నారు. బస్సు లీజు రద్దు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదానికి కారణమైన బస్సు కాంట్రాక్టర్‌తో లీజు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు నారాయణ విద్యాసంస్థల జిల్లా డీన్ సీహెచ్ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 మే 23న చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను మాత్రమే తిప్పాల్సి ఉందని, అయితే ఆ బస్సును ఇతరులను తీసుకెళ్లేందుకు వినియోగించారని, ఆ కారణంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పాఠశాలకు సెలవు రోజుల్లో బస్సును పార్కింగ్ చేసి ఉంచాలని, అయితే ఆదివారం సెలవు రోజైనప్పటికీ తమకు తెలియజేయకుండా, తమ అనుమతి లేకుండా బస్సును ఇతరుల కోసం ఆపరేటర్ వినియోగించడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. బాధితులను ఆదుకుంటాం : డిప్యూటీ సీఎం రోడ్డు ప్రమాద బాధితులను ఆర్థికంగా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బస్సు ప్రమాద బాధితులను ఆయన ఆదివారం రాత్రి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. బస్సు డ్రైవర్ శ్రీను, బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇనుపకోళ్ల శ్రీనివాసరావులను పరామర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, మోరంపూడి, హుకుంపేట, బొమ్మూరు వంటి జంక్షన్లను బ్లాక్ స్పాట్లుగా గుర్తిస్తున్నట్టు తెలిపారు. ఆ ప్రాంతాల్లో నిరంతరం ట్రాఫిక్ పోలీసులు ఉండేలా, సిగ్నలింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా, పోలీసు వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. స్పీడ్ కంట్రోల్, డ్రింక్ అండ్ డ్రైవ్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పండక్కని ఇంటికి వచ్చింది.. తనను చూసేందుకు, పండగకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు తన తల్లి శివనేని మహాలక్ష్మి (70) 20 రోజుల క్రితం కాకినాడ రూరల్ కరప మండలం కోదాడ గ్రామం నుంచి వచ్చిందని ఆమె కొడుకు సత్యనారాయణ తెలి పాడు. స్వగ్రామం వెళ్లేందుకు ఆదివారం బాబానగర్‌లోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరామని, జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి తన వాహనంలో పెట్రోలు అయిపోవడంతో మోరంపూడి జంక్షన్లో ఉండమని చెప్పానని తెలిపారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని విలపించాడు. కొడుకును ఇంటికి తీసుకువెళుతూ.. మండపేట గొల్లపుంతకు చెందిన ఇనుపకోళ్ల దుర్గాప్రసాద్ రాజమండ్రిలోని ప్రైవేటు విద్యా సంస్థ హాస్టల్లో ఉండి 7వ తరగతి చదువుకుంటున్నాడు. అతడిని ఇంటికి తీసుకువెళ్లేందు కు తల్లిదండ్రులు ఆదివారం వచ్చారు. ద్విచక్ర వాహనంపై హాస్టల్ నుంచి దుర్గాప్రసాద్‌ను తీసుకుని వస్తూ సిగ్నల్ పడడంతో మోరంపూడి జంక్షన్లో ఆగారు. ఇంతలో జరిగిన ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ (13) అక్కడికక్కడే మృతి చెందాడు. వారు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాసరావుకు వెన్నెముక విరిగింది. విజయలక్ష్మికి కాళ్లు విరిగిపోయాయి. దిక్కులేని తమ్ముడికి అన్నీ అక్కే.. రాజమండ్రి గాంధీపురం-3కి చెందిన ర్యాలి వెంకన్న(55) ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అతడిని అక్కే అన్నీ తానై చూస్తోంది. వెంకన్న ఆదివారం మోరంపూడి జంక్షన్‌లోని ఒక వైన్ షాపులో పనికి వెళ్లాడు. అదుపు తప్పిన బస్సు ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డాడు. శుభలేఖలు ఇచ్చేందుకు వెళుతూ.. తన కొడుకు పెళ్లి శుభలేఖలను బంధువులకు ఇచ్చేందుకు బయలుదేరిన డాక్టర్ బుద్ధుడు మరో వైద్యుడితో కలిసి కారులో మోరంపూడి జంక్షన్‌కు చేరుకున్నారు. వీరి కారును బస్సు ఢీకొనడంతో గాయపడి ఆస్పత్రిపాలయ్యారు. -
మృత్యుశకటం
ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో ఆనందంగా గడిపారు ఆ చిన్నారులు. సోమవారం ఉదయాన్నే స్కూలుకెళ్లేందుకు భారంగా నిద్రలేచారు. ఓ వైపు చలి వణికిస్తున్నా తల్లిదండ్రులు వారిని త్వరత్వరగా ముస్తాబు చేసి స్కూలుకు పంపేందుకు భోజనం క్యారియర్లు సిద్ధం చేశారు. అమ్మానాన్నలకు టాటా..చెప్పి ఆటో ఎక్కిన ఆ పిల్లలు కాసేపటికే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. * ఆటోను ఢీకొన్న స్కూలు బస్సు * ఇద్దరు చిన్నారుల దుర్మరణం * 14 మందికి తీవ్రగాయాలు * ముగ్గురి పరిస్థితి విషమం చిల్లకూరు: ఆటోలో స్కూల్‌కు బయలుదేరిన చిన్నారుల పాలిట ఓ ప్రైవేటు స్కూల్ బస్సు మృత్యుశకటంగా మారింది. వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొనడంతో మోడిబోయిన వెంకీ(7), దొడ్డగ వినయ్(7) మృతిచెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే ఇళ్ల నుంచి బయలుదేరిన తమ పిల్లలు ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తీపనూరు సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..తీపనూరుకు చెందిన వెంకీ, వినయ్, శ్రీ వంశీ, భావన, శ్రీదివ్య చిల్లకూరులోని ఎస్‌కెఆర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్నారు. చిల్లకూరు సమీపంలోని ఎల్ఏపీ పాఠశాలలో చదువుతున్న అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్, దినేష్, చరణ్‌తేజ, సుశాంక్, సునీల్, శ్రీహరి,రక్షిత, జగన్‌తో పాటు చిల్లకూరులోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదివే సుజీ విమలాదేవి, మౌనిక ఒకే ఆటోలో బయలుదేరారు. గ్రామాన్ని దాటిన కొద్దిసేపటికే వీరి ఆటో ప్రమాదానికి గురైంది. గూడూరు నుంచి పిల్లల కోసం బయలుదేరిన ఓ కార్పొరేట్ స్కూలు బస్సు వేగంగా వస్తూ ఆటోను ఢీకొంది. కొంతదూరం ఆటోను ఈడ్చుకెళ్లడంతో అందులోని విద్యార్థులతో పాటు డ్రైవర్ రాఘవయ్య తీవ్రగాయాలపాలయ్యారు. మౌనిక వెంటనే తేరుకుని గ్రామం వైపు పరుగుతీసింది. ఓడూరు వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తమ పెద్దలకు సమాచారం ఇవ్వాలని కోరింది. వారిలో ఒకరు 108, 100కు సమాచారం అందించగా మరొకరు తీపనూరుకు వెళ్లి గ్రామస్తులకు ప్ర మాదవిషయాన్ని తెలియజేశాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన పిల్లల తల్లిదండ్రులు ఆందోళనగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపు గూ డూరు, చిల్లకూరు, కోట నుంచి 108 అంబులెన్స్‌లు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను గూ డూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్యం అందే పరిస్థితి లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకి, వంశీ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో మిగిలిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌ల్లో నెల్లూరులోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. వారిలో చరణ్‌తేజ, సుశాంక్, జగన్ పరిస్దితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఏరియా ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. వివరాల సేకరణ ఘటన జరిగిన వెంటనే డీఈఓ ఆంజనేయులు, గూడూరు ఆర్డీఓ రవీంద్ర, డీఎస్పీ శ్రీనివాస్‌తో పాటు చిల్లకూరు తహశీల్దార్ శ్రీకాంత్కేదారినాథ్, ఎంపీడీఓ చిరంజీవి, డిప్యూటి డీఈఓ మంజులాక్షి, ఎంఈఓ మధుసూదన్‌రావు ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలను సేకరించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. మృతదేహాల అప్పగింత వెంకి, వినయ్ మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన స్కూలు బస్సు డ్రైవర్ కాలేషాను పోలీసులు అదుపులోకి తీసుకోగా క్లీనర్ శ్రీను పరారీలో ఉన్నాడు. ఎస్సై దశరథరామారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ బస్సు బోల్తా
త్రిపురాంతకం : ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడటంతో ఓ విద్యార్థి చేయి సగానికి తెగగా మిగిలిన విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని గణపవరం సమీపాన కేజీ రోడ్డుపై సోమవారం జరిగింది. వివరాలు.. త్రిపురాంతకంలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు మండలంలోని అన్నసముద్రం వెళ్లి 20 మంది విద్యార్థులతో తిరిగి బయల్దేరింది. మార్గమధ్యంలోని గణపవరం సమీపాన కేజీ రోడ్డుపై బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో అన్నసముద్రానికి చెందిన ఒకటో తరగతి విద్యార్థి పోట్ల అజయకుమార్ చేయి తెగింది. మరో ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఏడుస్తున్న ఓ బాలికను తల్లిదండ్రులు డ్రైవర్ వద్ద కూర్చోబెట్టారు. బాలిక బస్సు స్టీరింగ్‌ను గట్టిగా లాగడంతో బోల్తా కొట్టిందని డ్రైవర్ చెబుతున్నాడు. బస్సు బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. చేయి విరిగిన బాలుడు మినహా అంతా సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. బాలుడికి స్థానిక వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
నిర్లక్ష్యంతోనే ప్రాణాలు బలి
రాకాసి రైలు ముక్కు పచ్చలారని పాలబుగ్గలను చిదిమేసింది. అమాయక పిల్లల నిండు ప్రాణాలను బలిగొంది. ఎంతో మంది తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చింది. తన చిన్నారులు ఇక లేరని, తిరిగి రార ని ఓ తండ్రి గుండె పోటుతో మృతి చెందడం చూస్తే గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. మాసాయిపేట వద్ద రైలు ప్రమాదం ముమ్మాటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యమేనని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. - సాక్షి నెట్వర్క గార్డును నియమించాలి.. స్కూల్ వ్యాన్ నడిపే డ్రైవర్లు ఓపికతో ఉండాలి. నిష్ణాతుల్ని యాజమాన్యం నియమించుకుంటే మంచిది. అదే విధంగా రైల్వే క్రాసింగ్‌ల వద్ద తప్పకుండా గార్డును నియమించాలి. - తిరుమల, ఉపాధ్యాయురాలు గేట్లను ఏర్పాటు చేయాలి రైల్వే ప్రమాద ఘటనలో రైల్వే శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. భారత దేశ వ్యాప్తంగా దాదాపు 30 వేల రైల్వే క్రాసింగ్‌లు ఉండగా అందులో పదిహేను వేల వరకు గార్డులు లేని గేట్లే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే శాఖ రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్లను ఏర్పాటు చేయాలి. - నవీన్, కరస్పాండెంట్, కాకతీయ టెక్నో స్కూల్, రాంనగర్ డ్రైవర్‌దే తప్పు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా పెరిగిన రోజుల్లో కూడా రైలు ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. రైల్వే క్రాసింగ్ వద్ద రెండు వైపులా చూసుకొని బస్సు నడపకపోవడం డ్రైవర్‌దే తప్పు. రైలు వస్తుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్‌కు, క్లీనర్‌కు ఉండాలి. - రూపాధరణి, విద్యార్థిని ప్రమాదం జరిగినప్పుడే హడావుడి... రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేటు, సిగ్నల్స్, గార్డును నియమిస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదు. సంఘటనలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి చేస్తారే తప్ప ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోరు. - చప్పిడి సుభాన్‌రెడ్డి, నవీన విద్యా సంస్థల చైర్మన్ ఫిట్నెస్ చూడాలి బస్సు ఫిట్నెస్ను ఎలా చూసుకుంటున్నామో డ్రైవర్ కూడా ఫిట్నెస్ కలిగి ఉన్నాడో లేడో చూసుకోవాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యాలపై ఉన్నది. డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. - రామలింగం, ప్రిన్సిపాల్, క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీనగర్‌కాలనీ పునరావృతం కాకుండా చర్యలు... నిర్లక్ష్యానికి కారకులు ఎవరైనప్పటికీ చనిపోయిన విద్యార్థులను తిరిగి తీసుకురాలేరు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధ్యులపై చర్యలు తీసుకుని డ్రైవర్లకు శిక్షణా తరగతులు నిర్వహించాలి. - ఇ.సుష్మ, విద్యార్థిని -
కన్నతల్లుల కడుపుకోత
ఆ చిన్నారులు తెల్లవారగానే లేచారు.. వడివడిగా తయారయ్యారు. పాఠశాలకు వెళుతూ అమ్మానాన్నలకు బైబై చెప్పారు. ఎంతో ఉషారుగా పాఠశాల బస్సెక్కారు. అంతలోనే ఆ పాలబుగ్గలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు చిదిమేసింది. వెల్దుర్తి మండలం మాసాయిపేట కాపలాలేని రైల్వేగేట్ వద్ద గురువారం ఉదయం నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పాఠశాల బస్సును ఢీకొట్టిన ఘటనలో 14 మంది విద్యార్థులతోపాటు డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కన్నతల్లులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ►పసిమొగ్గలను చిదిమేసిన మృత్యుశకటం ►ఛిద్రమైన దేహాలు.. చెల్లాచెదురైన ఆశలు ►కన్నీటి సంద్రమైన మెతుకుసీమ ►ఘటనాస్థలికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మెదక్ : ఆ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం విద్యార్థుల నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. చదువులమ్మ ఒడిలో ఆడిపాడాల్సిన ఆ విద్యార్థులు.. మృత్యుఒడిలో విగతజీవులుగా మారారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కాపలాలేని రైల్వే గేట్ వద్ద గురువారం ఉదయం రైలు వస్తున్నా చూసుకోకుండా బస్సును అలాగే పట్టాలెక్కించడంతో.. నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొని ఆ బస్సులోని విద్యార్థులతోపాటు, బస్సు డ్రైవర్, క్లీనర్ మృత్యువాతపడ్డారు. అప్పటిదాకా కేరింతలతో వున్న చిన్నారుల దేహాలు ఒక్కసారిగా ఛిద్రమవడాన్ని చూసి భరించలేని ఆ కన్నతల్లులు బోరున విలపించారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి మృతదేహాలకు గురువారం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. ఆ చిన్నారులను తలుచుకుంటూ.. వారి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ.. గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. వారి రోదనలను ఆపడం ఎవరితరం కాలేకపోయింది. ప్రమాదం విషయం తెలుసుకున్న మెదక్ ప్రజలు ఆస్పత్రికి పెద్దఎత్తున చేరుకుని చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలి చేసుకుంటూ.. కష్టనష్టాలు భరిస్తూ...పిల్లలను బడికి పంపితే మా కలలను కల్లలు చేస్తూ.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా.. బిడ్డా? అంటూ కన్నవారు గుండెలు బాదుకున్నారు. మేమేం పాపం చేశామని దేవుడు మాకే ఎందుకు ఈ శిక్ష విధించాడంటూ రోదించారు. ఇంటి దీపాలను ఆర్పేసిన నిర్లక్ష్యం.. అధికారులు, ప్రైవేట్ యాజమాన్యాలు, డ్రైవర్, క్లీనర్ల నిర్లక్ష్యం కన్నవారి కనుపాపలను కాటేసింది.ఈ ప్రమాదంలో పలు కుటుంబాల ఇంటిదీపాలే ఆరిపోయాయి. గౌసియా-అబ్దుల్ రషీద్, చరణ్-దివ్య, సుమన్-శ్రీవిద్య, శృతి-విశాల్-భువన అనే అన్నాచెల్లెలంతా దుర్మరణం చెందడంతో వారి కన్నవారి కలలు కల్లలయ్యాయి. తల్లిదండ్రులు ఎన్నో మొక్కులు మొక్కగా పండిన కలల పంట మల్లేష్ యాదవ్ సైతం ఈ ప్రమాదంలో మృత్యువాత పడటంతో వారి బాధ వర్ణానాతీతమైంది. వీరితోపాటు ఈ ప్రమాదంలో రమేష్, ధనుష్కోటి, వంశీ, విష్ణులతోపాటు డ్రైవర్ బిక్షపతిగౌడ్, క్లీనర్ రమేష్గౌడ్ల మృతదేహాలకు మెదక్ ఏరియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘోర ప్రమాదం వైద్యులను సైతం కన్నీరు పెట్టించింది. ఏమని ఓదార్చాలమ్మా..! కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న మిమ్మల్ని ఏమని ఓదార్చాలమ్మా..? మేం ఏం సాయం చేసినా.. పోయిన మీ బిడ్డలను తేగలమా? అని కంటతడిపెడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, జి. జగదీశ్వర్‌రెడ్డి తదితరులు బాధితులను ఓదార్చారు. కాగా, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చిలుముల మదన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రజా గాయకుడు గద్దర్, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, టీఆర్ఎస్ నేతలు దేవేందర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, నర్సారెడ్డి తదితరులు కూడా బాధితులను ఓదార్చారు. -
విద్యార్థులకు తప్పిన ప్రమాదం
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రైవేట్ స్కూల్ బస్సు టైర్లు ఊడిపోయిన ఘటన సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... అమ్మవారిశాల సమీపంలోని గౌని సర్కిల్లో ఉన్న శ్రీవాణి విద్యాలయం స్కూల్ బస్సు సోమవారం ఉదయం విద్యార్థులను తీసుకొని వచ్చేందుకు మండల పరిధిలోని కల్లూరు గ్రామానికి వెళ్లింది. కల్లూరు, తాళ్లమాపురం, నీలాపురం గ్రామాల విద్యార్థులందరూ ఇదే బస్సులో వస్తారు. కల్లూరులో సుమారు 60 మంది దాకా విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. వారిలో నర్సరీ, ఒకటి, రెండు, మూడో తరగతులు చదివే చిన్న పిల్లలు కూడా వున్నారు. విద్యార్థులు ప్రయాణించే ఈ బస్సు కల్లూరు గ్రామం దాటిన తర్వాత కొంత దూరం వెళ్లగానే బస్సు వెనుక వైపున ఉన్న రెండు టైర్లు ఊడిపోయాయి. ఊడిపోయిన టైర్లు రహదారికి ఇరువైపుల ఉన్న పొలాల్లో దూరంగా పడ్డాయి. టైర్లు విడిపోగానే బస్సు ఒక వైపుకు ఒరిగి పెద్ద శ బ్దం వచ్చింది. విద్యార్థులందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో కల్లూరు గ్రామానికి చెందిన తేజేష్, ఉదయ్‌కుమార్, భరత్, బాలాజీ, నాని, గురుప్రసాద్ అనే విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. కొందరైతే భయంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఈ విషయం విద్యార్థుల తల్లి దండ్రులకు తెలియడంతో వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ పిల్లలను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. గాయ పడిన విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లారు. బస్సులో ప్రయాణిస్తున్న 60 మంది విద్యార్థులకు ప్రమాదం తప్పింది. వీరిని మరో బస్సులో పాఠశాలకు తరలించారు. కాగా 25-30 మాత్రమే ప్రయాణించాల్సిన మినీ బస్సులో 60-70 మందిని పాఠశాలకు తరలిస్తున్నట్లు కల్లూరు గ్రామస్తులు అంటున్నారు. అంతేగాక స్కూల్ యాజమాన్యం బస్సు కండీషన్ పట్ల జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్సులపై నిఘా పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.