సీతారాంపల్లి సమీపాన ప్రమాద స్థలి వద్ద గుమిగూడిన ప్రజలు
అనంతపురం, ధర్మవరం రూరల్: సీతారాంపల్లి వద్ద జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ప్రైవేటు స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... కనగానపల్లి మండలం మామిళ్లపల్లిలో ఉన్న శ్రీ ప్రార్థన విద్యానికేతన్ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు పది మంది విద్యార్థులతో జాతీయ రహదారిపై వెళ్తోంది. సీతారాంపల్లి వద్దకు రాగానే బస్సులో ఉన్న పిల్లలు అల్లరి చేస్తుండటంతో డ్రైవర్ వెనక్కు తిరిగి మందలించాడు. అంతే.. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో నీలిమ అనే విద్యార్థిని కాలు విరిగింది. మరో తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. హైవే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని గాయపడిన విద్యార్థులను 108లో ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
ఇంటిని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
సోమందేపల్లి: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇంటి బయట బట్టలు ఉతుకుతున్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం అనంతపురం వైపు నుంచి హిందూపురం వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు సోమందేపల్లి మండలం చాలకూరులోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న నాగరత్నమ్మ ఇంటిని ఢీకొట్టింది. రెండు గదులు దెబ్బతిన్నాయి. ఇంటి బయట బట్టలు ఉతుకుతున్న నాగరత్నమ్మ తల్లి గంగమ్మ తీవ్రంగా గాయపడింది. బస్సు ఒక దూసుకురావడం గమనించి అక్కడున్న మరికొంతమంది పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. టైర్ల వద్ద వీల్ అలైన్‌మెంట్ దెబ్బతినడంతో అదుపుతప్పి ఇంటిని ఢీకొన్నట్లు డ్రైవర్ తెలిపాడు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా రోడ్డుపైకి వచ్చి పడ్డాయి. సిలిండర్‌లో గ్యాస్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కోపోద్రిక్తులైన స్థానికులు ఆర్టీసీ డ్రైవర్ మౌలానాపై చేయిచేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ తిరుపాల్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డ్రైవర్‌ను అక్కడి నుంచి స్టేషన్‌కు తరలించారు. గాయపడ్డ వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment