రోడ్డెక్కిన టీడీపీ విభేదాలు
త్రిపురాంతకం : జిల్లా ఉన్నతాధికారి తన క్లాస్‌మేట్ అంటారు, నాలుగు క్వార్టర్లు ఇచ్చేవారికి, దళారులకు పనులు చేస్తారు. ఓడిపోయిన వారిని ఇన్‌చార్జీలుగా నియమిస్తే ఇలానే ఉంటుందని టి.డి.పి. యర్రగొండపాలెం ఇన్‌చార్జిపై ఆ పార్టీ త్రిపురాంతకం ఎంపీపీ నీలం చెన్నమ్మ ధ్వజమెత్తారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తన మాట పెడచెవిన పెట్టి వేరే వారిని ఎంపీడీవోగా నియమించడంపై మండిపడ్డారు. ఎంపీడీవో బదిలీని నిరసిస్తూ తెలుగుదేశం ఎంపీపీతోపాటు ఆ పార్టీ నాయకులు రోడ్డెక్కారు. మండలపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా ఎంపీపీ చెన్నమ్మ మాట్లాడుతూ యర్రగొండపాలెం నియోజకవర్గంలో టి.డి.పి. తరుపున పోటీచేసి ఓడిన అజితారావు ఆమె భర్త కోటేశ్వరరావు ఇన్‌చార్జిని అని చెప్పుకుంటూ పార్టీకి అన్యాయం చేస్తూ పార్టీ కార్యకర్తలకు నష్టం కల్పిస్తున్నారని ఆమె విమర్శించారు. ఓడిపోయిన వారు ఏవిధంగా ఇన్‌చార్జీలవుతారని ప్రశ్నించారు. 20 వేలతో ఓడిన వారికి విజయం విలువ ఏమి తెలుస్తుందంటూ ఆమె ప్రశ్నించారు. సందకాడ నాలుగు క్వార్టర్లు ఇస్తే పనులు అయిపోతాయి, జిల్లా ఉన్నతాధికారి తన క్లాస్‌మేట్ అని చెప్పి నియోజకవర్గంలోని అధికారులపై పెత్తనం చేస్తున్నారని తప్పుపట్టారు.
దళారులకు ఉన్న విలువ పార్టీ కార్యకర్తలకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు కూడా ఓడిపోయిన నాయకురాలి భర్త చెపితే వినాలా అని ఆమె ప్రశ్నించారు. అజితారావు ఢిల్లీలో ఉంటారు, ఓడిన ఆమె రాదు ... ఆమె భర్త కోటేశ్వరరావు ప్రభుత్వ ఉధ్యోగి అయి ఉండి ఢిల్లీ నుంచి వారానికి ఒక రోజు వచ్చి అధికారులపై పెత్తనం చేయడం ఏమిటని నిలదీశారు. ఒక మహిళా ఎంి.ప.డి.ఓ. కె.అరుణాదేవిని ఇక్కడే కొనసాగించాలని కోరినప్పటికీ ఆమెను బదిలీ చేసి ఆ స్థానంలో అవినీతి పరుడైన మాణిక్యాలరావును నియమించడం ఏమిటని ప్రశ్నించారు.
కోప్షన్ సభ్యులు లాజర్ మాట్లాడుతూ మార్కాపురం డివిజన్‌లోనే ఏకైక టి.డి.పి . మండలం త్రిపురాంతకం. ఇక్కడ ఒక ఎస్‌సి మహిళా ఎం.పి.పి.ని,ఆమె అభిప్రాయాలను గౌరవించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వివరిద్దామని ఒంగోలు వెళ్లాం.. అక్కడ జడ్‌పికి సి.ఇ.ఓ. ఒక తాళం వేస్తే మరో తాళం ఈదర హరిబాబు వేశారు.