త్రిపురాంతకం, న్యూస్‌లైన్ : పిడుగుపాటుకు పాక్షికంగా దెబ్బతిన్న బాలా త్రిపురసుందరీదేవి ఆలయ గోపురాన్ని దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. బాలా త్రిపురసుందరి ఆలయ గోపురంపై గురువారం రాత్రి పిడుగుపడిన విషయం విధితమే. పిడుగుపాటుకు ఆలయ గోపురం పగుళ్లిచ్చింది. కొన్ని విగ్రహాలు పూర్తిగా ధ్వంసం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తం 15 విగ్రహాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న గోపురాన్ని జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, మార్కాపురం ఆర్డీఓ సత్యనారాయణ, తహసీల్దార్ వరప్రసాద్ పరిశీలించారు.
దేవాదాయ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గోపురంపై దెబ్బతిన్న 15 విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గోపుర నిర్మాణానికి వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఆలయంపై పిడుగుపాటు సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడతారా అని విలేకర్లు ప్రశ్నించగా.. ఆగమ శాస్త్ర పండితుల సలహాతో చర్యలు చేపడతామని చెప్పారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ సత్యనారాయణ తెలిపారు.
ఆలయ గోపుర నిర్మాణ పనులను త్వరగా పూర్తిగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. ‘ఇది అతి పురాతనమైన చరిత్ర గల ఆలయమైనందున అరిష్టం జరిగిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే పనులు వెంటనే చేపట్టాల’ని డేవిడ్‌రాజు కోరారు. త్వరలోనే పనులు చేపడతామని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆలయాల కార్యనిర్వహణాధికారి పప్పు వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.