tripurantakam
-
ప్రకాశం: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్త్క్షి, త్రిపురాంతకం: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలోని హైవేపై ఆదివారం రాత్రి 10.15 సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన సాయి(26), పిల్లి శ్రీనివాస్(23), చంద్రశేఖర్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108లో వినుకొండకు తరలించారు. మార్గంమధ్యలో శకంర్ (24) మృతిచెందాడు. అనంతపురంలో ఒక పెళ్లి మండపం డెకరేషన్ కోసం వెళ్లి విజయవాడ వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు ఎస్సై జీవీ సైదులు తెలిపారు. ఇది కూడా చదవండి: కోటిపల్లి రైల్వేలైన్‌కు కదలిక -
రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు
త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైఎస్సార్ జిల్లా వాసులకు గాయాలయ్యాయి. కర్నూలు– గుంటూ రు జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలంలోని ఉమ్మడివరం సమీపంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం ముదిరేపల్లికి చెందిన వారు గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలోని కోటప్పకొండకు మొక్కు తీర్చుకునేందుకు తుఫాన్ వాహనంలో వెళ్తున్నారు. స్పీడ్‌బ్రేకర్ వద్ద ఓ లారీ స్లో కావడంతో వెనుక వేగంగా వస్తున్న వీరి తుఫాన్ వాహనం ఢీకొట్టింది. దానిలోని గువ్వల లింగా రెడ్డి, జ్యోత్స్న, సావిత్రి, టి.శివారెడ్డి, సుహాసిని, హమీర్‌బాషా, మరొకరు గాయపడ్డారు. వీరిని వినుకొండలోని వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతున్నారు. -
స్కూల్ బస్సు బోల్తా
త్రిపురాంతకం : ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడటంతో ఓ విద్యార్థి చేయి సగానికి తెగగా మిగిలిన విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని గణపవరం సమీపాన కేజీ రోడ్డుపై సోమవారం జరిగింది. వివరాలు.. త్రిపురాంతకంలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు మండలంలోని అన్నసముద్రం వెళ్లి 20 మంది విద్యార్థులతో తిరిగి బయల్దేరింది. మార్గమధ్యంలోని గణపవరం సమీపాన కేజీ రోడ్డుపై బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో అన్నసముద్రానికి చెందిన ఒకటో తరగతి విద్యార్థి పోట్ల అజయకుమార్ చేయి తెగింది. మరో ఇద్దరు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఏడుస్తున్న ఓ బాలికను తల్లిదండ్రులు డ్రైవర్ వద్ద కూర్చోబెట్టారు. బాలిక బస్సు స్టీరింగ్‌ను గట్టిగా లాగడంతో బోల్తా కొట్టిందని డ్రైవర్ చెబుతున్నాడు. బస్సు బోల్తా కొట్టిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీశారు. చేయి విరిగిన బాలుడు మినహా అంతా సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. బాలుడికి స్థానిక వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తీసుకెళ్లారు. ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. -
రోడ్డెక్కిన టీడీపీ విభేదాలు
త్రిపురాంతకం : జిల్లా ఉన్నతాధికారి తన క్లాస్మేట్ అంటారు, నాలుగు క్వార్టర్లు ఇచ్చేవారికి, దళారులకు పనులు చేస్తారు. ఓడిపోయిన వారిని ఇన్‌చార్జీలుగా నియమిస్తే ఇలానే ఉంటుందని టి.డి.పి. యర్రగొండపాలెం ఇన్చార్జిపై ఆ పార్టీ త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తన మాట పెడచెవిన పెట్టి వేరే వారిని ఎంపీడీవోగా నియమించడంపై మండిపడ్డారు. ఎంపీడీవో బదిలీని నిరసిస్తూ తెలుగుదేశం ఎంపీపీతోపాటు ఆ పార్టీ నాయకులు రోడ్డెక్కారు. మండలపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీపీ చెన్నమ్మ మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజకవర్గంలో టి.డి.పి. తరుపున పోటీచేసి ఓడిన అజితారావు ఆమె భర్త కోటేశ్వరరావు ఇన్చార్జిని అని చెప్పుకుంటూ పార్టీకి అన్యాయం చేస్తూ పార్టీ కార్యకర్తలకు నష్టం కల్పిస్తున్నారని ఆమె విమర్శించారు. ఓడిపోయిన వారు ఏవిధంగా ఇన్చార్జీలవుతారని ప్రశ్నించారు. 20 వేలతో ఓడిన వారికి విజయం విలువ ఏమి తెలుస్తుందంటూ ఆమె ప్రశ్నించారు. సందకాడ నాలుగు క్వార్టర్లు ఇస్తే పనులు అయిపోతాయి, జిల్లా ఉన్నతాధికారి తన క్లాస్మేట్ అని చెప్పి నియోజకవర్గంలోని అధికారులపై పెత్తనం చేస్తున్నారని తప్పుపట్టారు. దళారులకు ఉన్న విలువ పార్టీ కార్యకర్తలకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు కూడా ఓడిపోయిన నాయకురాలి భర్త చెపితే వినాలా అని ఆమె ప్రశ్నించారు. అజితారావు ఢిల్లీలో ఉంటారు, ఓడిన ఆమె రాదు ... ఆమె భర్త కోటేశ్వరరావు ప్రభుత్వ ఉధ్యోగి అయి ఉండి ఢిల్లీ నుంచి వారానికి ఒక రోజు వచ్చి అధికారులపై పెత్తనం చేయడం ఏమిటని నిలదీశారు. ఒక మహిళా ఎంి.ప.డి.ఓ. కె.అరుణాదేవిని ఇక్కడే కొనసాగించాలని కోరినప్పటికీ ఆమెను బదిలీ చేసి ఆ స్థానంలో అవినీతి పరుడైన మాణిక్యాలరావును నియమించడం ఏమిటని ప్రశ్నించారు. కోప్షన్ సభ్యులు లాజర్ మాట్లాడుతూ మార్కాపురం డివిజన్‌లోనే ఏకైక టి.డి.పి . మండలం త్రిపురాంతకం. ఇక్కడ ఒక ఎస్సి మహిళా ఎం.పి.పి.ని,ఆమె అభిప్రాయాలను గౌరవించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వివరిద్దామని ఒంగోలు వెళ్లాం.. అక్కడ జడ్పికి సి.ఇ.ఓ. ఒక తాళం వేస్తే మరో తాళం ఈదర హరిబాబు వేశారు. -
బాలా త్రిపురసుందరి ఆలయంపై 15 విగ్రహాలు ధ్వంసం
త్రిపురాంతకం, న్యూస్‌లైన్ : పిడుగుపాటుకు పాక్షికంగా దెబ్బతిన్న బాలా త్రిపురసుందరీదేవి ఆలయ గోపురాన్ని దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. బాలా త్రిపురసుందరి ఆలయ గోపురంపై గురువారం రాత్రి పిడుగుపడిన విషయం విధితమే. పిడుగుపాటుకు ఆలయ గోపురం పగుళ్లిచ్చింది. కొన్ని విగ్రహాలు పూర్తిగా ధ్వంసం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తం 15 విగ్రహాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న గోపురాన్ని జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, మార్కాపురం ఆర్డీఓ సత్యనారాయణ, తహసీల్దార్ వరప్రసాద్ పరిశీలించారు. దేవాదాయ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గోపురంపై దెబ్బతిన్న 15 విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గోపుర నిర్మాణానికి వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఆలయంపై పిడుగుపాటు సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడతారా అని విలేకర్లు ప్రశ్నించగా.. ఆగమ శాస్త్ర పండితుల సలహాతో చర్యలు చేపడతామని చెప్పారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ సత్యనారాయణ తెలిపారు. ఆలయ గోపుర నిర్మాణ పనులను త్వరగా పూర్తిగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. ‘ఇది అతి పురాతనమైన చరిత్ర గల ఆలయమైనందున అరిష్టం జరిగిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే పనులు వెంటనే చేపట్టాల’ని డేవిడ్‌రాజు కోరారు. త్వరలోనే పనులు చేపడతామని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆలయాల కార్యనిర్వహణాధికారి పప్పు వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.