శంషాబాద్ రూరల్: ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపుతప్పి వాగుపక్కన వరద నీటిలోకి దూసుకెళ్లింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని సుల్తాన్‌పల్లి–కేబీ దొడ్డి గ్రామాల మధ్యలో ఉన్న ఎంటేరు వాగులో వర్షాల కారణంగా వరదనీరు పారుతోంది. వాగుపై సుల్తాన్‌పల్లి శివారులో చిన్న కల్వర్టు ఉంది. ఏడాది కిందట ఈ కల్వర్టు పూర్తిగా దెబ్బతిని రెండు చోట్ల భారీ గుంతలు పడ్డాయి. ఇదిలా ఉండగా.. మంగళవారం వాగులో వరద పెరగడంతో రాకపోకలను నిలిపివేశారు. ఇరు వైపులా గ్రామాల శివారులో పోలీసులు బారికేడ్లు పెట్టారు.
ఉదయం ఓ ప్రైవేట్ స్కూలు బస్సు కేబీ దొడ్డి వద్ద ఆరుగురు విద్యార్థులను ఎక్కించుకుని ఎంటేరువాగు మీదుగా సుల్తాన్‌పల్లి వైపు వెళ్తుండగా.. వాగులో వరద ఎక్కువగా ఉందని అటు వైపు వెళ్లవద్దని స్థానికులు బస్సు డ్రైవర్‌కు సూచించారు. ఇవేవి లెక్క చేయకుండా డ్రైవర్ బారికేడ్లను తొలగించి బస్సుతో ఎంటేరువాగు వద్దకు చేరుకున్నాడు. కల్వర్టు సమీపంలోకి రాగానే వరద నీళ్లలో దారి కనిపించక బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు దిగింది.
ఈ క్రమంలో బస్సు ఓ వైపు ఒరిగిపోవడంతో భయంతో విద్యార్థులు కేకలు వేశారు. గమనించిన స్థానికులు వెళ్లి విద్యార్థులను జాగ్రతగా బయటకు తీసుకొచ్చారు. బస్సు మరింత ముందుకు వెళ్లి ఉంటే వరదనీటిలో కొట్టుకుపోయేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
జేసీబీతో బస్సు తొలగింపు..
రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన స్కూలు బస్సును స్థానికులు జేసీబీతో అక్కడి నుంచి తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment