ఓల్డ్ బోయిన్‌పల్లి: కరోనా మహమ్మారి.. లాక్‌డౌన్ తదితర కారణాలతో అర్థికంగా చితికిపోయి బతుకుతున్న ప్రజలపై ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఫీజులను అమాంతం పెంచి చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఓల్డ్ బోయిన్‌పల్లిలోని సెయింట్ యాండ్రూస్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. పెంచిన స్కూల్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను పట్టుకుని కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా సామాజిక దూరం పాటిస్తూ ధర్నా చేశారు. ఉదయం 9 గంటలకు మొదలైన ధర్నా మాధ్యాహ్నం వరకు కొనసాగింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా స్కూల్ గేట్లు మూసివేయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విషయం తెలుసుకున్న బోయిన్‌పల్లి, తిరుమలగిరి పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసుల చొరవతో 50 శాతం ఫీజులను తగ్గించాలని యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... కరోనా విపత్కర సమయంలో తాము ఉద్యోగాలు కోల్పోవడంతో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. గతంలోనే ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా çపట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం క్రితం జరిపిన చర్చల్లో మంగళవారం వస్తే చర్చిస్తామని చెప్పిన స్కూల్ యాజమాన్యం తమను లోపలికి అనుమతించకుండా గేట్లు మూసివేయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 శాతం ఫీజులు తగించాలి...
అన్‌లైన్ ద్వారా నడుస్తున్న తరగతుల కోసం వసూలు చేస్తున్న ఫీజుల్లో 50 శాతం తగ్గించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ. 18 వేలు ఉండేదన్నారు. దానిపై ఒక్కసారిగా రూ. 6100 పెంచారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఒక పక్క ప్రభుత్వం ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకోవచ్చని చెబితే ట్యూషన్ ఫీజు పేరుతో ఏకంగా రూ. 6100 పెంచడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment