ఆర్టీఏ అధికారులు సీజ్ చేసినఓ ప్రైవేటు స్కూల్ బస్సు
తాండూరు టౌన్: పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ లేకుండానే రయ్‌రయ్ మంటూ వెళ్తున్నాయి. చిన్నారుల జీవితాలతో ప్రైవేటు స్కూల్ బస్సుల యజమానులు చెలగాటుమాడుతున్నారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తిరుగుతున్నాయి. డొక్కు బస్సులతోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే పాఠశాలలు పునః ప్రారంభం అయినప్పటికీ బస్సుల ఫిట్‌నెస్, పర్మిట్‌లను రవాణా శాఖాధికారులు తనిఖీలు చేయలేదు.
దీంతో పలు బస్సులకు ఫిట్‌నెస్, పర్మిట్ లేకున్నా రోడ్డెక్కి దర్జాగా స్కూల్ పిల్లలను తరలిస్తున్నాయి. బస్సు పూర్తి స్థాయి కండీషన్‌లో ఉంటేనే రోడ్లపై తిరగడానికి అర్హత ఉంటుంది. కండీషన్ లేని బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫిట్‌నెస్ లేని బస్సుల్లో పిల్లలను తరలించినపుడు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం లేని బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
20 శాతం బస్సులకే ఫిట్‌నెస్
జిల్లా పరిధిలో పలు ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తంగా 191 స్కూల్ బస్సులు ఉన్నాయి. గతేడాది అక్కడక్కడా పలు స్కూల్ బస్సులు విద్యార్థులను తరలిస్తూ ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. 191 బస్సుల్లో ఈ ఏడాది ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకున్న బస్సులు కేవలం 38 మాత్రమే ఉండటం విశేషం. మిగిలిన 153 బస్సులు అంటే 80శాతం బస్సులు ఎలాంటి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే విద్యార్థులను తరలిస్తున్నారు.
యాజమాన్యాలతో కుమ్మకై ్క అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ లేని బస్సుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినపుడు హంగామా చేయకుండా ముందు జాగ్రత్తగా బస్సులను తనిఖీలు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కానరాని సేఫ్టీ పరికరాలు
● ఫిట్‌నెస్, పర్మిట్‌లు మాత్రమే కాకుండా ప్రతి స్కూల్ బస్సులో ఆర్టీఏ నిబంధనల ప్రకారం అన్ని వసతులు ఉండాలి.
● చిన్నారులు కిటికీల నుంచి బయటకు తొంగి చూడకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయాలి.
● ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రాథమిక చికిత్స చేయడానికి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండాలి.
● బస్సులో అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. స్కూల్ బ్యాగులు పెట్టుకునేందుకు ప్రత్యేక ర్యాక్స్ ఉండాలి.
● బస్సు బయట రేడియం స్టిక్కర్లు అంటించాలి. ప్రమాదం జరిగినపుడు అద్దాలను పగుల గొట్టేందుకు సుత్తె వంటి పనిముట్లు ఉండాలి.
● అగ్ని ప్రమాదం సంభవించినపుడు మంటలను ఆర్పేందుకు అవసరమైన అగ్ని నిరోధక రసాయన సిలిండర్‌లు ఉండాలి. అలాగే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు స్కూల్ బస్సులు నడపరాదు.
● ఇలాంటి నిబంధనలతో కూడిన బస్సుల్లో మాత్రమే విద్యార్థులను తరలించేందుకు అనుమతులు ఇస్తారు. నిబంధనల ప్రకారం లేని బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేయాల్సి ఉంటుంది.
తనిఖీలు ముమ్మరం చేశాం
పాఠశాలలు ప్రారంభం కాకముందే యాజమాన్యం బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. జిల్లాలో కేవలం 38 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. తనిఖీలు ముమ్మరం చేశాం. ఇప్పటికీ రెండు బస్సులను సీజ్ చేశాం. నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపితే చర్యలు తప్పవు.
– వెంకట్ రెడ్డి, ఆర్టీఓ
Comments
Please login to add a commentAdd a comment