స్కూల్ బస్సు బోల్తా
త్రిపురాంతకం : ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడటంతో ఓ విద్యార్థి చేయి సగానికి తెగగా మిగిలిన విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని గణపవరం సమీపాన కేజీ రోడ్డుపై సోమవారం జరిగింది. వివరాలు.. త్రిపురాంతకంలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు మండలంలోని అన్నసముద్రం వెళ్లి 20 మంది విద్యార్థులతో తిరిగి బయల్దేరింది. మార్గమధ్యంలోని గణపవరం సమీపాన కేజీ రోడ్డుపై బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో అన్నసముద్రానికి చెందిన ఒకటో తరగతి విద్యార్థి పోట్ల అజయకుమార్ చేయి తెగింది. మరో ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఏడుస్తున్న ఓ బాలికను తల్లిదండ్రులు డ్రైవర్ వద్ద కూర్చోబెట్టారు. బాలిక బస్సు స్టీరింగ్‌ను గట్టిగా లాగడంతో బోల్తా కొట్టిందని డ్రైవర్ చెబుతున్నాడు. బస్సు బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. చేయి విరిగిన బాలుడు మినహా అంతా సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. బాలుడికి స్థానిక వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.