సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారిగా అనుమానిస్తూ గోల్డ్‌మైన్ శ్రీనివాసరావు అలియాస్ వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు సోదాలకు పరిమితమైన ఈడీ సోమవారం ఒకరిని అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు, అకస్మాత్తుగా శ్రీనివాసరావు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడమే కాకుండా ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించడాన్ని బట్టి చూస్తే.. ఈ ఉదంతం మరింత సంచలనానికి దారితీసే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.
అకస్మాత్తుగా తెరపైకి..
సోమవారం వరకు శ్రీనివాసరావు పేరు గానీ, ప్రస్తావన గానీ లిక్కర్ స్కామ్‌లో బయటకు రాలేదు. ఈ స్కామ్‌లో 14వ నిందితుడిగా ఆరోపణలెదుర్కొంటున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో పాటు ఆయనకు చెందిన రాబిన్ డిస్టిలరీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినిపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావు, ఆడిటర్ బుచ్చిబాబు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ బృందాలు గత వారం సోదాలు నిర్వహించాయి. ఇక్కడ లభించిన కీలక ఆధారాల నేపథ్యంలోనే శ్రీనివాసరావుపై దృష్టి సారించినట్టు తెలిసింది.
సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు.. శ్రీనివాసరావు కేంద్రంగా జరిగిన మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ఆయన కార్యాలయాలున్న హైదరాబాద్‌లోని రామాంతపూర్ (సాలిగ్రామ్ టెక్నాలజీస్), మాదాపూర్ (వరుణ్ సన్), బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ (శ్రీనివాసరావు కార్యాలయం)తో పాటు మరో రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి.
రూ.కోట్ల లావాదేవీలపై ఆధారాలు లభ్యం
శ్రీనివాసరావు ద్వారా కోట్లాది రూపాయలు లావాదేవీలు జరిగినట్టు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లై విచారణలో వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు వారివద్ద ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది. సోదాల్లో బయటపడ్డ కంపెనీల ఏర్పాటు సంబంధిత డాక్యుమెంట్లు, కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒప్పంద పత్రాల ద్వారా ఈడీకి కీలక సమాచారం అందినట్లు సమాచారం.
సంభాషణలు రిట్రైవ్ చేసిన ఈడీ
పిళ్లై విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చినట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. అతని ఫోన్‌లోని సిగ్నల్ యాప్ ద్వారా జరిగిన సంభాషణను ఈడీ అధికారులు రిట్రైవ్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీనివాసరావుతో సాగిన సంభాషణలు ఈడీకి కీలక సమాచారాన్ని ఇచ్చినట్టు తెలిసింది. వీరిద్దరి చాటింగ్‌కు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు స్కామ్‌లో వినిపిస్తున్న ప్రముఖుల మొబైల్‌కు పంపించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
పంజాబ్‌కు వెళ్లిన రూ.200 కోట్లెక్కడివి?
ఈడీ అధికారుల సోదాలో మరో సంచలనాత్మక అంశానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతకు రూ.200 కోట్లు ఇచ్చినట్టుగా ఆధారాలు లభించినట్లు సమాచారం. కాగా ఆ డబ్బులు శ్రీనివాసరావు ద్వారానే అక్కడికి చేరాయా? అన్న అంశంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ డబ్బు ఏ ఒప్పందంలో భాగంగా ఇచ్చారు, లిక్కర్ టెండర్ల కోసమేనా? లేక మరేదైనా కారణముందా? అన్న కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా ఈ డబ్బు ఎవరి ఆదేశాల మేరకు వెళ్లింది? కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిందా? లేక లెక్కల్లో లేని డబ్బా? అన్న కోణంలో ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు తెలిసింది. ఆడిటర్ బుచ్చిబాబు నివాసాల్లో జరిగిన సోదాల్లో ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు లభించినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అడ్వాన్స్ అని, పర్సంటేజీ అన్న పేరుతో సాగిన ఓ వాట్సాప్ సందేశంపై ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్టు తెలిసింది.
అక్కడ పిళ్లై.. ఇక్కడ శ్రీనివాసరావు.. మధ్యలో?
ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ చేజిక్కించుకునేందుకు ఆ రంగంలో ప్రావీణ్యం ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్లైని రంగంలోకి దించారు. ఆయన ఢిల్లీలోని పలువురిని కలిసి లంచాలు ముట్టజెప్పారని సీబీఐ ఆరోపిస్తోంది. అదే విధంగా లిక్కర్ దందాకు కావాల్సిన కంపెనీలు, వేయాల్సిన టెండర్లు, ముట్టాల్సిన సొమ్ము.. కట్టాల్సిన సొమ్ము సమీకరణ బాధ్యత శ్రీనివాసరావుకు అప్పగించారని తెలుస్తోంది.
అయితే.. హైదరాబాద్ టూ ఢిల్లీ అన్నట్టుగా సాగిన ఈ దందాలో మధ్యవర్తిత్వం చేసిందెవరు? వారికి ఈ వ్యవహారంతో ఉన్న సంబంధం ఏమిటి? అన్నదానిపై ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దూకుడు పెంచడం కలకలం రేపుతోంది. సోమవారం రాత్రి వరకు సుమారు ఆరు గంటల పాటు శ్రీనివాసరావును ఈడీ ప్రశ్నించింది.
ఎవరీ శ్రీనివాసరావు?
శ్రీనివాసరావుది ప్రస్తుత సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతగల్ గ్రామం. అధికార పక్ష ముఖ్య నేతల అండదండలతో ఆర్థికంగా ఎదిగినట్లు తెలుస్తోంది. ఆయనకు పవిత్ర పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇటీవలే రామాంతపూర్‌లో సాలిగ్రామ్ ఐటీ కంపెనీ ప్రారంభించారు. మాదాపూర్‌లోని వరుణ్ సన్ షోరూమ్‌లో వాటాలున్నట్లు, రంగారెడ్డి జిల్లాలో గోల్డ్ స్టార్ మైన్స్ అండ్ మినరల్స్ పేరిట మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
రూ. 2 వేల కోట్లతో 18 జోన్లు కైవసం!
ఢిల్లీలోని 32 జోన్లలో లిక్కర్ దందా కోసం నిధుల సమీకరణ, లావాదేవీల వ్యవహారం మొత్తం వెన్నమనేని శ్రీనివాసరావు ద్వారానే జరిగినట్టుగా ఈడీ ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. రూ.2 వేల కోట్లకు పైగా నగదును 9 కంపెనీలకు మళ్లించి, ఆ కంపెనీల ద్వారా టెండర్ల దాఖలుకు దగ్గరుండి ఏర్పాట్లు చేసినట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీలకు సంబంధించి ఆడిటర్ బుచ్చిబాబు, శ్రీనివాసరావు మధ్య జరిగిన లావాదేవీల వ్యవహారం కూడా తాజాగా బయటపడుతోందని వెల్లడించాయి.
రూ.2 వేల కోట్లతో దాదాపు 18 జోన్లలో లిక్కర్ దందాను చేజిక్కించుకున్నట్టు ఈడీ అనుమానిస్తోంది. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ఖాతాల ద్వారా సంబంధిత కంపెనీల్లోకి మళ్లించారు? తదితర అంశాలపై శ్రీనివాసరావును ఈడీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment